Tuesday, January 5, 2010

టైం


తెలుగువాళ్ళు గంట యెంతైందీ తెలుసుకొడానికీ, తెలియజేయడానికి మాత్రమే కాక, ఇంకా అనేక సందర్భాలలో టైంఅనే మాట వాడుతున్నారు . భోజనం టైం అయింది. 'నీతో మాట్లాడటానికి యిప్పుడు నాకు టైం లేదు', 'సరిగ్గా టైం కు వర్షం వచ్చింది', 'రైలుకు యింకా అర్ధగంట టైం వుంది', 'యీ పని చేయడానికి గంట టైం పట్టుతుంది'- యిలా అనేక సందర్భాలలో యీ మాట వాడుతున్నారు. పై వాక్యాలలో యీ ఇంగ్లీషు మాటలకు బదులు సరైన తెలుగు మాట పెట్టడానికి ప్రయత్నించండి. ఒక నిమిషం ప్రయత్నం చేస్తే చాలు.- మీ ప్రయత్నం నెరవేరినా సరే, నెరవేరక పోయినా సరే- నెత్తి మీద సుత్తెతో కొట్టినట్లు ఒక విషయం మీకు హఠాత్తుగా బుర్ర కెక్కుతుంది. యేమిటంటే: టైం అనే భావానికి అన్ని సందర్భాలలోను తగిన ఒకే తెలుగు పదం యేదీ లేదు. అనగా , అన్ని సందర్భాలలోను టైం కు సమానార్థకమైన తెలుగు పదం ఒకే ఒకటి లేదు.కాలం, సమయం, వేళ, పొద్దు, తీరిక, వ్యవధి, అదను లాంటి పదాలు మనకు బోలెడు వున్నాయి. అయితే , ఏ ఒక్కటి అన్ని సందర్భాలకూ కుదరదు. ఒక్కొక్క సందర్భంలొ ఒకటి సరిపోతుంది గానిఎ, మరొకటియేదీ సరిపోదు. వివిధ సందర్భాలకు సరిపడే వివిధ పదాలు బోలెడు వుండడమే మనకు సమస్య అయింది. నిజానికి, యిలా సందర్భోచితమైన పదాలు వేరువేరుగా వుండడం భాషా వికాసానికి చిహ్నం. అనగా, టైం అనే భావానికి సంబంధించినంతవరకు మన తెలుగు భాష యింగ్లీషుకంటే యే ఎనిమిది రెట్లో పది రెట్లో అభివృద్ధి చెందిన భాష అని మనం గర్వించవచ్చు.

కానీ, దురదృష్ట వశాత్తు, మన భాష బాగా వికసించడమే తెలుగు'వాడి'కి సమస్య అయింది. వున్న బోలెడు పదాలలో సందర్భాన్ని బట్టి సరైన పదం యేరుకొని మాట్లాడడం మనవానికి యిబ్బంది కలిగించింది.యేరుకొనే శ్రమ యెందుకు, అన్ని సందర్భాలలోను టైం అనే ఇంగ్లీషు మాట వాడితే సరిపోతుంది కదా, అని మామూలు తెలుగు మనిషి అనుకొన్నాడు...........
___________________________________

టైమెంత? = వేళ ఎంత?

భోజనం టైం అయింది.
= భోజనం వేళ అయింది.

'నీతో మాట్లాడటానికి యిప్పుడు నాకు టైం లేదు'
= 'నీతో మాట్లాడటానికి యిప్పుడు నాకు తీరిక/ వ్యవధి లేదు'

'రైలుకు యింకా అర్ధగంట టైం వుంది'
= 'రైలుకు యింకా అర్ధగంట వ్యవధివుంది'

'యీ పని చేయడానికి యెంత టైం పట్టుతుంది'
= 'యీ పని చేయడానికి యెంత కాలం పట్టుతుంది'

'యీ పని యే టైంకు పూర్తి అవుతుంది'
= 'యీ పని యే వేళకు పూర్తి అవుతుంది'

'యీ పని చేయడానికి నీకు పది నిమిషాలు(పది రోజులు) టైం ఇస్తిన్నాను.'
='యీ పని చేయడానికి నీకు పది నిమిషాలు(పది రోజులు) వ్యవధి/ గడువుఇస్తున్నాను.'

(స్వల్ప వ్యవధి)
= పది నిమిషాల సేపు, గంట సేపు, చాలా సేపు ( కాని సంవత్సరం సేపు/ నెల సేపు అనకూడదు)

'నీకిచ్చిన
టైం ముగిసింది.' = 'నీకిచ్చిన గడువు ముగిసింది.

'యీ పని చేయడానికి గంట టైం పట్టుతుంది'= 'యీ పని చేయడానికి గంట
వ్యవధి పట్టుతుంది'

'వాడు సరిగ్గా టైం కు వచ్చాడు' = 'వాడు సరిగ్గా
(నిర్ణయించిన)వేళకు(సకాలంలో) /(మనకు అవసరం ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా వస్తే)సమయానికి వచ్చాడు'

'యీ వారమంతా నాకు మిత్రులను చూడడానికి
టైం లేదు' = 'యీ వారమంతా నాకు మిత్రులను చూడడానికి తీరిక లేదు'

'రైలు వచ్చే
టైం అయింది' = 'రైలు వచ్చే (నిర్ణయించిన)వేళ/ (రైలు వస్తున్నట్లు గంట కొట్టినా, సిగ్నల్ యిచ్చినా ఆసందర్భంలో)సమయం అయింది'

సకాలంలో/ అదనుకు వర్షం వచ్చింది.
ఈ చెట్టు
సకాలంలో పూయలేదు.

(పుటలు :3, 63,64 &65 "అనువాద సమస్యలు" , రాచమల్లు రామచంద్రా రెడ్డి, 1991)___________________________________________

No comments:

Post a Comment