Thursday, March 11, 2010

మతం మత్తు మందు


"మతం మత్తు మందు” అన్నాడు కార్ల్ మర్క్స్. ఆయినా ప్రజల్లో మత విశ్వాసాలు పెరుగుతున్నాయేతప్ప తగ్గటం లేదు.మతాలన్నవి ప్రజలమధ్య స్నేహవారథులు నిర్మించాల్సింది పోయి అడ్డుగోడలు స్రుష్టిస్తున్నాయి.ఆ కారణంగానే మతం పేరుతో నిష్కారణ మారణ హోమాలు ప్రపంచమంతా జరుగుతూనే ఉన్నాయి. “మతమన్నది నాకంటికి మసకైతే, మతమన్నది నీ మనసుకు మబ్బైతే, మతం వద్దు గితం వద్దు… మాయామర్మం వద్దు.” ఆన్నారు క్రుష్ణశాస్త్రి. అయినప్పటికీ మన్వంతరాల క్రితం పుట్టిన మతాలు కొన్ని సందర్భాల్లో మనుషుల మధ్య కలతలు, కలహాలు స్రుష్టిస్తూ ఈనాటికీ అప్రతిహతంగా రాజ్యం చేస్తూనే ఉన్నాయి. హైందవం, బౌద్దం, జైనం వంటి ఎన్నో మతాలకు పుట్టినిల్లు భారతదేశం. ఒక మతంవారంటే మరొక మతంవారికి పడక పోవటం మొదటినుంచీ ఉన్నదే.”వాళ్ళొట్టి బౌద్దులు”… అంటూ వెనక వైదిక మతావలంబకులకు బుద్ధ మతస్తులను గురించి తేలిక్గా మాట్లేడేవారు. మళ్ళీ శైవులకు, వైష్ణవులకు పడేదికాదు. శైవ, వైష్ణవుల మధ్య తీవ్రస్థాయిలో కలహాలు చెలరేగిన రోజులున్నాయి. “మతములనుచు పుట్టి మన్వంతరుములాయె, మనుజునందు మిగిలె దనుజ వ్రుత్తి, మతములెప్పుడింక మనసును పెంచురా….” అంటూ ప్రశ్నించారు నార్లవారు. దేవుడు మనుషులను స్రుష్టిస్తే మనుషులు అనేక రకాల దేవుళ్ళను కల్పించారు. దేవుళ్ళకు దేవతలకు ప్రతినిధులుగా అనేకమంది బాబాలు, అమ్మలూ అవతరించారు. ఆంతా తమను నమ్మేవారిని ఉద్ధరిస్తామని చెబుతూ ముందుగా తమను తాము ఉద్ధరించుకుంటున్నారు. ఓ ఊరికి కొత్తయిన ఆ స్వాములవారు దోవన పోతున్న ఓ ఆసామిని ఆపి, “నాయనా సత్రవుకు దోవ ఎటు?...” అని అడిగాడు. ఆసామి సత్రానికి దోవ చెప్పటమే కాక తానే వెంట ఉండి స్వాములవారిని అక్కడికి చేర్చాడు. ఆందుకు సంతోషించిన స్వాములవారు “నీ సేవకు మెచ్చాను నాయనా! సాయంకాలం గుడి దగ్గరకు రా… ధర్మోపన్యాసం చేస్తాను…విందువుగాని. ముక్తిపథానికి దోవ ఎటో తెలుస్తుంది…” అన్నాడు. ఆ మాటలకు ఆసామీ సంతోషించలేదు. “స్వాములూ, మీకు సత్రానికి దోవ ఎటో తెలియకే నన్ను అడిగారు. అటువంటిది నాకు ముక్తిపథానికి దోవ ఎటో చెబుతారా?... బాగుంది!” అంటూ నవ్వి వెళ్ళిపోయాడు!

“నాకు దేవుడిమీద నమ్మకం ఉందొ లేదో నికరంగా చెప్పలేను కానీ మానవుడిమీద మాత్రం అచంచల విశ్వాసం ఉందని నిశ్చయంగా చెప్పగలను…” అన్నారు ఒక సందర్భంలో శ్రీశ్రీ. కొంతమందికి మానవత్వం మీద కంటే దైవత్వం మీదే నమ్మకం ఎక్కువ. తాము స్రుష్టించిన రాయిరప్పలకే మహిమలు కలవని మొక్కుతూ తోటి మానవుల కష్టసుఖాలను పట్టించుకోనివారెందరో ఉన్నారు. మత విశ్వాసాలకు బానిసలైన వారికి వాస్తవ ప్రపంచం కనపడదు. “దేవుడెకడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా, కన్నుతెరిచిన కానబడడో మనిషి మాత్రుడియందులేడో” అని మహాకవి గురజాడ ప్రశ్నించారు. ఆయినా భగవంతుని కోసం వెతుకులాటలో, దైవ మహిమలను ఊహించుకోవటంలో మనిషి తనను తానే మర్చిపోతున్నాడు. మత విశ్వాసాలు నమ్మకాలు అనేకరకాలుగా ఉంటాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, అర్చనం, ఆత్మనివేదనం, అర్పణం తదితర వివిధ పద్ధతుల్లో భక్తులు భగవంతునికి చేరువ కావాలని ప్రయత్నిస్తుంటారు. మధురభక్తి లేక గోపికా భక్తి అనే ప్రక్రియలో భక్తులు తమను తాము గోపికలుగా నాయికులుగా భావించి ఆ పరమాత్ముణ్ణే నాయకునిగా ఎంచి ఆత్మార్పణ చేసుకుంటారు. శ్రుంగార భక్తి ఆధారంగా వేలాది కీర్తనలు రచించి తిరుమల నాథుని క్రుపాకటాక్షాలు పొందిన భక్తాగ్రేసరుడు అన్నమయ్య. భక్తి ప్రపత్తులను వ్యక్తం చేయటంలో వివిధ దేశాల్లోని ప్రజలు విభిన్న మార్గాలను అవలంబిస్తుంటారు………….......................................మత విశ్వాసాలకు హేతువాదానికి ఎప్పుడు చుక్కెదురే కదా!
("చుక్కెదురు" - సంపాదకీయం, 'ఈనాడు',14:09:2003)

No comments:

Post a Comment