Tuesday, January 5, 2010

వినూత్న చంద్రోదయం


దేవతలూ రాక్షసులూ కలిసి పాలసముద్రాన్ని మథించినప్పుడు అందులోంచి చంద్రుడు జన్మించాడని పురాణాలు వర్ణించాయి. విరాట్పురుషుడి మనస్సులోంచి చంద్రుడు ఉద్భవించాడు. '-చంద్రమా మనసోజాతః' అని వేదం వెల్లడించింది. నాలుగైదు వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం అంగారకుడి ఆకృతిలో ఉన్న పెద్ద ఖగోళ వస్తువు భూమిని ఢీకొట్టడంవల్ల చందమామ ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలావస్తే ఏమిగాని - చంద్రుడు, ఒక్క విరహంతో రగిలిపోతున్న ప్రేయసీ ప్రియులకు తప్పించి- తక్కినవారందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ ఇష్టసఖుడిగా మారిపోయాడు. నిండుజాబిలినీ, పండువెన్నెలనూ తిలకించి పరవశించనివారెవరుంటారు?ఉచితంగా లభించేసరికి చులకనగా చూడటం అనే మన సహజలక్షణం చంద్రుడితో సహా అన్నింటికీ వర్తిస్తుందని అనిపిస్తుంది. లక్ష్మీదేవిని మనం తల్లిగా పూజిస్తూ, క్షీరసాగరమథనంలో ఆమెకన్నా ఒక్కడుగు ముందుగా పుట్టాడన్న చుట్టరికంకొద్దీ చంద్రుణ్ని 'మామ'గా సంభావిస్తూ, అడపాదడపా చందమామనైనా మన నగరాలలోకి రానిస్తునన్నామేగాని, వెన్నెలను ఎక్కడైనా వెలుగు చూడనిస్తున్నామా? కళ్ళుమిరుమిట్లుగొలిపే భారీవిద్యుద్దీపాల కాంతికి భయపడి వెన్నెల 'ఆకాశకుసుమం'గానూ, 'అడవిగాచిన వెన్నెల'గానూ మిగిలిపోగా- పుస్తకాల్లో చదువుకోవడమే మిగిలిన దారి మనకు. ఆకాశంలో వెలుగుతున్న చందమామ తనకు కావాలని శ్రీరామచంద్రుడు మారాంచేస్తే, అద్దంలో చూపించి బుజ్జగించింది అమ్మ కౌసల్య. బువ్వతినకుండా అల్లరిచేస్తున్న బుజ్జిపాపాయిలను 'చందమామరావె జాబిల్లిరావె' అనే అన్నమయ్య పాటతో ఆకట్టుకుని ఒడుపుగా గోరుముద్దలు తినిపించి, పసిపిల్లల బొజ్జలు నింపిన తరమిప్పుడు పాతబడుతోంది. లోకంలో తల్లులెందరికో సాయంచేసి చందమామ తన పుట్టింటి మమకారాన్ని చవిచూపించిన వైనాలు ఇక పుస్తకాలకే పరిమితం అయ్యేలా ఉన్నాయి, చూస్తుంటే!

చంద్రుడికి ఆ తరహా ఉదారగుణం ఎక్కువేనని పారిజాతాపహరణకావ్యం సాక్ష్యం చెబుతుంది. షోడశకళాప్రపూర్ణుడైన చంద్రుడు అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత అనే తన 16 కళల్లోంచి ఒక్కటి మినహా రోజుకొక్కటిగా దేవతలకు నైవేద్యం పెడతాడంటారు. అందుకనే చంద్రుడు చివరికి కళావిహీనుడై, మనకు 15 రోజులకు అమావాస్య ఏర్పడుతుందని చెబుతారు. తనలోంచి ఒకో కళను ఆహారంగా ఇస్తాడు కనుకనే చంద్రుణ్ని దేవతలపాలిట 'భోజనాల గంప'గా వర్ణిస్తారు. అదే అర్ధంతో 'అమరుల బోనపుట్టిక' అని చంద్రుణ్ని వర్ణించిన నందితిమ్మన ఆచేత్తోనే ''వలిమల అల్లువాడు- తలవాక ధరించిన పూవుగుత్తి, వేల్పులగమి జీవగర్ర, ఉడివోవని చల్వలటెంకి, వెన్నెలల్‌ మొలచినపాదు, పాల్కడలి ముద్దులపట్టి'' అంటూ అచ్చతెనుగు పదాలతో నిండుగా చంద్రుని స్తుతించాడు ఆపై ''నీ వంశీయుడే అయిన మా ప్రభువు కృష్ణరాయలవారిని 'చల్లగా' చూడు'' అని ముగించాడు. ప్రతిపద్యంలోనూ చమత్కారానికి ప్రాణప్రతిష్ఠ చేసిన విజయవిలాసకర్త చేమకూర వేంకటకవి- 'సుభద్ర నెన్నుదురు అరచందమామనేలిన దొరగా నెన్నుదురు' అని ఒకే మాటను రెండర్థాలతో వినిపించాడు. చంద్రుణ్ని ఎంతమంది పొగిడారో అంతమందీ తిట్టడం కూడా ఒక విశేషమే. మదనుడు మమ్మల్ని బాధిస్తుంటే చంద్రుడు వాడికి తోడ్పడుతున్నాడనేది వాళ్ళందరి ఫిర్యాదు. కవి దాశరథి ''మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనమూ నీకేల?'' అని నిలదీశారు. బహుశా ఆ దృష్టితోనే ''ఆ రజనీకర మోహనబింబము నీ నగుమోమును పోలునటే'' అంటూ చంద్రుడి అందచందాలకన్నా చెలి నగుమోమును మిన్నగా చేసి వర్ణించారు. చంద్రుడి పక్షం వహించిన కవులయితే ''చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాసింది'' అని ''ఆకాశవీధిలో అందాలజాబిలి'' కారణంగానే ''హాయిహాయిగా జాబిల్లి తొలిరేయి వెండిదారాలల్లి'' అలరించడం సాధ్యమవుతోందని వాదించారు. 'ఆ సెందురూడే మద్దెన మనకి పెద్దమనిసి' అని సాచ్చీకం వేసిన నాయుడుబావ తీరా అనుకున్న సమయానికి రాకపోయేసరికి ఎంకికి బాధకలిగి ''ఆనాటి నావోడు సెందురూడా! అలిగి రాలేదోయి సెందరూడా'' అని వాపోతుంది.

''ఎలుతురంతామేసి ఏఱు నెమరేసింది'' అని అచ్చంగా ఎంకి భావించినట్లే- చంద్రుడి విషయంలోనూ జరగబోతోందంటున్నారు శాస్త్రజ్ఞులు. జాబిలి ఉపరితలంమీదికి సూర్యకిరణాలు నేరుగానూ, నిరంతరాయంగానూ తాకుతుంటాయి కాబట్టి చంద్రుడిపై భారీ సౌరవిద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించవచ్చంటున్నారు. అక్కడే ఉత్పత్తిఅయిన విద్యుత్తును సూక్ష్మతరంగ ఏంటెన్నాలద్వారా భూమికి తరలించనూవచ్చన్నది శాస్త్రజ్ఞుల అంచనా. డేవిడ్‌ క్రిస్‌వెల్‌ అంచనా ప్రకారం 2050 నాటికి ఈ భూమిమీద విద్యుత్తు అవసరాలన్నింటినీ పూర్తిగా తీర్చగల స్థాయిలో విద్యుత్తు చంద్రుడి నుంచి సరఫరా అయ్యే అవకాశం ఉంది. దాంతో భూమిపై ఇంధనకొరత తీరిపోతుందంటున్నారు. 'విద్యుత్తుకేకాదు రాకెట్‌ ఇంధన ఉత్పత్తికి కూడా చంద్రుడు అద్భుతమైన వేదిక' అంటున్నారు శాస్త్రజ్ఞులు. భూమికి అధికంగా ఉండే గురుత్వాకర్షణశక్తి కారణంగా ఇక్కడి నుంచి రాకెట్లు ప్రయోగించినప్పుడు శక్తిని చాలా ఎక్కువగా వినియోగించవలసివస్తోంది. అదే చంద్రుడిపై నుంచి అయితే ఇంధనం చాలా తక్కువస్థాయిలో ఖర్చవుతుంది. కనుక రాకెట్‌ ప్రయోగాలు కూడా పెరిగే అవకాశం ఉంది. చందమామపై ఖనిజాలు, సహజవనరులు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. భూమినుంచి విడిపోయిందేకనుక అల్యూమినియం, టైటానియం, మెగ్నీషియం, సిలికాన్‌ తదితరాలూ ఉండవచ్చునంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న చంద్రయాన్‌-1 ద్వారా చంద్రమండల యాత్రలు ప్రారంభమైతే ఇక సందడే సందడి. ఇక భవిష్యత్తులో వెలిగిపోబోతున్న చంద్రుణ్ని చూసి ''చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్‌'' అనే పాట మరచిపోవాలేమో. చంద్రుడి కారణంగా ఇకపై 'పగలే వెన్నెల జగమే వూయల' అని పాడుకోవలసి వస్తుందేమో!
(Eenadu, editorial, 06:01:2008)

No comments:

Post a Comment