Monday, December 5, 2011

భగవద్గీత పుట్టినరోజు Gita Jayanti or Mokshada Ekadashi



గీతా జయంతి అంటే భగవద్గీత పుట్టినరోజు. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజు భగవద్గీత జయంతిఉత్సవం జరుపుతారు. మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన హితోపదేశమే భగవద్గీత. గీతా జయంతిని ''మోక్షదా ఏకాదశి'' అని కూడా పిలుస్తారు.

కురుక్షేత్రం జరిగి ఆరువేల సంవత్సరాలు గడిచాయి. అంతే భగవద్గీతకు ఆరువేల సంవత్సరాలన్నమాట. హిందువులకు భగవద్గీత వేదంతో సమానం. అందుకే ఎందరో భక్తులు గీతా పారాయణం చేస్తారు. గీతా సారాంశం కనుక బోధపడితే ఇక సంసార సాగరంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీటినీ అవలీలగా ఎదుర్కోగల్గుతారు.

''అర్జునా! చేసేది నువ్వే అయినా చేయించేది నేను..'' అంటూ మొదలుపెట్టి అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పిన హితోక్తులు, ఆనాటికీ, ఈనాటికీ కూడా జీవనసత్యాలే. నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో మనకు ఎదురయ్యే క్లిష్ట సమస్యలు అన్నిటికీ భగవద్గీతలో సమాధానాలు దొరుకుతాయి. మనసులో చెలరేగే కల్లోలాలు, అయోమయంగా, అగమ్యగోచరంగా తోచే సంక్లిష్ట పరిస్థితుల్ని కూడా గీతా సారంతో సమన్వయ పరచుకోగలం. అలజడులు, ఆందోళనలను శాంతింపచేసుకోగలం.

ఇంత అద్భుతమైనది, అపురూపమైనది కనుకనే భగవద్గీతను అందరూ దైవంతో సమానంగా కొలుస్తారు. గీతా శ్లోకాలను కంఠస్తం చేస్తారు. నేర్చుకోలేనివారు కనీసం విని ఆనందిస్తారు. ఆఖరికి న్యాయస్థానంలో కూడా భగవద్గీతమీదే ప్రమాణం చేయించుకుంటారు.

అసలు భగవద్గీత ఎలా పుట్టింది అంటే -
కురుక్షేత్రంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలు, గురువులు యుద్ధభూమిలో ఉండగా అర్జునునికి అయోమయంగా అనిపించింది. ఏరుల్లా పారుతున్న రక్తం, క్షతగాత్రులైన, వీర మరణం చెందిన సేనల్ని చూస్తోంటే మతి పోయింది. అంత దయనీయమైన పరిస్థితికి దారితీసే రణరంగం అంటే ఏహ్యత కలిగింది. తాను యుద్ధం చేయాలా, ఎందుకు చేయాలి - లాంటి ప్రశ్నలు దహించాయి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన హితబోధయే భగవద్గీత. ''చేసే పనిమీదే తప్ప, ఫలితం గురించి ఆలోచించవద్దు'', ''చావు అంటే ఆత్మ దుస్తుల్లాంటి ఒక శరీరాన్ని విడిచి మరో శరీరంలో చేరడమే'' లాంటి ఆ ఉపదేశం ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతుంది. జీవిత సత్యాలను, కఠోర వాస్తవాలను తేటతెల్లం చేసి చెప్పినట్లుగా ఉంటాయా శ్లోకాలు.

దైవానికి ప్రతిరూపంగా భావించే భగవద్గీత భారతీయులకు పరమ పవిత్ర గ్రంధం. అందుకే దేశం నలుమూలలా ''గీతా జయంతి''ని ఉత్సవం జరుపుతారు. భగవద్గీత పుట్టినరోజు అయిన మోక్షదా జయంతి నాడు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, కృష్ణ పూజ చేస్తారు. రమ్యమైన భగవద్గీత శ్లోకాలను విని తరిస్తారు. దేవాలయాల్లో దైవ సమానమైన భగవద్గీత శ్లోకాలను తాత్పర్య సహితంగా చెప్తారు. ముక్తకంఠంతో గీతా పారాయణం చేస్తారు. కొందరు కురుక్షేత్ర ఘట్టాలను, భగవద్గీత శ్లోకాలను నృత్య రూపకాలుగా, నాటికలుగా రూపొందించి ప్రదర్శిస్తారు. భక్తులు పాటలు, భజనలతో సత్ కాలక్షేపం చేస్తారు. భగవద్గీతలోని మహా సూక్తులను పదేపదే మననం చేస్తారు. మర్నాడు ద్వాదశి రోజున ప్రసాదం సేవించి ఉపవాసానికి స్వస్తి చెప్తారు.

భగవద్గీత సారాన్ని వంటబట్టించుకున్నవారు జీవితంలో ఎన్నడూ బాధపడరు. విషాదంలో మునిగితేలరు. అసలు వత్తిడికే గురవ్వరు. ఎంత క్లిష్ట పరిస్థితినైనా ఇట్టే ఎదుర్కోగల్గుతారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇంత స్థైర్యాన్ని అందించిన భగవద్గీత ప్రత్యక్ష దైవమే కదా!

No comments:

Post a Comment