Monday, August 2, 2010

త్యాగయాగం

- చిమ్మపూడి శ్రీరామమూర్తి
ఈ లోకంలో త్యాగభావంకన్నా మహత్తరమైన గుణం మరొకటి లేదు. ఈమానవజాతి జన్మసార్థకతకు మూలం 'త్యాగం'. త్యాగం ప్రేమవల్ల పుడుతుంది. ప్రేమ స్నేహంవల్ల పుడుతుంది. స్నేహం విశ్వాసంనుంచి ఆవిర్భవిస్తుంది. విశ్వాసం అవగాహన నుంచి జనిస్తుంది. అవగాహనకు మూలం ఆధ్యాత్మిక పరిజ్ఞానం. కనుక ఆధ్యాత్మికతకు త్యాగానికీ అవినాభావ సంబంధం ఉంది.

మానవుడు సహజంగా సుఖం కోరుకుంటాడు. ఎంతో శ్రమిస్తాడు. సంపద పోగుచేస్తాడు. ఆ సంపదలో కొంతభాగాన్నైనా దానరూపంలో త్యాగం చేయాలి. ఈదానం త్యాగంలోని ఒక భాగం. ఏ సంపదనైనా త్యాగభావంతో అనుభవించాలని వేదం చెబుతోంది. మన సంపద ఏ రూపంలో ఉన్నా అందులోని కొంతభాగాన్ని తప్పకుండా ఇతరుల శ్రేయంకోసం వినియోగించాలి. ధనం, ధాన్యం, భూమి, జలం యిలాంటివేవైనా మనం శ్రమించి కూడబెట్టుకుంటే అర్హులయినవారికి వీటిలోని ఎంతో కొంత భాగాన్ని వితరణ చేసి ఉదారవంతులం కావాలి.

జీవించినంతకాలం లోకహితకర్మలే ఆచరించాలి. ఈ లోక హితకర్మలన్నింటిలో త్యాగలక్షణం ప్రథమశ్రేణికి చెందినది. స్వార్థమున్నచోట త్యాగానికి తావే ఉండదు. మానవుడు తనలోని స్వార్థబుద్ధిని క్రమక్రమంగా దూరం చేసేకొద్దీ త్యాగబుద్ధికి హృదయంలో చోటు దక్కుతుంది. 'కర్మలను త్యజించడం సన్యాసం కాదు, కర్మఫలాలను త్యజించడం సన్యాసమనిపించుకుంటుంది' అని గీతావాక్యం. ఒంటరిగా తినటంకన్నా నలుగురితో కలిసి భోజనం చేస్తే కలిగే సంతృప్తి అనిర్వచనీయమైనది. మనకేది లభించినా అది భగవత్ప్రసాదం. దాన్ని వితరణ చేయాలి.

ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పరోపకారం త్యాగమే అవుతుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువూ సజీవమైనా, నిర్జీవమైనా- మననుంచి ఏమీ ఆశించకుండానే... ఎంతటి మహోత్కృష్ట ఫలితాలు, సౌఖ్యాలు ప్రసాదిస్తున్నాయో చూడండి. మేఘం, చెట్టు, గాలి, నీరు, గగనం, నేల... ఏదైనా ప్రాణికోటిని సేవిస్తోందేతప్ప బదులుగా ఏదీ తీసుకోవడంలేదు. ఇంతకన్న మించిన త్యాగం ఏముంటుంది? అదే నేర్చుకోవాలి మనం. అందుకే 'ప్రకృతి మానవుడి మొదటిబడి' అంటారు విజ్ఞులు.

మనదేశం అనాదిగా త్యాగానికి సాకారంగా పరిఢవిల్లుతోంది. మన ఆర్షవాఞ్మయమే అందుకు సాక్షి. తన శరణుకోరిన పావురాన్ని కాపాడటంకోసంశిబిచక్రవర్తి డేగకు తన తొడకోసి మాంసాన్నిచ్చి దాని ఆకలి తీర్చాడు. బ్రాహ్మణవేషంలో వచ్చిన ఇంద్రుడు కోరగానే పుట్టుకతోనే దేహంతో వచ్చిన సహజ కవచకుండలాలను త్యాగం చేశాడు కర్ణుడు. రాక్షస సంహారం కోసం ఇంద్రుడు కోరగానే తన వెన్నెముకను ఆయుధంగా ఇచ్చేశాడు దధీచి మహర్షి.రంతిదేవుడు అడవుల్లో తన ఆలుబిడ్డలతో తిరుగుతుంటే- చాలా రోజులకు దొరికిన అన్నం ఒక భిక్షుడికిచ్చివేసి ముంతలోని నీటితో దాహం తీర్చుకొనేందుకు సిద్ధమవుతాడు. అంతలో మరో యాచకుడు దాహార్తితో యాచించగానే ఆ నీరు అతనికి ఇచ్చేస్తాడు. సత్యంకోసంహరిశ్చంద్రుడు రాజ్యాన్నే త్యాగం చేస్తాడు.శ్రీరాముడు తండ్రి మాటను నిలబెట్టేందుకు అరణ్యవాసం చేసి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, నలుడు, బలిచక్రవర్తి ఇలా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు. అహింసామూర్తి బాపూజీ భారత స్వాతంత్య్రం కోసం తన జీవితమంతా త్యాగం చేశాడు. అల్లూరి, ఆంధ్రకేసరి, తిలక్‌, గోఖలే, భగత్‌సింగ్‌ల త్యాగనిరతిని జాతి మరువగలదా?

నూరు మందిలో ఒకడు శూరుడై ఉంటాడు. వెయ్యిమందిలో ఒకడు పండితుడై ఉంటాడు. పదివేల మందిలో ఒకడు వక్తయి ఉంటాడు. లక్షల్లోనైనా ఒకడు దాత అయి ఉండటం అరుదు. దాత అంటే త్యాగశీలి అయినవాడు. త్యాగానికి రెండు పంక్తుల్లో ఎంతటి మహత్తరమైన అర్థం చెప్పాడు గురజాడ! 'సొంతలాభం కొంత మానుక పొరుగువారికి తోడు పడవోయ్‌!' అన్నారాయన. త్యాగంవల్ల మానవుడిలో తృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పరమపురుషార్థం వైపు తీసుకువెళ్లేదే త్యాగం. యజ్ఞప్రక్రియను త్యాగానికి ప్రతీకగా అభివర్ణించారు సనాతనులు. అందుకే త్యాగమొక యాగం. 'కొట్టితినకు, పెట్టితిను' అనే వేదమే సామాన్యుడికి అవగతమయ్యేలా చెప్పింది. సత్పాత్ర దానంవల్లనే సంపాదన సార్థకమవుతుంది.అధములు 'నాదీ నాదే, నీదీ నాదే' అంటారు. మధ్యములు 'నీది నీదే నాది నాదే' అంటారు. ఉత్తములు 'నీది నీదే, నాదీ నీదే' అంటారు. ఈ ఉత్తమగుణం అలవరచుకుంటే లోకకల్యాణమే! ప్రతిఫలాపేక్షతో చేసే త్యాగం త్యాగమే కాదు. దేశం కోసం, లోకం కోసం చేసే త్యాగానికెవరూ విలువకట్టలేరు. త్యాగంవల్ల కలిగే ఆనందానికీ తృప్తికీ అవధులే లేవు, హద్దులే లేవు.మేరుపర్వతమంత ధనం సంపాదించాలనీ, త్యాగం చేసేటప్పుడు దాన్ని గడ్డిపరకలా భావించాలనీ శాస్త్రోక్తి. ఇదే మన జీవన పరమార్థం.

1 comment: