Thursday, June 17, 2010

'బోగస్‌'స్వాములు


'కలడు కలండనెడివాడు కలడో లేడో' అన్నది సాక్షాత్తూ దేవుడి గురించిన డౌటు. ఇది పోతన భాగవతం లోది. 'కలదు కలందనెడి సంస్థ కలదో లేదో' అన్నది వ్యాపార బాగోతం. దీనిని తిప్పి చూస్తే ఎందరో 'బోగస్‌'స్వాములు ఎందెందు వెదకి చూసిన అందందే కలరన్న పద్యపాదం కనపడుతుంది. వ్యాపారమంటే కోట్లు లక్షలు పెట్టుబడి పెట్టాలి; 24X7 శ్రమపడాలి అన్న భావనకు పోటీగా పెట్టుబడులెందుకు? పట్టుబడకుండా ఉంటే అదే పది లక్షలు అదే పది కోట్లు అన్న ధోరణి ప్రబలుతోంది. మాయ వ్యాపారులు మాయం కాగానే ఉన్నావా అసలున్నావా అన్న పాట పాడాల్సి వస్తోంది.'జమీందారు రోల్సు కారు మాయంటావూ! బాబూ ఏమంటావూ?' అన్న శ్రీశ్రీ మాటలు వింటే ఆహా ఓహో అనుకుంటాం. కారు మాయ కాకపోవచ్చు లేని కారును ఉన్నట్లు భ్రమ కలిగించి డబ్బు కొట్టేసే మాయ'దారుల్లో'ని మోస'కారు'లను తలుచుకుంటే మాత్రం 'కార్‌'ఫుల్‌గా ఉండాలనిపిస్తుంది. సృష్టికి ప్రతిసృష్టి ఉన్నట్టే, అసలు వ్యాపారులకు తోడు బోగస్‌ వ్యాపారాలూ పుట్టుకొస్తున్నాయా అనిపిస్తోంది. మాయల మరాఠీ ఒక్కడు కాదు ఎంతోమంది ఉన్నారనిపిస్తుంది. వాక్చాతుర్యం ఉంటే చాలు 'ఫేక్‌'చాతుర్యం చేయొచ్చని నిరూపిస్తున్నారు. నకిలీ స్టాంపులు, నకిలీ నోట్లు, నకిలీ సంస్థలు నకిలీ సర్టిఫి'కేట్లు' కాదేదీ నకిలీకనర్హం అనిపిస్తుంది. నకిలీ నోట్లది చిదంబర రహస్యం అనడానికీ వీల్లేదు. అది పి.చిదంబరానికి కూడా తెలియని రహస్యమేమో. దాదాపు 1,69,000 కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీ మన సమాజంలో చొరబడినందువల్ల బాధితులు 'చెల్లియో చెల్లకో...' పద్యం పాడుతున్నారని అంచనా. బోగస్‌ వ్యాపారమంటే సమాజం మీద జరిపే కుట్రతో సమానం. అన్నట్లు ఇంగ్లిషు వాడు స్థలాన్ని ప్లాట్‌ అన్నాడు. ప్లాట్‌ అంటే కుట్ర అని దాని అర్థం కూడా చెప్పాడు. దీంతో బోగస్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం గురించి తెల్లవాడికి ముందే ఐడియా ఉందని తేలిపోయింది. ప్లాట్లు కాగితాల మీదనే కనపడుతున్నాయి తప్ప ఎన్ని పాట్లు పడ్డా భూమ్మీద ఆనవాలు చిక్కట్లేదు. బోగస్‌కు దిగాక ఒకటి కుదురుతుంది ఇంకోటి కుదరదనలేం. ముందు 'మోహన'ంగా సాగిన యూరో లాటరీ 'కోలా'టం ఎలా బంద్‌ అయిందో అందరికీ తెలుసు. అలాగే 'వీసా'సనీయ వర్గాల ప్రకారం ఆ మధ్య చెన్నైలో 9 మంది తెలుగు మహిళలు 'గాలి'వీసాలతో చెన్నై ఎయిర్‌పోర్టులో పట్టుబడి 'వీసా'విరహే తవదీనా... అని పాట ఎత్తుకున్నారు. ఒక పెద్ద మనిషి తానో పెద్ద ఎయిర్‌పోర్టు పెడుతున్నట్టు జనాన్ని నమ్మించి 15 కోట్లు గుటకాయ స్వాహా చేసిన 'ధన'కార్యం ముందు ఇదెంత అనిపిస్తుంది.

'ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన బోగసోడు' అని సర్కారు ఇటువంటి వాళ్ల వెంటపడి పట్టుకుని 'సమ్‌'కెళ్లు వేస్తుందని ఆశపడతాం.కానీ ఓ 'గద్ద'మనిషి ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్నే 'సృష్టించేసి' మంది డబ్బును ఎగరేసుకుపోయాడు. దాంతో ఎంతో మంది 'జేబులొ డబ్బులు పోయెనే' అనే 'బాట' పాడుకోవలసి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలు చూపిస్తామని గాలి కబుర్లు చెప్పి జేబులు కత్తిరించి, బిచాణా ఎత్తేయడం బోలెడు గిరాకీ ఉన్న వ్యాపారమైపోయింది. 'దొర'కేంత వరకు ఇటువంటి 'దొరలు' ఎందరో!
బోగస్‌ వ్యాపార సుందరి 'ఫోర్‌'జరీ అంచు చీర కట్టుకుని హొయలొలకబోస్తుంటుంది కూడా. బోగస్‌ వ్యాపారాలను 'మార్చి' మార్చి జనాన్ని ఏమార్చి ఒక నెలలోనే 15వేల కోట్ల రూపాయల మేరకు సాగించారని 'నోటు'మాటగా చెప్పవచ్చు. హ్యాపీ లైఫ్‌ కోసం ఆశపడి బీపీ లైఫ్‌ తెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. బోగస్‌ నవ్వులు నవ్వి 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా' అన్న సీను సృష్టించి నమ్మిన వాళ్లను రౌడీల చేత నట్టేట ముంచేట్టు చేయడమూ జరుగుతోంది!

చివరకు షాపింగ్‌లో బోగస్‌, సర్కారు ఇళ్ల కేటాయింపులోనూ బోగస్‌ వ్యవహారం 'చోటు' చూసుకుంటోంది! చిత్రమేమిటంటే బోగస్‌ వ్యవహారాల మీద స్ట్రాంగ్‌ యాక్షన్‌ తీసుకుంటామని మంత్రులు నమ్మకంగా చెప్తుంటారు. కొంత కాలానికి ఎంత గొప్ప 'యాక్షన్‌' అనిపిస్తుంది.మహామహా నటులు ఇంతగా నటించ లేరని వేరే చెప్పాలా?
-ఫన్‌కర్‌

No comments:

Post a Comment