Sunday, February 28, 2010

మేకింగ్ ఆఫ్ మానవ!!!


అవి బ్రహ్మ సృష్టికర్తగా కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు......
మొదటి రోజు శుభసూచకంగా గోవుని సృష్టించి, నీకు అరవై ఏళ్ళ ఆయువుని ప్రసాదిస్తున్నాను. ఎండని వానని చూడక కష్టపడి రైతుకి అండగా వుండి అవసరానికి అతని ఆకలిని నీ క్షీరముతో తీర్చు అని సెలవిచ్చాడు.
ఆవు అయ్యా! ఇలా గొడ్డు చాకిరీ చేస్తూ అరవై ఏళ్ళు బ్రతకాల? నాకు ఇరవై ఏళ్ళు చాలు భగవంతుడా, మిగిలిన నలభై ఏళ్ళని నీవే తీసుకోమని మనవి చేసుకున్నది. బ్రహ్మ సరే అన్నారు.
రెండవరోజు శునకాన్ని సృష్టించాడు, దానికి ఇరవై ఏళ్ళ ఆయువుని ప్రసాదించి నీవు ఇంటి ద్వారానికి కాపలా కాస్తు వచ్చే పోయేవారిని చూసి మొరగమని సలహా ఇచ్చారు.
కుక్క, మహాప్రభో! ఈ కాపలా ఉద్యోగం ఇరవై ఏళ్ళెందుకు పదేళ్ళకి కుదించమని మొరపెట్టుకుని మిగిలిన పదేళ్ళు తిరిగి ఇచ్చేసింది. బ్రహ్మ సై అన్నారు.
మూడవరోజు మర్కటాన్ని మహా మోజుతో మలచి నీకు ఇరవై ఏళ్ళ ఆయువుని ఇస్తాను నీ కోతి చేష్టలతో అందరినీ అలరించమన్నాడు ఆ బ్రహ్మ.
కోతి తన కోతిబుర్రతో ఆలోచించి, అయ్యా నాపై మీకు ఇంత అభిమానము వద్దు కాని నాకు కూడా కుక్కకి ఇచ్చినంత ఆయువునే ప్రసాదించండి. మిగిలిన పదేళ్ళు నేను కూడా మీకే ఇచ్చేస్తున్నానంది. బ్రహ్మ వలదు అనలేక ఔను అన్నారు.
నాల్గవరోజు నవ్వుతూ నరుడిని రూపొందించాడు. ఈసారి నరుడి నోట "నో" అనిపించుకోరాదని, నరుడా నీవు ఏపని చేయకు హాయిగా తిని, ఆటలాడుకుని ఆనందించి నిద్రించు, నీకు ఇరవై ఏళ్ళు ఆయువుని ప్రసాదిస్తున్నాను పండగ చేసుకో! అని అలసి కాస్త విశ్రాంతికై ఒరిగిన వేళ......మానవుడు మాహా మేధావి, బ్రహ్మాజీ! ఒక విన్నపము ఈ జీవితానికి ఇరవై ఏళ్ళు ఏం సరిపోతాయి చెప్పండి? తమరు కాస్త పెద్దమనసుతో నా ఇరవైకి గోవుగారి నలభై, శునకానివి పది, కోతివి పది కలిపితే మొత్తం ఎనభై ఏళ్ళు మీ పేరు చెప్పుకుని బ్రతికేస్తాను అన్నాడు. బ్రహ్మగారు మానవుని మర్యాదకి మెలికలు తిరిగి తధాస్తు అన్నారు.
అదండీ అప్పటి నుండి మానవుడు.....మొదటి తన ఇరవై ఏళ్ళు ఏపని చేయకుండా తిని తొంగుని తరువాత నలభై ఏళ్ళు గొడ్డు చాకిరీ చేసి పదేళ్ళ తన కోతి చేష్టలతో మనవళ్ళని మనవరాళ్ళని నవ్వించి మిగిలిన పదేళ్ళు ఇంటికి కాపలా కాస్తున్నాడన్నమాట!
(ఇది సరదాగా నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నమే కాని ఎవ్వరినీ భాధ పెట్టాలని మాత్రం కాదని మనవండి... చిత్తగించవలెను)

No comments:

Post a Comment