Sunday, March 21, 2010

అంతా నమ్మకంలో ఉంది


''భగవంతుడొక్కడే శాశ్వతుడు'' అన్న గాంధీజీ, ''భగవంతుడు హేతువాదానికి అందనివాడు. నమ్మకం ఉన్నవారికి ఏ రూపంలో కోరితే ఆ రూపంలో కనపడతాడు. అతడు సర్వాంతర్యామి'' అనీ చెప్పారు. నాస్తికులు భగవంతుడు లేడంటే- ఆస్తికులు వేదవేదాంగాలు, పురాణాలు, భక్తుల కథలు సాక్ష్యాలుగా చూపుతూ దేవుడున్నాడని వాదిస్తుంటారు. దేవుడున్నాడా, లేడా అనే విషయమై తరతరాలుగా తర్కవితర్కాలు సాగుతూనే ఉన్నాయి. మహాభక్తులుగా పేరు తెచ్చుకున్నవారికి సైతం, ''కలడు కలండనెడివాడు కలడో లేడో'' అనే సందేహం అప్పుడప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ప్రపంచమంతటా అనిర్వచనీయ నిగూఢ శక్తి వ్యాపించి ఉన్నదనీ దాని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరనీ అందరూ అంగీకరిస్తున్నదే. ఆ అగోచరమైన శక్తే భగవంతుడు అని దేవుణ్ని నమ్మేవారు దృఢంగా విశ్వసిస్తారు. ''నడిచెడివాడు నడిపించెడివాడు చేసెడివాడు చేయించేవాడు అంతా ఆ పరమాత్మే'' అని భగవద్గీతా చెబుతుంది. ఇదే అదనుగా తమ అకృత్యాలకు సైతం దేవుడే బాధ్యుడంటూ కుతర్కాలు చేస్తుంటారు గిరీశంలాంటి పండితులు. ''ఓ దేవుడా! నా మనస్సు యిండిపెండెంటుగా సృజించావా లేక డిపెండెంటుగా సృజించావా? యిండిపెండెంటుగా అయితే నా యిష్టవొచ్చిన పనల్లా నేను చేశాను. నువ్వెవరు అడగటానికి? ఇలాంటి చిక్కులు పెట్టావంటే హెవెన్‌లో చిన్న నేషనల్ కాంగ్రెస్ వొకటి లేవదీస్తాను. లేక నన్ను డిపెండెంటుగా చేశావూ... అష్లాగయితే నువ్వే నాచేత పాపం చేయించావు గనక నీకే ఆ శిక్ష కావాలిసింది. దేర్‌ఫోర్ చలో నరకానికి చలో అంటాను'' అంటూ వితండవాదం చేస్తాడు గిరీశం.

విశ్వాసానికీ హేతువాదానికీ చుక్కెదురు. నమ్మకం కలవారికి భగవంతుడు విశ్వమంతా నిండి ఉన్నట్లే అనిపిస్తాడు. నిదర్శనాల నిరూపణ, హేతువాదాన్ని పక్కనపెడితే భగవంతుడు ఎక్కడలేడు? ''వాడవాడల వాడె జాడలన్నిట వాడె'' అనిపిస్తుంది. ఏదో ఒక అదృశ్యశక్తి మనకు ఆసరాగా ఉన్నదనే భావన మనిషికి ఆత్మస్త్థెర్యాన్ని కలిగించి మనోబలాన్ని పెంచుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కోవటానికి ఆ బలం తోడ్పడుతుంది. ''తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది'' అని ఒక కవి వెటకారంగా అన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో భక్తిభావం పెరిగిపోతూనే ఉంది. 'ఆపదలో మొక్కులు, సంపదలో మరుపులు' అని సామెత. ఆపద కలిగినప్పుడు విధిగా అందరికీ భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. ''రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మకా'' అంటూ అలనాటి గజేంద్రునికి మల్లేనే భగవంతుని వేడుకుంటారు. ఎన్నో మొక్కులూ మొక్కుకుంటారు. ఆపద తీరిన తరవాత వాటిని మరిచిపోవటమూ షరా మామూలు. మనుషులు ఆశావాదులే కాదు- స్వభావాలు సందర్భాలనుబట్టి అవకాశవాదులూ అవుతుంటారు. మంచితనమే అసలైన మతం, సిసలైన దేవుడు అంటారు విజ్ఞులు. ''మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును, అంత స్వర్గసుఖంబులన్నవి అవని విలసిల్లున్'' అన్నారు మహాకవి గురజాడ. మహాకవి పలుకులు ఎప్పుడు నిజమవుతాయో కాని, ఈ లోపున మనుషులు ఎవరి విశ్వాసాలను అనుసరించి వారు ప్రవర్తిస్తున్నారు.

'నమ్మి చెడినవారు లేరు. నమ్మక చెడిపోతే పోయేరు' అన్న తత్వంలో మంచి నమ్మకమే ఉన్నట్లుంది తూర్పు ఇంగ్లాండులోని పోలీసు శాఖవారికి. అందుకే దొంగలను, అసాంఘిక శక్తులను పట్టుకోవటానికి దేవుడి సాయాన్ని కోరుతున్నారు. తూర్పు ఇంగ్లాండులోని లింక్లాన్‌షైర్ పట్టణానికి చెందిన క్రిస్టియన్ పోలీసు సంఘం దొంగలు, దుండగుల ఆటలు కట్టించటానికి దేవుడి సహాయాన్ని కోరటమే మంచి మార్గం అంటోంది. వారు సరికొత్త ప్రార్థన పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఆ సంస్థకు చెందిన పోలీసు సభ్యులంతా సామూహిక ప్రార్థనలు నిర్వహించి అసాంఘిక శక్తులను పట్టుకోవటానికి తమకు సాయపడవలసిందిగా దేవుణ్ని వేడుకొంటున్నారు. ప్రార్థనాలయాలతోపాటు ఇతర చోట్లా దుండగులు విధ్వంసాలకు తెగబడకుండా ఉండేందుకు ఈ ప్రార్థనలు తోడ్పడతాయని వారు విశ్వసిస్తున్నారు. ''ప్రజల మాన ప్రాణాలను రక్షించి దుండగులను పట్టుకోవటానికి ప్రార్థనలవల్ల పోలీసులకు కొత్త శక్తి వస్తుందని మా విశ్వాసం. మా ప్రార్థనలను ఆలకించి భగవంతుడు సాయం చేస్తాడనే మాకు గట్టి నమ్మకం'' అంటున్నారు ఆ సంస్థ ప్రతినిధి. పోలీసు శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేసి రిటైరయిన డాన్ ఆక్స్‌సెల్ అనే ఆసామీ ప్రస్తుతం లింక్లాన్‌షైర్ క్రిస్టియన్ పోలీస్ సంఘానికి ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్. ''నాకు ఇటువంటి ప్రార్థనల్లో చాలా నమ్మకం ఉంది. భగవంతుడు మన విన్నపాలు విని తప్పకుండా సహాయం చేస్తాడు. వ్యక్తిగతంగా నా ప్రార్థనలు ఫలించి నాకు మేలు కలిగిన సందర్భాలు ఉన్నాయి'' అంటున్నాడాయన. భగవంతునిపై భక్తివిశ్వాసాలు కలిగి ఉండటంలో తప్పేమీలేదు. ఆపదల్లో భగవంతుణ్ని తలచుకోవడం, తమను ఆపదనుంచి తప్పించమని వేడుకోవటం పరిపాటే. మన రాష్ట్రం భగవంతుని రాజ్యమని ముఖ్యమంత్రే సెలవివ్వడం తెలిసిందే. ఏ విషయంలోనైనా మానవ ప్రయత్నం, కృషి, కర్తవ్య నిబద్ధతా తప్పకుండా ఉండాల్సిందే మరి! గాలిలో దీపంపెట్టి దేవుడా నీ మహిమ అంటే సరిపోతుందా?

2 comments:

  1. నేనే సర్వాంతర్యామి నైతే ?
    మనం భగవంతుడం అనుకొని అలా ఉండటానికి మనసా వాచా ప్రయత్నం చేస్తే మనం చేసే తప్పులు చాలా వరకు జరగకుండా వుంటాయి.ఎందుకంటే సర్వాంతర్యామి ఏనాడు తప్పులు చెయ్యడు కాబట్టి.
    IF I AM GOD?
    IF WE CAN ELEVATE OUR SELVES TO THE LEVEL OF GOD AND TRY TO DO THINGS LIKE HIM ,MOST OF THE MISTAKES IN OUR LIFE CAN BE AVERTED,AS ALMIGHTY CAN NEVER GO WRONG IN HIS CREATION.

    ReplyDelete
  2. నేనే సర్వాంతర్యామి నైతే

    నేనే భగవత్ స్వరూపుడని భావించి అలా బ్రతుక గలిగితే మనం జీవితంలో చేసే చాలా తప్పులు జరగకుండా వుంటాయి.ఎందుకంటే సర్వాంతర్యామి ఏనాడూ తప్పు చెయ్యడు గాబట్టి.
    IF I AM GOD?
    if we can elevate ourselves to the level of GOD and do things like he do,most of the mistakes of our life can be averted, as ALMIGHTY can never go wrong in his creation.

    ReplyDelete