Sunday, October 18, 2009

పెళ్ళిపందిరిలో ప్రకటన!!

పెళ్ళిపందిరిలో వధువు కావలెను అనే ప్రకటనని ఎవరెవరు ఎలాఇచ్చారో ఒక్క లుక్ వేయండి:)...:)

డాక్టర్....కొద్దిరోజుల క్రితమే నాకు ప్రేమ అనే బాక్టీరియా సోకి పెళ్ళి అనే రోగానికి దారితీసింది. కావున అందమైన రోగిణులు మందు మాకు గురించి తెలిసిన వారు ముందుగా రిసెప్షన్ లో అపాయింట్మెంట్ తీసుకుని నన్ను సంప్రదించవలసిందిగా ప్రార్ధన. రోగనిర్ధారణ(అన్ని అభిప్రాయాలు కలిస్తే) జరిగిన పిమ్మట నేను ఒక మంచి వైద్యునిగా(భర్తగా) సేవలందిస్తానని వాగ్ధానం చేస్తున్నాను!!!

లాయరు(న్యాయవాది).... నేను భర్తగా ఆమోద యోగ్యతను పొంది, వివాహమాడ తలచినాను కావున అవివాహితల నుండి ధరఖాస్తులను కోరడమైనది. ఆమె తన పరిధిలో నాకు మనసావాచా అర్పితమవ్వాలి. ఎటువంటి అభ్యంతరమున్నా ఓవర్ రూల్డ్ కావించబడుతుంది, సస్టండ్ చేయబడదు!!!

బిక్షగాడు....అయ్యా దేవుని పేరుపై నాకు ఒక సహధర్మచారిణిని దానం చేయండి. వేరొకరి పత్ని కాకపోయినా మీపత్ని అయినా పర్వాలేదండి. మీరు ఒకళ్ళని దానం చేస్తే మీకు భగవంతుడు నలుగురిని ప్రసాదిస్తాడు. అయ్యా ఆలోచించక దానం చేయండి బాబయ్యా!!!

బ్యాంకర్....వధువు కావలెను, ఎవరైతే వారి ఆస్తిని జమా చేసి చక్రవడ్డీ లాంటి సేవలతో లాభాలని అందించగలరో అటువంటి అమ్మాయిల నుండి నెలలోపు ధరకాస్తులను కోరడమైనది. గడువు తరువాత అయినచో ఆలస్య రుసుముతో స్వయముగా సంప్రదించ గలరని ప్రార్ధన!!!

కవి....బహుకాలానికి నాకొక కోరిక కలిగినది,
పెళ్ళికై నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది,
ఇన్నాళ్ళు పెళ్ళితో నాకేమీ పనిలేదన్నది,
ఇప్పుడిక ఇంటపని బయటపని నాతో కాకున్నది.
అందుకే సరి అయిన జోడీ కొరకు వెతుకుతున్నది!!!

కారు మెకానిక్....పాతదైనా కొత్తమోడల్ గా కనబడే వధువు కావలెను. మంచి కండిషన్ లో ఉండి తక్కువ సొమ్ముతో ఎక్కువ హంగూ ఆర్భాటాలు చేయగలిగి, సంవత్సరంలో రెండు సర్వీసులు( సినిమాలు) మాత్రమే కోరుకునే 362436 మోడల్ వధువునకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బ్రోకర్లను వదలి పార్టీ డైరెక్టుగా సంప్రదించవలసిందిగా కోరుతున్నాము!!!

తాగుబోతు....నాకు పెళ్ళాం కావాలి. పిల్ల తండ్రికి తప్పక సోడా ఫ్యాక్టరీఉండి తీరాలి. నేను ప్రతిరోజూ కాకుండా వారానికి ఏడు రోజులు మాత్రమే తాగుతాను. ఇంటి వద్ద కాదంటే బార్ లో సరిపెట్టుకుంటాను. బార్ నుండి నన్ను ఇంటికి మోసుకెళ్ళే అమ్మాయిలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సోడాని సాంపుల్ గా పంపి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి!!!

గమనిక:- ఇప్పటి వరకు పై వ్యక్తుల ఆలోచనల మేరకు ప్రకటనలను ఇవ్వడం జరిగినది. ఎవరైనా ఆశక్తిగలగిన వారు తమకి తోచిన విధముగా ప్రకటనలు ఇవ్వదలచిన వ్యాఖ్యల రూపంలో ప్రకటించమని అభ్యర్ధన!!!

బ్లాగ్ మిత్రులారా! ఇది కేవలం హాయిగా నవ్వుకోవడానికి చేసిన చిరు చిలిపి ప్రయత్నమే కాని ఎవ్వరి మనసునీ నొప్పించాలని మాత్రం కాదని మనవి....

No comments:

Post a Comment