Sunday, November 14, 2010

భయం లేని చోటు


ఆహార, నిద్రా, భయ, మైధునాలుజీవులన్నిటిలో సాధారణమే అయినప్పటికీ, మానవుల్లో వీటి గురించిన చింతన కొంచెం ఎక్కువ.ఆహార, నిద్రా, మైధునాలు- వాటి అవసరం తీరాక అవి శాంతిస్తాయి. కానీ, మూడోదైన భయం మాత్రం మనిషిని నిత్యం వెన్నంటి ఉంటూనే ఉంటుంది.

రోజుల శిశువు కూడా నిద్రలో ఉలికులికిపడటం మనం చూస్తుంటాం. అది మొదలు- ఏదో కారణంగా, ఈ భయం మనిషిని బాధిస్తూనే ఉంటుంది. 'నేనెవరికీ భయపడను. భయం అనేది నా నిఘంటువులోనే లేదు' అని డంబాలు పలికినవారూ కొన్ని కొన్ని పరిస్థితుల్లో భయపడక తప్పదు. సకల సంపదలూ ఉన్నప్పటికీ వాటిని అనుభవించటంవల్లరోగం వస్తుందన్న భయం. మంచి పేరు ప్రతిష్ఠలున్నవారికి జాగ్రత్తగా ప్రవర్తించకపోతే చెడ్డపేరు వచ్చేస్తుందన్న భయం. ధనవంతులకు ఆ ధనాన్ని ఎలా కాపాడుకోవాలా అన్న భయం. అభిమానవంతులకు ఆత్మాభిమానంకాపాడుకోవాలన్న భయం. బలవంతులకు శత్రుభయం. సౌందర్యవంతులకుముసలితనంవల్ల భయం. శాస్త్రజ్ఞులకు ప్రతివాదులవల్ల భయం. మంచివారికిచెడ్డవారివల్ల భయం. జీవులందరికీ మరణభయం. ఈ భయాలేవీ లేని చోటు అసలు ఉంటుందా?మానవులు తాము చూస్తున్నదీ, అనుభవిస్తున్నవీ శాశ్వతాలు కావనీ, ఇవన్నీ ఏదో ఒకరోజున నాశనమైపోయేవే అని గ్రహించగలిగి వాటిమీద మమకారాన్నీ, వ్యామోహాన్నీ తగ్గించుకొని- నిత్యమైనదీ, సత్యమైనదీ భగవంతుడొక్కడే అని గ్రహించగలిగితే- 'ఇది నాది, ఇది నేను' అనే భావన తొలగుతుంది. అదే వైరాగ్యం! అలాంటి వైరాగ్యం కలిగినప్పుడు భయానికి చోటుండదు. దాన్ని అలవరచుకోవటానికి ప్రయత్నించాలి! అదే విషయం చెప్పాడు భర్తృహరి-

భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తే నృపాలాద్భయం
మానే దైన్యభయం, బలే రిపుభయం, రూపే జరాయాభయమ్‌
శాస్త్రే వాదభయం, గుణే ఖలభయం, కాయే కృతాన్తాద్భయమ్‌
సర్వం వస్తు భయాన్వితం భువినృణాం, వైరాగ్యమేవా భయమ్‌
(వైరాగ్య శతకం)

- పి.వి.బి.శ్రీరామమూర్తి

No comments:

Post a Comment