Wednesday, July 21, 2010

అవినీతి-రాజనీతి



- శంకరనారాయణ

''కామిగాక మోక్షగామియు కాడయా విశ్వదాభిరామ వినురవేమ!'' అన్న వేమన్న 
'అవినీతిపరుడుగాక నీతిపరుడు కాలేడయా' అన్న ఒక్క ముక్క గనక అని ఉంటే మన పాలకులు ఆయనకు (సంస్కరణ) బ్రహ్మరథం పట్టి ఉండేవాళ్లు. వూరూరా ఆయనకు గుళ్లూ గోపురాలు కట్టించేవాళ్లు. 'చెక్కు' భజనలుచేసేవాళ్లు. అయితే, అంత 'అదృష్టం' వేమనకు దక్కలేదు. అయినా మన నాయకులు వేమన చెప్పిన మాటను కాస్త మార్చి 'తినగ' తినగ 'స్కాము' తీయనుండు అంటున్నారు. ఎప్పటికప్పుడు 'అవినీతి బ్రహ్మోత్సవాలు'జరిపిస్తూ 'ఆదర్శం'లోకి 'అడుగు'వేస్తున్నారు.

ఇందుకు గిరీశమే స్ఫూర్తి. ''యిన్ఫెంట్‌ మారేజీలు అయితేనేగాని, యంగ్‌విడోజ్‌ వుండరు. విడోజ్‌ వుంటేనేగాని విడో మారియేజ్‌ రిఫారమ్‌కి అవకాశం వుండదు గదా! సివిలిజేషన్కల్లా నిగ్గు విడోమారియేజ్‌ అయినప్పుడు, యిన్ఫెంట్‌ మారేజీల్లేకపోతే సివిలిజేషన్‌ హాల్టవుతుంది. మరి ముందుకు అడుగుపెట్టలేదు. గనక తప్పకుండా యిన్ఫెంట్‌ మారియేజ్‌ చేయవలసిందే'' అంటాడు గిరీశం. ఆ లెక్కన 
అవినీతే లేకపోతే అవినీతి నిర్మూలన ఎలా జరుగుతుంది? 'తిన్నది' ఎలా అరుగుతుంది? తక్కువ 'తిన్న'వారెవరూ ఉండకూడదన్న సదాశయంతో 'చేతి'కి ఎముకలేకుండా 'సంత'ర్పణలు సాగుతున్నాయి.

వనభోజనాలు ఒక్క కార్తీకమాసంలోనే జరిగితే ఎవరైనా ఎంత తినగలరు? అందుకే మహానాయకుల చేతి చలువతో ఏడాదిలో అన్ని మాసాల్లోనూ, అన్ని మోసాల్లోనూ 
'ధన భోజనాలు' పుష్కలంగా జరుగుతున్నాయి. 'జేబు నిండా డబ్బు... కంటినిండా నిద్ర' అనేది 'నోటికి నోరు శాతం' అమలు అయిపోతున్నది!

అలాగని, మాంసం తిన్నంతమాత్రాన ఎముకలు మెళ్లో వేసుకోవాలని ఎక్కడన్నా ఉందా? ముడుపులు ముట్టినంతమాత్రాన మాటల్లోనూ మడి కట్టుకోకూడదని ఎవడు చెప్పాడు? అందువల్ల 
'నేత' బీరకాయలు, 'నీతి బీరకాయలు'బ్రహ్మాండంగా పుట్టుకొస్తున్నాయి.
'అవినీతి అంతర్జాతీయ సమస్య' అని ఇందిరమ్మే చెప్పారు. అప్పటికన్నా ఇందిరమ్మరాజ్యం ఇప్పుడే ఎక్కువ వెలిగిపోతోంది! 'తిన్నవాడికి తిన్నంత మహాదేవా!' అంటున్నారు. అయినా 'సంత'ర్జాతీయ సమస్యలను ఎవరేం చేయగలరు? ధృతరాష్ట్ర పాలకుల్లా చూస్తూ ఊరుకోవలసిందేనంటే ఎంత అవమానకరం!

ఎన్నో సమస్యలను పరిష్కరించిన గిరీశమే ఇందులోనూ పాలకులకు ఓ బాట చూపించాడు! దాంతో ఏలినవారు 'నినద భీషణ శంఖము దేవదత్తమే' అంటున్నారు. అవినీతి కనబడితే తోలు వలిచేస్తాం అని బెదిరిస్తున్నారు.
సర్వ'శిక్షా'భినయాలను కళ్లకు కట్టినట్టు ప్రదర్శిస్తున్నారు.

''మంత్రాలకు చింతకాయలు రాలతాయా? 
తిట్లకు అవినీతి మటుమాయమైపోతుందా?'' అని గిట్టనివాళ్లు అంటుంటే ఆ మాటలు'చెవులూ'రించడం లేదు. 'ఎంతదాకానో ఎందుకు? మీ చుట్టుపక్కల,చుట్టపక్కాల అక్రమ సంపాదనకు పొగబెడితేచాలు అవినీతి దయ్యం దెబ్బకు పారిపోతుంద'ని ప్రతిపక్షాలవాళ్లు ఎద్దేవా చేస్తుంటే, 'దీపం చుట్టూ చీకటి ఉండడం సహజమేగా' అని అధికారపక్ష పౌరాణికులు 'అరికథలు' వినిపిస్తున్నారు. ఇది నిజమే. అవినీతి అంతం తాతలనాటి పతకం. 'అవినీతి సొంతం' ఇప్పటి నేతల పథకం. 'అవినీతి సొంతం' వల్ల తమకు చెడ్డపేరు వచ్చినా ఇతరులకు మంచి పేరు వస్తుంది. ఇదికూడా ప్రజాసేవే.

అధికారుల గోల అధికారులది. అవినీతి విషయంలో 'రాజ'నీతి చిత్రంగా ఉందని వారు వాపోతున్నారు. నేతల అవినీతిపై పెదవివిప్పని మారాజులు అధికారుల మీదికిమాత్రం ఒంటికాలిమీద లేస్తున్నారని, ఇదికూడా 'విభజించి పాలించు' సూత్రమేనని విమర్శిస్తున్నారు. నాయకుల ఆజ్ఞ లేకుండా ఫైలయినా కదులుతుందా? కళ్లు మూసుకుని ఫైళ్లమీద సంతకం పెట్టిననాడే ఈ విషయం గుర్తొచ్చి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? అని ప్రశ్నిస్తున్నారు. చివరికి 'బలి పశువులం మేమా?' అని నిలదీస్తున్నారు.

వీటి సంగతేమయినా ప్రభువుల 
'విత్తశుద్ధి'ని శంకించడానికి వీల్లేదు. అవినీతిని సజీవంగా పట్టి ఇచ్చిన ఉద్యోగులకు 30 శాతం ప్రోత్సాహక వేతనాన్ని ఇస్తామని అధినాయకులు ఊరిస్తున్నారు. ఎంత జీతం ఇస్తేమాత్రం ఏం లాభం? అవినీతిని పట్టుకున్నవారు లంచం తీసుకున్నా దానిని వారు ఒప్పుకొంటే వదిలెయ్యాలంటూ చట్టం చేయాలని కొంతమంది 'నొక్కేసి' వక్కాణిస్తున్నారు. ఒక అవినీతిపరుణ్ని ఇంకో అవినీతిపరుడు మాత్రమే పట్టుకోగలడు కాబట్టే దొంగ చేతికే తాళాలిచ్చినట్టు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. పైగా 'అవినీతిపరులు ఎంతటివారయినా వదలొద్దు' అని సాక్షాత్తూ ప్రభుత్వాధినేతే చెబుతుంటే అవినీతిపరులయిన అధికారులు పులకించిపోతున్నారు. 'అందుకేగదా సార్‌! అవినీతిపరులు ఎంతటివారయినా, వారిని మేము వదలకుండా వాళ్లచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దక్షిణలు పుచ్చుకుంటున్నాం. అందువల్ల అవినీతిలో గుత్తాధిపత్యం తగ్గిపోయి వికేంద్రీకరణ జరుగుతుంది! అవినీతి పలచన కావడానికి మంది ఎక్కువ కావడమే కదా మార్గం'' అంటున్నారు.

ప్రభువులు గమనించని విషయం ఒకటుంది. అన్నిటికన్నా పారదర్శకతకు పెద్దపీట వేయడం ముఖ్యం. అవినీతి జరక్కపోతే దర్యాప్తు ఉండదు. దర్యాప్తు జరగకపోతే పారదర్శకత ఉండదు. కాబట్టి... అన్నీ తెలిసినవాళ్లకు ఇంతకుమించి ఏం చెప్పగలం

No comments:

Post a Comment