కాంతులు చిందించే సంక్రాంతి
Colourful Festival Sankranti
సంక్రాంతి... పేరులోనే ఉంది కాంతి. నిజంగా ఇది కాంతులొలికే పండుగ. సంబరాల పండుగ. వాకిట్లో రంగురంగుల రంగవల్లికలు, ఆకాశంలో అంతకంటే అందమైన గాలిపటాలతో మహా శోభాయమానమైన పండుగిది. ఇది ఒకరోజు పండుగ కాదు. నెలరోజులపాటు సంబరాలు చేసుకునే వైభవం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకసారి Colourful Festival Sankranti విశేషాలు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో మేషం, వృషభం - ఇలా పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు ఒక్కో నెలలొ ఒక్కో రాశిలొ ప్రవేశిస్తాడు. సూర్యుడు మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అది మేష సంక్రమణం. అలా ఏ రాశిలొ సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలొ ప్రవిసించింది మొదలు మకరరాశిలొ ప్రవేశించడంవరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటివరకూ దక్షిణాయనంలొ సంచరిస్తోన్న సూర్యుడు ఉత్తరాయణంలొ ప్రవేశించిన పుణ్యదినం కూడా ఇది.
మకర సంక్రాంతికి ముందురోజు ''భోగి''. భోగి అంటే గోదాదేవి, శ్రీరంగనాథుని సేవించి కల్యాణ భోగం అనుభవించిన రోజు. మకర సంక్రాంతిలాగే భోగి కూడా పెద్ద పండుగే. ఆవేళ ఉదయాన్నే లేచి ''భోగిమంటలు'' వేస్తారు. భోగిమంటల్లో సూక్ష్మక్రిములను నశింపచేసే పిడకలు, విరిగిపోయి ఇళ్ళలో అడ్డంగా అనిపించే చెక్క సామాను, ఔషధప్రాయమైన వేప తదితర కలపతో వేస్తారు. ఇవి కేవలం చలి కాచుకోదానికే గాక ఆరోగ్యరీత్యా మంచిది. క్రిమికీటకాలు నశిస్తాయి. వాతావరణ కాలుష్యం పోతుంది.
అభ్యంగన స్నానం, కొత్తబట్టలు, పూజలు, పిండి వంటలు, బంధుమిత్రుల సమాగమం లాంటి కార్యక్రమాలతో ఇల్లిల్లూ సందడిగా, సంతోషంగా కనిపిస్తుంది. చిన్నారులున్న ఇళ్ళలో రేగిపళ్ళలో పప్పుబెల్లాలు, పూవులు, డబ్బులు జోడించి ''భోగిపళ్లు'' పోస్తారు. రేగిపళ్ళు సూర్యునికి ప్రీతికరమైనవి. పిల్లల తలపై భోగిపళ్లు పోయడంవల్ల సూర్యుని ఆశీస్సు లభిస్తుంది.
భోగిపళ్లు అంటే రేగిపళ్ళే. బదరీఫలం అనే పదం నుండి భోగిపండు వచ్చింది. బదరికావనంలో నరనారాయణులు తపస్సు ఆచరించే సమయంలో బదరీ ఫలాలను తిన్నారట. అందుకే భోగిపళ్లు పోయడమంటే నరనారాయణుల ఆశీస్సులు పండడం. రేగిపళ్ళు ఆరోగ్యరీత్యా కూడా చాలా మేలు చేస్తాయి. వాటిని శరీరం మీద పోయడంవల్ల అనారోగ్యాలు నయమౌతాయి. ఇవి తింటే దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఉదర సంబంధ జబ్బులు కుదురుతాయి. ఆహారం చక్కగా జీర్ణమౌతుంది. భోగిపళ్ల వేడుక ముగిసిన తర్వాత ఈ పళ్ళను కూడా పంచిపెడతారు. అవి తిని ఆరోగ్యంగా ఉండాలనేది పరమార్థం.
ఇక మకర సంక్రాంతి మరుసటిరోజు కనుమ. ఇది రైతులకు ముఖ్యమైన పండుగ. వ్యవసాయ కుటుంబాల్లో తెల్లవారుజామున లేచి పనులు మొదలుపెడతారు. పాడి పశువులను కడిగి, కుంకుమ, పూసల గొలుసులు, మువ్వలు, పట్టెడలతో అలంకరిస్తారు. నెల పొడుగునా వాకిళ్ళలో పెట్టిన గొబ్బెమ్మలను పొయ్యికింద పెట్టి పాయసం చేసి మొదట సూర్యునికి, ఆపైన దేవుడి మందిరంలో, తర్వాత పశువుల కొట్టంలో నైవేద్యం పెడతారు. పొలంలో, పశువులశాలలో గుమ్మడికాయ పగలగొట్టి దిష్టి తీస్తారు. గంగానమ్మ, పోలేరమ్మ లాంటి గ్రామదేవతలకు గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.
సంక్రాంతి నెల మహా సందడిగా ఉంటుంది. ఒణికించే చలిలో కూడా అర్ధరాత్రివరకూ మెలకువగా ఉండి వాకిళ్ళలో కళ్ళాపి జల్లి, రంగవల్లులు తీర్చిదిద్దుతుంటారు. లేదా తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేస్తారు. అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తారు. పుణ్య నదుల్లో స్నానం చేస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి, జ్ఞాననేత్రం తెరచుకుంటుంది. నదిలో మునిగి, సూర్యునికి అర్ఘ్యం వదులుతారు. మకర రాశిలో ప్రవేశించిన సూర్యునికి నమస్కరిస్తారు. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు.
ఇళ్ళముందు సంక్రాంతి ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, పూలు, పసుపుకుంకుమలు జల్లి వాకిళ్ళను కళాత్మకంగా రూపొందిస్తారు. గుమ్మాలు మావిడాకులు, బంతిపూల తోరణాలతో అలరారుతూ అందాలు చిందిస్తాయి. గ్రామాల్లో అప్పుడే కోతలు ముగిసి ధాన్యం ఇంటికి రాగా, ఏడాది అంతా చేసిన శ్రమ మాయమై కొత్త ఉత్సాహం ముఖాల్లో వెల్లివిరుస్తుంది.
సంక్రాంతి సందర్భంగా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు. తిరుప్పావై పాశురాలను చదువుతారు లేదా వింటారు. వేద మంత్రాలను పఠిస్తారు. యాగాలు నిర్వహిస్తారు. ఇక హరిదాసులు, పులి వేషగాళ్ళు, గంగిరెద్దుల సందడి, గాలిపటాల ఆటల గురించి చెప్పనవసరమే లేదు. చూస్తుండగానే పండుగ వచ్చేస్తుంది. కొత్త బియ్యంతో అరిసెలు, పాలతాలలికలు చేసి దేవునికి నివేదిస్తారు. పేదసాదలకు దానధర్మాలు చేస్తారు. సాయంత్రంపూట బొమ్మలకొలువు ఏర్పాటు చేస్తారు.
ఇతర రాష్ట్రాల్లో సంక్రాంతి
Sankranti Festival Celebrations
సంక్రాంతి కేవలం మన రాష్ట్రంలోనే కాదు తెలుగువాళ్ళు ఎక్కడుంటే అక్కడ మకర సంక్రాంతి మహా ఘనంగా జరుగుతుంది. ప్రవాసాంధ్రులు తెలుగుతనాన్ని మర్చిపోకుండా వీలైనంతవరకూ పండుగ సంప్రదాయాలేవీలోపించకుండా కళకళలాడేలా వైభవోపేతంగా జరుపుకోవడం మనకు తెలిసిందే. మరో సంగతి ఏమంటే మకరసంక్రాంతి తెలుగువారి పండుగ మాత్రమే కాదు. కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా వివిధరాష్ట్రాలవాళ్ళు ఈ పండుగ జరుపుకుంటారు.
తమిళులు నాలుగు రోజులపాటు సంక్రాంతి పండుగ వేడుక చేసుకుంటారు. మొదటిరోజును ''తై'' నాడు సూర్యుని, వానదేవుని ప్రార్థిస్తారు. రెండోరోజు ''పొంగల్'', మూడోరోజు''మత్తు పొంగల్'', నాలుగోరోజు ''తిరువళ్ళువర్''. వీటిని మనం వరుసగా భోగి, పండుగ, కనుమ, ముక్కనుమ అంటాం.
బెంగాలీలకు సంక్రాంతి గొప్ప పండుగ. అత్యుత్సాహంతో వేడుక చేసుకుంటారు.
ఉత్తరప్రదేశ్ లో సంక్రాంతిని ''ఖిచ్రి'' అంటారు. గంగా, యమునా, సరస్వతి సంగమ తీరంలో నదీ స్నానం చేస్తారు. గంగా తీరంలో పెద్ద ఎత్తున భోగిమంటల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
పంజాబులో భోగి పండుగను ''లోహ్రి'' అని, సంక్రాంతిని ''మఘీ'' అని అంటారు. ఈ పండుగ మహోత్సవం సందర్భంగా భాంగ్రా నృత్యం చేస్తారు.
మధ్యప్రదేశ్ లో సంక్రాంతిని ''సుకరాత్'' పేరుతో ఆనందంగా జరుపుకుంటారు.
మహారాష్ట్రలో సంక్రాంతి సందర్భంగా నువ్వులతో పిండివంటలు తయారుచేస్తారు.
సంక్రాంతి ప్రత్యేక పిండివంటలు
Sankranti Festival Recipes
పాలతాలికలు
కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి - అరకిలో
బెల్లం - అరకిలో
పాలు - ఒక లీటరు
జీడిపప్పు , కిస్మిస్ - వంద గ్రాములు
యాలుకల పొడి - తగినంత
తయారుచేసే పద్ధతి
బియ్యాన్ని నానబెట్టి దంచిన పిండిని జల్లించి తగినన్ని నీళ్ళు పోసి బాగా కలపాలి. బెల్లాన్ని సన్నగా తరిగి ఉంచాలి. జీడిపప్పు, కిస్మిస్ లను నేతిలో వేయించి ఉంచుకోవాలి. పాలను కాచి అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత బియ్యప్పిండిని కారప్పూస గిద్దల్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా వత్తాలి. గడ్డ కట్టకుండా మెల్లగా తిప్పుతూ తరిగిన బెల్లం వేసి కలయతిప్పాలి. చివరికి మిగిలిన బియ్యప్పిండిని కూడా వేసి కలపాలి. పచ్చితనం పోయి చక్కగా ఉడికింది అనుకున్నాక ఇలాచీ, కిస్మిస్, జీడిపప్పు వేసి దించితే సరిపోతుంది.
అరిసెలు
కావలసిన పదార్థాలు
బియ్యం - కిలో
బెల్లం - ముప్పావు కిలో
నూనె - అరకిలో
నువ్వులు - వంద గ్రాములు
తయారుచేసే పద్ధతి
బియ్యం ఒకపూట ముందు నానబెట్టి ఎందపోయాలి. ఆ బియ్యాన్ని దంచి జల్లెడ పట్టాలి. బెల్లం తరిగి సుమారుగా కప్పుడు నీరు పోసి పాకం పట్టాలి. బెల్లంలో సన్నటి రజను లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది కనుక పాకం పల్చగా ఉండగా వడకట్టాలి. తర్వాత మరోసారి స్టవ్ మీద పెట్టి ముదురు పాకం రానివ్వాలి. అందులో బియ్యప్పిండివేసి ఉండ కట్టకుండా తిప్పాలి. తర్వాత దింపి, చల్లారిన పిండితో చిన్న ఉండలు చేసి బాదం ఆకు లేదా పాలిథిన్ కవరు మీద వేసి సన్నగా వత్తి నువ్వులను జల్లి, అరచేత్తో అద్ది బాణలిలో వేసి వేయించాలి. కాలిన అరిసెలను రెండు అపకల సాయంతో బాగా వత్తి, నూనె కారిపోయేటట్లు చేసి తీయాలి. తడి లేని డబ్బాలో భద్రపరచుకోవాలి.
కొబ్బరి వడలు
కావలసిన పదార్ధాలు
కొబ్బరికాయ – 1
బియ్యం – పావుకిలో
నూనె – పావుకిలో
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి - 6
కొత్తిమీర – 1 కట్ట
జీలకర్ర – 1 టీ స్పూను
వంట సోడా – చిటికెడు
కరివేపాకు – 2 రెబ్బలు
ఉప్పు - తగినంత
తయారు చేసే పద్ధతి
కొబ్బరిని తురమాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. బియ్యం కడిగి నానబెట్టాలి. నీళ్ళు ఓడ్చి, కొబ్బరి తురుము కలిపి రుబ్బుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి నూరి కలపాలి. వంటసోడా, ఉప్పు, తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. బాణలిలో నూనె కాగనిచ్చి కలిపి ఉంచుకున్న పిండిని వడల్లా వత్తి ఎర్రగా వేయించుకోవాలి. కొబ్బరి వడలు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి.
చెక్క గారెలు
కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి - 4 పావులు
శనగపప్పు - అర్ధపావు
నూనె - కిలో
వెన్న – కప్పుడు
పచ్చిమిర్చి - వంద గ్రాములు
కరివేపాకు - పది రెబ్బలు
అల్లంవెల్లుల్లి పేస్టు - కొద్దిగా
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి
శనగపప్పును కడిగి ఒక గంటసేపు నానబెట్టి పక్కన ఉంచాలి. బియ్యప్పిండిలో శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న, ఉప్పు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినన్ని నీళ్ళు వేసి బాగా కలపాలి. అరటి ఆకు లేదా పాలిథిన్ కవరు మీద కొద్దిగా నూనె రాసి, పిండిని సన్నటి గారెలుగా చేసి వేయించుకోవాలి. ఈ చెక్కగారెలు పదిరోజులు నిలవుంటాయి.
రవ్వ పులిహోర
కావలసిన పదార్ధాలు
రవ్వ – అరకిలో
నూనె - ముప్పావు కిలో
చింతపండు - వంద గ్రాములు
శనగపప్పు - చారెడు
మినప్పప్పు - చారెడు
పల్లీలు - అర కప్పుడు
పచ్చిమిర్చి - పది
ఎండుమిర్చి - పది
కరివేపాకు - నాలుగు రెబ్బలు
పసుపు - కొద్దిగా
ఆవాలు - తగినన్ని
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి
చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకోవాలి. ఒక పాత్రలో సుమారుగా ఒక లీటరు నీళ్ళు పోసి మరిగిన తర్వాత అందులో రవ్వ వేసి పొడిపొడిగా ఉడికించి దించాలి. పైన రెండు గరిటెల నూనె పోసి మూత పెట్టాలి. కొంతసేపటి తర్వాత మూత తీసి బాల్చీలోకి తీయాలి. ఎంతమాత్రం ఉండలు కట్టకుండా చేత్తో చిదిమి పసుపు, ఉప్పు కలపాలి. మూకుట్లో నూనె పోసి తాలింపు దినుసులు వేసి వేగిన తర్వాత రవ్వ ముద్ద వేసి, చింతపండు గుజ్జు కూడా వేసి కలయతిప్పి కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి, దించితే సరిపోతుంది
No comments:
Post a Comment