Tuesday, July 20, 2010

మాతృదేవోభవ!



'ఎందుకొచ్చిన చదువులురా! ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళు ఏలాలా? ఉన్న చెక్కను చక్కగా సాగు చేసుకుంటూ, కడుపులో చల్ల కదలకుండా కళ్లముందు చల్లగా పడుంటే అదే పదివేలు' అనేది ఒకప్పటి గ్రామీణ భారతం. 'వద్దు వొద్దంటుంటే ఈ ఇంగిలీషు చదువులో పెట్టావ్‌! మనకీ ఇంగిలీషు చదువు అచ్చిరాదంటే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావధాన్లు కొడుకును ఇంగిలీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి వూష్టం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేసింది' అని అగ్రహారం ఆక్రోశించేది. ఈ రకం అభివృద్ధి నిరోధక ధోరణి వెనక ఒకానొక కడుపు తీపి, మమకారపు నుడికారం ధ్వనించేవి. 'దీని చదువు మన వంశానికి చెడ్డపేరు తెస్తోంది నాన్నా! మరీ ఇన్నేసి మార్కులా! మీ జీవితంలో ఎప్పుడైనా వచ్చాయా? నా మటుకు నేను ఎప్పుడైనా తెచ్చుకున్నానా! మన వంశ సంప్రదాయానికి ఇది అప్రదిష్టకాదూ?' అని చెల్లెలి మార్కులు చూసి అన్నగారు బెంగపడటం సినీమార్కు చమత్కారం హాస్యప్రవృత్తికి అలంకారం. చదువులకయ్యే ఖర్చు చూసి బెంబేలుపడటం మరోరకం. వెంకటేశం విషయంలో అగ్నిహోత్రావధాన్లు 'మెరక పొలం సిస్తు అంతా వాడికిందయి పోతోంది. నేను వేదం ఎనభైరెండు పన్నాలూ ఒహ దమ్మిడీ పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతుంది. ఒక్క దమ్మిడీ ఇవ్వను' అనేసి అగ్గిరాముడై పోవడం- ఈ బాపతుకిందికి వస్తుంది. క్రమంగా కాలం మారింది. చదువులపట్ల శ్రద్ధ బాగా పెరిగింది. అవసరమైతే కడుపు మాడ్చుకుని కూడబెట్టి మరీ చదువులు చెప్పించాలనే ధోరణి బలంగావ్యాపించింది. ఉన్న ఊళ్లో లేకపోతే పట్టణాలకు పంపించి అయినా పిల్లలకు పెద్దచదువులు చెప్పించడానికి తల్లిదండ్రులు తపన పడుతున్న రోజులివి. భర్తను ఊళ్ళో సేద్యానికి వదిలేసి, ఒంటరిగా పట్టణాలకు వచ్చి పిల్లలకు వండిపెడుతూ శ్రద్ధగా చదివించుకుంటున్న తల్లులు ఈ పెద్దమార్పునకు ప్రత్యక్ష ఉదాహరణలు.

ఒక జాతి ఆలోచనా విధానాన్ని ఇంత గణనీయంగా మలుపుతిప్పిందెవరు? జీవనశైలిలో బలంగా స్థిరపడిన అలవాటులో ఇంతటి పరివర్తనకు దోహదకారి ఎవరు? నెలవారీ కుటుంబఖర్చుల్లో పిల్లల చదువులదే పెద్దపద్దు కావడంలో కీలకనిర్ణయం ఎవరిది? ఇంకెవరిది- అమ్మది! భర్తతోడు బాగా అవసరమయ్యే వయసులో పిల్లల భవిష్యత్తుకు బతుకును ముడుపు కట్టి, ఒంటరిగా గడపడానికి సిద్ధపడిన అమ్మలకే చెందుతుంది- ప్రగతికి చెందిన ఈ ఘనతంతా! అవును. ఇంతటి మార్పునకు అమ్మే ప్రధాన కారణం. బాల్యంలో గోరుముద్దలు తినిపిస్తూ, దేవుణ్ని చూపించి... ఏదమ్మా అను... జేజి... జేజి అను తాత్తాత్తాత్తాత్త... అంటూ మాటలు నేర్పించిన తొలిగురువును గుర్తుతెచ్చుకోండి. ఉప్పుమూటలా బిడ్డను వీపున మోస్తూ- వంగుని, ముంగిట తెల్లని ముగ్గులు వేస్తూ- అమ్మలు నేర్పిన పాటలు గుర్తుచేసుకోండి. కోడికన్నా ముందే లేచి తాను తయారై, అన్నాలు వండి, కేరేజీలు సర్ది, పిల్లలను లేపి, వీపులు రుద్ది, బట్టలు తొడిగి, మూతులు కడిగి- వీధిలో గంట వినపడేసరికల్లా పిల్లాణ్ని ఒకవంక, పుస్తకాల బస్తా ఒక చంక ఇరికించుకుని పరుగులు తీసే అమ్మల హైరానా కళ్లారా చూడండి. పగలంతా ఇంటిపనులతో సతమతమై దీపాలవేళకు పాలో పళ్లరసమో పిల్లలచేత తాగించి చుట్టూ కూర్చోబెట్టుకుని హోంవర్కు పూర్తిచేయించే అమ్మల్ని జాగ్రత్తగా గమనించండి- అది అమ్మదనం ఎంతో ఆదరంగా అక్షరాస్యతకు సమర్పిస్తున్న నీరాజనమని అర్థమవుతుంది! చదువుల తల్లికి చందన చర్చలు ఎవరివో తెలిసి వస్తుంది! విద్యాభారతికి వెన్నెల హారతి పడుతున్న సంస్కారచిత్తం ఎవరిదో వెల్లడవుతుంది. ఆధునిక యుగంలో అమ్మ వామనరూపం ఎలా విశ్వరూపంగా విస్తరించిందో బోధపడుతుంది. జాతి జీవనాడిలో ఇంతటి అద్భుతమైన పరిణామానికి బీజం ఎక్కడిదో తెలుస్తుంది. నూరేళ్ల క్రితమే ఈ కీలకాన్ని గుర్తించిన వాడు మహాకవి గురజాడ! 'మీలాగే వాడూ జంఝాలు వొడుక్కుంటూ బతకాలని ఉందా ఏమిషి? మీకంత భారవఁని తోస్తే మావాళ్లు నాకు పసుపూ కుంకానికి ఇచ్చిన భూవంమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను' అని తెగేసి చెప్పిన వెంకమ్మ- ఈ అమ్మలందరికీ మూలపుటమ్మ!

గానంలో ఆరితేరిన గాయకుడు హెచ్చుశ్రుతిలో, పెద్దస్థాయిలో చికాకు లేకుండా పాడేందుకు వీలుగా తన రాగాలాపనకు ప్రారంభ స్వరస్థానాన్ని కుదిమట్టంగా స్థిరపరచుకుంటాడు. దాన్ని ఆధారషడ్జమం అంటారు. అమ్మను ఆధారషడ్జమంగా నిలుపుకొన్న వ్యక్తి తన జీవనరాగాలాపనలో ఎంతటి పైస్థాయిలోనూ తడబడడు. ప్రతి విజేతలోనూ అతని తల్లి లక్షణాలు కొన్ని తప్పక కనపడతాయని మనస్తత్వవేత్తలు చెప్పేదాంట్లో రహస్యమదే. 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' అని కీర్తించిన ఆదికవి మొదలు- 'ఈ లోకమనే గుడి చేరగ తొలివాకిలి అమ్మ' అని గానం చేసిన అవధాన కవి వరకు, కవులెందరో అమ్మదనానికి పల్లకీలు పట్టారు. 'లోకంలో చెడ్డకొడుకులుంటారు తప్ప చెడ్డ అమ్మలు ఉండరు' అని శంకర భగవత్పాదులు ఒక తీర్మానమే ప్రకటించారు. 'లోకంలో అమ్మలందరూ అమృతహృదయులే, జాలిగుండె కలవారే- ఎందుకంటే అమ్మలు దేవుడి ప్రతినిధులు' అన్నాడొక రచయిత. 'దేవుడు అన్నిచోట్లా ఉండటానికి వీలుకాక తన బదులుగా అమ్మను సృష్టించి అన్నిచోట్లకూ పంపించాడు' అన్న ఆంగ్లసూక్తి- మాతృదేవోభవ అనే ఆర్యోక్తికి ప్రతిధ్వనిగా అనిపిస్తుంది. అంతటిది కాబట్టి అమ్మదనం- పరంపరాగతంగా వస్తున్న అగ్రహారపు అసహనాన్ని సమన్వయ సంస్కారంతో సరిదిద్దగలిగింది. చారిత్రక విభాత సంధ్యల పెను చాదస్తపు చీకట్లను సమూలంగా తరిమేసేందుకు వీలుగా ఈ జాతి అంతస్సీమల్ని జ్యోతులతో నింపే దివిటీ కాగలిగింది. వెలుగులు పంచింది. గొప్పమలుపును సాధ్యం చేశారు అమ్మలు. అందుకే వారికి జేజేలు

No comments:

Post a Comment