Sunday, September 11, 2011

సరస్వతీ నమస్తుభ్యమ్‌..



పలు సందియములు దొలచును/ వెలయించు నగోచరార్థ విజ్ఞానము- అన్నది చదువుమీద చిన్నయసూరి సదభిప్రాయం. అక్షరం లోకం చక్షువు. నిరక్షర కుక్షిని గుడ్డి కుక్కతో పోల్చారు పురందరదాసు. 'సంతకుపోయి తిరిగిన దుడ్డుపెట్టె కాక దొరకేనా?' అని ఆ యోగి ఎకసెక్కాలాడినట్లే గాలికి తిరిగి తన పుత్రులెక్కడ జనుషాంధులవుతారోనని పంచతంత్రంలో పాటలీపుత్రం రాజు తెగ మథనపడిపోతాడు. అహరహము హరి నామస్మరణ మరిగిన ముద్దుల పట్టిని తిరిగి దారికి తెచ్చుకుందామంటే హిరణ్యకశిపుడికీ ముందుగా తోచింది సద్గురువుల వద్ద లభించే సద సద్వివేక చతురత కలిగించు విద్యాబుద్ధులే! చదవనివాడజ్ఞుండగునని రాక్షసుడైనా అక్షర మహిమను చక్కగా గ్రహించాడు. ఇప్పుడంటే విద్య పరమార్థం అర్థ సంపాదన గానీ... ఏకలవ్యుడు ఆ కాలంలో ఏ కాసులు ఆశించి గురుబ్రహ్మను బొమ్మగా తీర్చిమరీ విద్యలకోసం వెంపర్లాడాడు! కర్ణుడు పరశురాముని వద్ద పడీపడీ శుశ్రూషలు చేసింది కాలక్షేపం కోసమైతే కాదు గదా! మృతసంజీవనీ విద్యకోసం కచుడు చేసిన సాహసం సామాన్యమైనదా! ఆత్మ పరమాత్మల పరమ రహస్యాలను గురుముఖతః గ్రహించాలన్న కామనతోనే గదా జాబాలి గౌతముని మున్యాశ్రమంలో అన్నేళ్లు ఎడతెగక గొడ్లూ-గోదలను కాసింది! విద్యార్జనకెంత విలువలేకపోతే ఆ బాలగోపాలుడు సాందీప మహాముని ఆశ్రమంలో గుంట ఓనమాలు దిద్దుకుంటాడు! అవతార పురుషుడు ఆ తారకరాముడు సైతం తాటకి వధకు ముందు వశిష్టులవారి వద్ద వేద పారాయణాల్లో తర్ఫీదు పొందినవాడే! విద్యా సముపార్జనను ఓ విధిగా నిర్దేశించిన బ్రహ్మచర్యం చతురాశ్రమాల్లో ప్రథమమైనదే కాదు... ప్రధానమైనది కూడా. భారతీయులకు చదువు చెప్పే గురువు సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపం.పురందరదాసు ప్రబోధించిన విధంగా గురువుకు 'గులాము అయ్యేదాకా ముక్తి దొరకదన్నా' అన్న సూక్తి మనిషికి చదువు మీదున్న భక్తిశ్రద్ధలకు పెద్ద నిదర్శనం.

భర్తృహరి బోధించినట్లు విద్య నిగూఢ గుప్తమగు విత్తముపూరుషాళికి రూపము,యశస్సుభోగకరివిదేశంలో ఆదుకునే ఆపద్బంధువు. హర్తకు అగోచరమైన నిధి, సుఖపుష్టి, సత్కీర్తి ఘటించు ఈ దివ్యధనం విద్యార్థి కోటికి పూర్తిగా ధారపోసినా పెరిగేదే గాని తరిగే ద్రవ్యం కాదు. నిజానికి మనిషికి భుజకీర్తులు, సూర్య చంద్రహారాలు పెద్ద అలంకారాలు కావు. చందన స్నానాలూ, మందార మాలలు అందచందాలను ఏమంత పెంచనూ లేవు. వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణమ్‌- అన్న భర్తృహరి వాదనను కొట్టిపారేయలేము. ఆ రాచకవి అన్నట్లు నిజంగా విద్య నృపాల పూజితమే. కాకపోతే మనుచరిత్ర కర్త అల్లసాని పెద్దనామాత్యుని 'ఎదురైనచో మద కరీంద్రము నిల్పి కేయూత యొసగి' కృష్ణరాయలంతటివారు సరదాకి అయినా ఎక్కించుకుంటారా? వల్మీకజుడైన వాల్మీకి మహర్షికి కమలజన్మునితో సరిసమానమైన గౌరవ మర్యాదలందటానికి కీలకం రామాయణా రచనేనంటే ఏమనగలము? సుభాషిత రత్నావళి భాషించినట్లు చందమామకు తారాతోరణం, పతీపత్నులకు పరస్పర సాహచర్యం, పృథ్వీమతల్లికి సద్భూపాల సుపరిపాలన భూషణాలయితే..విద్య మాత్రం సర్వేసర్వత్ర సకల లోకాలకూ ఒకే మాదిరైన సద్భూషణం. 'డొక్క శుద్ధిలేని మనిషితేనె బొట్టులేని పట్టు' అంటారు ఖలీల్‌ జిబ్రాన్‌. మనిషిజన్మ ఎత్తినందుకైనా నాలుగు మంచిముక్కలు నాలుకమీద ఉంచుకోనివాడిని- వజ్రవైఢూర్య ఖచిత ఘటకంలో తెలకపిండి వంటకంకోసం మంచిగంధపు చెక్కల్ని మంటపెట్టినవానికన్నా వెయ్యిరెట్లు అధిక మూర్ఖునిగా చిత్రించింది విద్యానీతి. చదువుకన్నా చక్కదనం, చక్కనిధనం ముల్లోకాలుగాలించినా ఎక్కడా దొరకదనేదే సర్వశాస్త్రాల సారం.

'చదువు సంధ్యలుఎంత చక్కని జంట పదం! జీవిత సంధ్యను రాగరంజితంచేయగలిగే చేవ చదువుకు మాత్రమే ఉందని ఎంత వింతగా ధ్వనిస్తున్నదీ పదం!బతుకు ధర్మక్షేత్రంలో మంచిచెడ్డల మధ్య జరిగే నిత్య కురుక్షేత్రంనుంచీ మానవుడిని మాధవునిలాగ కాపాడగలిగేది ఓనమాలే! సర్వరోగాలకు మూల కారణమైన తాపత్రయంవల్ల అంతిమంగా జరిగే నష్టం ఆయుక్షీణం- అన్నది రుగ్వేదవాదం. ఆ యావనుంచి మనసును మళ్లించి మంచి దోవకు తిప్పగల తారకమంత్రం మనచేతిలోనే ఉందని మానసిక వైద్యులూ చెబుతున్నారు. ఆరోగ్యసిద్ధికి... అమరత్వలబ్దికి పుస్తక పఠనమే ఉత్తమ సోపానం అని ఇప్పుడు లండన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులూ పేర్కొంటున్నారు. ఒక దశ దాటిన పిదప వయసుతోపాటు మనసు వడలిపోవడం సహజ పరిణామమే. నిష్కాముకత్వం దానికి నిఖార్సైన ఔషధం కావచ్చుకానీ... ఆ యోగం అందరికీ అంత సులభంగా అందివచ్చే అందలమా? బద్దెన నీతిశాస్త్రంలో కుండ బద్దలుకొట్టినట్లు ధనం, ఉషోదయం, యవ్వనం, వండిన అన్నం, మూర్ఖుడి స్నేహం లాగా మానవ జీవితకాలమూ బుద్బుధప్రాయమే. 'ఆయువు నూరు సంవత్సరములందు సగంబు నశించె నిద్రచే/ నా యరలో సగంబు గతమయ్యెను బాల్య జరాప్రసక్తి చే/ బాయక తక్కిన యట్టి సగబాలు గతించు బ్రాయస వృత్తిచే!' ఆ మిగిలిన సగభాగంలోనైనా పడుచుదనంతో పరవళ్లు తొక్కాలని ఎవరికి ఉవ్విళ్ళూరదు!పుస్తక పఠనం  వ్యసనంగా మలుచుకున్నవారి ఆయుర్దాయంపెరగడమేకాదు... ఉన్నంత కాలం చలాకీగా చిందులెయ్య గలుగుతారని లండన్విశ్వవిద్యాలయ పరిశోధక బృందం జరుపుతున్న పరీక్షల ఫలితం నిగ్గు తేల్చింది.మానవ కణాలల్లోని క్రోమోజోముల చివర జీవితకాలాన్ని నిర్దేశించే 'టెలొమెర్‌'లు ఉంటాయనీ... అవెంత దీర్ఘంగా ఉంటే జీవితకాలమంత సుదీర్ఘంగా సాగుతుందని ఆ బృందం నాయకుడు ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ హోల్గేట్‌ వాదం. పుస్తకాల పురుగులలో ఈ టెలొమెర్‌ కణం పొడుగు పెరుగుతుంటుందనేది పరిశోధనల సారాంశం. ఇంకేం... ఏడు పదులు దాటినా చేతికి కర్ర రాకుండా చలాకీగా ఉండాలంటే వెంటనే ఓ మంచి పుస్తకంతో 'పఠనాయోగం' ప్రారంభించటం మంచిది కదూ!
(సంపాదకీయం, ఈనాడు, ౨౯:౦౫:౨౦౧౧) 

No comments:

Post a Comment