Tuesday, January 26, 2010

ఇచ్చుటలో ఉన్న హాయి...



'వచ్చినవాడు వామనుడు కాడు, శ్రీమన్నారాయణుడు... దానం మాట మర్చిపో... లేకుంటే ఆయన మాయకు బలిఅవుతావు' అని బలిచక్రవర్తినిశుక్రాచార్యులు గట్టిగా హెచ్చరించాడు. అయినా బలిచక్రవర్తి వినలేదు. 'మాటఇచ్చాను... దానం చేసి తీరవలసిందే... తిరుగన్నేరదు నాదు జిహ్వ,వినుమా ధీవర్య వేయేటికిన్‌' అన్నాడు. ప్రకారమే ఇచ్చినమాటకికట్టుబడ్డాడు. తన సహజ కవచకుండలాలు అపహరించడానికి స్వయంగా దేవేంద్రుడే యాచకుడిగా వస్తున్నాడనికర్ణుడికి ముందే తెలిసింది. అయినాచలించలేదు. '...విప్రులు కడునర్థివేడిన బొచ్చెంబు సేయక ఇచ్చుట...నాకు వ్రతం... వ్రత నియమాలకి తిరుగులేదు' అన్నాడు.అన్నట్టుగానే దానమూ చేశాడు. దగ్గరున్నదంతా దానధర్మాలకు వెచ్చించివట్టి చేతులతో మిగిలాడు రంతిదేవుడు! ఆ స్థితిలో మరో దీనుడు వచ్చి చేయి చాచాడు. 'అన్నము లేదు... కొన్నిమధురాంబువులున్నవి...త్రావుమన్న... రావన్న!' అంటూ వాణ్ని చేరదీసి ఉన్న మంచినీళ్లుకూడా ఇచ్చేసి నిశ్చింతగానిలబడ్డాడు. మొన్న మొన్నటిదాకా మన మధ్యన జీవించిన మహాతల్లి డొక్కా సీతమ్మదీ అదేవరస. 'వరద గోదారిపోటుమీద ఉంది, పడవ ప్రయాణం ప్రమాదమమ్మా!' అని సరంగులు వారించారు. అయినా ఆవిడ వినలేదు. లంకల్లోచిక్కడి, ఆకలితో అల్లాడుతున్న దీనులకోసం వేడిగా వండి వార్చి పట్టుకెళ్ళి వడ్డించింది. పాప పుణ్యాల సంగతి కాదుఇక్కడ చూడవలసింది. 'దానం చేస్తే పుణ్యం వస్తుంది' అనుకుంటూ దానాలు చేసిన బాపతు కాదు వారెవరూ! దాతృత్వంవారి సహజ స్వభావం అంతే! తమ దగ్గర ఉన్నది సంతోషంగా ఇచ్చే లక్షణం కారణంగా వారంతా చరిత్రలోనిలిచిపోయారు. వారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ధన్యజీవులంటున్నాం!

చప్పని వట్టిగడ్డిని తినిపించినా- గోవులు కమ్మని పాలు ఇస్తాయి. మురికినీటిని తెచ్చి తమలో కలిపేస్తున్నా సహించి, నదులు తియ్యని నీళ్లు ఇస్తాయి. తనని నరకడానికి వచ్చినవాడికి సైతం చెట్లు చల్లని నీడ ఇస్తాయి. ఇవ్వడం వాటిస్వభావం! అందుకే వాటికి లోకంలో పూజార్హత!
అపకారం చేసినవాడినిసైతం ..పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు... అనే గొప్ప లక్షణాన్నిమనిషి వాటినుండే నేర్చుకున్నాడు. రుచికరమైన ఆహారాన్ని ఒక్కడివీకూర్చుని తినకు. ఏకఃస్వాదు భుంజీత... అని భారతం ఆదేశించింది.దాన్ని పాటించేవారు ఇంకా ఇప్పటికీ ఉన్నారు. వారిని సజ్జనులుఅంటారు. వారివల్లే ఈమాత్రం అయినా వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి- అని లోకం భావిస్తుంది. దానగుణం అనేదాన్ని గొప్పలక్షణంగా లోకం గుర్తించింది. ఆలికి అన్నం పెట్టడమే ఊరికి గొప్ప ఉపకారమనుకునే జనంసంఖ్య పెరిగిపోతున్న రోజుల్లో, పరాయివాడికి సహాయం చేద్దామని ఎవరైనా అనుకుంటే చాలు- లోకం హర్షిస్తుంది. వారికిజేజేలు పలుకుతుంది. వారిని దేవుళ్లలా చూస్తుంది. 'అనాథాశ్రమం కట్టడానికి చందా కావాలి' అని వస్తే- 'నా దగ్గరేముందిఇవ్వడానికి! నా ముసలి తల్లితండ్రులను మీ సమాజానికి జమ వేసుకోండి' అని అంటగట్టడానికి చాలామంది సిద్ధంగాఉన్నారు. అలాంటివారికి ఇవ్వడంలో ఉండే గొప్ప అనుభూతి ఎన్నటికీ తెలియదు. తన స్తనాన్ని పసిబిడ్డ నోట కరచిపట్టుకుని తియ్యని పాలని ప్రేమగా జుర్రుకుంటుంటే- తన జీవాణువుల్లోని మాతృత్వపు మహామాధుర్యాన్ని పాలరూపంలో బొట్టు బొట్టుగా బిడ్డ లేత పెదవులపై జార్చే అమ్మ- ఆ క్షణాన ఏ దేవతకైనా తీసిపోతుందా? ప్రమాదానికి గురైరక్తం ఓడుతూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యుడికి మన శరీరంలోని రక్తం నెమ్మదిగా ప్రాణం పోస్తుండగా, ఆజీవి క్రమంగా తేరుకుని మొహం తేటపడుతుంటే మనకు కలిగే ఆనందం బ్రహ్మానందానికి తీసిపోతుందా! ఆ క్షణానమనం దేవతలతో సమానం కామా? మరణానంతరం మన కళ్లు మరో అంధుడి కళ్లకి వెలుగునిచ్చి ఈ లోకాన్ని తృప్తిగాపరికిస్తుంటే - మనం ఇంకా జీవించి ఉన్నట్లు కాదా! ఆ మేరకు మనం అమరులం అయినట్లే కదూ! అవును! దానగుణంమనల్ని దేవతలను చేస్తుంది.

మనలో కొన్ని అపోహలు స్థిరపడి ఉన్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటే మగతనంసన్నగిల్లుతుందనీ, రక్తం దానం చేస్తే ప్రాణం నీరసపడుతుందనీ, కళ్లు దానం చేస్తే వచ్చే జన్మలో గుడ్డివాడిగాపుడతామనీ.. ఏవేవో దురభిప్రాయాలు మనలో పాతుకుపోయాయి. ఇదంతా వట్టి అవివేకమని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. నిజానికి రక్తదానం చేసినప్పుడు ఆ మేరకు తిరిగి రక్తాన్ని ఉత్పత్తి చేసుకునే వ్యవస్థ మన శరీరంలోనే ఉంది. కొద్దిగంటల్లోనే శరీరానికి అవసరమైనంత రక్తం తయారవుతుంది. అంతేకాదు, శరీర భాగాలను దానం చేసిన వారికిఆరోగ్యమూ, ఆయుర్దాయమూ పెరుగుతాయన్న ఒక గొప్ప విశేషాన్ని పరిశోధకులు గుర్తించారు. మూత్రపిండాలనుదానం చేసినవారి ఆరోగ్య స్థితిగతులపై సుదీర్ఘ పరిశీలన నిర్వహించిన అమెరికాలోని మినెసొటా విశ్వవిద్యాలయ పరిశోధకబృందం ఈ సంచలన విషయాన్ని ప్రకటించింది. 'న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌'లో ప్రచురితమైన డాక్టర్‌ హసన్ఇబ్రహీం బృందం పరిశోధన ప్రకారం- మూత్రపిండాలు దానం చేసినవారు మరింత ఆరోగ్యంగాను, ఆయుర్దాయంతోనునిశ్చింతగా జీవిస్తున్నట్లు స్పష్టం అయింది. గతంలో నార్వే, స్వీడన్లలో చేపట్టిన ఇదేరకం అధ్యయనాలు సైతం ఈవిషయాన్నే నిర్ధారించడం గమనించదగిన విశేషం.
మనిషి శరీరంలోని భాగాలను సైతం దానం చేసినాహాని జరగదుసరికదా- ఆరోగ్యం మెరుగవుతుంది, ఆయుర్దాయమూపెరుగుతుందన్నది విజ్ఞాన శాస్త్రం తేల్చి చెప్పింది. మనిషికివరంగా లభించే దేహంలోనే ఎలాంటి నష్టమూ వాటిల్లనప్పుడు- దానం మూలంగా మనిషి స్వయంగా సంపాదించుకున్నసిరిసంపదలలో కొంతభాగం ఇచ్చేస్తే కోలుకోలేమనడం శుద్ధ అవివేకం కదా! ఏమంటారు?

No comments:

Post a Comment