- చక్కిలం విజయలక్ష్మి
జీవితం గురించి, భగవంతుని గురించి సరైన అవగాహన లేనివారే జీవతమూ, భగవంతుడూ వేరు వేరు అనే భావనతో ఉంటారు. భగవంతుడు సృజించిన, భగవంతునిలోంచి ఉత్పన్నమైన జీవితం ఆయనతో వేరుపడి ఎలా ఉంటుంది!? చెట్టులోంచి వచ్చిన కాయ చెట్టు తాలూకు జీవ లక్షణాలనే కలిగి ఉంటుంది- రూపం వేరైనా. చాలామంది భగవంతుణ్నిపూజ గదికే పరిమితం చేసి ఉంటారు. ఎంతో నిష్ఠగా, పవిత్రంగా పూజావిధిని నిర్వహించిన వ్యక్తి, పూజ ముగించి ఆ గది తలుపులు మూయగానే పూర్తిస్థాయి 'సామాజిక స్పృహ'ను పులుముకుంటాడు ఒక వ్యక్తిలోని దైవత్వానికి, రాక్షసత్వానికి ఒక 'గడపమాత్రం' దూరమేనా!?
వేదం 'సర్వభూత దయ'ను నిర్దేశించింది. నీచస్థాయి జీవి అయిన కుక్కనైనాకాలితో తన్నకూడదని విజ్ఞుల ఉపదేశం. చీపురుకట్టకూ తగిన మర్యాద ఇవ్వాలనిదివ్య జనని శారదామాత అభిప్రాయం. మనం మన సాటి మనిషిని, తోటిమనిషినిమానసిక హింసకు గురి చేస్తున్నాం. మన స్వార్థంకోసం మరెందర్నో,మరెన్నింటినో... మరెన్ని రకాలుగానో. మనం రెండు వేషాలు వేస్తూ ఉంటాం-మానసికంగా! ఒకటి భక్తుడిగా, మరొకటి సామాజికుడిగా. ఈ నాటకీయతమనకుఅవసరం లేదు. ఈ వేషాల మార్పుతో పనిలేదు. కదలని దేవుడు పూజామందిరంలో ఉంటే, కదిలే దేవుళ్లు బయట ఉన్నారు. పలకని దేవుడు లోపల ఉంటే, పలికే దేవుళ్లు బయట ఉన్నారు. అంతే. మనుషులేకాదు, సమస్త జీవజాలం, జీవంలేని వస్తుజాలమూ భగవంతుని సృజనే. ఆయన ప్రతిరూపమే. మనం సామరస్య స్పృహ, సమతాదృష్టి కలిగిఉంటే చాలు.
విజ్ఞులు భగవత్ సాధనకు ఒక్క యోగాన్ని మాత్రమే నిర్దేశించలేదు. భక్తి, జ్ఞాన యోగాలతోపాటు కర్మయోగాన్నీ సూచించారు. సర్వభూత దయ, సాటి మనుషుల పట్ల సామరస్య ధోరణి, త్యాగం, విరాగం, నిష్కామకర్మ, ప్రతి కర్మలో ఆధ్యాత్మిక దృష్టి... ఇవన్నీ కర్మయోగమే. యోగాన్నిపూజామందిరంలో మాత్రమే ఏ యోగీ నిక్షిప్తంచేయలేడు. భగవంతుణ్ని ఒక్కఆలయంలో మాత్రమే ఏ రుషీ ఆవాహన చేయలేడు. మోక్షం ఏ దేవుడూగరిటెతోవడ్డించేది కాదు. అందుకు జీవితాన్నిచ్చాడు భగవంతుడు. ఇది చాలా సరళమైన యోగం. అదే... జీవితాన్ని యోగంగా భావించటం.
ఎలా! ఇదెలా సంభవం!? సామాజిక జీవనంలో ఒక రూపాయి సంపాదించాలంటే, కేవలం పదిమందిలో ఒకరిగా గుర్తింపు పొందాలంటే, కనీసం కుటుంబ సభ్యుల ప్రేమ సంపాదించాలంటే ఎంతో కష్టపడతాం. మరెంతో త్యాగం చేస్తాం. మహోన్నతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు, దాన్ని సాధించాలనుకున్నప్పుడు ఆ మాత్రం శ్రమ తీసుకోలేమా? ఏ మాత్రం సాహసం చేయలేమా? దాని ఫలితం సర్వోత్కృష్టమైన, సర్వ శ్రేష్ఠమైన జీవన్ ముక్తి, జన్మ రాహిత్యం. పరమాత్మ పదం. దానికై చేయలేనిది ఏముంది? చేయరానిది ఏముంది? ప్రారంభంలో కష్టం అనిపించినా సాత్వికాహారంలా క్రమేణా సులువవుతుంది. రుచి దొరుకుతుంది. చివరకు వదలలేనిదవుతుంది. అందుకే ఆ పనిలో నిమగ్నమవుదాం.
ఆ దిశగా... ప్రతి పనిలో పక్కవారి ఇబ్బందిని గమనిద్దాం. ప్రతి లాభంలో పక్కవారికి భాగం అందేలా చూద్దాం. ప్రతి మాటలో పక్కవారికి మాధుర్యం అందజేద్దాం. దైన్యాన్ని పోగొడదాం. ధైర్యాన్ని, ధీశక్తిని ప్రోది చేద్దాం. అవతలివారి ఆవేదనలో సగం మనం తీసేసుకుందాం. మన ఆనందంలో సగం అవతలివారికి భాగం పెడదాం. అప్పుడు ప్రపంచమే పూజామందిరం అవుతుంది. ప్రతి దేహధారీ దేవుడై విలసిల్లుతాడు. అప్పుడు మన పూజ ఒక్క దేవుడికి కాక కోట్లాది దేవుళ్లకు అందుతుంది. మన ఆరాధన ఒకపూజా మందిరానికే చెందక ప్రపంచపరివ్యాప్త మవుతుంది. మన సాధన ఒకటికికోటి రెట్లుగా మారి, పరమాత్మవైపు మనం వేసిన ఒక్క అడుగుకోట్లాదిఅడుగులకు చేరి అగణితమై భగవంతుడు మరింత, మరెంతో చేరువైఅరచేతిలో ఆమలకంలా భాసిస్తాడు. మన 'ప్రేమవిశ్వరూపం' ముందు వామనుడై,అంగుష్ఠ మాత్రుడై, కుశాగ్ర (తృణాగ్ర)మాత్రుడై మన హృదయంలో ప్రేమమీదతానుగాబందీయైపోతాడు.
Wednesday, March 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment