'తలనుండు విషము ఫణికిని... వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్' అంటూ వర్ణించాడు బద్దెన కవి. 'ఖలునకు నిలువెల్లా విషం... భద్రంసుమా' అని ఏనాడో హెచ్చరించాడు. ఆ పద్యం సంగతి తెలియని ఒక లేతతేలుబాల్యచాపల్యం కొద్దీ ఖలుణ్ని కుట్టేసి, తన ప్రాణంమీదకు తెచ్చుకున్న వైనం వివరించి నవ్వించారు ముళ్ళపూడి. నిలువెల్లా విషం నిండిన ఆడపిల్లల గురించి జానపద కథల్లో చెప్పారు. ఒక పథకం ప్రకారం పసిబిడ్డగా ఉన్నప్పుడేపాషాణం అనే ఒక రకమైన విషాన్ని తక్కువ మోతాదుల్లో అలవాటు చేస్తూ, రహస్యంగా పెంచుతారు. ఈడు వచ్చేసరికివారు విషకన్యలుగా తయారవుతారు. ఈ మధ్య మనకు తెలిసిన మానవబాంబు మాదిరిగా వారిని శత్రురాజులపైకి ప్రయోగించేవారు. వారిని ముద్దుపెట్టుకుంటే చాలు ప్రాణాలు గుటుక్కుమనేవి. రాజ్యతంత్రంలోని అనేకవ్యూహాల్లో అదొకటి.'ముద్రారాక్షసం'లో విశాఖదత్తుడు అలాంటి ఒక విషకన్యను చిత్రించాడు. రాక్షస మంత్రి తాను బాల్యం నుంచి సాకిన ఆ విషకన్యను చంద్రగుప్తుడిపైకి ప్రయోగించాడు. కంసుడి ఆజ్ఞ మేరకు తల్లి రూపంలో వచ్చి పూతన బాలకృష్ణుడిపై విష ప్రయోగానికి సిద్ధపడింది. తన చనుమొనలకు గరళాన్ని పూసి కృష్ణుడి నోటికి అందించింది. 'నా చనుబాలొక గ్రుక్కెడు ఓ చిన్నికుమార! త్రావుము' అని బలవంతం చేసింది. 'బాలెంతచందంబునన్ (ఆమె) పాలిండ్లన్ విషమూని వచ్చుట...' కృష్ణుడు ముందే పసిగట్టాడు. పాలు తాగే నెపంతో పూతనప్రాణాలను సైతం పీల్చేశాడు. స్త్రీత్వానికి, అమ్మదనానికి కళంకం తెచ్చిన ఆపయోముఖ విషకుంభాన్ని చూసికలవరపడ్డారు యశోదాదులు.
అమ్మ అనే పదానికి ఈ లోకం గొప్ప గౌరవాన్ని ఆపాదించింది. స్త్రీకి గౌరవ వాచకం ఇల్లాలు అనుకుంటే, ఇల్లాలికి గౌరవవాచకం తల్లి. నిప్పునకు చెదలంటవని సామెత. అమ్మదనానికి స్వార్థం తుప్పు పట్టదు. తాను ఆకలితో అలమటిస్తున్నాతన నిండు విస్తరిని తనవంటి మరొకడికి దానంచేయడంలో లభించే ఒకానొక అలౌకిక అనుభూతికి, అపురూపమైనసంతృప్తికి అచ్చమైన స్థావరం అమ్మ మనసు. దాన్నే కరిగించి స్తన్యంగా మార్చి బిడ్డ నోటికి అందిస్తుంది అమ్మ. అమ్మపాలకు అంతటి మాధుర్యం దక్కిందంటే- దానికి అమ్మ మనసే కారణం. స్వచ్ఛత విషయంలోను, పవిత్రతవిషయంలోను అమ్మపాలకు సాటి లేనేలేదు. కష్టాల గరళాన్ని తన కడుపులోనే జీర్ణించుకుని, స్తనాల్లోంచి అమృతజీవధారలను స్రవిస్తుంది అమ్మ. అలా జాలువారిన తల్లిపాలతోనే ప్రాణి జీవం నిలుపుకొంటుంది, బతికి బట్టకడుతుంది. 'అను' అనే పదానికి ఎడతెగని అని అర్థం. బిడ్డకు తల్లితో బలపడే అనుబంధానికి తల్లిపాలే జీవధార. అమృతం అనేసరికిదేవతలకైతే ఎన్నో అర్థాలు తోస్తాయిగాని, మనిషికి మాత్రం అమ్మ స్తన్యమే అమృతం! కొంతకాలంక్రితంపాలడబ్బాలమీద 'అమ్మపాలను మించినవి కావు' అనే ప్రకటన కనిపించేది. తల్లిపాల శ్రేష్ఠతకు యోగ్యతా పత్రాలు, హామీసంతకాలు అవసరంలేదు. బిడ్డ పుట్టిన కొద్దిగంటలకు బాలింత స్తనాల్లోంచి పచ్చని చిక్కని ద్రవాలు స్రవిస్తాయి. వైద్య పరిభాషలో వాటిని 'కొలొస్ట్రమ్' అంటారు. కొన్ని ప్రాంతాల్లో వాటినే 'ముర్రుపాలు' అని పిలుస్తారు. పౌష్టిక విలువల రీత్యా, రోగనిరోధక శక్తి విషయంలో అవి సర్వశ్రేష్ఠమైనవి. పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు వాటి ప్రభావం చురుగ్గా ఉంటుందంటే అవి ఎంత శక్తిమంతమైనవో మనం అర్థం చేసుకోవచ్చు.జున్నుపాల పౌష్టికవిలువలూ అంతటివే. సాదం అంటే అనుగ్రహం. తల్లిపాలనేవి ప్రకృతి ప్రసాదం. మాతృత్వం పేరిట ప్రకృతి ప్రసాదించే సహజవరాలే-అమ్మపాలు! అవి ఆరోగ్య పరిరక్షణ సాధనాలు, సంపూర్ణ రక్షణ కవచాలు.
వైదిక భావనల్లో అగ్నికి, దర్భకు అత్యంత ప్రాశస్త్యం లభించింది. పవిత్రత విషయంలో వాటికే అగ్రతాంబూలం. అగ్నిని అంటుతాకదు, దర్భకు మైల సోకదు. కాలుష్యం వాటి జోలికే రాదు. లోకం దృష్టిలో అమ్మపాలూ అంత పవిత్రమైనవే! శ్రేష్ఠతకు స్వచ్ఛతకు మారుపేరుగా చెప్పుకొనే అమ్మపాలలో విషం ప్రవేశించడం వూహించని పరిణామం. శీతల పానీయాల్లో విషం చేరిందంటే అర్థం ఉంది. తినే తిండీ, తాగేనీరూ విషమయం అవుతున్నాయంటే అవకాశం ఉంది. అమ్మపాలు ప్రాణాంతకాలు కావడం ఏమిటి విడ్డూరం కాకపోతే! కానీ అది నిజం! రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలోఅనూప్గఢ్ గ్రామంలో వెలుగుచూసిన పరిశోధన ఫలితాలవి. సేద్యమే అక్కడ ప్రధాన వృత్తి. కొన్నేళ్లుగా పురుగుమందుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పంటలను ఆశించే పురుగుల సంగతి అలా ఉంచి- ప్రజలు శ్వాసించే గాలితోసహా నీరు, తిండిగింజలు సమస్తం విషమయం అయిపోయాయి. ఆఖరికి తల్లిపాలు సైతం గరళంగా మారిపోవడం అత్యంత విషాదకర పరిణామం. ఆ పాలను తాగి పెరుగుతున్న పిల్లలుభయంకరమైన రోగాల పాలవుతున్నారని రాజస్థాన్ విశ్వవిద్యాలయానికి చెందిన జంతుశాస్త్ర పరిశోధకులు డాక్టర్ఇంద్రపాల్ సోనీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి నశించడమే కాదు- వారి తెలివితేటలను, జ్ఞాపకశక్తిని సైతం తల్లిపాలలోని విషప్రభావం తీవ్రంగా దెబ్బతీస్తోందంటున్నారు. పొలాల్లో పనిచేసుకునే మహిళలరక్తంలోను, స్తన్యంలోను పురుగుమందుల అవశేషాలను గమనించి దిగ్భ్రాంతికి లోనయ్యామని పరిశోధకులుచెబుతున్నారు. అమృతం చిలికే తమ పాలిండ్లలోంచి కాకోల విషం స్రవిస్తోందని తెలిసిన తల్లుల మానసిక దుర్భర వేదనను ఏ కవి వర్ణించగలడు? తల్లి స్తన్యంలో చేరి తరాలను కాటేస్తున్న అవశేష విషశేషు సంహరణకై ఏజనమేజయుడు మహాసర్పయాగాన్ని సంకల్పించగలడు? ప్చ్! అగ్నికి చెద సోకిందన్నా, దర్భకు అపవిత్రత తాకిందన్నానమ్మాల్సి వస్తోంది.
No comments:
Post a Comment