Wednesday, March 10, 2010

గెలుపు పిలుపు

'గెలుపూ ఓటమికి మధ్య పోటీ పెడితే ఓటమే ముందు గెలుస్తుంది' అని చైనా సూక్తి. ప్రతి విజయానికీ వెనక ఓ ఓటమి ఉంటుంది. బావి తవ్వేవాడి చేతికి తొలుత మట్టే అంటుకుంటుంది. శరీరం తప్ప మరే ఆధారం లేని జీవజాలానికి పోరాడటం, ఎలాగైనా బతకాలనే ఆరాటం మినహా గెలుపూ ఓటములూ పట్టవు. కష్టపడి కట్టుకున్న గూడు చెదిరిందని సాలీడు ఏనాడైనా ఆత్మాహుతి చేసుకుందా? ఎండలు మండిపోతుంటే మళ్ళీ చినుకులు పడి చెరువులు నిండేదాకా కప్పలు బండల మధ్య రోజులు గడుపుతాయికానీ, గుండెలు పగిలి చావవు. శీతోష్ణాలూ, రాత్రింబవళ్ళు, చీకటి వెలుగులూ మాదిరే గెలుపూ ఓటములు! రాయిని రాతితో కొట్టి ఎవరూ నేర్పకుండానే నిప్పును పుట్టించినప్పటినుంచీ, చంద్రమండలం మీది నీటి జాడలు పట్టుకున్న దాకా అసలు ఓటమంటే తెలియకుండానే నెట్టుకొచ్చాడా మనిషి? అమ్మ కడుపులో పడిన క్షణంనుంచే మనిషికి పరీక్షలు మొదలవుతాయి.ఒలింపిక్సు పరుగుపందెంలో మొదట వచ్చిన విజేత కూడా బుడిబుడి అడుగుల వయసులో ఎన్నోసార్లు తడబడి పడిపోయే ఉంటాడు. 'పరుగాపక పయనించవె తలపుల నావ/ కెరటాలకు తలవంచితె దొరకదు తోవ...' అని ఓ సినీకవి అన్నదీ- కష్టాల వారధి దాటినవాళ్లకే అవరోధాల దీవిలోని 'ఆనంద నిధి' సొంతమవుతుందని చాటడానికే. 'మనిషి ఎన్ని శాస్త్రాలు చదివి పుణ్యకార్యాలు ఆచరించినా ప్రాణం ముందు అవన్నీ తృణప్రాయమే'నన్నది మహర్షి యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించిన జీవనసూత్రం. ప్రాణం అంత తీపి కనకనే అమృతం కోసం దాయాది వైరాన్ని సైతం పక్కనపెట్టి క్షీరసాగరమథనానికి పూనుకున్నారు దేవదానవులు. సాక్షాత్‌ మృత్యుస్వరూపుడైన యమధర్మరాజే దండంతో ప్రాణాలు హరించటానికి వచ్చినా శివలింగాన్ని పట్టుకుని వదలలేదు మార్కండేయుడు!

పెద్దలు
'జాతస్య మరణం ధ్రువమ్‌' అన్నారని చేతి గీతలను చేజేతులా చెరిపేసుకోవాలనుకోవడం పిరికితనమే అవుతుంది. మన ప్రమేయంతో మనం పుట్టామా... మన ప్రమేయంతోనే పోవటానికి? తల్లి తొమ్మిదినెలలు మోసి జన్మనిస్తే తండ్రి పందొమ్మిదేళ్లు కంట్లో పెట్టుకుని పెంచిన శరీరం ఇది. మన ఆటపాటలకు, ముద్దు ముచ్చట్లకు, సుఖసంతోషాలకు వాళ్ల జీవితాలను చాదితే చేవదేరిన దేహం ఇది. 'ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు భూతాలు. వాక్‌ పాణి పాద పాయూపస్థలనే అయిదు కర్మేంద్రియాలు, త్వక్‌చక్షు శ్రోత జిహ్వాఘ్రాణాలనే అయిదు జ్ఞానేంద్రియాలు... మనోబుద్ధి చిత్తాహంకారాలనే అంతఃకరణ చతుష్టయంతో కలిసి పందొమ్మిదిమంది దేవతల ఆవాసం మనిషి శరీరం' అని ప్రశ్నోపనిషత్తు పేర్కొంది. అది శాస్త్రోక్తమైనదా, కాదా అనే వాదనను పక్కనపెట్టినా నేటి సామాజిక జీవనరంగంలో ఏ వ్యక్తి జీవితమూ ఉలిపికట్టె మాదిరి ఒంటరిగా సాగేటందుకు వీలులేనిది.'పుటక'నీది, చావునీది, బతుకంతా దేశానిది' అంటూ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌కు ప్రజాకవి కాళోజీ నివాళులర్పించారు. మన బతుకంతా దేశానిది అనిపించుకునేంతగా కాకపోయినా అది- కనీసం మన కన్నవారిది, మనం కన్నవారిది, మనల్ని నమ్ముకుని బతుకుతున్నవారిది అని అయినా ఒప్పుకొనితీరాలి! తిండికి బిడ్డ ఒక్కపూట పాలుమాలితే- పాలు కుడిపిన తల్లి రొమ్ము ఎలా తల్లడిల్లిపోతుందో తెలుసా! ఆకాశంలో అకాల చుక్క పొద్దువుతాడని కాదుగా కన్న తండ్రి కండల్ని చాది బిడ్డను చెట్టంతవాణ్ని చేసిందీ! 'నాతి చరామి' అని ఇచ్చిన హామీని నమ్మి ఓ బిడ్డకు తల్లిగా మారిన పిచ్చితల్లి 'అమ్మా! నాన్నేడే!' అని ఆ బిడ్డ అడిగితే బదులేమి చెబుతుంది?

పంట పొలాలు ఎండిపోయాయనో, ప్రేమించిన పిల్లకి వేరే అబ్బాయితో పెళ్ళి అయిపోయిందనో, ఉద్యోగం వూడి బతుకూ పరువూ బజార్న పడ్డాయనో, స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి షేర్లు 'బేర్‌' మన్నాయనో, అభిమాన కథానాయకుడి సినిమా మొదటి ఆటకు టిక్కెట్లు దొరకలేదనో, మార్కులు నూటికి నూరు రాలేదనో, ఇష్టమైన ప్రజానాయకుడు హఠాత్తుగా పోయాడనో, క్రికెట్‌ ట్వంటీ20లో మనవాళ్ళు ఓడిపోయారనో, నిరాహారదీక్షలకు కూర్చున్న ప్రజాప్రతినిధులు నిమ్మరసం తాగారనో, తాగలేదనో ప్రాణాలు నిష్కారణంగా తీసుకునే ధోరణులు సమాజంలో క్రమక్రమంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నిరుడు 1.22లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14,224 మంది బలవన్మరణం పాలయ్యారు. స్వహననమే సమస్యలకు పరిష్కారం కాదు. విసుగుకీ ఓటమికీ ఉసురు తీసుకోవటం విరుగుడు కానేకాదు. జీవన సమరాంగణంలో యోధులుగా మారి ప్రతి అడుగునూ ఓ దీక్షా శిబిరంలా మార్చుకోవాలి. ఒడుపుగా మలుపు తీసుకోవడం మరిచిపోనంతకాలం మన ప్రయాణాన్ని ఏ వంకర టింకర మలుపూ ఆపలేదని తెలుసుకోవాలి. 'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది...' అనే పాట అర్థం ఒంటపట్టించుకొంటే మంచిది.

No comments:

Post a Comment