Monday, March 1, 2010

తొలి వేలుపు



తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెండుగమ్రోయు గజ్జెలును మెల్లని చూపులు... దగ్గరికి వచ్చేసరికి శిష్యుడుఆగిపోయాడు. పద్యం మరిచిపోయాడనుకుని '...మందహాసమున్‌...' అంటూగురువు అందించబోతే, శిష్యుడు పట్టించుకోలేదు. 'అయ్యా వినాయకుడిది ఏనుగుతల... ఆపైన ఏకదంతుడు! మందహాసం ఎలా సాధ్యం?' అని అడిగాడు.వినాయకుడి పేరుచెబితే చాలామందికి హాస్యం తోస్తుంది. పత్రికల తీరులోనూ ధోరణి కనపడుతుంది. వినాయక చవితి ప్రత్యేక సంచికలు రకరకాలబొమ్మలతోను ఆయనపై వ్యంగ్య చిత్రాలతోను కిక్కిరిసి ఉంటాయి. హాస్యకథలపోటీకి, ప్రత్యేక హాస్య సంచికలకు వినాయక చవితి సరైన అదను. చవితిరోజునపొట్ట పట్టనంతగా ఉండ్రాళ్లు సేవించిన లంబోదరుణ్ని చూసి చంద్రుడు నవ్వడం,దానికి పార్వతి కోపించి చంద్రుణ్ని శపించడం కథ అందరికీ తెలిసిందే! వినాయక చవితి పేరుచెప్పి చందాలు దండుకునేవారి ఆగడాలు భరించలేక'చందమామను అదరగొట్టిన గణేశుడు 'చందా'మామలను ఏం చెయ్యలేకపోయాడు' అని ఒక హాస్యరచయిత చమత్కరించాడు.'అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ...' అంటూ మొదలుపెట్టి అల్లసాని పెద్దన- వినాయకుడు పప్పులో కాలేసిన సంగతిచెప్పాడు. అమ్మ ఒళ్లోచేరి పాలుతాగుతూ బాల గణపతి రెండోవైపు తడిమాడు. శివుడు అర్ధనారీశ్వరుడు కదా! రెండోవైపు ల్లి స్తనానికి బదులు, తండ్రి మెడలో పాము చేతికి తగిలింది. అభం సుభం ఎరుగని పసివాడు అదిఅహివల్లభ హారమని తెలియక తామరతూడుగా పొరబడ్డాడని వర్ణించాడు పెద్దన. ఏనుగులకు తామారతూడులంటే పరమప్రీతి. అదీ అందులో చమత్కారం. మనుచరిత్రకు కేంద్రబిందువైన 'భ్రమ'ను స్ఫురింపజేసే ప్రయత్నమది. గంధర్వుణ్ని చూసి వరూధిని నిజమైన ప్రవరుడని భ్రమపడటం దాని ఇతివృత్తం. అందుకూ పెద్దనగారి ఎత్తుగడ.

'సకల జీవరాశులు సమస్త విశ్వం- ఆయన కుక్షిలోంచే ప్రభవించా'యని గణేశోపనిషత్తు స్పష్టంచేసింది. గణపతిని దేవగణాలకు అధిపతిగాను, వేదాలకు నాయకుడిగాను రుగ్వేదం వర్ణించింది. తంత్రశాస్త్రాలు 'త్రికోణ మధ్యగతుడు' అన్నాయి. ముత్తుస్వామి దీక్షితుల ప్రసిద్ధ కీర్తన 'వాతాపి గణపతిం' లోనూ దాని ప్రస్తావన ఉంది. మూలాధారక్షేత్ర స్థితుడిగానూ ఇదేకృతి నుతించింది. ఈ సృష్టిలో మొట్టమొదట ఆవిర్భవించింది- జలం! జలానికి అధిష్ఠాన దేవత వినాయకుడు. కనుక ముందుగా పూజందుకునే అర్హత ఆయనకు దక్కింది. 'తొలి పూజలందే ఇలవేలుపు' (ఇలువేలుపు అనేదిసరైన పదం) అని కవుల వర్ణన. ప్రమథ గణాధిపత్యం కోరి కుమారస్వామితో పోటీపడి గెలిచి 'గణాధిపతి' అయ్యాడు. విఘ్నాలకు అధిపతిగా- మనపనులను నిర్విఘ్నంగా దీవించాలని విఘ్నేశ్వరుణ్ని ఆరాధిస్తాం. బాల గణపతి, తరుణ గణపతి, విజయ గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, క్షిప్ర గణపతి, ధ్వజ గణపతి, పింగళ గణపతి, ఉద్ధిష్ట గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, ఊర్ధ్వ గణపతి, విఘ్నరాజ గణపతి, భువనేక గణపతి, నృత్య గణపతి, మహా గణపతి- అనే పదహారూ గణేశుడి షోడశ తత్వాలు. ఒక్కోతత్వారాధనకు ఒక్కో రకం లక్ష్యం, ఒక్కో రకం ఫలితం అని శాస్త్రాలు చెబుతాయి.

యోగశాస్త్రరీత్యా గణపతి- మూలాధార చక్రానికి అధిపతి. మూలాధారంసృష్టితత్వానికి చెందినది. వినాయకుడి విగ్రహానికి ఊరి చెరువులోంచి తెచ్చిన మట్టిని ఉపయోగించడం సంప్రదాయం. చెరువులో మట్టినివినాయకుడి ప్రతిమగా రూపొందించి, తొమ్మిది రోజులపాటు ఆరాధించి, మళ్లీ ఆ చెరువులోనే నిమజ్జనం చెయ్యడం ఆనవాయితీ. మట్టిలోంచి వచ్చిన మనిషి తిరిగి మట్టిలోనే కలవక తప్పదనే నిత్యసత్యానికి ఆధ్యాత్మిక ప్రతీక- ఆ ఆచారం. భక్తులు తమ అవసరాలనుబట్టి ఒక్కో రూపంలో ఉన్నవినాయక తత్వాలను ఆరాధిస్తారు. పంచభూత తత్వానికి ప్రతీకగా అయిదు తలలతో సింహవాహనంపై దర్శనమిచ్చే గణపతి- హేరంబ గణపతి.ఆయన అత్యంత శక్తిమంతుడని ప్రసిద్ధి. శరీరానికి, మనస్సుకు రక్షణ కల్పించి, విపత్కర పరిస్థితుల్లో ఆదుకునే దైవంగా హేరంబ గణపతికి పేరు. కోపావేశాలను,మానసిక ఆందోళనలను దూరం చేసుకునేందుకు హేరంబ దేవతా రూపంలోగణపతిని పూజిస్తారు. లంబోదర గణపతి- ఉదర సంబంధిత వ్యాధుల నివారణ విషయంలో అపర ధన్వంతరి! ఆయన విద్యాధిదేవత. అక్షర సముదాయమంతా ఆయన కుక్షిలో దాచిపెట్టాడు. బొజ్జ విద్యల భోషాణం! 'పెద్దది పొట్ట విద్దియల పెట్టె యనంగ' అని ఒక సహస్రావధాని చమత్కారం! సిద్ధి, బుద్ధి అనే వినాయకుడి భార్యల పేర్లు సైతం ప్రతీకలే అన్నారు పెద్దలు.మనసుకు అధిదేవత అయిన చంద్రుడు- భాద్రపద శుద్ధ చవితి రోజున 'హస్తా' నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు 'హస్త'గతుడయ్యాడంటే- మనసు స్వాధీనంలోకి వచ్చి 'సిద్ధి'ంచిందని అర్థం. హస్తానక్షత్రం బుధగ్రహానికి లేదాబుద్ధికి సంబంధించింది. కనుక బుద్ధి స్వాధీనం అయిందని లెక్క. మనసునూ బుద్ధినీ ఒకే మార్గంలో నడిపించమని కోరుతూ క్షిప్ర గణపతినిఆరాధిస్తారు. తక్షణమే అనుగ్రహించే ఆయన స్వభావాన్నిబట్టి 'క్షిప్ర ప్రసాది'అనడం ఆనవాయితీ. తత్వాలను గ్రహించి ఆరాధించడం శ్రేష్ఠమైన పూజా విధానం.

No comments:

Post a Comment