Friday, April 2, 2010

ధర్మబద్ధ జీవన దిక్సూచి... భగవద్గీత


గీత అంటే గానం చేసినదని అర్థం. భగవంతుడే స్వయంగా గానం చేసింది కనుక భగవద్గీత అయింది. 'గీతా' అని అన్నప్పుడు బహువచన అర్థం వస్తుంది. దీన్ని అనుసరించి చూస్తే భగవద్గీతలోని ప్రతి అధ్యాయమూ ఒక గేయంగా చెప్పవచ్చంటారు పెద్దలు. పలు అధ్యాయాలు ఉన్నాయి కనుక ఇలా 'గీతా' అనడం కూడా కనిపిస్తుంది. ఒకరు మరొకరికి చెప్పిన మంచి మాటలు అన్నది చాలాచోట్ల కనిపించే అర్థం.

గీత అంటే ఒక్క భగవద్గీతే కాదు చాలారకాల గీతలున్నాయి. భారతంలోను, భాగవతంలోను దాదాపు పన్నెండు దాకా హంసగీత, బ్రాహ్మణగీత, భ్రమరగీత, శ్రుతిగీత లాంటి గీతలున్నాయి. అయితే గీత అన్న శబ్దం చెవిన పడగానే అందరి కళ్లముందు ప్రత్యక్షమయ్యేది భగవద్గీతే.

భగవద్గీత- శ్రీకృష్ణపరమాత్ముడు యుద్ధరంగం మధ్యలో అర్జునుడికి చేసిన హితోపదేశమిది. అర్జునుడు నేను యుద్ధం చెయ్యను, బంధువులను చంపడం మహాపాపం కదా! అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు... 'ఇది నీ కర్తవ్యం. యుద్ధం చెయ్యక తప్పదు' అంటూ అర్జునుడు ఎందుకు యుద్ధం చేయాలో విడమరిచి చక్కగా బోధించాడు. అర్జునుడి చేత యుద్ధం చేయించి ధర్మానికి విజయం చేకూర్చిపెట్టాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎన్నిరకాలుగా ఉత్సాహపరచాలో అన్నిరకాలుగా విషయాన్నంతా విడమరిచి చెప్పి యుద్ధానికి సన్నద్ధం చేశాడు. యుక్తితో కొన్ని ఉదాహరణలతో భగవద్గీతను కృష్ణభగవానుడు అర్జునుడికి చెప్పాడు. అంత శక్తివంతమైనది భగవద్గీత.

అయితే ఇక్కడ కొంతమంది శ్రీకృష్ణుడు హత్యాకాండను ప్రేరేపించాడని అనవసరమైన అపవాదును చేస్తుంటారు. ధర్మం ఎంతో సూక్ష్మమైనది. దాన్ని దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మరిచిపోయి కృష్ణుడు చేసిన గీతోపదేశాన్ని యుద్ధప్రేరకంగా భావించడం మంచిది కాదన్నది పండితుల, పరిశోధకుల భావన. దీనికి ఒక న్యాయాధికారిని ఉదాహరణగా పండితులు చెబుతుంటారు. ఎదురుగా ఉన్నది బంధువులు కదా, వారిని ఎలా సంహరించటం? అనే సందేహం అర్జునుడికి కలిగింది. న్యాయాధికారి హంతకుడికి మరణదండన విధిస్తుంటాడు. ఆ సమయంలో నేరస్థుడు తనకు సమీప బంధువనీ, అతడికి మరణదండన ఎలా విధించగలననీ న్యాయాధికారి అనుకుంటే అతడు సరిగా న్యాయం చేసినట్లుకాదు. పక్షపాతబుద్ధి లేకుండా నేరస్థుడు బంధువైనా, మరొకరైనా శిక్షను అమలుచేయటంలో చిత్తశుద్ధితో ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇలాంటి బుద్ధినే గీతోపదేశం చేసి అర్జునుడిలో కలిగించాడు శ్రీకృష్ణుడు. స్వ, పర భేదంలేక దుష్టులను శిక్షించడం ఉత్తమ క్షత్రియుడి కర్తవ్యమని బోధించాడు. ధర్మమనేది వ్యక్తిపరంగాకాక నిస్పక్షపాతంగా ఉండాలన్నాడు. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలన్నాడు. నీతిబాహ్యులైనవారిని శిక్షించకపోతే సమాజానికి చేటనేది కృష్ణుడి ఉపదేశంలో మనకందే సందేశం. అలా చేయకపోతే సంఘ వ్యవస్థ చెడిపోతుంది. దేశరక్షణ కోసం ఉన్న సైనికులు శత్రుసేనలు చొచ్చుకొస్తున్నప్పుడు అహింస అంటూ కూర్చుంటే సమంజసంగా ఉండదు. వారు చేస్తున్నది దురాక్రమణ కనుక ఎదురు నిలిచి వారిని సంహరించాల్సిందే. కౌరవులు కూడా న్యాయాన్ని అతిక్రమించారన్నది అప్పటికే ప్రపంచమంతా తెలిసిన విషయం. కృష్ణుడు ఎన్నో సందర్భాల్లో దుర్యోధనుడి అన్యాయాలను కళ్ళారా చూశాడు కూడా. అందుకే అర్జునుడిని యుద్ధం చెయ్యమని ఉపదేశించాడు.

శ్రీకృష్ణుడు మామూలు మనిషికాదు, ఆయన పరమాత్మ అని అప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా. సాక్షాత్తూ దైవమే వచ్చి చెప్పిన మాట ఏనాడూ అధర్మంగా ఉండదు. ఈ ఒక్క విషయాన్ని మనసులో ఉంచుకున్నా భగవద్గీత యుద్ధాన్ని ప్రేరేపించిన ఉపదేశం కాదని, సర్వమానవాళి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని చెప్పిందేనని అవగతమవుతుంది. ఈ భగవద్గీతలో మానవజాతికి ప్రతినిత్యం ఎదురయ్యే నైతిక, ఆధ్యాత్మికపరమైన ధర్మసందేహాలకు సంబంధించిన సమాధానాలు ఉన్నాయి. వాటినన్నిటినీ వివరంగా తెలుసుకుంటే చక్కటి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి వీలుంటుంది. భగవద్గీతలో భగవత్ తత్వం, భగవత్ ప్రాప్తి మార్గాల వివరణ ఉంది. భగవద్గీతలో జ్ఞాన, కర్మమార్గాల్లో ఏది విశిష్టమైనది అనేదానికి సమాధానంగా రెండింటికీ భేదం లేదని, ఎంతటి జ్ఞాని అయినా కర్మ చేయక తప్పదని, అయితే ఫలాపేక్ష లేకుండా చేసే కర్మకు దోషం ఉండదని చెప్పిన సమన్వయం కనిపిస్తుంది. ఇలా భగవద్గీత మానవాళికి ఒక మార్గదర్శకంగా వెలుగొందుతోంది.

No comments:

Post a Comment