Sunday, January 3, 2010

ఉన్నతాశయం


ప్రతి మనిషికీ ఒక ఆశయమంటూ ఉండాలి. అది ఉన్నతమైనదై ఉండాలి. అది శరీరానికి రాసుకున్న సుగంధద్రవ్యంలా కృత్రిమమైనది, తెచ్చిపెట్టుకుంటే వచ్చేదిగా కాక, పూవు పుట్టగానే వచ్చే పరిమళంలా సహజసిద్ధమైనదై ఉండాలి. అప్పుడే ఆ ఆశయం సిద్ధిస్తుంది. ఆ విషయంలో విజయం చేకూరుతుంది.

ఒక పిల్లవాడు బడికి వెళ్లే తోవలో ఒక సైనిక శిబిరం ఉంది. అక్కడ సైనికులను, వారి విన్యాసాలను ఆరాధనగా చూసేవాడా పిల్లవాడు. చూసి ముగ్ధుడయ్యేవాడు. ప్రతిరోజూ కాసేపు ఆ సైనికులతో గడిపేవాడు. ఆ పిల్లవాడి తల్లి బడిలో భోజన సమయంలో తినడానికి రకరకాల రుచికరమైన పదార్థాలను తయారుచేసి మూటకట్టి ఇచ్చేది. వాటిని ఆ కుర్రవాడు తీసుకుని వెళ్ళి తాను తినక ఆ సైనికులకిచ్చి బదులుగా వారిదగ్గరుండే దళసరి ముతక రొట్టెల్ని తీసుకుంటూండేవాడు.

అది చూసిన ఒక సైనికుడు ''ఇంత చిన్న కుర్రాడివి. రుచికరమైన పదార్థాలు మానేసి ముతక రొట్టెల్ని ఎలా తినగలుగుతున్నావు? అయినా నీకెందుకీ బాధ? హాయిగా మీ అమ్మ చేసే రుచికరమైన పదార్థాలనే తినవచ్చుకదా?'' అనడిగాడు. దానికా కుర్రవాడు ''నేను పెద్దవాడినయ్యాక సైనికుడిని కావాలనుకుంటున్నాను. ఇప్పుడు రుచికరమైన పదార్థాలు తినడానికి అలవాటుపడితే పెద్దయ్యాక ఆ ముతక రొట్టెల్ని తినలేక సైనికుణ్ని కావాలనే ఆశయాన్నే విడిచిపెట్టే అవకాశం ఉంది. అందుకనే ఇప్పట్నుంచే వీటిని తినడం అలవాటు చేసుకుంటున్నాను'' అన్నాడు. అతడే కాలాంతరంలో తన ఆశయాలను నెరవేర్చుకుని ఐరోపానంతటినీ గడగడలాడించిన ఫ్రాన్స్‌ దేశపు రాజు. అతడి పేరే నెపోలియన్‌. సహజసిద్ధమైన ఇటువంటి ఆశయాలున్నవారే తామనుకున్న స్థానానికెదుగుతారు.

'సింహశ్శిశురపి నిపతతి మదమవిన కపోల భిత్తిషు గజేతు,
ప్రకృతిరియం సత్త్వవతాం నఖలు వయస్తే జసాం హేతుః.
చిన్నదైనప్పటికీ సింహంపిల్ల సింహంపిల్లే. అది పసితనంలో ఉన్నప్పటికీ- మదజలం కారే చెక్కిళ్లతో నిక్కుతున్న ఏనుగు కుంభస్థలాన్ని చీల్చాలన్న కోరికతోనే దాని మీదకు ఎగురుతుంది. అది దాని స్వభావం. ఈ పరాక్రమం, ప్రతాపం అనేవి కొందరికి సహజసిద్ధంగానే వస్తాయి. దీనికి వయస్సుగాని, చిన్న పెద్ద అనే తారతమ్యం గాని ఉండవు.

నేడు పిల్లల ఆశయాలకు వ్యతిరేకంగా ఎందరో తలిదండ్రులు తమ ఆలోచనల్ని, ఆశల్ని వాళ్ళమీద బలవంతంగా రుద్దుతున్నారు. భయానికో, భక్తికో ఎదురు చెప్పలేక ఒప్పుకొన్నా ఆ రంగంలో ప్రవేశించినా దానిపట్ల అనురక్తిలేక శరీరానికి రాసిన పైపూతలాగానే అతి తొందరలో యథాస్థితికి వచ్చి అటూకాక ఇటూకాక చెడిపోతున్నారు.

ఎవరి సహజసిద్ధమైన ఆశయాలతో వారిని ఎదగనిస్తే అదే విజయానికి పునాది అవుతుంది. ఉన్నతమైన ఆశయాలు సహజసిద్ధంగా ఏర్పడాలి. ఒకరిపై ఆపాదించినా, కలిగించాలని చూసినా కుదరదు. సహజసిద్ధంగా ఏర్పడిన ఆ ఉన్నతాశయాలు ఆ వ్యక్తిని కచ్చితంగా ఉన్నతునిగా నిలబెడతాయి.
- అయ్యగారి శ్రీనివాసరావు

No comments:

Post a Comment