Friday, April 9, 2010

నాన్నకు వందనం!


- డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు
ఒక వూళ్ళో ఒక పండితుడు ఉండేవాడు. సకల శాస్త్రాలు ఔపోసన పట్టి బాగా పేరు గడించాడు. అతని కొడుకూ తన పాండిత్య ప్రతిభతో అనేక సన్మానాలూ, బహుమానాలూ పొందుతూ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. తండ్రి మాత్రం పెదవివిప్పి ఏ మెచ్చుకోలు మాట మాట్లాడేవాడు కాదు. పైగా కొడుకు పాండిత్యంపై విమర్శలు చేసేవాడు. కొడుక్కి విపరీత ద్వేషం కలిగి తండ్రిని చంపేయాలనుకున్నాడు. ఒకరోజు తమ ఇంటి అటకపైనున్న తిరగలిని తండ్రి తలమీదకు విసురుదామని అతడి ప్రయత్నం. ఆ సమయంలో తండ్రి భోజనానికి కూర్చున్నాడు. తల్లి భోజనం వడ్డిస్తోంది. తల్లిదండ్రుల మాటలు అతడికి వినిపించాయి. 'పాపం, మన అబ్బాయి మీ ప్రవర్తనకు కుమిలిపోతున్నాడు, ఎంతో ప్రతిభతో వెలుగుతున్న అతడిని మీరు అభినందించడం లేదు ఎందుకని?' అంది తల్లి. ఆ మాటలకు తండ్రి నవ్వుతూ
'తల్లితండ్రులు పొగిడితే బిడ్డలకు ఆయుఃక్షీణం. మనం పొగిడితే వారిలో గర్వం తలెత్తుతుంది. అందుకే మనసులోనే వాడి ప్రతిభకు ఆనందపడుతున్నాను. పుత్రోత్సాహాన్ని లోలోపలే దాచుకుంటున్నాను'అన్నాడు. తండ్రి మాటలు విన్న ఆ కొడుకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. అటక దిగి తనను క్షమించవద్దనీ, ఏదైనా శిక్ష విధించమని ప్రాథేయపడుతూ తండ్రి కాళ్లు పట్టుకున్నాడు. ఆ యువకుడే 'తొందరపాటు నిర్ణయం వినాశానికి హేతువు' అనే అర్థం వచ్చే ఒక అద్భుతమైన శ్లోకాన్ని రచించిన మహాకవి భారవి.

తండ్రి మాటకోసం సింహాసనాన్ని తృణీకరించి అడవిమార్గం పట్టిన
శ్రీరాముడు, తండ్రికోసం జీవితాంతం బ్రహ్మచారిగా గడిపిన భీష్ముడు, తన తండ్రి యయాతికోసం తన యవ్వనాన్ని ధారపోసి వృద్ధాప్యాన్ని స్వీకరించినపురూరవుడు... ఇలా ఎందరో మహానుభావులు- తమ తండ్రుల ఆజ్ఞానుసారం జీవించి మహాత్ములుగా చరిత్రలో నిలిచిపోయారు.

- ఇవన్నీ పురాణకాలం నాటి సంగతులు. నేటి పరమాణు యుగంలో నాన్నల పరిస్థితి ఏమిటి? రెక్కలు, ముక్కలు చేసుకుని బిడ్డల ఉన్నతి కోసం జీవితపర్యంతం తుదిశ్వాస వరకూ జీవించే తండ్రులకు మిగులుతున్నదేమిటి? జీవఫలం చేదువిషం. తమను పున్నామనరకంనుంచి తప్పిస్తాడని భావించే తండ్రులకు జీవించి ఉండగానే నరకం చూపించే కొడుకుల సంగతులు మనకు తెలుసు. తండ్రులు భారం అవుతున్నారని వారిని వృద్ధాశ్రమాలకు తరలించే ప్రబుద్ధులు మనకు సమాజంలో కనిపిస్తున్నారు.

పుత్రోత్సాహం తండ్రికి కొడుకు పుట్టిన వెంటనే రాదనీ, ఆ కొడుకు గుణగణాలు సమస్త జనులూ తెలుసుకొని పొగిడినప్పుడు మాత్రమేనన్న సుమతీ శతకకారుడి వాక్కులు అక్షరసత్యాలు.

తల్లిదండ్రుల మీద దయచూపని కొడుకు పుట్టినా చనిపోయినవానితో సమానమనీ, పుట్టలోని చెదలు పుట్టినట్టే పుట్టి ఎలా నాశనమవుతాయో, దయార్ద్ర హృదయం లేని కొడుక్కూ అదే గతి అనీ వేమన చేసిన నీతిప్రబోధం అన్ని కాలాల్లోనూ అందరూ గుర్తుంచుకోదగినది.

యజ్ఞాల్లో పితృయజ్ఞం అనుపమానమైనదంటారు వేదాంతులు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలుగా గుర్తించి వారిని సేవించడమే ఈ యజ్ఞ భావనగా పండితులు పేర్కొన్నారు.
పితృయజ్ఞానికి ఆద్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన తన మాతాపితలనే సర్వస్వంగా భావించి వారిచుట్టూ ప్రదక్షిణ చేశాడు. అది మొత్తం ప్రపంచాన్ని చుట్టివచ్చే యజ్ఞానికి సమానంగా ప్రసిద్ధికెక్కింది. తల్లిదండ్రులకు చేసే సేవ లేదా పితృయజ్ఞం వారికే కాదు ఈ ప్రపంచం మొత్తానికి చేసే సేవగా వినాయకుడు పితృయజ్ఞం ద్వారా లోకానికి చక్కటి నీతిని ప్రబోధించాడు.

యస్మా త్పార్థివ దేహః ప్రాదుర భూద్యేన భగవతా గురుణా!
నంతు నమాంసి సహస్రంతస్మై సర్వజ్ఞ మూర్తయేపిత్రే!

ఎవరివల్ల ఈ భౌతిక శరీరం జన్మించిందో అటువంటి భగవత్‌ స్వరూపుడైన సర్వజ్ఞమూర్తి అయిన తండ్రికి వేలకొలది నమస్కారాలు అని ఈ శ్లోకం అర్థం.
ఈ శ్లోకంలోని పరమార్థాన్ని గ్రహించి నాన్నలకు వందనం చేద్దాం. పితృయజ్ఞంలో భాగస్వాములమవుదాం.

No comments:

Post a Comment