Tuesday, February 14, 2012

ప్రేమ.. ప్రేమ.. ప్రేమ... ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..


 


ప్రేమికుల రోజు అనేది పూర్వం లేకపోవచ్చు. కానీ ప్రేమ మాత్రం ఇవాళ్టిది కాదు. మనిషి మనుగడ మొదలైన దగ్గర్నించీ ప్రేమ ఉంది. సృష్టి అంతమయ్యేదాకా ప్రేమ ఉంటుంది. ప్రేమ అనంతం, అజరామరం. యువతీయువకులు పరస్పరం ఇష్టపడి, ఒకర్ని విడిచి వేరొకరు ఉండలేమని గ్రహించినప్పుడు పెళ్ళికి సిద్ధపడతారు. సర్వసామాన్యంగా ఈ ప్రేమపెళ్ళిళ్ళ పట్ల కుటుంబంలో సద్భావం ఉండదు. కులం, వర్గం, ఆస్తి, అంతస్తు, ఆచారాలు, అంతరాలు - ఇలా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. పైగా అన్నిటినీ మించి లోతుపాతులు తెలీని ఆకర్షణతో కూడిన ప్రేమలో స్థిరత్వం ఉండదని, తాత్కాలికమని, మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసిపోతుందని ఎక్కువమంది భయపడతారు. కనుకనే పెద్దలు ప్రేమను సామాన్యంగా సమ్మతించరు, ప్రేమికులను స్వాగతించరు.

ఆధునిక కాలంలో ప్రేమకు ప్రోద్బలం ఇచ్చే మార్గాలు అనేకం ఉన్నాయి. ఐస్ క్రీం పార్లర్లు, ఐమాక్స్ దియేటర్లు, పార్కులు, పబ్బులు, రిసార్టులు - ఒకటేమిటి.. అనేక తావులున్నాయి. కబుర్లు చెప్పుకోడానికి కమనీయ ప్రదేశాలు.. ఏకాంతంగా మనసు విప్పి మాట్లాడుకోడానికి గుడి, బడి, రెస్టారెంట్, షాపింగ్ మాల్ అనే తేడా లేకుండా బోల్డంత స్పేస్.. ప్రేమికులకు రక్షణ కల్పించి, ఒకింటివారిని చేసే అవకాశాలకూ లోటులేదు. అమ్మాయీ, అబ్బాయీ మైనారిటీ తీరి, మేజర్లయి ఉంటే ఎవరు ఆమోదించినా లేకున్నా వారికి వారు స్వతంత్రంగా పెళ్ళి చేసుకోవచ్చు. స్వశక్తితో సంసార బాధ్యతలు చేపట్టవచ్చు. కానీ పురాణకాలంలో ఇంత వెసులుబాటు, ఇన్ని అవకాశాలు లేవు. పెళ్ళికి ముందు స్త్రీపురుషులు కలుసుకోవడమే అరుదు. ఒకవేళ ఒకరికొకరు తారసపడితే.. వారిలో ప్రేమ అంకురిస్తే ఆ ప్రేమకావ్యాలు ఎక్కువశాతం ఊహలకే పరిమితం.
 
ఏదేమైనా ప్రేమకు గమ్యం పెళ్ళి. అది కేవలం దండలు లేదా ఉంగరాలు మార్చుకోవడంతో ముగియవచ్చు. లేదా హంగులు, ఆర్భాటాలతో కూడిన సంప్రదాయ వివాహం కావచ్చు. మొత్తానికి పెళ్ళి రెండు మనసుల్ని ఒకటి చేస్తుంది. ఇద్దరు మనుషుల్ని ఏకం చేస్తుంది. మూడు ముళ్ళ బంధంతో జీవితాంతం కలిపి ఉంచుతుంది. ఏడడుగులతో (సప్తపది) ప్రారంభమైన జీవితం కడదాకా సాగుతుంది.

మన పురాణాల్లో బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ఆర్ష వివాహం, ప్రజాపత్య వివాహం, గాంధర్వ వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం, పైశాచ వివాహం - అంటూ ఎనిమిది రకాల వివాహాలను ప్రస్తావించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఇతర వివాహాల సంగతి అలా ఉంచి గాంధర్వ వివాహాన్ని జ్ఞాపకం చేసుకుందాం.

గాంధర్వ వివాహం

ప్రేమించుకున్న జంట ఏ ఆర్భాటాలూ లేకుండా పరస్పరం దండలు మార్చుకుని రహస్యంగా చేసుకునే పెళ్ళి గాంధర్వ వివాహం అంటారు. వాత్స్యాయన కామసూత్రాల్లో గాంధర్వ వివాహమే ఉత్తమమైందిగా చెప్పారు. హిడింబి - భీమసేనులు, రతీ - మన్మథులు, శకుంతలా దుష్యంతులు ఈ రకమైన పెళ్ళే చేసుకున్నారు. కుటుంబసభ్యుల అంగీకారం దొరకనిపక్షంలో ప్రేమికులు వెళ్ళిపోయి, రహస్యంగా పెళ్ళి చేసుకున్నా అది గాంధర్వవివాహమే.

పురాణాల్లో ప్రేమకథలు
హిడింబి - భీమసేనులు
భీమసేనుడు కండబలమే కాదు, గుండెబలమూ ఉన్నవాడు. తనను నమ్మి వచ్చినవారికి అండదండలు అందిస్తాడు. దుర్యోధనుడు పాండవులను మట్టుబెట్టాలని చూస్తున్న తరుణంలో పాండవులు తల్లి కుంతీదేవితో కలిసి అడవిలో ప్రయాణిస్తున్న్నారు.

భీముని ఆచూకీ తెలిసిన హిడింబాసురుడు, అతన్ని బంధించి తెమ్మని తన సోదరి హిడింబిని పంపాడు. తల్లి, సోదరులతో కలిసి అడవిలో నడుస్తున్న భీముని, హిడింబి చూసింది. దృఢకాయం, భారీ విగ్రహం, ఆత్మవిశ్వాసం, అపరిమిత ధైర్యసాహసాలు, ముఖంలో తేజస్సు ఉన్న భీమసేనుని చూసిన హిడింబి విపరీతమైన ఆశ్చర్యానందాలకు గురైంది. సోదరుడు హిడింబాసురుడు చెప్పినట్లు అతన్ని బంధించడానికి మనసు ఒప్పుకోలేదు. తొలిచూపులోనే అతనిపట్ల ప్రేమ చిగురించింది.

భీమునితో మాట కలిపింది. నెమ్మదిగా అతన్ని అనుసరించింది. తాను స్త్రీననే వెరపు లేకుండా, తన నిర్మలమైన ప్రేమను తెలియజేసింది. కానీ భీముడు ఒకపట్టాన ఒప్పుకోలేదు. ఈలోపు అక్కడికొచ్చిన హిడింబాసురుడు, విషయం తెలిసి తన సోదరి అని కూడా చూడకుండా హిడింబిని సంహరించబోయాడు. అప్పుడు భీముడే ఆమెను కాపాడాడు. మొత్తానికి హిడింబి ప్రేమకు లొంగిపోయాడు భీముడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని ఉదయం నుంచి సంధ్య చీకట్లు పడేవరకూ తనతో గడుపుతానని, చీకటిపడగానే వెళ్లిపోతానని చెప్పాడు. హిడింబి అందుకు సమ్మతించింది. ఇద్దరూ సంతోషంగా జీవించారు. వారి ప్రేమ గుర్తుగా ఘటోత్కచుడు పుట్టాడు.

హిడింబి ప్రేమకు, వ్యక్తిత్వానికి చిహ్నంగా చిత్రదుర్గలో ''హిడింబేశ్వర దేవాలయం'' ఉంది. హిడింబి, ఆమె సోదరుడు హిడింబాసురుడు ఈ ప్రాంతంలో ఉండేవారట. ఇక మనాలీలోని ఆలయంలోనూ హిడింబిని పూజిస్తారు.
 
శకుంతలా దుష్యంతులు
వేటకు వెళ్ళిన దుష్యంతుడు శకుంతల ముగ్ధమోహన సౌందర్యానికి చలించిపోయాడు. శకుంతల సైతం అతని ఆరాధనకు దాసోహమంది. దుష్యంతుడు తన అంగుళీయకం తీసి శకుంతల వెలికి తొడిగి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. అంతులేని ఆనందాన్ని చవిచూశారు. శాపవశాన దుష్యంతుడు ఆమెను మర్చిపోయినప్పటికీ అశరీరవాణి జోక్యంతో అతనికి జరిగినదంతా కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. అలా వాళ్ళ ప్రేమ ఫలించి శాశ్వతమౌతుంది.

రతీమన్మథులు
మన పురాణ గ్రంధాల్లో ప్రేమకు సంకేతం రతీ మన్మథులు. మన్మథునికి కామదేవుడు, కాముడు, మదనుడు, రతికాంతుడు - లాంటి అనేకపేర్లు ఉన్నాయి. మన్మథుని అర్థాంగి రతీదేవి. ఈ ప్రేమజంట ప్రేముకులను ప్రేరేపిస్తుందని, వారి ప్రేమను మరింత ఉద్దీపింపచేస్తుందని, సఫలమయ్యేందుకు తోడ్పడుతుందని చెప్పే పురాణ కథనాలు ఉన్నాయి.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అభినందనలు. ఒట్టొట్టి ఆకర్షణలు ప్రేమ కాదు. అది తాలూతప్పా లాంటిది. కానీ నిజమైన ప్రేమ స్వచ్ఛమైన స్ఫటికం లాంటిది. సూర్యకాంతి లాంటిది. విశ్వజనీనమైంది. అది అమూల్యం, అపూర్వం. స్త్రీ పురుషులమధ్య కలిగే ప్రేమ సంగతి అలా ఉంచితే... మనచుట్టూ దిక్కూమోక్కూ లేని అనాధబాలలు, నిస్సహాయంగా బ్రతుకులీడుస్తున్న వృద్ధులు, జీవన భారాన్ని మోయలేక మోస్తున్న అంగవికలాంగులు లాంటి వారెందరో! అలాంటివారిమీద కనికరం చూపడమే సిసలైన ప్రేమ. ఆ యూనివర్సల్ లవ్ ఇప్పుడు కావలసింది

No comments:

Post a Comment