సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించడాన్ని ధనుర్ సంక్రమణ అంటారు. ఈ డిసెంబర్ 16న ధనుర్మాసం మొదలై జనవరి 14, 2012న ముగుస్తుంది. ధనుర్ సంక్రమణను వాడుకలో ''నెల పట్టడం'' అంటారు. హిందువులకు.. అందునా వైష్ణవులకు ధనుర్మాసం పరమ పవిత్రమైంది.మన తెలుగువాళ్ళే కాకుండా కన్నడీగులు, తమిళులు కూడా ధనుర్మాసాన్ని గుర్తించి, ఆయా ఆచారాలను పాటిస్తారు.
వైష్ణవులకు ధనుర్మాసం నెల మహా పవిత్రమైంది. ప్రతిరోజూ ఒక పర్వదినమే. విష్ణుమూర్తిని, ఆండాళ్ మాతను ఆరాధిస్తారు. తిరుప్పావై పఠిస్తారు. ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని చెప్తున్నాయి పురాణాలు. అందుకే భూలోక వైకుంఠంగా భావించే తిరుమలను ఈ నెలలో దర్శించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ధనుర్మాసంలో చేసే పూజలతో వైకుంఠవాసుడు ఇట్టే ప్రసన్నుడౌతాడు. విష్ణుమూర్తిని, ఆయన ప్రతిరూపమైన శ్రీ వేంకటేశ్వరుని ధనుర్మాస విశేష దినాల్లో ప్రత్యేకంగా ఆరాధించాలి.
ధనుర్మాసం ఆరంభంతోనే సంక్రాంతి పండుగ సంబరం మొదలవుతుంది. వాకిట్లో రంగవల్లికలు తీర్చిదిద్దుతారు. గొబ్బెమ్మలను పెట్టి పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. హరిదాసులు, గంగిరెద్దుల హడావిడి సరేసరి.
ధనుర్మాసంలో ''వైకుంఠ ఏకాదశి'', ''భోగి'' విశేష పర్వదినాలు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం జరుపుతారు.
ధనుర్మాసం రోజుల్లో తిరుమలలో గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు.
శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవం మహా ఘనంగా జరుగుతుంది.
తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్ని ''పావై నొంబు'' అంటారు.
No comments:
Post a Comment