మానవతా మహాపతాకం
'ప్రకృతిలో మానవుడే పరమాద్భుత పరాకాష్ఠ-' అంటూ మనిషి ఔన్నత్యానికి అక్షరాభిషేకం చేశాడు హరీన్ చట్టో. తన మనుగడను శాసించజూసే సవాళ్లను తిప్పికొడుతూ, ప్రతిబంధకాలను అధిగమిస్తూ- జీవన యవనికపై మనిషి నిత్యం ఆవిష్కరించవలసిన మనోజ్ఞదృశ్యం ఆ సార్వకాలీన సత్యమే.'కాలమా! నీకు బానిస కాను/నీవు ఎంత ఎదురొడ్డినను నేను ఎదుగగలను' అన్నంత ధీమా అడుగడుగునా సాక్షాత్కరించే మానవ జీవితం ఒక మహా సాహసికయాత్ర. కాలప్రవాహంలోని ఆటుపోట్లకు వెరవకుండా సంకల్పబలంతో కడవరకు సాగాల్సిన ప్రయాణమది. ఆ ప్రస్థానంలో- 'రానీ, రానీ, వస్తే రానీ! కష్టాల్, నష్టాల్... రాట్లూ, పాట్లూ రానీ రానీ' అన్న శ్రీశ్రీ మహితోక్తి మనిషి మీటే జీవన గానానికి పల్లవియైు రవళించాలి. కష్టాల్ని ధిక్కరిస్తూ, నష్టాల్ని వెక్కిరిస్తూ, విజయహాసం చిందిస్తూ- జీవనపథంలో గమ్యం వైపు నిర్నిరోధంగా పురోగమించేవారే కార్యసాధకులవుతారు. మొక్కవోని ధైర్యంతో, సడలిపోని స్త్థెర్యంతో ముందడుగు వేసే మనిషి- లక్ష్యం చేరుకోవడానికి ఏదీ అడ్డంకి కాదు, అంగవైకల్యంతో సహా! తునకలుగా ఉన్నా, మెలికలు తిరిగిన రూపంలో ఉన్నా బంగారం జిగి ఎప్పటికీ తగ్గనిదే. దాని విలువా ఎన్నటికీ తరగనిదే. అలాగే- శారీరకంగా అంగ వైకల్యమున్నా, జ్ఞానేంద్రియాల్లో లోపమున్నా మనిషి గుండె దిటవు, ఆత్మధృతి ఏనాటికీ చెక్కుచెదరనివే. సమున్నతమైన ఆ లక్షణాలే దిక్సూచిగా... 'బాధల్లో మునుగుతాను- సంతోషాల్లో ఉదయిస్తాను/నేను మానవ సూర్యుణ్ని'అన్న శేషేన్ వాక్కును సాకారం చేస్తున్నట్లు జీవన రస్తాపై పయనిస్తున్న ధీరత్వం అంగవికలురది!
మూగతనం, బధిరత్వం, అవిటితనం, అంధత్వం వంటి వైకల్యాలు మనిషి దేహానికే తప్ప, మనోధైర్యానికి ఉండవు. తెలుగు కవిత్వానికి గంధర్వగాన సొబగులద్దిన కృష్ణశాస్త్రి దాదాపు ఏడు పదుల వయసులో తన గొంతుక మూగవోయిన తరవాత కూడా 'ఐన నేమాయె- మూగవోయిన నా గళమ్మునను గూడ/ నిదురవోయిన సెలయేటి రొదలు గలవు'అనిపించేలా రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. శ్రవణేంద్రియాలు పనిచేయకపోతే మాత్రమేం, బధిరులు- ఎదుటివారి పెదవులపై కదలాడే మాటల్లోని మంత్రలిపిని చదివి, వారి మనసును అర్థం చేసుకోగలరు. పాశ్చాత్య సంగీతలోకంలో ధ్రువతార బీతోవెన్ బధిరుడు. తాను వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయినా- సంగీత సాధనను విడనాడకుండా, సమాజానికి సంగీత మధురిమలను పంచిపెట్టిన కళాకారుడతడు. తడబడుతూనే కాదు, ప్రయత్నబలంతో వడివడిగా అడుగులు వేయడానికీ అవిటితనం అడ్డుకాదు. పరుగు పందేలకు వికలాంగులూ 'సై' అనడం అందుకు ఓ నిదర్శనం. పోటీ మొదలైంది.... అవిటితనంతో లెక్కేమిటన్నట్లు పోలియోగ్రస్త పిల్లలు వూతకర్రల సాయంతో పరుగులాంటి నడకతో కదులుతుంటే మైదానంలో మిన్నుముట్టేలా హర్షధ్వానాల హోరు... పరుగు పందెంలో గెలుపురేఖకు ఒకేఒక్క అడుగు దూరంలో ఉన్న బాలుడు హఠాత్తుగా ఆగిపోయి వెనకడుగు వేశాడు. తనతో పాటు పోటీలో పాల్గొంటూ ఉన్నట్టుండి పడిపోయిన మరో బాలుడి వద్దకు చేరుకున్నాడు... అతణ్ని లేవనెత్తి మైదానం వెలుపలికి తీసుకెళ్లాడు... మిగిలిన పోటీదారులూ అతణ్ని అనుసరించారు... పందెంలో విజయం కాదు, కింద పడిపోయిన సాటి వికలాంగుడికి చేయూతనిచ్చి నిలబెట్టడమే ముఖ్యమని చాటిన పెద్దమనసు ఆ చిన్నపిల్లవాడిది. అందరిలోనూ మారాకు తొడగవలసింది- మానవత్వ పరిమళాల్ని వెదజల్లిన ఆ స్ఫూర్తే! ఫిడేలు నాయుడుగారుగా సుప్రసిద్ధులైన ద్వారం వెంకటస్వామి పాక్షికంగా అంధులు. అయితేనేం, కవి నారాయణబాబు అన్నట్లు- వాయులీనంమీద తన వేళ్ల విన్యాసంతో ఆయన 'నిశ్శబ్దపు నీలి నీలి అంచులనే మ్రోగించి' సంగీత వర్ణమయ జగత్తును రసజ్ఞుల కళ్లకు సాక్షాత్కరింపజేశారు.
ఏడాదిన్నర పసిపాపగా ఉన్నప్పుడే సోకిన వ్యాధి వల్ల అమెరికన్ మహిళ హెలెన్ కెల్లెర్ కంటి వెలుగులు ఆరిపోయాయి. వినికిడి శక్తినీ పూర్తిగా కోల్పోయిందామె. లోకమంతా చీకటైపోయిన ఆమె- మూడేమూడు రోజులు భగవంతుడు తనకు మళ్లీ చూపును ప్రసాదిస్తే, ఆ వెలుగుల్ని ఎలా ప్రసరింపజేయాలన్న వూహలకు రెక్కలు తొడిగింది. ఆ డెబ్భైరెండు గంటల్లో తొలుత- అప్పటివరకు తాను స్పర్శ సాయంతోనే గుర్తించిన బంధువుల్ని, నేస్తాల్ని, తనకు అన్నిటా చేయూతనిచ్చి జీవిత పాఠాలను నేర్పిన టీచర్ని చూడాలన్నది ఆమె ఆకాంక్ష. పొలాల్లో నడుస్తూ ప్రకృతి శోభను తిలకించాలని, అడవులు, కొండలు, నదులు, ద్వీపాలను వీక్షించాలని ఆమె అభిలాష. జనసమ్మర్దంతో కలకలలాడుతున్న న్యూయార్క్ నగర వీధుల్ని, పార్కుల్లో ఆడుతూపాడుతూ కేరింతలు కొడుతున్న చిన్నారుల్ని, శ్రమజీవన సౌందర్యాన్ని కళ్లకు కడుతూ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికుల్ని చూడాలని ఆమె కోరిక. ఈ లోకంలోని అందాలను చూడటానికి కనీసం మూడురోజులైనా దృష్టిభాగ్యం లభిస్తే చాలనుకున్న కెల్లెర్ ఆర్తి- కనుచూపు కరవైనవారందరిలోనూ ఉంటుంది. అటువంటివారి కంటివెలుగుపై కమ్ముకున్న కారుమబ్బుల్ని తొలగించి, వారికి శాశ్వతంగా చూపు ప్రసాదించేందుకు- తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి పలువురు ముందుకు వస్తుండటం శుభపరిణామం. ఆ మహత్కార్యంలో రంగారెడ్డి జిల్లాలోని దేవుని ఎర్రవెల్లి గ్రామం అందరికీ మార్గదర్శకమై నిలిచింది. ఆ పల్లె ప్రజలందరూ తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి సంసిద్ధత వ్యక్తంచేశారు. ఆ మేరకు తొలి విడతగా వెయ్యిమంది- తమ కళ్లను దానం చేయడానికి అంగీకారం తెలుపుతూ ఇటీవల వాగ్దాన పత్రాలపై సంతకాలు చేసి మానవీయవిలువల మహాపతాకాన్ని ఆవిష్కరించారు. బెడ్డ దెబ్బకు గాయపడి నీటిబొట్టు కదలాడితే, చెరువులోని నీరంతా చలించిపోయినట్లు- విధి చిన్నచూపు చూసిన సాటివారిని ఆదుకోవడానికి ఒక్కుమ్మడిగా తరలివచ్చిన ఊరు దేవుని ఎర్రవెల్లి దైవత్వానికి జేజేలు!
No comments:
Post a Comment