Friday, June 18, 2010

వికటించిన హాస్యం


నవరసాల్లో హాస్యానికి ప్రత్యేక స్థానం ఉంది. హాస్యరసం లేకపోతే నీరసమే మిగులుతుంది. ఇదివరకు పెళ్ళిపాటల్లో, వియ్యాలవారి సరసాల్లో, వదినా మరదళ్ళ సరాగాల్లో కావాల్సినంత హాస్యం జాలువారుతుండేది. భోజనాల సమయంలో వినిపించే పరాచికాలకు, పాటలకు పద్యాలకు అంతే ఉండేది కాదు. కాలం మారి క్యాటరింగ్ సంస్కృతి పెరిగి, బఫే భోజనాల హడావుడి ఎక్కువయ్యాక పెళ్ళిళ్ళలో డాబుదర్పాల ప్రదర్శన పెరిగింది. సరదాలు, సరస సంభాషణలు తరిగాయి. హాస్యం వల్ల మందహాసం నుంచి అట్టహాసం వరకు అనేక రకాల నవ్వులు వెల్లివిరుస్తుంటాయి. కొందరు పొదుపరులు ఎంత నవ్వొచ్చినా దాచుకొని మందహాసంతోటే సరిపెడుతుంటారు. డబ్బు విషయంలో పొదుపు మంచిదేకానీ నవ్వుల విషయంలో కాదు. హాయిగా నవ్వుతుంటేనే ఆరోగ్యం నిక్షేపంగా ఉంటుందని డాక్టర్లూ చెబుతున్నారు. ఛలోక్తులు, చతురోక్తులు, పరాచికాలు, పరిహాసాలు వంటివన్నీ నవ్వు తెప్పించేవే. తెలుగులో ఇన్ని మాటలున్నా ఇంగ్లీషులో ఉన్న జోక్ అనే పదమే బహుళ ప్రచారంలో ఉంది. జోక్ అనే మాట వింటూనే మొహం ప్రఫుల్లమవుతుంది. ''ఆ కొత్తాయన వట్టి కాకారాయుడనీ పట్టుపరిశ్రమలో ప్రవీణుడనీ మన బాస్‌కి అప్పుడే ఎలా తెలిసిందోయ్'' అని అడిగాడో ఉద్యోగి సహచరుణ్ని. ''ఎలా ఏముంది? మన బాస్ ఇంకా జోక్ చెప్పకుండానే ఈయన పొట్ట చేత్తో పుచ్చుకొని మెలికలు తిరిగిపోతూ నవ్వటం మొదలెట్టాడు'' అని సందేహం తీర్చాడు తోటి ఉద్యోగి.
''నీతులకేమి యొకించుక బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో'' అని కవి చౌడప్ప అన్నాడు. అసభ్యతను హాస్యంగా సహృదయులు అంగీకరించరు. అపహాస్యం కానంతవరకే హాస్యం రాణిస్తుంది. నైట్రస్ ఆక్సయిడ్‌ను 'లాఫింగ్ గ్యాస్' అంటారు. ఈ గ్యాస్‌ను పీలిస్తే తెరలు తెరలుగా నవ్వు పుట్టుకొస్తుందిట. హాయిగా నవ్వుకోవటానికి సరసమైన ఛలోక్తులు, జోకులు చాలు. అటువంటి గ్యాస్ పీల్చవలసిన అవసరమేమిటి? షేక్స్‌పియర్ మహాశయుడు మంచి నాటకం ఒకటి రాయాలని కూర్చున్నాడు. ఎంతసేపటికీ భావోద్వేగం కలగడంలేదు. రచన సాగటంలేదు. చేతిలో ఉన్న పెన్సిల్‌ను కొరుకుతూ కూర్చున్నాడు. కొంతసేపటికి చూస్తే పెన్సిల్ మీద పంటి గాట్లయితే చాలా పడ్డాయి కాని ఒక్క భావమూ స్ఫురించలేదు. దాంతో ''టు బైట్ ఆర్ నాట్ టు బైట్'' అనుకున్నాడు. దాంతో బుర్రలో భావం తళుక్కుమని ''టు బి ఆర్ నాట్ టు బి'' అన్న ప్రసిద్ధ డైలాగుతో రసవంతమైన 'హేమ్లెట్' నాటకం రూపుదిద్దుకొంది. కేవలం ఫక్కుమంటూ నవ్వునే తెప్పించనక్కరలేదు. మనస్సును ఆహ్లాదపరచేది హాస్యమే. తనను ఆటపట్టించాలని మాటలు విసురుతున్నవారిని అంతకంటే ఘాటైన మాటతో అవాక్కయ్యేటట్లు చేయటాన్నే రిపార్టీ అంటారు. ఓ మాస్టారు పాఠం వినకుండా అల్లరి చేస్తున్న ఓ కుర్రాడి వైపు బెత్తాన్ని పెట్టి చూపిస్తూ ''ఈ బెత్తం చివర ఓ గాడిద ఉన్నాడు'' అన్నాడు. ''ఏ చివర మాస్టారూ?'' అన్నాడా అబ్బాయి అమాయకంగా. అందుకే ఇతరులను ఆట పట్టించాలనుకునేవారు తమ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ఏ ఛలోక్తి అయినా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని తెలుసుకోవాలి!

నొప్పింపక తానొవ్వక ఫక్కున నవ్వించేదే ఛలోక్తి అంటారు. ఎంతటి గంభీరమైన వాతావరణాన్నయినా చక్కని జోక్స్ చల్లబరిచి ఆహ్లాదకరంగా మారుస్తాయి. మొహాన్ని గంటుపెట్టుకొని ధుమధుమలాడుతూ కూర్చున్నవారూ సరసమైన జోకులు విన్నప్పుడు పకపక నవ్వుతూ ప్రఫుల్లవదనులైపోతారు. సర్దార్జీల మీద జోకులు ఎన్నో ఎంతో కాలంగా ప్రచారంలో ఉన్నాయి. గడియారంలో 12 గంటలైనప్పుడు చిన్న ముల్లును ఎవరో ఎత్తుకుపోయారని ఓ సర్దార్జీ కంగారుపడ్డాడని చెప్పే- 'సర్దార్జీ బారా బజే-' వంటి జోకులు వినపడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు ఇటువంటివాటి గురించి ఆట్టే పట్టించుకోకుండా ఉపేక్షించి ఊరుకున్నా ఇహముందు సర్దార్జీలు అలా ఊరుకోదల్చుకోలేదు. ఇటీవల ముంబాయిలోని ఓ ప్రచురణ సంస్థ 'శాంటా బాంటా ఎస్ఎమ్ఎస్ జోక్స్' అనే పేరుతో ఓ జోక్స్ పుస్తకాన్ని వెలువరించింది. ఈ పుస్తకం అట్టమీద శాంటా అనే సర్దార్జీ పింక్‌రంగు తలపాగా చుట్టుకొని ఉండగా బాంటా అనే సర్దార్ నీలంరంగు తలపాగా చుట్టుకొని ఉన్నట్లు ఉంటుంది. లోపల సర్దార్జీలకు సంబంధించిన జోక్స్ ఎన్నో ఉన్నాయి. ఒక జోక్‌లో జిరాక్స్ కాపీ చేతికి అందగానే ఓ సర్దార్‌జీ ఏం చేస్తాడు అంటే అసలుతో పోల్చి చూసుకుంటాడు అని ఉంది. ఇటువంటి జోకులు సిక్కు మతస్థులను, సర్దార్లను కించపరిచేటట్లు ఉన్నాయంటూ ఆ ప్రచురణ సంస్థపై చర్య తీసుకోవాలని సిఖ్ మీడియా అండ్ కల్చర్‌వాచ్ సంస్థ సభ్యుడు జస్మీత్‌సింగ్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ''సర్దార్లకు సిక్కు మతస్తులకు సంబంధించి అభ్యంతరకరమైన ఛలోక్తులు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికైనా వాటికి ఫుల్‌స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది'' అన్నాడు స్వర్ణజిత్ బజాజ్ అనే ఆయన. ''ప్రస్తుతం ఈ పుస్తకం ముంబాయికే పరిమితమైనా త్వరలోనే ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుంది. సర్దార్లను కించపరిచే జోక్స్ ఇప్పటికే నెట్‌లో చాలా ఉన్నాయి. ఇటువంటి అవాంఛనీయమైన జోకులపై చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది'' అని కొంతమంది అంటున్నారు. ''ఇటువంటి జోకులపై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చర్య తీసుకోవాలి'' అంటున్నాడు మహారాష్ట్ర మైనారిటీస్ కమిషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అబ్రహమ్ మతాయ్. నిజానికి ఒకరిని నొప్పించేవి ఛలోక్తులు కానే కావు. అటువంటి జోక్స్ వల్ల ఎవరికీ నవ్వు రాదు- వాటికి గురైనవారికి బాధ కలుగుతుంది తప్ప. జోక్స్ విసిరి అవతలివారిని నవ్వించాలని ప్రయత్నించేవారు ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిది!

No comments:

Post a Comment