Monday, August 5, 2013

దాన బ్రహ్మ

దాన బ్రహ్మ

గాలీ నేలా నీరూ నిప్పూ ఆకాశాలమయమీ విశ్వం. ఇక్కడ ఈ భూతలాన అనంతకోటి ప్రాణుల్లోని మనిషొక అద్భుతమైతే, ఆ మనసు ఓ పరమాద్భుత సృష్టి. గరికపాటి కవికి కనిపించినట్టు'సృష్టి జడమ్ము, పూర్ణమగు చేతన నుండి సముద్భవించె, ఈ/ సృష్టి పునర్విలీనమగు చేతనలో, పరిణామశీలమై/ వ్యష్టిగ రూపుదాల్చునొక వైద్యుత పుంజము మేలుకొల్పెనీ సృష్టిని'. పర్యవసానంగానే మనిషీ మనసూ ఈ ప్రపంచమంతా. సమస్త సృష్టి పరిణామక్రమంలోనూ ఒక్క మానవప్రాణికి మాత్రమే అనుబంధాలు, అనుభూతులు, బలాలు, బలహీనతలు. 'నిన్న నిన్నే, నేడు నేడే, రేపు రేపే' అన్నట్టు సాగే గమనంలో ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే లెక్కలేనన్ని మార్పులు, చేర్పులు, కూర్పులు, నేర్పులు! మెలమెల్లని పిల్లగాలులే కాదు, ప్రళయ ఝంఝా ప్రభంజనాలూ వీస్తాయిక్కడ. నవ జీవనానంద మందిరాలకు పునాదులతో పాటు, నింగికీ నేలకూ మధ్య అడ్డుగోడలూ లేస్తాయిక్కడ. సెలయేటి గలగలలతో పాటే, మహోగ్ర రూపమెత్తి ఒక్కసారిగా ముంచెత్తే జలఘోషలూ ఇక్కడ వినిపిస్తాయి. కొండంత వెలుగునిచ్చే గోరంతదీపాలే కాక,దాశరథి భావనలా 'కొండలు కొండలే అడవికోనల భగ్గున మండిపోవ/గుండెలు గుండెలే అరుణగోళములై ప్రళయాగ్నిమాలలై పోవ' అగ్నిధారలు కూడా ఇక్కడే కనిపిస్తాయి. తళుకులూ మెరుపులే కాదు- ఎరుపులు, ఉరుములు సైతం దడదడలాడిస్తాయి ఆకాశాన్ని. అంతలా ఆశనిరాశలు, సుఖదుఃఖాలు వెంబడిస్తుంటే ఆధునిక కవిహృదయంలా 'జననం సుప్రభాతం, మరణం సాయం సంధ్యారాగం, ఆ రెండింటి నడుమ ఉన్నదే జీవితం' అని ప్రతి ఒక్కరికీ అనిపించక మానదు.




 

లోకంలో అన్నింటికంటే సముదాత్తం, ఉత్తమోత్తమం మానవ జీవితమే. దాన దయాగుణాల కారణంగానే దానికి సార్థకత, ధన్యత. 'ఫలములనిచ్చును వృక్షము/ సలిలములిచ్చును నదులును చక్కగ నెపుడున్/ ఫలితము కోరక జనులకు/ కలకాలము మేలొనర్తురు గద సాధుజనుల్' అన్న సంప్రదాయ కవి మనోగతమూ అదే. తోటివారికి సూర్యచంద్రుల్లా కళాకాంతీ ప్రసాదించే మనిషే మనిషని రుగ్వేదమంటే, దానమే సకల గుణసంపన్నమన్నాయి ఉపనిషత్తులు. అభయదానం ఆదర్శప్రాయమని భగవద్గీత బోధిస్తే, దానం చేయాలన్న సద్బుద్ధే అన్నివిధాలా వృద్ధిదాయకమంది మహాభారతం. తాళ్లపాక తిమ్మక్క చెప్పినట్టు 'ధర్మమేదియు ప్రాణదానముతోను తులతూగదు'. కవి తిమ్మయ చాటినట్టు 'ప్రాణదానము సేయ బహు పుణ్యమిచ్చు'. మహా ఫలప్రదానంగా తిక్కన, సర్వ ప్రీతికరంగా నన్నయ ప్రస్తుతించిన దానశక్తికి ప్రతీకలుగా ఎందరు లేరు? అన్న, ధన, విద్య, వస్త్ర, భూదానాదులు అనేకమున్నా- పరహితమే పరమార్థ సాధనకు పునాది అని భావించి చేసే అవయవ దానాలే అమృత గుళికలు. ప్రతి మనిషీ తన కోసమేకాక ఇతరుల మేలు కోసమూ తపిస్తే, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలన్న ఆర్తికి క్రియారూపమిస్తే, సినారె అన్నట్టు- 'అవధి లేని అనుభూతి' అది. కళ్లు, గుండె భాగాలు, మూత్రపిండాలు, వూపిరితిత్తులు, కాలేయం... శరీరంలోని ఏ భాగాన్నయినా తన మరణానంతరం ఇతర అవసరార్థులకు ఇవ్వాలన్న సంకల్పమే మనిషి జన్మకు అమరత్వ సిద్ధినిస్తుంది. మృతశరీర అవయవాల మార్పిడి అంటే మరొకరికి ప్రాణంపోయడం. మనిషే అద్భుత సృష్టి అనుకుంటే, ప్రతిసృష్టికీ ఆ వ్యక్తే మూలం కావడం ఎంత ఘనాఘనం! లయానంతరం ఆ ప్రాణి మరో ప్రాణికి ప్రాణమివ్వడం ఎంతెంత పరమాద్భుత దానం! శిబి, బలి, దధీచి, కర్ణుడు, రంతిదేవుడు వంటి ధర్మనిరతులు, దానశీలురు, యశోధనులు పుట్టిన భరతసీమ మనది. సాటిలేని ఆ సత్యసంధత తరతరాలకీ చెదరనిది, దీటురాని ఆ భారతీయత సకల మానవాళికీ పరంపరానుగత వరసిద్ధి. కవి స్వరం పలికినట్టు 'నిరంతర సౌరభాలొలికే గులాబీపువ్వు' దాత జీవనం. 'రమణీయ ఫాలసీమ భాసిల్లే లేతనవ్వు' ఆ భావనం.

ఎంత నిండుగా పారే ఏరైనా, తన నీటిని తానే తాగదు.ముందు వెనకా చుట్టుపక్కలా ఉన్న అన్నింటినీ చూసే కన్ను, తన ఉనికిని తాను చూడదు.ఆ తీరులోనే, ఇతరులు హాయిగా బతకాలన్న ఆర్ద్రత కలిగిన మనిషి 'నేనూ- నాదీ' అన్న స్వార్థధోరణితో ముడుచుకుపోయి బతకలేడు. లోకానఎవరికైనా జననం, మరణం, గమనం, గమ్యం ఒకటే. ఆకులు రాలిన చోట కొత్తచిగురును కోరే మది మాత్రమే నరసింహకవివాక్కులా 'ఉన్న వనరులన్ని ఉపయోగముననున్న/ చిత్తశుద్ధి పనులు చేయుచున్న/వెనుకనున్న ఘనత కునుకు తీయకయున్న/ ప్రగతి కురియు హర్షవర్షమట్లు'స్థితిని సొంతం చేసుకుంటుంది. ఆపద్బంధువులా ఆదుకునేందుకు ముందుకొచ్చిన మంచి మనసును చూసి చెమ్మగిల్లని కళ్లుంటాయా? ప్రార్థించే పెదవులకన్నా సేవచేసే చేతులు ఎంత మిన్నో గ్రహించిన ఆ కృతజ్ఞతకు నోట మాటలంటూ వస్తాయా? 

అవయవాల దానం మరికొన్ని జీవితాల్ని వెలుగులమయం చేసిన సందర్భాలకు ఈమధ్య భాగ్యనగరమే వేదికగా భాసించింది. వైద్యశాలలో మృత్యుముఖాన ఉన్న ఒక వ్యక్తినుంచి అవయవాల్ని జీవనదానమిచ్చేందుకు ముందుకొచ్చారా కుటుంబీకులు. ఫలితంగా అతడి మరణం తదుపరి, ఏడుగురికి ప్రాణప్రదానం సంభవమైంది. మరో వ్యక్తీ అదే స్థితిలో మరణించి, తన అనంతరం ఐదుగురికి జీవితాన్ని పంచారు.అదంతా 'స్వస్థ సమాజ' సాధన దిశగా మానవత సగర్వంగా ఎగరేసిన నవ పతాక. మానవుల పరిపూర్ణ వికాసానికి కీలకం ఆరోగ్యమంది చరక సంహిత. అన్ని సంపదలకీ తలమానికం ఆరోగ్యభాగ్యమేనని చాటిచెప్పింది బుద్ధచరిత. ఆ వైభవమంతటినీలేనివారికి పంచిపెట్టే 'దానబ్రహ్మ' మనిషే కావడం అనంత మాననీయం, అత్యంత మహనీయం.

No comments:

Post a Comment