మానవుడు సంఘ జీవి. నలుగురితో నారాయణా అన్నట్లుగా అందరితో కలిసిమెలిసి జీవించాలనే కోరుకుంటాడు. ఏకో నారాయణా అన్నట్లుగా ఒంటికాయ శొంఠికొమ్ములాగ బతికే ప్రబుద్ధులు అక్కడక్కడా ఉండొచ్చు. అటువంటివారి సంఖ్య స్వల్పం. నలుగురు పలికిందేమాట నలుగురు నడిచిందే బాట, నలుగురితో చావు పెళ్ళితో సమానం- వంటి సామెతలు సంఘజీవనం పట్ల మనుషులు చూపే మక్కువ నుంచి ఉద్భవించినవే. పూర్వం మునులు, ముముక్షువులు ఇతరులతో సంపర్కంలేకుండా ఏకాంతంగా ఏ కొండల్లోనో కోనల్లోనో ముక్కుమూసుకొని ఏళ్ళతరబడి తపస్సు చేస్తూ కాలం గడిపినట్లు చెప్పే పురాణ గాథలున్నాయి. వారూ ఏదో ప్రయోజనం ఆశించి, ఏ దేవుడో ప్రత్యక్షమై తమకు వరాలు ప్రసాదిస్తాడనీ తద్వారా నలుగురిలో గుర్తింపు లభిస్తుందనే ఆశతోనే అటువంటి తపస్సు చేశారేమో! నిర్జనంగా ఉన్న మంచుకొండల్లో ఒక్కతే కూర్చుని వీణ వాయించుకుంటున్న అద్భుత సౌందర్యరాశి వరూధినిని చూసి ప్రవరాఖ్యుడు ఆశ్చర్యపోతాడు. ''ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ, యొంటి జరించె దోటలేకివ్వన భూమి'' అని ప్రశ్నిస్తాడు. మనుష్య సంచారం లేని ఆ హిమనగంలో అనుకోకుండా ఓ వ్యక్తి తారసపడినందుకు ఉబ్బితబ్బిబ్బై పోయిన ఆ గంధర్వాంగన వయ్యారాలు పోతుంది. ఎవరూలేని ఆ చోట భయంలేకుండా ఒక్కదానివీ ఏం చేస్తున్నావు అన్న ప్రవరుని ప్రశ్నకు తిన్నగా జవాబు చెప్పదు. ఆ సమయంలో అనుకోకుండా ఓ తోడు దొరికినందుకే ఆమె మురిసిపోయి ఉండాలి!
సంపద ఎంత ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా మానవుడు ఒక తోడు కోరుకుంటాడు. ''చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము...'' అన్నారు శ్రీశ్రీ ఒక సినిమా పాటలో. వివాహంతో ఎవరికైనా తోడు దొరుకుతుంది. కొంతమంది పెళ్ళంటేనే జంకుతారు. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావంటారు. ఆ సోగ్గాడు ముదిరిన బెండకాయలా అయినా పెళ్ళిమాటమాత్రం తలపెట్టడంలేదు. ''పెళ్ళెందుకు చేసుకోవోయి...'' అని అడిగాడు మిత్రుడు. ''ఆఫీసులో నా పీకలమీద సవారి చేస్తూ ఓ బాస్ ఉండనే ఉన్నాడు. ఇంట్లోకి కూడా మరో బాస్‌ను తెచ్చుకోమంటావా ప్రాణాలమీదికి'' అంటూ విసుక్కున్నాడు సోగ్గాడు. అటువంటివారు కొందరు ఉన్నప్పటికీ సహజంగా ఎక్కువమంది జీవితంలో ఒకతోడు కావాలనే కోరుకుంటారు. వెన్నెలరేయి ఒంటరితనాన్ని భరించలేక, ''నాకూ తోడెవ్వారు లేరు, కోడికూతా జాముదాకా తోడు రారా వన్నెకాడా'' అని ఓ పల్లెపడుచు సాక్షాత్తు ఆ చందమామనే తోడురమ్మని కోరుతుంది. కాలం మారి ఇప్పుడు భార్యాభర్తలిద్దరు మాత్రమే ఉండే కంప్యూటర్ కాపురాలు ఎక్కువైనప్పటికీ వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల హడావుడే అధికం. కష్టసుఖాలు నలుగురితో పంచుకోవటంలోనే ఆనందం ఉందని నమ్మేవారు. ''నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొకపరి తలవండి...'' అంటుంది పూర్ణమ్మ. ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని కోరుకొనేకంటె నలుగురితో కలిసిమెలిసి ఉన్నప్పుడే జీవితం ఆనందంగా గడుస్తుంది.
ఏకాంతాన్నే కోరుకుంటూ ఒంటరిగా ఏవో ఆలోచనల్లో మునిగిపోతూ కాలక్షేపం చేయటానికి ఇష్టపడే మగవారు గుండెపోటుతో మరణించే ప్రమాదం ఎక్కువని ఓ అధ్యయన బృందం నిర్ధారించింది. షికాగోలోని నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం 30 సంవత్సరాలపాటు విస్తృతంగా పరిశోధించి కడకీ నిర్ణయానికి వచ్చింది. ఒకే వయస్సు, ఒకే సామాజిక హోదా కలిగిన 2100మంది పురుషులను మనస్తత్వాన్నిబట్టీ ప్రవర్తన తీరునుబట్టీ నాలుగు గ్రూపులుగా వేరు చేశారు. అసహనం ప్రదర్శిస్తూ ఒక్కక్షణం కూడా స్థిమితంగా ఉండలేని పురుషవరేణ్యులను మొదటి బృందంగా వర్గీకరించారు. ఈ బాపతు పురుషపుంగవులకు గుండెపోటు వచ్చే అవకాశం అధికం. జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా తేలికగా తీసుకుంటూ స్థిమితంగా, ప్రశాంతంగా ఉండేవారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడటం అరుదు. ఇటువంటి మగవారిని రెండో బృందంగా గుర్తించారు. ఇక మూడో బృందానికి చెందినవారు ఎంతసేపటికీ ఇతరుల మెప్పును పొందాలనే తాపత్రయపడుతుంటారు. స్వీయనియంత్రణ తక్కువ కావటంతో మనసులో అనవసరమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఆ కారణంగా వీరికీ గుండెపోటు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎప్పుడూ ఆందోళనతో ఉంటూ అన్నిటికీ మొహమాటపడుతూ తమ భావాలను పైకి వెల్లడించకుండా తమలోనే అణచేసుకొనే అయ్యలు నాలుగో బృందం కిందికి వస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం తక్కువ. ఇలాంటివారికీ తరచూ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఇతరులతో పోలిస్తే ఒంటరిగా కాలం గడిపేవారు గుండెజబ్బుతో చనిపోయే ప్రమాదం 40శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఎక్కువమంది స్నేహితులుండి, వారితో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొంటూ కాలక్షేపం చేసే నిత్య సంతోషులకు, పెళ్ళి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా కాలక్షేపంచేసే పుణ్యపురుషులకు గుండెపై ఒత్తిడితగ్గి ఆరోగ్య సమస్యలు చాలావరకు నెమ్మదిస్తాయి. అందుకే పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని హాయిగ కాలం గడపండి మీ గుండెకేం ఢోకా ఉండదు- అని ఆ అధ్యయన బృందంవారు పురుషపుంగవులకు అడగకుండానే సలహా ఇస్తున్నారు!

No comments:
Post a Comment