Saturday, April 30, 2011

సంకల్పబలం



Pathway to Perseverence
QUITTERS NEVER WIN!
WINNERS NEVER QUIT!

బీహార్‌ రాష్ట్రంలోని గయ జిల్లాలో గెహ్లోర్‌ గ్రామవాసి దశరథ్‌ అస్వస్థతగా ఉన్న తన భార్యను వజీర్‌గంజ్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడానికి మధ్యలో ఒక కొండ అడ్డుగా నిలిచింది. కొండ చుట్టూ తిరిగి పోవాల్సిందే తప్ప మరో దారి లేదు. ఆ కారణంగా ఆరు గంటలు ఆలస్యమై సకాలంలో వైద్య సదుపాయం అందక దశరథ్‌ భార్య మరణించింది. భార్య మరణం అతణ్ని ఎంతగానో కలచివేసింది. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనుకున్నాడు. అడ్డుగా ఉన్న కొండను తొలిచి రోడ్డును నిర్మించాలనుకొన్నాడు. అనుకున్నదే తడవుగా కొండమీద నుంచి కిందికి రహదారిని నిర్మించే పనిలో పడిపోయాడు. ఈ బృహత్కార్యం నిర్వహించటంలో మరొకరి సహాయం తీసుకోలేదు. అధునాతన సామగ్రినీ ఉపయోగించలేదు. కేవలం మామూలు పలుగులు, సుత్తులు వంటి వాటితోనే పని మొదలుపెట్టాడు. నిర్విరామంగా కృషిచేసి అనుకున్నది సాధించాడు. ఇప్పుడక్కడ 25 అడుగుల ఎత్తున్న కొండ మీది నుంచి కిందికి 36 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పు గల రోడ్డు తయారైంది. 1967వ సంవత్సరంలో పని ప్రారంభించిన దశరథ్‌ 21 సంవత్సరాలపాటు రాత్రింబగళ్ళు పనిచేసి 1988 సంవత్సరానికి రహదారి నిర్మాణాన్ని పూర్తిచేయగలిగాడు. దశరథ్‌ సాహసం బీహార్‌ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. అదివరకు అత్తారి గ్రామం నుంచి వజీర్‌గంజ్‌ చేరటానికి చుట్టు తిరిగి 50 మైళ్ల దూరం ప్రయాణం చేయాల్సివచ్చేది. ఈ రోడ్డు వేసిన తరవాత ఆ దూరం 10 మైళ్లకు తగ్గిపోయి పరిసర గ్రామాలవారు సంతోషిస్తున్నారు. తాను నిర్మించిన కచ్చారోడ్‌ను మంచి తారురోడ్డుగా మార్చాలని దశరథ్‌ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం 1990లో అప్పటి బీహార్‌ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ను కలిసి విన్నవించుకున్నాడు. ఆయన అలాగే చేయిస్తానని మాటయితే ఇచ్చాడు, పనిమాత్రం జరగలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ ఇప్పటి ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను కలుసుకొని పరిస్థితిని వివరించి ఆ రోడ్డును తారురోడ్డుగా మారిస్తే పరిసర గ్రామాలవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పాడు. ఏడుపదుల వయసు దాటిన దశరథ్‌ సంకల్పబలాన్ని, ఆరాటాన్ని నితీశ్‌కుమార్‌ మెచ్చుకున్నారు. ఆ రోడ్డును తారురోడ్డుగా మారుస్తానని హామీ ఇచ్చారు. దశరథ్‌ కృషికి ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి బీహార్‌ సిఫారసు చేసింది!

గుండెబలం ఉంటే కొండల్ని పిండిగొట్టవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఎంతటి క్లిష్ట కార్యాన్నయినా సాధించవచ్చని ఎందరో రుజువు చేశారు. ''ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా...'' అని మహాకవి ఉద్బోధించినట్లు ఎవరి సహాయాన్నో ఆశించకుండా ఆత్మవిశ్వాసంతో, కార్యదీక్షతో అనుకున్నది సాధించటమే ధీమంతుల లక్షణం. ''పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు పట్టెనేని బిగియు పట్టవలయు...'' అని ఓ శతకకారుడు సెలవిచ్చాడు. ఆత్మబలమే తోడుగా, సత్యాగ్రహమే ఆయుధంగా, కార్యసాధనే ధ్యేయంగా దీక్షబూని రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాధినేతలను గడగడలాడించి మనకు స్వాతంత్య్రాన్ని సముపార్జించిపెట్టారు మహాత్మాగాంధీ. 'ధైర్యం సర్వత్ర సాధకం' అన్న పెద్దలే 'కష్టే ఫలీ' అనీ అన్నారు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగేవారికి ఎప్పుడూ విజయాలే లభిస్తాయి. ''నాకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఏ పనైనా బ్రహ్మాండంగా చేయగలను...'' అంటూ తాయారమ్మ గొప్పలు ఒలకబోస్తుంటే- ''ఒక్క వంట తప్ప'' అంటూ మొగుడు గొణుక్కున్నాడు. ఆత్మవిశ్వాసం అధికమైతే అహంకారంగా మారే ప్రమాదముంది. ఎందులోనూ అతి పనికిరాదు. ఈ విషయం ఎలాగున్నా కార్యసాధకుడు మీనమేషాలు లెక్కించకుండా, ఒకరి సహాయం అపేక్షించకుండా ఒంటరిగానైనా కార్యనిర్వహణకు పూనుకోవటం సహజం. భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలో శ్రీమహావిష్ణువు అటువంటి పనే చేస్తాడు. ''నీవే తప్ప నితఃపరంబెరుగ రావే ఈశ్వర కావవే వరద...'' అంటూ గజేంద్రుడు మొరపెట్టుకోగానే మరో ఆలోచన లేకుండా ఉన్నపళంగా బయలుదేరతాడు విష్ణువు. ''సిరికిం జెప్పడు శంఖచక్ర యుగముంజేదోయి సంధింపడేపరివారముం జీరడు...'' అన్న మనోహరపద్యం పోతన ఆ సందర్భంలో రాసిందే.

''ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన దాజక్కనొనర్ప...'' అన్నారో కవి. ''ఇంతపెద్ద దొంగతనం నువ్వొక్కడివే చేశావా?'' అని ఆశ్చర్యంగా అడిగాడు జడ్జీ, బోనులో నుంచున్న ముద్దాయిని. ''చిత్తమండీ. ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మలేం కదండీ మరి...'' అన్నాడు దొంగ తడుముకోకుండా! మంచైనా, చెడైనా ఇతరుల మీద ఆధారపడకుండా పరుల సహాయం కోరకుండా స్వయంగా నెరవేర్చుకొనే గుణం కొందరికి ఉంటుంది. గోబీ ఎడారిలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో శత్రువుల మధ్య నిరంతర పోరాటమే జీవనశైలిగా కాలం గడుపుతున్న ఛంఘిజ్‌ఖాన్‌ సాహసం, సంకల్పబలాలే ఊపిరిగా ప్రపంచంలో ముప్పాతికవంతు వరకు జయించి జగజ్జేత అనిపించుకున్నాడు. అనుకున్నది సాధించాలనే పట్టుదల మెండుగా ఉన్నప్పుడు ఎటువంటి కష్టాన్నీ లెక్కచేయరు కార్యసాధకులు. కొత్త ఖండాలు కనిపెట్టాలనే సదాశయంతో వసతులు, సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఆ రోజుల్లోనే కొలంబస్‌ సాహసయాత్ర ప్రారంభించి నూతన ప్రదేశాలను కనిపెట్టాడు. భార్యపట్ల ప్రేమ షాజహాన్‌ను అపూర్వ స్మృతిచిహ్నం తాజ్‌మహల్‌ నిర్మించేలా చేసింది. ప్రియురాలి పట్ల మమతే కులీకుతుబ్‌షాతో భాగ్యనగరావతరణానికి దోహదపడింది. ''ప్రియురాలు మరణింప ప్రియుడు కట్టించె కన్నీటి తలపోతగా తాజమహలు. జవరాలి ప్రేమకై యువరాజు నిర్మించె పన్నీటి కాన్కగా భాగ్యనగరమ్ము...'' అని వర్ణించారో కవి. బీహార్‌కు చెందిన దశరథ్‌ మాంజి అనే ఆసామి ఆ కోవలోనే తన భార్యను తలచుకొంటూ ఏకంగా ఒక కొండనే తొలిచి రోడ్డుమార్గాన్ని ఏర్పాటు చేశాడు.

No comments:

Post a Comment