సేవలు అందుకోవడమే తప్ప, సేవించడం ఎరుగనివారిలో మొదటివరుస పసిపిల్లలది, మహరాజులదే. అందుకే 'బాలభోగం రాజభోగం' అన్నారు పెద్దలు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి... ఆ వైభవంలోనూ రాజులకన్నా పసికూనలు ఒక మెట్టు కాదు, పదిమెట్లు పైనే ఉంటారు. గద్దెపైనున్నవారిని సేవించడంలోని డొల్లతనాన్ని వెక్కిరిస్తూ- 'ఇమ్మనుజేశ్వరాధములు' అంటూ ధిక్కరించే స్వరాలు, 'రాజుల్‌మత్తులు'అని ఈసడించే గళాలు అప్పుడప్పుడన్నా వినిపిస్తుంటాయి. కానీ, సేవలందుకునే పసిబిడ్డలు ఎప్పటికీ వరాల మూటలే! బోసినవ్వులొలికిస్తూ ఉయ్యాలలూగే శిశువు, ముంగాళ్లపై నేలమీద దోగాడే పాపాయి, గోడనో మంచంకోడునో పట్టుకుని బుడిబుడి అడుగులు వేసే బుజ్జాయి- ఇలా ప్రతి అంచెలో, బంగారుకొండలాంటి తమ చిన్నారితల్లికి, వజ్రాలమూటవంటి చిట్టితండ్రికి సేవలందిస్తూ... 'ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము, ఇదిగాక వైభవం ఇకనొకటి కలదా!' అని పరవశించని తల్లులుంటారా? అప్పటిదాకా కొడుతున్న కేరింతల్ని ఉన్నట్టుండి ఆపేసి, ఏడుపు లంకించుకున్న పాపణ్ని లాలిస్తూ 'ఏడవకు, ఏడవకు వెర్రి నా తండ్రీ/ ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు/ నీలాలు కారితే నే చూడలేను/ పాలైన కారవే పాపాయి కళ్లు'- అంటూ తల్లులు పాడే జోలపాట ప్రతి తెలుగు ఇంటా ప్రతిధ్వనించేదే. పాపాయి ప్రతి ముచ్చటా అమ్మకు అపురూపమే, నలుగురితో పంచుకునే పెద్ద పండుగే! తన చిన్నారి ఊఁకొడితే ఉగ్గు గిన్నెలు; మూసిన పిడికిలి తెరిస్తే ముద్దకుడుములు; వచ్చీరాని పలుకులు పలికితే చక్కెర చిలుకలు; బోర్లాపడితే బొబ్బట్లు; అడుగులు వేస్తే అరిసెలు- పేరంటాళ్లకు సంబరపడుతూ పంచి మురిసిపోతుంది తల్లిమనసు.
బుజ్జాయిలు మహాగడుగ్గాయిలు. ఇంటింటా వాళ్లే నియంతలు. బతిమాలో, బామాలో వాళ్లను మన దారికి తెచ్చుకోవాలే తప్ప- అదిలించడాలు, బెదిరించడాలు వారిదగ్గర ససేమిరా కుదరవు. నిద్రలేపడం, నీళ్లుపోయడం, బువ్వ తినిపించడం, మళ్ళీ బజ్జోపెట్టడం- ఏ విషయంలోనైనా తమ మాటే నెగ్గించుకునే చిన్నారి నియంతలకు స్వచ్ఛందంగా, సంతోషంగా తలొగ్గాల్సింది మనమే. మిగతావాటి సంగతెలా ఉన్నా- అన్నం దగ్గర చిన్నపిల్లలు చేసే మారాములు అన్నీ ఇన్నీ కావు. నింగిలోని జాబిల్లిని తెచ్చి ఇస్తేగానీ, అన్నం తిననని ముగ్గురు తల్లుల గారాలబిడ్డ శ్రీరాముడూ చిన్నతనాన మొండికేశాడట. 'ఎందుకు ఆ చందమామా/ అందగాడనా నీకన్నా, అందరాడనా నాకన్నా' అంటూ కైకమ్మ అనునయించినా వినలేదట. అప్పుడా తల్లి అద్దాన్ని తెప్పించి, అందులో చంద్రుడి ప్రతిబింబాన్ని చూపించి, రాముణ్ని మరిపించి అన్నం తినిపించడం రామకథాసుధారసార్ణవంలో ఓ రమణీయ లహరి.ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు బాలకృష్ణుడు- వెన్నముద్దలు తిన్నంత తిని మరింత వెన్న పారేయడంతో యశోదమ్మకు పట్టరాని కోపం వచ్చింది. ఆ 'దుండగీడు'కు రెండు తగిలించాలని కొంగుబిగించి మరీ వచ్చింది. గోడకు అంటుకుపోయి, భయం నటిస్తూ, కాటుకనిండిన చారెడు కళ్లను తనకప్పగించిన నల్లనయ్యను చూడగానే- ఆమె కోపం పోయింది. ఫక్కున నవ్వుతూ, గోపాలబాలుణ్ని యశోదామాత అక్కున చేర్చుకోవడం- కృష్ణ లీలాతరంగిణిలో మనల్ని ఓలలాడించే కమనీయ ఘట్టమే. తల్లులున్న తనయులు కాబట్టి, ఆ అయ్యలు ఏం చేసినా చెల్లింది. తల్లిలేని శివయ్యను తలచుకుని ఆయన భక్తురాలు బెజ్జమహాదేవి తల్లడిల్లిపోయింది. పరమేశ్వరుడికే తల్లి ఉన్నట్లయితే- ఆయన తల జడలు కట్టనిచ్చేదా, ఒంటిపై పాములను ధరింపనిచ్చేదా, విషం తాగనిచ్చేదా అని బాధపడిందామె. శివుడికి... 'చన్నిచ్చి బలుమారు వెన్నయు బెట్టి/ పన్నుగానిన్నియు బాలును పోసి/ ఆకొనగా గడుపరసి పాలిచ్చి/ సాకించి పెనుపదే జనని గల్గినను' అన్న ఆ భక్తురాలి ఆర్తిలో ఉన్నదీ మాతృహృదయ స్పందనే.
అమ్మ చేతిముద్దలు తినాలంటే 'అది కావాలి, ఇది కావాలి' అని మారాము చేసే ఆనాటి బాలరామచంద్రులకు, తినో తినకో పారేసే బాలకృష్ణులకు ఏమాత్రం తీసిపోనివారే ఈ కాలం పిల్లలు కూడా. లండన్‌లో మూడేళ్ల బాలుడు ఐదాన్ అలాంటి గడుగ్గాయిల్లో ఒకడు. తల్లి తెచ్చే అన్నంగిన్నెను లాక్కొని విసిరేయడం, ఆహారాన్ని పారేయడం, పాత్రలను దొర్లించడం నిత్యకృత్యాలైన ఐదాన్ పోరు పడలేకపోయింది ఆ బుడతడి తల్లి మెలిండా షెపర్డ్. ఆహారపదార్థాలు ఎటువైపు తిప్పినా పడిపోకుండా లోపలే జారేలా ఓ గిన్నెను ఆమె తయారుచేసింది. 360 డిగ్రీల కోణంలో తిప్పే వీలున్న ఈ గోళాకారపు గిన్నెను కిందపడేసినా, అందులోని ఆహారపదార్థాలు కిందపడవు! గిన్నెచుట్టూ వర్తులాకారంలో అమర్చిన చక్రాన్ని పట్టుకుని పిల్లలు హాయిగా ఆడుకుంటూ భోజనం చేయవచ్చు! 'లూపా గైరో బోల్' ఈ పాత్ర నామధేయం. కొత్త ఆవిష్కరణ దేనినైనా స్వాగతించవలసిందే. అన్నం తినకుండా మొండికేసే పిల్లణ్ని చంకనెత్తుకుని, అన్నం కలిపిన గిన్నెను ఓ చేత్తో పట్టుకుని-'ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది బామ్మ ముద్ద' అంటూ కొసరికొసరి గోరుముద్దలు తినిపించే అమ్మకు తప్ప బిడ్డ ఆకలి మరెవరికి తెలుస్తుంది? అందుకే తల్లులు 'చందమామ రావె, జాబిల్లి రావె/ వెండిగిన్నెలో వేడిబువ్వ తేవె/ పైడిగిన్నెలో పాలబువ్వతేవె' అని పాడుతూ... మారాంచేసే తమ చిన్నారుల్ని బులిపిస్తుంటారు. ఆ చందమామ ఎవరో కాదు, అమ్మే. ఆ వెండిగిన్నె తల్లి మనసే. ఆ పైడిగిన్నె ఆమె మమతే. ప్రేమానురాగాల్నే దివ్యద్రవ్యాలుగా ఆమె కలిపి పెట్టే అన్నాన్ని మించిన అమృతముంటుందా? అమ్మచేతి గోరుముద్దలున్న గిన్నెకు, ఆ అక్షయ పాత్రకు, ఆ అమృత భాండానికి ఎన్ని 'లూపా గైరో బోల్స్' సాటిరాగలవు?!
No comments:
Post a Comment