సంఘ జీవనంలో కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యముంది. కుటుంబ సభ్యులు ఒకరిపట్ల మరొకరు బాధ్యతాయుతమైన ప్రేమను కలిగి ఉంటూ ఒకరికొకరు తోడుగా ఉండటంలో ఆనందం ఎంతయినా ఉంటుంది. అండలుంటే కొండలు దాటవచ్చని సామెత. మంచయినా, చెడయినా నేనున్నానని అండగా నిలిచే కుటుంబ సభ్యులు తోడుంటే మనిషి నిశ్చింతగా ఉండగలుగుతాడు. నాగరకత ఎంత పెరిగినా, ఎన్ని మార్పులొచ్చినా భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ పదిలంగానే ఉంది. 'తల్లితండ్రి యన్నదమ్ములాత్మ సఖులు, నెలమి బంధుభృత్యులెల్ల జనులు గలిగి వర్ధిల్లంగ ఘనతతో నుండరా...' అన్నాడు వేమన కవీంద్రుడు. తల్లితండ్రులు, అన్నదమ్ములు, ఆత్మబంధువులు అంతా కలసి ఒకే కుటుంబంలా ఉండటం మనదేశ ప్రత్యేకత. మారుతున్న కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్నా కుటుంబ సభ్యులమధ్య ఆప్యాయతానురాగాలు మాత్రం తగ్గిపోవటం లేదు. మనదేశ సంస్కృతీ వారసత్వమే దానికి కారణం అని చెప్పవచ్చు. 'అపుత్రస్య గతిర్నాస్తి' అని సామెత. పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని మనవారి నమ్మకం. అంతేకాక కొడుకులు వృద్ధాప్యంలో తమను ఆదుకుంటారని, ఆదుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. ఆ కారణంగానే కొడుకులే కావాలని కోరుకుంటూ ఉంటారు. పిల్లలు పక్కదారులు పట్టకుండా లక్షణంగా పెరిగి పెద్దవారై కుటుంబానికి మంచిపేరు తేవాలని ప్రతి తల్లిదండ్రులూ ఆశిస్తారు. ఆ ఆశతోనే ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా పిల్లలను పెంచుతుంటారు. అన్నిటినీ సర్దుకుంటూ పిల్లల యోగక్షేమాలే ధ్యేయంగా సంసారాన్ని నెట్టుకురాక తప్పదు గృహస్తులకు. ఆదర్శప్రాయంగా జీవిస్తూ తమకూ, తల్లిదండ్రులకు పేరు తేవటమేగాక వారి క్షేమమే తమ లక్ష్యంగా ప్రవర్తిల్లే కొడుకులూ అనేకమంది ఉన్నారు. పురాణకాలంలో భీష్ముడు తన తండ్రి సుఖం కోరి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞచేసి తన మాటను నిలబెట్టుకుంటాడు. భీష్మ ప్రతిజ్ఞ చరిత్ర ప్రసిద్ధి చెందింది. యయాతి తనయుడు పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ధారపోసి ఆయన అకాల వృద్ధాప్యాన్ని తాను భరిస్తాడు. తల్లిదండ్రుల కోసం పిల్లలు, పిల్లల కోసం వారిని కన్నవారు త్యాగనిరతిని ప్రదర్శిస్తూ ఉండటం కొత్తకాదు. యుగాలు మారినా మనుషులలోని ఈ స్వభావం మారలేదని నాగశయన ఉదంతమే రుజువు చేస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన నాగశయన, సుమాకిరణ్ దంపతులిద్దరూ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులే. సుమాకిరణ్ సికింద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంటే నాగశయన అమెరికాలో టెలికాం ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నాగశయన తండ్రికి కాలేయం దెబ్బతినగా మార్చాలని డాక్టర్లు చెప్పారు. దాంతో నాగశయన అమెరికానుంచి భారత్ చేరుకొని తన కాలేయంలో కొంత భాగాన్ని తండ్రికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆపరేషన్ చేయటానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ దశలో నాగశయన భార్య సుమాకిరణ్, 70 ఏళ్ల వృద్ధుడైన తండ్రికోసం 27 సంవత్సరాల చిన్న వయసులో ఉన్న తన భర్త నాగశయన కాలేయం ఇస్తే భవిష్యత్తులో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా భర్త తన నిర్ణయం మార్చుకోకపోవటంతో ఆమె కోర్టుకు వెళ్లింది. కాలేయ మార్పిడివల్ల తన భర్త ఆరోగ్యం క్షీణిస్తే తమ దాంపత్య జీవితానికి భంగం కలుగుతుందనీ భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆమె కోర్టులో వాదించింది.
కేసును కూలంకషంగా పరిశీలించిన కోర్టువారు ఇది కుటుంబపరమైన సమస్యనీ, కుటుంబంలోనే పరిష్కరించుకోవచ్చని, ఇందులో కోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. అదీకాక కాలేయం ఇవ్వడంవల్ల తన భర్త ఆరోగ్యం దెబ్బతింటుందనడానికి సుమాకిరణ్ ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదని వ్యాఖ్యానించారు. అదేసమయంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్యగల ఆత్మీయతానుబంధం అనిర్వచనీయమైనదని, తల్లిదండ్రుల ప్రేమకు, త్యాగాలకు హద్దులుండవని తన భర్త భూమిమీదకు రావటానికి కారణం ఆయన తల్లిదండ్రులేనన్న విషయాన్ని ఆమె అర్థం చేసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ కేసుకు కొసమెరుపేమిటంటే కోర్టువారు సుమాకిరణ్ వాదనను పూర్వపక్షం చేసినా ఆమె మామగారు మాత్రం కోడలి హృదయాన్ని అర్థం చేసుకున్నారు. వృద్ధుడైన తన మూలంగా ఎంతో భవిష్యత్తు ఉన్న తన కొడుకు ఆరోగ్యంలో సమస్యలు ఏర్పడటం తనకు సమ్మతం కాదన్నారు. తన మూలంగా కొడుకు సంసారంలో కలతలు ఏర్పడటం తనకు ఇష్టం లేదన్నారు. ఈ కారణాలతో కొడుకునుంచి కాలేయాన్ని స్వీకరించటాన్ని నిరాకరించారు. దాంతో జరగవలసిన ఆపరేషన్ ఆగిపోయింది. తండ్రి ఆరోగ్యం కోసం తనయుడు, కొడుకు క్షేమం కోసం తండ్రి పడుతున్న ఈ ఆరాటం మనదేశంలో కుటుంబవ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో, కుటుంబ సభ్యులు ఒకరిపట్ల మరొకరు ఎంతటి ఆప్యాయతానురాగాలను కలిగి ఉంటున్నారో స్పష్టపరచింది. ఎంతకాలం గడిచినా, ఎన్ని మార్పులొచ్చినా ప్రాచీన భారత సంస్కృతి ఇంకా తన పట్టుకోల్పోలేదనే విషయం ఆనందాన్ని కలిగిస్తోంది.!

No comments:
Post a Comment