Thursday, October 14, 2010

నమ్మకం ఉండాలి


- అయ్యగారి శ్రీనివాసరావు
లోకమంతా సజావుగా నడవడానికి 
నమ్మకం కీలకం. అది ఉంటే దేన్నయినా సాధించవచ్చు. ద్వైదీభావం, అనుమానం, అపనమ్మకం లాంటివి ఏ కోశానా లేకుండా పూర్తి విశ్వాసంతో తన ప్రయత్నం చేసిననాడు- ఆ పని కచ్చితంగా నెరవేరి తీరుతుంది.

ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీః
దైవేన దేయమితి కా పురుషావదంతి
దైవం నిహత్యకురుపౌరుష మాత్మశక్త్యా
యత్నేకృతేయదినసిధ్యతి కోత్రదోషః
(
ప్రయత్నశీలుని విజయలక్ష్మి వరిస్తుంది. భగవంతుడే అన్నీ చేస్తాడని చూడకుండా తనమీద తనకు నమ్మకంతో మానవ ప్రయత్నం చేయడం నీ కర్తవ్యం. అలా చేసిన ప్రయత్నం ఫలించకపోయినా అందులో నీ దోషం లేదు)

తన మీద తనకు నమ్మకం కలిగినవారికి దేవుడు కూడా సాయపడతాడు. ఒక యువకుడు ఉద్యోగంకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అవి ఫలించటంలేదు. తనమీద దేవుడికి దయలేదని ఒకసారి, తన ఖర్మ ఇంతేనని ఒకసారి, తనకిక ఉద్యోగం రాదని తాను తెలివితేటలు లేనివాడనని మరొకసారి... ఇలా అనుకుంటూ నిరాశనిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి సమయంలో ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు పుస్తకాల సంచితో పాటు గొడుగునూ వెంటపట్టుకుని బడికి వెళుతున్నాడు. ఆ సమయంలో వాతావరణం పొడిగా ఉంది. గొడుగు అవసరమేమిటనిపించి ఆ పిల్లవాడినే అడిగాడు. దానికా కుర్రవాడు 'సాయంత్రం వర్షం వస్తుంది. అప్పుడు గొడుగు అవసరముంటుంది. అందుకని...' అన్నాడు.

ఆ మాటకు ఆశ్చర్యపోయిన ఆ యువకుడు 'వర్షం వస్తుందని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు?' అనడిగాడు.
'ఈరోజునుంచి వర్షకాలం మొదలవుతుందని, మొదటిరోజు తప్పక వాన కురుస్తుందని అమ్మ చెప్పింది. మా అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు' అన్నాడు. ఆ మాటల్ని బాల్యచేష్టలుగా తలచి పట్టించుకోలేదా యువకుడు. ఆ సాయంత్రం నిజంగానే వర్షం కురిసింది. అప్పుడనుకున్నాడు- 'ఆ బాలుడికి తన తల్లి మాటలమీద నమ్మకం ఉండబట్టే కదా ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరాడని.

ఆ సంఘటనతో-
 ఏ ప్రయత్నం చేసినా తనమీద తనకు నమ్మకం ఉంటేనే విజయం సిద్ధిస్తుందనిపించింది. కొన్నాళ్ళ తరవాత ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యాడా యువకుడు. ఉన్నది ఒకటే ఉద్యోగం. దానికి తనలాగే అనేకమంది వచ్చారు. వారందర్నీ చూసి అధైర్యం కలిగింది మొదట. వెంటనే ఆ బాలుడు మదిలో మెదిలాడు. అతడి స్థిరనమ్మకం గుర్తొచ్చింది. ఆపై తాను ఈ ఇంటర్వ్యూ కోసం చేసిన సాధన గుర్తొచ్చింది. స్థిమితపడ్డాడు.

అందరినీ పరీక్షించడం పూర్తయ్యాక యజమాని అభ్యర్థులందరినీ ఒకచోట సమావేశపరచి 'ఈ ఉద్యోగం మీలో ఎవరికొస్తుందనుకుంటున్నారు?' అనడిగాడు.

రకరకాల అనుమానాలు, భయాలతో ఎవరూ జవాబు చెప్పడానికి సాహసించలేదు. అలాంటి సమయంలో ఆ యువకుడు నిలబడి 'ఈ ఉద్యోగం తప్పక నాకే వస్తుంది' అన్నాడు తడుముకోకుండా.

అతడలా అనగానే 'అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు?' అని ప్రశ్నించాడా యజమాని.

జవాబుగా 'ఈ పరీక్షలో నెగ్గాలని నాలుగు రోజులుగా కష్టపడుతున్నాను. ఇందాక మీరు చేసిన ఇంటర్వ్యూలో సరైన సమాధానాలు చెప్పగలిగానని నమ్మకం ఉంది కాబట్టి' అన్నాడు.

ఆ మాటల్లోని ఆత్మస్త్థెర్యం కనిపెట్టిన యజమాని 'నీకీ ఉద్యోగం వస్తే ఎలా భావిస్తావు?' అనడిగాడు మళ్ళీ.

దానికా యువకుడు 'ప్రయత్నానికి తగిన ప్రతిఫలమని' అన్నాడు. ఆ మాటతో ఆ ఉద్యోగం అతడినే వరించింది.

కాబట్టి-
కో అతిభారః సమర్థానాం కిందూరం వ్యవసాయినామ్‌.
కోవిదేశః సవిద్యానాం కఃపరః ప్రియవాదినమ్‌!
సమర్థులకు మోయరానిది ఉండదు. ప్రయత్నశీలురకు పట్టుబడనిదంటూ ఉండదు. విద్యావంతులకు పరదేశమనే బాధ ఉండదు. మంచిగా మాట్లాడేవారికి శత్రువులుండరు.

No comments:

Post a Comment