Auspicious Mukkoti Ekadasi
పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. సహజంగానే ఏకాదశి తిథి ఎంతో ఉత్తమమైంది. ఇక వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైంది. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి.
విష్ణుమూర్తి ముర అనే రాక్షసుని సంహరించి, ఇంద్రాది దేవతలను ఆనందింపచేసిన రోజిది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు దేవుని దర్శించుకుని, ఉపవాసం ఉన్నవారికి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.
వైకుంఠ ఏకాదశినాడు చేసే దైవారాధన మూడు కోట్ల దేవతలకూ చెందుతుంది. ఈ విశిష్ట దినాన చేసే పూజతో మూడు కోట్ల దేవతలూ ప్రసన్నం అవుతారు. కనుక ఈరోజు విధిగా ఆలయానికి వెళ్తారు. భక్తిగా దేవుని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఉపవాసం ఉండి, పాలు, ఫలాలు మాత్రమే సేవిస్తారు. ముక్కోటి ఏకాదశినాడు దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడతాయి. ఇక వైష్ణవ దేవాలయాల సంగతి చెప్పనవసరం లేదు. కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలలో ముక్కోటి ఏకాదశి మహా వైభవోపేతంగా జరుగుతుంది.
ముక్కోటి ఏకాదశినాడు భక్తులు ముఖ్యంగా వైష్ణవులు ''విష్ణు సహస్రనామం''తో మొదలుపెట్టి స్వామివారికి అర్చనలు, పూజా కార్యక్రమాలు చేస్తారు. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పురాణ శ్రవణాలు, ధార్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తారు. ఈ పుణ్య తిథినాడు యజ్ఞయాగాదులు జరిపితే మంచిది కనుక కొందరు యజ్ఞాలకు పూనుకుంటారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునే భక్తులు ఇతర దినాల్లో కంటే, ముక్కోటి ఏకాదశి లాంటి విశేష పర్వదినాల్లో తిరుమల వెళ్ళడం మరింత శ్రేష్ఠమని నమ్మి, ఆ వేళ్టికి అక్కడ ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. నిజానికి రద్దీ విపరీతంగా ఉండటంవల్ల వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా లక్ష్యపెట్టకుండా వెళ్తారు.
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి నాడు చనిపోయిన వారు తిన్నగా వైకుంఠానికి వెళ్తారని, మోక్షం పొందుతారని పూరాణాలు చెప్తున్నాయి.
No comments:
Post a Comment