... బాహ్య రూపానికి హృదయ సౌందర్యం తోడైతే బంగారానికి తావి అబ్బినట్టే. అంతఃసౌందర్యం పెంపొందించుకోవడం మన చేతుల్లో, చేతల్లోనే ఉంది...
అందం అనేది ఎంతో అందమైన మాట. మన నిత్యజీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ మాట వాడకుండా ఉండలేం. అసలింతకీ అందం అంటే ఏమిటి? బాహ్యరూపమా, కనిపించే దృశ్యమా? ప్రకృతి మొత్తం రమణీయం అయితే 'యదృశ్యం తన్నశ్యం' అనే నానుడి ఎందుకొచ్చింది?పసివాడి నవ్వులు, వసివాడని పువ్వులు, ఆకాశాన ఎగిరే పక్షులు, కొండలు, లోయలు పర్వతాలు ఎంతో అందంగా ఉంటాయి. మన దేవుళ్లు కూడా చాల అందమైనవారని పురాణాలూ, ఇతిహాసాలూ చాటి చెప్తున్నాయి. అలంకార ప్రియుడైన విష్ణువు, అభిషేకాభిలాషుడైన శివుడు, నీలమేఘశ్యాములైన రాముడు, కృష్ణుడు, కరుణామయుడైన ఏసుక్రీస్తు, దయామయుడైన బుద్ధుడు తదితరులందరూ అందమైనవారే! వారందరూ బాహ్య రూపాల వల్లనే జగతికి సుగతినిచ్చారా? వారి అంతఃసౌందర్యం అంతకంటే అందమైనది!
వానరుడైన మారుతిలోని హృదయ సౌందర్యం గుర్తించాడు రాముడు. త్రివక్రిగా పిలిచే కుబ్జ్జనూ ఆదరించాడు కృష్ణుడు. ఒక పతితలోని పవిత్రతను పరికించి పావనమూర్తిగా కొనియాడి అంతస్సౌందర్యం ప్రాధాన్యాన్ని విప్పి చెప్పాడు జీసస్!
బాహ్య రూపానికి హృదయ సౌందర్యం తోడైతే బంగారానికి తావి అబ్బినట్టే. అందం అహంకారం కాకూడదు. 'సత్యమే అందం... అదే జీవిత మకరందం' అని ఆంగ్ల కవి జాన్ కీట్స్ అభివర్ణించాడు. భారతీయ తత్వవేత్తలు సత్యంకంటే ఓ మెట్టుపైన ధర్మం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ధర్మాల్లో విశేష ధర్మం ఇంకా శ్రేష్ఠమైనదని స్పష్టీకరించారు. అనేక కథలూ చాటువుల రూపాల్లో వాటిని భద్రపరచారు. అలాంటిదే ఒక కథలో ఓ వేటగాడు ఒక లేడిని వెంటాడుతుంటాడు. ఆ లేడి భయంతో పరుగెత్తి అలసిపోయి ఓ ముని ఆశ్రమంలో ప్రవేశిస్తుంది. ఆ వేటగాడు మునివద్దకు వెళ్లి లేడి ఏమయిందని ప్రశ్నిస్తాడు. 'చూసేది మాట్లాడదు... మాట్లాడేది చూడదు' అని బదులిస్తాడు. ఈ మాటలు అర్థంకాక వేటగాడు అక్కడినుంచి నిష్క్రమిస్తాడు. చూసే కన్ను మాట్లాడలేదు, మాట్లాడే నోరు చూడలేదు అని నర్మగర్భంగా చెప్పకపోతే ఏమయ్యేది? లేడి ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. ఇంత అందంగా మాటలాడటమే విశేష ధర్మం! అంటే నిజం, సత్యం కన్నా ధర్మం, విశేష ధర్మం ఉన్నతమైనవనే అర్థం కదా!
తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన శరీరం మనం మార్చుకోలేనిది. అది అందమైనదా, కాదా అన్న చర్చ అర్థరహితం. అంతఃసౌందర్యం పెంపొందించుకోవడం మన చేతుల్లో, చేతల్లోనే ఉంది. నిర్మల మనసు, నిత్యసాధన, నిష్కళంక జీవనం, నిరంతర శ్రమ వంటివి నిజమైన హృదయ సౌందర్యాన్ని పెంచి మానవ మనుగడకు వన్నె తెస్తాయి!
No comments:
Post a Comment