Tuesday, January 5, 2010

నా వూరూ... నా వారూ


భాగ్యనగర వీధులు ఎంత విశాలమో తెలియాలంటే, సంక్రాంతి పండగ రోజుల్లో చూడాలి. నిషేధాజ్ఞలు అమలుచేసినట్లు జనసంచారం బొత్తిగా లేక వీధులన్నీ బావురుమంటాయి. కిటకిటలాడే జనంతో బారులుతీరిన వాహనాలతో వాటి రొదలో కిక్కిరిసిపోయి ఉండే వీధులు- పండగ నాలుగైదు రోజులూ పిల్లలు క్రికెట్‌ ఆడుకోవడానికి వీలుగా కనపడటం ఎంతో వింతగా తోస్తుంది. రాజధానిలో సగానికిసగం జనాభా పండక్కని, బస్సుల్లోనూ రైళ్ళలోనూ కోళ్ళగంపల్లో పిల్లల్లా సర్దుకుని వారివారి ఊళ్ళకు బారులు తీరతారు. ఎందుకని ప్రజలలా పల్లెటూళ్ళకు పరుగులెడతారు? ఇక్కడ లేనిది అక్కడ ఏం ఉంది? అక్కడ పండగ ఉంది- పచ్చగా స్వాగతిస్తూ! మనుషులున్నారు- సజీవంగా శ్వాసిస్తూ! ...ఏదో గడుపుతూ కాదు- జీవిస్తూ! వారి కళ్ళల్లో వెలుగుంది... ప్రేమను ప్రకటిస్తూ! గుండెల్లో తడి ఉంది... ఆత్మీయతను కురిపిస్తూ... పల్లెటూరంటే మనిషికి తల్లిపేగు. అనునిత్యం రణగొణ ధ్వనులతో, పెనుకాలుష్యంతో ఒకరికొకరు రాసుకుంటూ ఇరుగ్గా జీవించే జనానికి- పల్లెలు విశాలంగా స్వాగతం చెబుతాయి. అడుగు పెట్టగానే- పచ్చని పరిసరాలు, పల్చని మంచుతెరలు, చల్లని పిల్లగాలి హాయిగా పలకరిస్తాయి. ఆ స్పర్శకు ప్రాణం లేచివస్తుంది. చలిపొద్దులు గంగిరెద్దులు భోగిమంటలు తలంటులు పిండివంటలు కొత్తపంటలు లేత జంటలు జడగంటలు పట్టుపరికిణీలు హరిదాసులు గొబ్బెమ్మలు బంతిపూలు భోగిపళ్ళు పేరంటాలు పాశుర పఠనాలు దాసరి కీర్తనలు పిళ్ళారి ఆరగింపులు సాతానిజియ్యర్లు రంగవల్లులు రథంముగ్గులు రిలీజు సినిమాలు కోడిపందాలు కనుమతీర్థాలు బొమ్మల కొలువులు... ఇలా ఉన్నట్టుండి తెలుపు నలుపు జీవితం అందమైన ఇంద్రధనుస్సులా వెలుగులీనుతుంది. జీవచైతన్యమేదో పురివిప్పుకొన్నట్లవుతుంది. నగర జీవితం బలవంతంగా తొడిగిన రకరకాల ముసుగులు జారిపోయి, మనిషి పసిబాలుడైపోతాడు. సహజమైన బతుకు రుచి చవిచూస్తాడు. అందుకూ- మనిషి పల్లెటూళ్ళకు పరుగెత్తేది!

నగర జీవితంలో ఇరుక్కుపోయి తాను పోగొట్టుకున్నదాన్ని వెతుక్కోవడానికి మనిషి పల్లెబాట పడతాడు. పల్లెతో పెనవేసుకుపోయిన తన బాల్యాన్ని గుండెల్లో పొదువుకునేందుకు వెళతాడు. పేర్లతోను, హోదాలతోను కాకుండా చుట్టరికాలతో పిలిచే పిలుపులను చెవులారా వినేందుకు వెళతాడు. నిజమైన ప్రేమానురాగాలకు మొహంవాచి వెళతాడు. తన మూలాలను తడుముకునేందుకు వెళతాడు. సంతలో తప్పిపోయిన లేగదూడలా అమ్మను వెతుక్కునేందుకు వెళతాడు. పల్లెల్లోకి వెళ్ళడమంటే మనిషి తనలోకి తాను ప్రవేశించడం! ...వినుము ధనములు రెండు తెరగులు... ఒకటి మట్టిని పుట్టినది... వేరొకటి హృత్‌ కమలంపు సౌరభము... అన్నాడు మహాకవి గురజాడ. నేను ఈ దేశపు పవిత్రమైన మట్టిని ప్రేమిస్తాడు వివేకానందుడు. పల్లెటూళ్ళకు పోతే తాతయ్యలు, బామ్మలు ఎదురొచ్చి బోసినోళ్ళతో విశాలంగా నవ్వి 'బాగున్నావురా' అని పలకరించినప్పుడు తెలుస్తుంది- మట్టివాసన అంటే ఏమిటో, హృదయకమల పరిమళ శోభ ఎంతటిదో! ఆ రెండు సంపదలూ పల్లెల్లోనే ఉన్నాయి. 'బాగున్నావుటే' అన్న పదం వినగానే గుండెలోతుల్లోంచి బెంగ పొగిలి కంటినీరుగా వెలువడినప్పుడు 'బతుకులో తీపి' అనే పదానికి అర్థం తెలుస్తుంది. గడవడానికీ బతకడానికీ తేడా ఏమిటో తెలియాలంటే- ఇలాంటి ఘట్టాలు అవసరం. బాగున్నావా అనేది ప్రశ్నకాదు- ఆత్మీయమైన పలకరింపు. క్షేమ సమాచారాల ఆరా. చుట్టరికాలకు దట్టమైన ఫెవికాల్‌ పూత. తరాలుగా ఈ జాతిలో స్థిరపడిన ఆపేక్షకు శబ్దమయ రూపమైన ఆ ప్రశ్నకోసం, దానిలోని ఉదాత్త మాధుర్యంకోసం, ఆ పలకరింపు సౌభాగ్యం కోరి మనిషి పల్లెకు పరుగెడతాడు.

లోగడ అయితే వీటికి పెళ్ళివేదికలు చక్కని నెలవులయ్యేవి. సందర్భాలు కుదిరేవి, సంబంధాలు కలిసేవి. పెళ్ళికి నాల్రోజులు ముందే రావడం, అందరినీ తీరిగ్గా పలకరించడం కబుర్లు కాలక్షేపాలు సరసాలు సందడులు అన్నీ తృప్తిగా ముగించుకుని మనుగుడుపుల నాటికి జనం తిరుగుప్రయాణం కట్టేవారు. అశుభకార్యాలకు సైతం నలుగురూ చేరడం, సహానుభూతి ప్రకటించడం ఉండేది. కన్నవాళ్ళను కనిపెట్టుకుని ఉండటానికే తీరికలేక వృద్ధాశ్రమాలకు తరిమేసే ఈ రోజుల్లో, అన్నేసిరోజులు కేటాయించడం అనేది ఊహించడానికే కష్టంగా ఉంది. అంతెందుకుగాని, పెళ్ళికంటూ వెళ్ళి లగ్నానికి ఉండకుండా భోంచేసేసి తిరిగొచ్చిన సందర్భాలు ఎన్నిలేవు? కనీసం మనసారా ఆశీర్వదించేందుకు, అక్షింతలు వేసేందుకు మనం ఉండటం లేదనేకదా- మూడుముళ్ళు పడకుండానే జంటను కలిపేసి సోఫాలో కూర్చోబెడుతున్నారు! పేకాటరాయుళ్ళే నయం, అక్షింతలకోసం కాసేపు విరామం పాటిస్తారు. ఈ నేపథ్యంలో తీపి పలకరింపులు... ఆపేక్షతో ఆలింగనాలు... జ్ఞాపకాలను తవ్వి పోసుకోవడం... పెళ్ళి సంబంధాలు ఆరా తీయడం... పిల్లలెక్కడున్నారో ఏం చేస్తున్నారో భోగట్టా లాగడం... వీలైతే ఒకరికొకరిని పరిచయం చేసి బాంధవ్యాలు నెలకొల్పడం... వంటివాటికి అవకాశమే లేకుండా పోతోంది. ఎవరన్నా మరణించినా- పత్రికల్లో నిలువెత్తు ప్రకటనలిచ్చి, సంతాపాలు తెలియజేయడమే సులువు మనకు. దశాహందాకా కాకపోయినా వెళ్ళి కనీసం నాలుగురోజులుండి ఓదార్చే ఓపిక, తీరిక కరవైపోయాయి. శుభానికీ కుదరక, అశుభానికీ కుదరక మనిషి విలవిల్లాడుతున్నాడు. కుదిరినా, మొక్కుబడికి వెళ్ళి రావడమే తప్ప హృదయపూర్వకంగా పాల్గొనే అవకాశం దక్కక మథనపడుతున్నాడు. అయినా గుండె 'నా' అనేవాళ్ళకోసం తపిస్తూనే ఉంటుంది. మనిషిలో ప్రవహించే రక్తం స్వభావం అది! 'నీటికన్నా నెత్తురు చిక్కన' అనే ఆంగ్లసూక్తికి అర్థమదే. రక్తంలో కలగలసిన ఆత్మీయ భావన, గుండెల్లో కెలకవేసే అపరాధ భావన రెండూ కలిసి మనిషిని పల్లెలవైపు పరుగులు తీయిస్తున్నాయంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. తప్పు జరిగాక, ...ఏమిసేతురా లింగా అనుకుంటూ తత్వాలు పాడుకోవడం తప్ప ఏం చేస్తాం!

No comments:

Post a Comment