" నా విష్ణుః పృథివీ పతిః"- విష్ణు అంశ లేనివాడు, విష్ణువు కానివాడు రాజు కాలేడని భావం. విష్ణువు అంటే సర్వవ్యాపకుడని, రాజు విష్ణు స్వరూపుడని వేదాలు స్పష్టం చేశాయి. సింహాసనాన్నధిష్ఠించిన ప్రతివాడూ రాజు కాడు. ప్రతి రాజూ విష్ణువు కాడు. విష్ణువులా తన పాలితులు, సమాశ్రితుల హృదయసర్వంలో వ్యాపించి, వారి సకల సంక్షేమం పట్ల ఆత్మీయపూర్వక బాధ్యుడై ఉండాలి. తన ఏలుబడిలోని వారిని అహేతుక ప్రేమతో పాలించేవాడై ఉండాలి. అలాంటివాడే రాజు. అలాంటి రాజే విష్ణువు. విష్ణువు స్థితికారుడు. లోకాలను పాలించేవాడు. పోషించేవాడు. తన ఏలుబడిలోని ఏ జీవి ఆర్తితో పిలిచినా... సిరికింజెప్పడు, శంఖ చక్రములనైనా ధరింపడు, లక్ష్మీదేవి చేలాంచలమైనా వీడడు. కాచికాపాడేందుకు కదలివస్తాడు. తన పాలితులపట్ల పాలకుడికి అలాంటి ఆర్తితో కూడిన బాధ్యత ఉండాలి. పరిమితి లేని ప్రేమ ఉండాలి.
మన పూర్వ పాలకులు వేద విహిత జీవనాన్ని గడిపినవారు. చతురాశ్రమాలను అనుష్ఠానం చేసినవారు. పాలన పట్ల నిష్ఠ కలిగినవారు. ప్రజలకు, పాలకులకు మధ్య అనుబంధం వారికి తెలుసు. అనుసంధానం తెలుసు. వారు మకుటమనే ముళ్ల కిరీటాన్ని తాము ధరించి, ప్రజలకు పూలబాటగా జీవితాన్ని అంజలితో అందించినవారు. అందుకే విష్ణుస్వరూపులయ్యారు. నిజానికి వారు ప్రజలను పాలించలేదు, సేవించారు. పాలనను యజ్ఞ సమంగా భావించారు. వారు యాజ్ఞికులుగా, వారి జీవితాలను సమిధలుగా, పంచాగ్నుల మధ్య యజ్ఞంగా జీవించారు. తరించారు.
నిజానికి పాలకుడంటే ప్రజాసేవకుడు. సేవకుడు కావాలంటే శారీరక బలాఢ్యుడు అయి ఉండాలని కాదు. ఆ అవసరమూ లేదు. హృదయమున్నవాడు కావాలి. ఆ హృదయాన్ని సవ్యమైన రీతిలో వినియోగించేవాడు కావాలి. అదే హృదయాన్ని ప్రజాసేవకై ప్రజల ముందు పరిచేవాడు కావాలి. సేవ అంటే మన ఇష్టాయిష్టాలకూ, మన వీలుకూ సంబంధించింది కాదు. సేవ చేయించుకునే వారి అవసరాలకూ, వారి ఇష్టాయిష్టాలకూ సంబంధించింది. ఎదుటి వారికి దాహమేసినప్పుడే మనం నీరందివ్వాలి. మన దగ్గర నీరున్నప్పుడు కాదు. మనకు వీలున్నప్పుడు కాదు. మనకు ఇవ్వాలనిపించినప్పుడు కాదు. అదే సేవ. విష్ణుమూర్తి ప్రియసఖితో కేళీవిలాసంగా ఉన్న సమయంలో, దూర్వాసుని పిలుపునకు శేషతల్పం నుంచి దిగివచ్చి ఆయన పాదసేవ చేశాడు. గజరాజు, అన్నమయ్య, రామదాసు, సక్కుబాయి లాంటి ఎందరో భక్తులకు దాసుడై మరీ సేవ చేశాడు. స్వయంవిష్ణువైన శ్రీరాముడు రుషులకు సేవ చేశాడు. ప్రజలకు సేవ చేశాడు. పక్షులకు సేవ చేశాడు. సేవకుడు పాలకుడుగా ఉండే అవకాశం లేదు. పాలకుడు సేవకుడుగా ఉండే అదృష్టం ఉంది. ఆశ్రయించినవారికి ఏకకాలంలో సేవచేసే అవకాశమూ, వరాలిచ్చే అధికారమూ కూడా విష్ణువు తరవాత పాలకుడికే ఉన్నాయి.
విష్ణువు సర్వజగాలకూ కర్త అయివుండీ ఆ జగాల సంరక్షణార్థం వరాహమయ్యాడు. వామనుడయ్యాడు. రాముడయ్యాడు. రాధా రమణుడయ్యాడు. నరుడూ, నారసింహుడూ అయ్యాడు. ఇంకా ఏమయినా కాగలడు. విష్ణువు విశ్వ పిత. ఆది బీజం. సర్వజగాలకు తండ్రి. ఆయనలోని తండ్రికి ఉన్న ప్రేమ, బాధ్యత, ఆర్ద్రత రాజుకూ ఉండాలి. నిజానికి ఎవరికైనా తల్లి తండ్రి వేరువేరు. కానీ రాజులో తల్లిప్రేమ, తండ్రి బాధ్యత కలగలిసి కలిమి పూలచెట్టులా వెల్లి విరియాలి.
రక్షించడం, పోషించడం, వినయాది సద్గుణాలను నేర్పించడం వంటి ప్రజోపయోగకరమైన కార్యాచరణ వల్ల అయోధ్యా ప్రజలకు- వారి కన్నవారు కేవలం జన్మనిచ్చినవారుగానే మిగిలిపోయి- రఘువంశ రాజులు తల్లిదండ్రులుగా పరిఢవిల్లారు. స్వచ్ఛమైన స్వ ఆచరణే ప్రజలకు నేర్పించే పద్ధతిగా పాలించినవారు గనుకనే రఘువంశ ఏలికల ఘనకీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఆధునిక పాలకులు తాము విష్ణు స్వరూపులమన్న అంశాన్ని మాత్రమే ప్రేమతో గౌరవంతో స్వీకరించి, మిగిలిన విష్ణు విశిష్ట గుణాలన్నింటినీ గాలి కొదిలేశారు. అలాంటివారు... వారూ గాలికి కొట్టుకుపోక తప్పదు... వారెవరైనా, ఎంతటివారైనా.
- చక్కిలం విజయలక్ష్మి
No comments:
Post a Comment