Showing posts with label life/telugu. Show all posts
Showing posts with label life/telugu. Show all posts

Sunday, February 10, 2013

జీవన సంజీవని



నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనడంలో 'శతమానం భవతి' ధ్వనిస్తే, వెయ్యేళ్లు హాయిగా వర్ధిల్లాలని కోరుకోవడంలో శుభ దీవెనే కాక ప్రగాఢ కామనా ప్రతిఫలిస్తుంది. అజేయంగా తిరిగే, అమేయంగా వెలిగే కాలచక్రంలో 'క్షణాలు దినాలు మాసాలు సంవత్సరాలు/ యుగాలు కల్పాలు కల్పాంతాలు' గిరగిరా చరచరా సాగిపోవడాన్ని మునుపే చూసింది కవినేత్రం! 'చిరంజీవ చిరంజీవ- సుఖీభవ సుఖీభవ' అని ఒకటికి రెండుసార్లు పలకడమన్నది కేవల ఆశీర్వచనమో వేదనాదమో కాదు. 'శతాయుష్మాన్ భవ' అన్న ఏడక్షరాలూ సప్తమహర్షుల హస్తాల నుంచి ఒక్కొక్కటిగా జాలువారిన పవిత్ర అక్షతలూ ఆశీస్సుమాల మాలలే! శత వసంతాల జీవన కాలాన్ని లోకులంతా కోరుకున్నా ఆ పత్రం నేలరాలకుండా చేసే, ఆ దేహదీపం ఆరిపోకుండా చూసే బాంధవుడెవరు? ఆయురారోగ్య భోగభాగ్యాలతో తులతూగాలని ఆబాలగోపాలానికీ ఉంటుందికానీ, ప్రాణ పరిపూర్ణ సంరక్షణే అసలు ప్రశ్న. 'అంబుధులీద వచ్చు, ప్రళయాగ్నులు గుప్పిట బట్టవచ్చు, గ్రం/థంబులు వ్రాయవచ్చు, గగనానికి నిచ్చెన వేయవచ్చు, వి/శ్వంబు జయింపవచ్చు, హిమశైలమునెక్కగ వచ్చు గాక/ చోద్యంబగు చావుపుట్టుకల దైవరహస్యమెరుంగవచ్చునే' అన్నారందుకే కవిశ్రీ. బాల్య కౌమార యౌవన వార్ధక్యాలనే చతుర్విధ దశలుగా కొనసాగే జీవన యానంలో మానవులకు ఆశలు శతకోటి! అయినా, సురవరం వారన్నట్టు- 'పుట్టుట గిట్టుట పుడమి జనులకు కట్టడి/ చావు బ్రతుకు వర్తించు చక్రగతి'. చిగురుటాకు అంచున వూగిసలాడే నీటిబిందువు వంటిది ప్రాణమైతే, అది ఉన్నంత కాలమూ- ప్రభాకరుని ప్రకాశం, ధ్రువతార తేజం, మేఘంలా వర్షించడం, చందమామలా స్పర్శించడం కావాలంతే!

ఉపకార చింతన, ధర్మ పరిరక్షణ కలగలిసిన తరుణాన స్థితప్రజ్ఞత, సత్యసంధత, స్థిరత, దానశీలత, ప్రతిభా ప్రపూర్ణతలూ సుగుణసంపన్నాలే. పురాణగాథల్లోని ఆంజనేయ, విభీషణ, కృప, పరశురామ, అశ్వత్థామ, బలి, వ్యాస చరితలు మానవాళికి బోధించేవీ ఈ విలక్షణతలే.. వీరందరిదీ పూర్ణాయు ప్రతీక. హితసాధనలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఘనతర పతాక. 'కాలము పోవును, కడకు మాట నిలుచు' అని క్షేత్రయ్య పలికినా, 'కీర్తి నిలుపుటయు కాదె జనులకు జన్మఫలంబు' అంటూ నన్నయ ప్రవచించినా- ఆ అర్థం బహుజన హితం, ఆ భావం బహుజన సౌఖ్యం. 'మనసులో పుట్టిన మంచి తలంపు/ లాచరణమునందు అలవికాకున్న/ జన్మఫలంబేమి? చచ్చుటే మేలు!' అన్న శ్రీనాథ సుభాషితమూ సర్వదా మననీయం, బహుధా స్మరణీయం. ఒక ప్రాణి జననం ఎప్పుడూ ఎక్కడా అని అడిగితే బదులు పలకొచ్చు. అదే ప్రశ్న మరణం గురించి అడిగితే- సమాధానమేదీ ఉండదు. వేమన 'ఏమి గొంచు వచ్చె నేమి దా గొనిపోవు/ బుట్టువేళ నరుడు గిట్టువేళ' అన్నదీ బదులు తెలియనిదే. తెలిసిందల్లా ఒక్కటే- జీవనకాలం ఎంత అనేకన్నా, అది ఎంత ప్రయోజనకరమన్నదే ఏనాటికైనా మిన్న. కాలజ్ఞతే మనిషి విజ్ఞతకు నికార్సయిన సూచిక. నిరంతరం పరిభ్రమించే కాలం ఒక్క క్షణమైనా ఆగదు. ఆగేదీ సాగేదీ మనిషే కనుక, మంచిని పెంచాల్సిందీ పంచాల్సిందీ ఆ మనిషే. మనుగడ ఓ నవరస భావ పూర్ణ నాటక వేదిక. సర్వ సమర్థంగా పాత్రపోషణ చేయాల్సిన మానవుడికి అందుకే 'అందనిదానికోసమయి అఱ్ఱులు చాచకు, లేనిదానికై/ కొందల మందబోకు, చెడు కోర్కెల చెంతకు చేరనీకు, నీ/ కందినదానితోడ ముదమందుచు, మోమున మందహాసముల్/చిందుచు సాగిపొమ్ము నవజీవన చైత్ర వనాంతరమ్ములన్' అని దారిదీపం చూపింది కరుణ కవి హృదయం. ఏడుస్తూ పుట్టి, కొన్నిమార్లు ఏడుస్తూ పెరిగి, ఇంకొన్నిసార్లు ఇతరుల్ని ఏడిపించిపోయే ప్రాణితో ఈ నేలకు ఉపకారమేమిటనీ నిలదీసిందా స్వరం. 'కలలొచ్చే సమయాన మేలుకోకు, కాలం కలిసొస్తే నిదురపోకు' అన్న హితోక్తి జనచేతనకు దోహదపడే నవామృత మాత్ర!

మిసిమి ప్రాయమైనా ముదిమి వయస్సయినా జీవితేచ్ఛ ఒకటే. కలకాలం విలసిల్లాలన్న శుభాకాంక్షకు పసికందు మొదలు ముదివగ్గుదాకా స్పందించేది బోసినవ్వుతోనే. అన్నమయ్య నిర్ధరించినట్టు 'తగిలి సంపదలచే దనిసినవారు లేరు/ ఒగరు సంసారభార మోపనన్నవారు లేరు/ జడిసి ఆయుష్యము చాలునన్నవారు లేరు'. లోక గమనాన్ని గమనించిన ఆయన నయనాల ఎదుట వరసగా సాగిపోతున్న దృశ్యాలు, రంగులు మార్చుకున్న వైనాలు అనేకం. వాటిని విశ్లేషిస్తే 'పెంచగ బెంచగ బెరిగీ నాసలు/ తుంచగ దుంచగ దొలగునవి/ తడవగ దడవగ దగిలీ బంధము/ విడువక విడువక వీడునది' అన్నట్టుంది స్థితి. నిలిచినదొకటే నిజం, తెలిసిన తెలివే ఘనం అంటే, అదేనేమో మరి. తెలియాల్సింది ఇంకా ఉందనుకున్నప్పుడు 'పక్కనే ఉన్న లోయలోకి తొంగిచూసి/ శిఖరం తన లోతెంతో తెలుసుకోవాలనుకుంది/ వృక్షం కళ్లుమూసుకుని/ తన వేళ్లు నేల పొరల్లోనికి ఎంత దూరం సాగిపోయాయో వూహించుకుంది' అనే సినారె మాలిక గుర్తురాక మానదు. శిఖరస్థాయిగా వృక్షసమంగా మూలలకీ విస్తరించిన వైద్య సదుపాయాలు ప్రజానీకానికి దీర్ఘాయువు ప్రసాదిస్తున్నాయి. జీవన ప్రమాణాల పెంపుదల కారణంగానూ- ఈ ఏడాది పుట్టిన బాలల్లో మూడోవంతు మంది వందో పుట్టినరోజు చేసుకుంటారంటోంది లండన్‌లో జరిగిన తాజా అధ్యయనం. దాంపత్య బంధంతో పాటు ఉత్తమ స్నేహ సంబంధం మనిషి ఆయువును పెంచి తీరుతుందని కూడా అక్కడి పరిశోధకులు తేల్చిచెప్పారంటే, సంజీవని... ఎదుట నిలిచినట్టేగా!

Wednesday, May 9, 2012

పుట్టుకతోనే మంచీచెడు




"నేర్చుకోవడంతో కాదు;
స్వాభావికంగానే వివేచన
నిర్ణయం అంతఃప్రేరణదే
అబద్ధమాడడం తప్పు...
దొంగతనం చేయడం తప్పు...
ఎవర్నైనా చంపడం తప్పు..."
...అనడంలో మనకెవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. అవునా? అందుకే మనం ఇలాంటి మంచి మాటల్ని పిల్లలకు చెబుతుంటాం. నీతి కథలు బోధిస్తుంటాం. ఏది మంచో, ఏది చెడో... నేర్పిస్తేనే తెలుస్తుందని మనం అనుకుంటాం. ఇది నిజమేనా? నేర్పిస్తేనే 'నీతి' అబ్బుతుందా? అసలు ఇది తప్పు, ఇది ఒప్పు అని మనం ఎలా నిర్ణయానికి రాగలుగుతాం? విభిన్న భాషల్లో, సమాజాల్లో, వాతావరణాల్లో పెరిగిన వారికి మంచి, చెడుల విషయంలో విభిన్న అభిప్రాయాలుంటాయా? ప్రసిద్ధ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మార్క్‌ హౌజర్‌ అనే ప్రొఫెసర్‌ దీనిపై పరిశోధన చేసి ఆసక్తికరమైన విశేషాలు వెల్లడించారు. ఏది తప్పో, ఏది ఒప్పో మనం నేర్చుకుంటాం అనడం కన్నా, ఆ ఇంగిత జ్ఞానం (కామన్‌ సెన్స్‌) పుట్టుకతోనే మనలో ఉంటుందని ఆయన తేల్చారు. దీన్నే తార్కికంగా వివరిస్తూ 'నైతిక హృదయాలు (మోరల్‌ మైండ్స్‌)' అనే పుస్తకం రాశారు. పుట్టాక ఊపిరి పీల్చడాన్ని మనకెవరూ నేర్పరు. పీల్చాలని చెప్పరు కూడా. అయినా మనం ఊపిరి పీల్చడం ప్రారంభిస్తాం. అంతఃప్రేరణే దీనికి కారణం. మంచి చెడుల్ని తేల్చే ఇంగితజ్ఞానం కూడా ఇలాగే బాల్యంలోనే మనుషుల్లో బలంగా నాటుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం బాటలోనే లక్షలాది ఏళ్లుగా ఈ అంతఃప్రేరణ మన మనసుల్లో జీర్ణించుకు పోయిందని, క్రమంగా ఎదుగుతూ వస్తోందని వివరించారు. నైతికతకు సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న వేసినపుడు, క్లిష్టమైనదైనా, అది మంచో, చెడో వెంటనే చెప్పేస్తాం. అందులోనూ ఎక్కువమంది చెప్పే అభిప్రాయాలు ఏకీభవిస్తాయి. దీనికి కారణం.. మనుషుల్లో సహజంగా ఉండే వివేచనే అని ఆయన విశ్లేషించారు. ''పిల్లలు పూర్తిగా ఖాళీ మెదడుతో పుట్టరు. భాషకు సంబంధించిన మౌలిక వ్యాకరణం వారిలో పుట్టేనాటికే ఉంటుంది. దాని ఆధారంగానే వారు భాషను నేర్చుకోగలుగుతారు. విభిన్న భాషలకు విభిన్న వ్యాకరణాలు ఉంటాయని కదా అని ప్రశ్నించవచ్చు. భాషేదైనా, దాన్ని నేర్చుకునేందుకు మౌలిక వ్యాకరణం ఒకటే. దాని ఆధారంగానే పిల్లల మెదడులో వాక్య సమీకరణాలు వృద్ధి చెందుతాయి'' అని ప్రసిద్ధ విద్యావేత్త నోమ్‌ చామ్‌స్కీ గతంలో ప్రతిపాదించారు. నీతికి సంబంధించి కూడా మన మనసుల్లో పుట్టుక నాటికే, అసంకల్పిత వ్యాకరణం ఏర్పడి ఉందనీ, దాని ఆధారంగానే మనం మంచి చెడులపై ఏకాభిప్రాయంతో ప్రతిస్పందిస్తున్నామనీ హౌజర్‌ తెలిపారు. పరిశోధనలో భాగంగా ఆయన రెండు సన్నివేశాలను ఉపయోగించారు. అవి...

రైలు మార్గంపైకి వెళ్తే...
పక్కపక్కనే రెండు రైలు మార్గాలున్నాయి. ఒకదానిపై ఐదుగురు వ్యక్తులు నడుస్తున్నారు. వారి వెనకే వేగంగా ట్రాలీ వస్తోంది. బ్రేకుతో ఆపలేని పరిస్థితి. అది అలాగే ముందుకు వెళ్తే ఆ అయిదుగురూ ప్రాణాలు కోల్పోతారు. వారిని కాపాడాలంటే రెండేరెండు మార్గాలున్నాయి.

ఒకటి... ట్రాలీని పక్కనున్న పట్టాలపైకి మళ్లించే వీలుంది. కానీ దానిపై ఒక పాదచారి ఉన్నాడు. ట్రాలీ కిందపడి అతడు చనిపోతాడు. కానీ ఆ ఐదుగురూ బతుకుతారు.

రెండు... ఏదైనా పెద్ద వస్తువును అడ్డంవేస్తే ట్రాలీని ఆపొచ్చు. పట్టాల పక్కనే ఒక స్థూలకాయుడు నిలబడి ఉన్నాడు. అతడు పట్టాలపై అడ్డంగా పడితే ట్రాలీ అగుతుంది. కానీ అతడు చనిపోతాడు. ఐదుగురు బతుకుతారు.

ఏది అనుసరణీయం? ఏ మార్గం మంచిది? ఏది చెడ్డది? మీరైతే ఏం చెబుతారు? ఆలోచించండి.

ఎక్కువ మంది మొదటిదానికే ఓటేశారు. ట్రాలీని పక్కనున్న పట్టాలపైకి మళ్లించడమే సరైందని, అదే నీతిమంతమనీ అభిప్రాయపడ్డారు. స్థూలకాయుడిని పట్టాలపైకి నెట్టడం సరికాదని స్పష్టంచేశారు. నిజానికి రెండు సన్నివేశాల్లోనూ, లెక్క సమానం. ఒక వ్యక్తి చనిపోతే ఐదుగురు బతుకుతారు. అనివార్యమైన ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడమే రెండింటిలోనూ అంతరార్థం. అయినా మొదటిదే సరైనదని, రెండోది తప్పని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఏకీభావం? ''వారి ప్రతిస్పందన స్వాభావికమైనది. గణాంకాల తర్కాన్ని, పట్టించుకోకుండా వారిలోని అసంకల్పిత సహజ అంతఃప్రేరణ ఈ నిర్ణయం తీసుకుంది. భాషా, సామాజిక, ప్రాంతీయ, వయో భేదాలకు అతీతంగా ఇది వ్యక్తమైంది. అంటే వారు జన్మతః తమలో ఉన్న సార్వజనీన నైతిక వ్యాకరణాన్ని అనుసరించారన్న మాట'' అని విశ్లేషించారు హౌజర్‌.

ఆసుపత్రిలోకి ప్రవేశిస్తే..
అదో ఆసుపత్రి. నర్సు వేగంగా డాక్టర్‌ వద్దకు పరుగెత్తుకుని వచ్చింది. ''సర్‌. ప్రమాదంలో గాయపడిన ఐదుగురు వ్యక్తుల్ని ఆసుపత్రికి తెచ్చారు. ఒకరికి గుండె, ఇద్దరికి కిడ్నీలు, ఇంకొకరికి ఊపిరితిత్తి, వేరొకరికి కాలేయం దెబ్బతిన్నాయి. తక్షణం మారిస్తేనే బతుకుతారు. కానీ వారికిచ్చేందుకు అవయవాలు మన ఆసుపత్రిలో లేవు'' అని చెప్పింది. డాక్టర్‌ అయోమయంగా చూశాడు. ''సర్‌, రక్తమిచ్చేందుకు ఒక నిరుపేద యువకుడు మన ఆసుపత్రికి వచ్చి కూర్చున్నాడు. అతడి బ్లడ్‌గ్రూపు, బాధితులదీ ఒకటే. అతడి అవయవాలను తీసి వీరికి అమరిస్తే ఈ ఐదుగురూ బతుకుతారు. కానీ ఆ యువకుడు చనిపోతాడు..'' అని చెప్పింది నర్స్‌.

మీరే డాక్టరైతే ఏమంటారు? సరే అంటారా? ఎక్కువమంది అది తప్పన్నారు. ఐదుగురూ బతకకపోయినా పర్లేదుగానీ, ఆ యువకుడి అవయవాల్ని వారికి అమర్చడం సరికాదన్నారు.

రైలు మార్గం సన్నివేశంలో, ఐదుగురిని రక్షించడం కోసం పాదచారిని బలిపెట్టడం మంచిదేనన్న వారు, ఇప్పుడు మాత్రం ఐదుగురిని బతికించడం కోసం నిరుపేద యువకుడిని చంపడం తప్పన్నారు. అక్కడా ఇక్కడా లెక్క సమానం. ఐదు ప్రాణాలకు ఒక ప్రాణం. అక్కడా ఇక్కడా సమాధానం చెప్పింది వాళ్లే. కానీ జవాబు విభిన్నం. అక్కడ ఒప్పైంది ఇక్కడ తప్పైంది. ఎందుకీ తేడా? ''ఎలాగైనా నష్టం జరుగుతుంది అన్నపుడు, అది తక్కువగా ఉండేట్టు చూసి, ఎక్కువ మంచికి దారితీసేలా చేయడంలో తప్పులేదు. కానీ ఎక్కువ మంచి కోసమని, కావాలని తక్కువ నష్టానికి పాల్పడడం మాత్రం సరికాదు'' అన్నదే మానవ నైతిక హృదయం ఇచ్చే తీర్పు అని హౌజర్‌ విశ్లేషించారు. అత్యధికులు ఏకాభిప్రాయంతో ఇవే సమాధానాలివ్వడం ఆశ్చర్యకరమేగాక, మనిషిలో స్వాభావిక నీతికి నిదర్శనమని కూడా ఆయన చెప్పారు. అయితే దీన్ని ఇప్పుడే నిర్ధారించలేమనీ, ఇదొక ప్రతిపాదిత చర్చమాత్రమేననీ తెలిపారు.

Thursday, April 19, 2012

సమైక్య జీవనసౌందర్యం




'అనేకానేక అద్భుతాలకు నెలవైన ఈ విశ్వంలో మానవ జన్మకన్నా అద్భుతమైనది మరొకటి లేద'న్నాడు గ్రీకు మేధావి సొఫొక్లిస్‌! అవును. ప్రపంచంలోని అన్ని జీవులకంటే, ఆ మాటకొస్తే- ఉందో లేదో తెలియని వూహాలోకంలో మనం ఉన్నారనుకుంటున్న అమర్త్యుల కంటే- మన కట్టెదుటనున్న జగత్తులోని మర్త్యుడే మిన్న. అతడి ఆవిర్భావం- మహిపై జీవన యవనికమీద విరిసిన హరివిల్లు. 'ఏడూ వర్ణాలు కలిసీ ఇంద్రధనుసవుతాది... అన్నీ వర్ణాలకూ ఒకటే ఇహమూ పరముంటాది...' అని పాటూరించాడు వేటూరి. మనిషి మానసంలోని రాగద్వేషాలు, అతడు అనుభవించే సుఖదుఃఖాలు, అనుభూతించే ఖేదప్రమోదాలు, ఆస్వాదించే ప్రశాంతి, దిగమింగుకునే అశాంతి, పలవరించే బాధామయ గాథలు, పరితపించే విషాదమాధుర్యాలు- ఏడు రంగులై విచ్చుకున్న మహేంద్రచాపం మానవజీవితం. సప్తవర్ణాలవంటి ఆ అనుభూతుల సమ్మిళితమైన విజయహారాన్ని ధరించి, జీవనప్రస్థానం సాగించి, విజేతగా నిలిచిన మనిషే ఇహపరాల సాధకుడవుతాడు. మరే జీవికీ లేని ఈ అనుభూతులు మనిషికి మాత్రమే సొంతం కనుకనే కాబోలు భగవంతుడు కూడా మానవునిగా అవతరించాడు, మహనీయుడనిపించుకున్నాడు.రామునిగా, కృష్ణునిగా, తిరుమలేశునిగా నరుడైన నారాయణుడే- తన ఇతర అవతారాల్లోకంటే ఎక్కువగా ఆరాధనీయుడవుతూ 'దైవం మానుష రూపేణా' అన్న ఆర్యోక్తిని సాకారం చేస్తున్నాడు! 'మనిషిగా పుట్టి దేవుడు మాత్రమేమి బావుకున్నాడు... బాధలు పడుట తప్ప!' అని ఆత్రేయ అని ఉండవచ్చు. కానీ, బాధలు పడటంలోని అనిర్వచనీయమైన ఆనందానుభూతి కోసమే దేవుడు మనిషిగా పుట్టి ఉంటాడు.

'జీవిత మైదానంలో ఆనందం జీవనది'గా అభివర్ణించాడు రచయిత గోపాలచక్రవర్తి. ఒకరితో ఒకరు చెట్టపట్టాలుగా, ఒకరికొకరు చేదోడువాదోడుగా మానవ సమూహాల మహాప్రస్థానం సాగిపోతే- సామాజిక జీవిత మైదానంలోనూ ఆనందం అలలు అలలుగా జీవనదియై ప్రవహిస్తుంది. మనుషుల హృదయాల్లో మానవత్వ పరిమళాల్ని గుబాళింపజేసే మానవీయ సంబంధాల కంటే ఆనందదాయకమైనవి వేరే ఏముంటాయి? మనిషి జననం, జీవనం, జీవితం, చివరికి మరణం... అన్ని దశలూ సామాజిక సంబంధాలతో ముడిపడినవే. అందుకే- 'సంఘం శరణం గచ్ఛామి' అన్న తారకమంత్రాన్ని బుద్ధభగవానుడు ఈ వేదభూమికి ఉపదేశించాడు. బహుముఖాలుగా ఉన్న సమాజం ఏకోన్ముఖంగా, మానవుడు వ్యష్టిగా కాక సమష్ఠిగా కదిలితే సమైక్య జీవనసౌందర్యం సాక్షాత్కరిస్తుంది. సమాజానికి, అందులో అంతర్భాగమైన వ్యక్తులకు తుష్టిని, పుష్టిని సమకూరుస్తుంది. అందుకు కావలసిందల్లా మనుషుల మధ్య సామాజికంగా సంబంధాలు బలపడటమే! సమత, 'సహ'వాసం పొడ గిట్టని ఓ పెద్దమనిషి- 'మీ కుర్రకారువన్నీ వెర్రి పోకడలు. 'సమానత్వం, సమానత్వం' అంటూ కేకలు వేయగానే సరా... మన చేతి అయిదు వేళ్లే సమంగా ఉండవు, అటువంటిది మనుషుల మధ్య సమానత్వం అసలెలా సాధ్యం?'- మెటికలు విరుస్తూ ఆ కొద్దిపాటి నొప్పికే 'అబ్బా' అనుకుంటూ ఓ కుర్రాణ్ని కోప్పడ్డాడు. 'మన చేతి వేళ్లు సమానంగా ఉండవుకానీ, వాటిలో ఏ ఒక్క వేలికి గాయమైనా శరీరానికి కలిగే నొప్పి మాత్రం సమంగానే బాధిస్తుంది మరి' అంటూ చురక అంటించాడు ఆ చిన్నోడు! 'లోకులతో నాకేమిటి, నా లోకమె నాద'నుకునే ఉలిపికట్టె బాపతు మనుషుల్లా కాక, పదిమందితో కలసిమెలసి తిరగడం మనిషిని ఉల్లాసంగా ఉంచుతుంది. మనసులో ఉత్సాహాన్ని నింపుతుంది. మనిషి ఆరోగ్యానికి ఆ రెండింటినీ మించిన మరో కొండగుర్తు ఏముంటుంది?

మనుషుల ఆరోగ్యం- వారు భుజించే ఆహారం, చేసే వ్యాయామం కంటే, సమాజంలో వారు జీవనాన్ని గడుపుతున్న తీరుపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని అమెరికా పరిశోధకులూ తాజాగా కనుగొన్నారు. పదుగుర్నీ పలకరిస్తూ సమాజంలోని తమ తోటివారితో పదం కలుపుతూ సన్నిహితంగా మెలిగే మనుషులు- అదిగో అంటే వచ్చి ముసిరే జలుబు, హఠాత్తుగా పంజా విసిరే గుండెపోటు తదితరాల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఆ పరిశోధకుల బృందం నాయకుడు ప్రొఫెసర్‌ అలెక్స్‌ ఇస్లాం చెబుతున్నారు. సంఘజీవనంలో మానవులు అన్యోన్య సంబంధాలు కలిగి ఉంటే కలదు సుఖం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అందరూ విడివిడిగా కాక కలివిడిగా జీవించేలా మానవీయ సంబంధాలకు అంటుకట్టడం మనుషులకు అసాధ్యమేమీకాదు. పరస్పర సంబంధాల సేతు నిర్మాణానికి పేగు బంధమొక్కటే ఆధారశిల కానక్కరలేదు. అందుకు సాటి మనిషీ ప్రాతిపదికయితే చాలు... ఎదుటివారు దుఃఖంలో కుమిలిపోతున్నప్పుడు వారి కన్నీటిని తుడిచే ఓ ఆత్మీయత చాలు... బాధతో పరితపిస్తున్నప్పుడు వారికి ఓదార్పునిచ్చే ఓ చల్లని పలుకు చాలు... కష్టాల్లో కుంగిపోతున్నపుడు వారి వెన్నుతట్టి ఊరట కలిగించే ఓ ధైర్యవచనం చాలు, మనిషికీ మనిషికి మధ్య సామాజిక సంబంధాలు తప్పకుండా మోసులెత్తుతాయి. ఎందుకంటే- శ్రీశ్రీ అన్నట్లు 'ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా/ ఎంతగా పైపై భేదాలున్నా/ ఎంతగా స్వాతిశయం పెరిగినా/ ఎంత బలం, ధనం, జవం పెరిగినా/ అంతరంగం అట్టడుగున మాత్రం/ అంతమందిమీ మానవులమే!' ఆర్థికాంశాలు కాక, మానవీయ సంబంధాలే మనిషి హృదయాన్ని శాసించే రోజు రావాలి. 
కనీసం అప్పుడైనా- వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల్ని దిక్కులేనివారిగా వీథులపాలుజేసే 'సుపుత్రుల' మానసిక అనారోగ్యానికి మందు దొరుకుతుందేమో!

Tuesday, March 27, 2012

రసజ్ఞతా వారధులు


రసజ్ఞతా వారధులు

కేంద్రమంత్రిగా, పలుమార్లు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించిన గుల్జారీలాల్‌నందా నిజమైన గాంధేయవాది.ఆయన నిండు నూరేళ్ళూ జీవించారు. రాజకీయాల్లోంచి తప్పుకొన్నాక, ఢిల్లీలోని తన కూతురింట్లో ప్రశాంతంగా గడిపారు. నందా వందో పుట్టినరోజున కొందరు పాత్రికేయులు ఆయనను కలవడానికి వెళ్ళారు. అక్కడ అట్టహాసాలు, ఆడంబరాలు ఏమీలేవు సరికదా, నందా పల్చని సాదాసీదా ఖద్దరు బట్టలతో ఎదురై, కేవలం 'టీ'తో పిచ్చాపాటీ సరిపెట్టారు. పత్రికల వారికి అది చప్పగా అనిపించింది. 'మాజీ ప్రధానిని పట్టించుకోని ప్రభుత్వం', 'అర్ధాకలితో అమాత్యుడు'... వంటి శీర్షికలతో ప్రభుత్వాన్ని ఎండగట్టి, ఎంతోకొంత ఆర్థికసహాయం ఆయనకు ముట్టేలా చెయ్యాలని వారిలో కొందరు ఉత్సాహపడ్డారు. వెంటనే నందా తీవ్రంగా స్పందించారు. 'నేను గాంధేయవాదిని, నిరాడంబరంగా జీవించడమే నాకు ఇష్టం' అన్నారు. 'నెలనెలా పింఛను వస్తోంది, డబ్బుకు ఇబ్బందేంలేదు. గాంధీజీ లేరుకదా అని ఆయన చూపించిన మార్గాన్ని విడిచిపెట్టడం నాకు చేతకాదు' అనీ స్పష్టీకరించారు. 'ప్రభుత్వానికి నా గురించి సిఫార్సులు పంపడంద్వారా నన్ను బిచ్చగాణ్ని చేయకండి. వెళ్ళిరండి' అన్నారు. అదిగో అదీ- గాంధేయవాదమంటే! మహాత్ముడి సాహచర్యం ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది. 'గాంధీజీకి నేను సమకాలికుణ్ని. బాపును నేను కళ్ళారా చూశాను'- అని, ఆనాటివారంతా ఛాతీ ఉప్పొంగేలా, మొహం వెలిగేలా ప్రకటించుకోవడాన్ని మనం ఈ కోణంలోంచి అర్థంచేసుకోవాలి. శ్రీరమణ 'బంగారు మురుగు' కథలో బామ్మ చేతికడియం మీద పెద్ద స్వాములవారు కన్నేశారు. ఆయనకన్నా గడుసుపిండం బామ్మ- 'ఇచ్చేటంతటిదాన్నా నేను!' అనేసి జారుకుంది. పైపెచ్చు 'ఇచ్చేదాన్నే అయితే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకొచ్చి సొరాజ్జెంకోసం జోలెపట్టినరోజే ఇద్దును. మహామహా ఆయనకే ఇవ్వలేదు, ఈ సర్కస్‌ కంపెనీకి ఇస్తానా?' అనేసింది. పీఠాధిపతుల ప్రభ గొప్పగా వెలుగుతున్న రోజుల్లో బామ్మ స్పందన- ప్రజల గుండెల్లో వారికన్నా గాంధీజీ స్థానం ఎంత ఎత్తయినదో తెలియజెప్పింది.

యుగపురుషులు లేదా చారిత్రక పురుషుల ఉనికి అంత గొప్పగా ఉంటుంది. వారి మాట తీసివేయలేం. వారిని వెనుతిరిగి చూడకుండా వెళ్ళలేం. వారున్న రోజుల్లో జీవించడమే చాలు- మనిషి తాను గొప్పగా చెప్పుకోవడానికి! ఐన్‌స్టీన్‌ అంతటివాడు గాంధీజీకి సమకాలికుణ్నని గర్వపడ్డాడు. అలాంటివారు అన్ని రంగాల్లోనూ ఉంటారుగాని, అరుదుగా ఉంటారు. వారితో మాట్లాడామని, వారిని చూశామని, వారిని ఎరుగుదుమనీ చెప్పుకోవడం మనిషికి నిజంగానే గర్వకారణం. ఎందుకంటే వారి గొప్పదనాన్ని గుర్తించడమనేది కూడా అభినందించదగినదే కనుక. 'ఏ గతి రచియించిరేని సమకాలమువారది మెచ్చరేగదా!' అని చేమకూర వేంకటకవి వాపోయింది- ఈ గుర్తించడం తెలియనివారి గురించే. 'తమ పూర్వీకులు సాధించిన ఘనవిజయాలను తలచుకొని గర్వపడలేనివారు- రాబోయే తరాలవారు తమను గుర్తించుకోదగ్గ ఘనకార్యాలేవీ సాధించలేరు' అంటాడు లార్డ్‌ మెకాలే. 'ఈ సంసార మిదెన్ని జన్మలకు ఏనీ-మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా? సత్కావ్య నిర్మాణరేఖా సామగ్రి రుణంబు తీర్పగలదా?' అని ప్రశ్నించారు విశ్వనాథ. ఒక వాల్మీకి రుషి ఘనతను, ఒక 'రుషివంటి నన్నయ్య' ఘనతను గుర్తించి గౌరవించిన విశ్వనాథ- తరవాతి తరం కూడా గర్వపడే కవిత్వం అందించగలిగారన్నది మనం గ్రహించాలి. ఇక్షోణిన్‌ నినుబోలు సత్కవుల్‌... అంటూ శ్రీనాథుడూ, ఉన్నతగోత్ర సంభవము... అంటూ ఎర్రాప్రగడా పూర్వకవులను స్తుతించడంలో ఆంతర్యమిదే.ఒక సొగసైన వాక్యాన్ని గుర్తించి ఆనందించగలవారికే- మరో అందమైన వాక్యాన్ని సృష్టించాలన్న తపన ఉంటుంది. ఆధునికుల్లో అలాంటివారైన విశ్వనాథను వినడానికీ, శ్రీశ్రీని చూడటానికీ సాహితీప్రియులంతా అప్పట్లో ఎంతో కుతూహలం, మరెంతో గౌరవం చూపించేవారు. 'విశ్వనాథ భావుకకోటి' అందరూ ఆ బాపతే!

ఈ తరానికి గాంధీవాదం పస తెలియడానికి, రాజకీయ రంగంలో నందా వంటి గాంధేయవాదుల అంకితభావం కారణం అనుకుంటే- సాహిత్య రంగానికి చెందిన విలువలు గాని, ఈ దేశపు పాండిత్యమూ రసజ్ఞతా సజీవంగా ఉండటానికిగాని, సాహితీప్రియులైన భావుకకోటి కారణం. సాంస్కృతిక రంగంలో- ముఖ్యంగా అలవాట్లు, అభిరుచులు, సంప్రదాయాలు కొత్తతరానికి వ్యాపించడానికి కారణం ఎవరంటే- రసజ్ఞులైన సామాన్యులు! యుగసంధిలో నిలిచి, వారు రెండు తరాలకు వారధిగా వ్యవహరిస్తారు. పైన మనం చెప్పుకొన్నవన్నీ యుగసంధిలోని ఘట్టాలే. పాతతరం మంచి అలవాట్లు కొత్త తరానికి వ్యాపించేందుకు వీలుగా రసజ్ఞతకు సంబంధించిన పూలవంతెనలు కట్టేది యుగసంధిలోని ఆ పుణ్యపురుషులే. 'చదువది ఎంతగల్గిన, రసజ్ఞత ఇంచుక చాలకున్న, ఆ చదువు నిరర్థకంబు' అని భాస్కర శతకకారుడు చేసిన సూచన వారికి తెలుసు. మనకు సంబంధించి యాభైల్లో, అరవైల్లో పుట్టి చదువూ రసజ్ఞతా కలిగిన వారంతా ధన్యజీవులు. వారిమూలంగానే కొన్ని పాతతరం విలువలతో కొత్తతరానికి పరిచయం ఏర్పడుతుంది. వారెంత అదృష్టవంతులంటే- సినీరంగపు పసిడియుగంతో వారికి బాగా పరిచయం. సాహిత్యరంగపు నిరుడు కురిసిన హిమసమూహాలతో బాగా చనువు. వారికి తామరపూలు తెలుసు, తాటిముంజెలు తెలుసు. తేగలంటే తెలుసు, దబ్బాకు తరవాణీ తెలుసు. వారికి బళ్ళారి రాఘవ తెలుసు, భానుమతి తెలుసు. బడే గులాం అలీ తెలుసు, బాలమురళీ తెలుసు. బాపూ బొమ్మ, శోభానాయుడు నృత్యం, షణ్ముఖి పద్యాలు తెలుసు. ఇవన్నీ రాలిపడిన బాదంకాయల్ని కొట్టితీసిన తాజా పప్పులనుకుంటే- ఈ రోజుల్లోవి సూపర్‌మార్కెట్‌లో ప్యాక్‌చేసిపెట్టిన బాదంపప్పులు. రెండింటికీ తేడా తెలిసినవారూ, తెలియజెప్పగలవారూ కనుకనే, వారిని అదృష్టవంతులని అనేది

Tuesday, February 14, 2012

వెలుగుదారి

9 28 Beautiful Tree Images



కాలమనే కడలిలో మరో కొత్త అల లేచింది. కొత్తదనమనగానే చిత్తానికెందుకో అంత ఉత్తేజం! 'అంతరంగం వింత విహంగమై/ రెక్కలు తొడుక్కుని ఎక్కడెక్కడికో/ ఎగిరిపోవాలని ఉబలాటపడే' శుభవేళ ఇది. 'అక్కయ్యకి రెండో కానుపు/ తమ్ముడికి మోకాలి వాపు/ చింతపండు ధర హెచ్చింది/ చిన్నాన్నకు మతిభ్రమ కలిగింది'. ఇలా, నిద్రనుంచి మేల్కొన్న మరుక్షణంనుంచీ గోరుచుట్టులా మనిషిని సలిపే సమస్యలు సవాలక్ష. 'ఆనందాన్ని చంపేందుకు/ అనంతంగా ఉంది లోకం/ కులాసాని చెడగొట్టేందుకు అలాస్కా దాకా అవకాశం ఉంది' అన్న కవి తిలక్ పలుకులు నిరాశ కలిగించేవే అయినా అవి నేటికీ సరిపోయే నిష్ఠుర సత్యాలే. చుట్టుముట్టిన చీకట్లను తిట్టుకుంటూ కూర్చుంటే వెలుగుదారి వెతుక్కుంటూ రాదు కదా! కాసేపైనా గోర్వంకల రెక్కలమీద ఊహావసంతాల చుట్టూ చక్కర్లుకొట్టి రాకపోతే ఈ చికాకుల లోకంనుంచి మనిషికి మరి తెరిపేదీ! 'మనసూ మనసూ కలగలిసిన మైమరుపు ముందు మద్యం ఎందుకు?' అంటాడొక నవ కవి. ఎవరెస్టుకన్నా ఎత్త్తెన శిఖరాల్నీ వూహల్లో త్రుటిలో లేపేయగల చేవ సృష్టిమొత్తంలో ఉంది మనిషికే. అదో అదృష్టం. ప్రతి క్షణం ఓ రుబాయత్ పద్యంలా సాగిపోవాలంటే సాధ్యపడకపోవచ్చు. పాతంతా గతించి, సరికొత్తదనం మన జీవితం గడపలోకి కొత్త పెళ్ళికూతురులా అడుగుపెట్టే వేళా మనసు ఒమార్ ఖయ్యాం కాకపోతే జీవితానికింకేం కళ! 'నేటి హేమంత శిథిలాల మధ్య నిలచి/ నాటి వసంత సమీరాలను' తలచుకొనే శుభసందర్భం కొత్త ఏడాది తొలి పొద్దుపొడుపే! ఉషాకాంతుల వంటి బంగరు వూహలతో దివ్య భవితవ్యానికి సర్వప్రపంచం సుస్వాగతాలు పలికే సంప్రదాయం వెనకున్న రహస్యం- మనిషి నిత్య ఆశావాది కావడమే!

ఆదిమానవుణ్ని అణుమొనగాడిగా మలచింది ఆశావాదమే. 'మనిషికి మనిషికి నడుమ/ అహం గోడలుండవని/ అంతా విశ్వజనని సంతానం కాగలరని/ శాంతియనెడి పావురాయి/ గొంతునెవరు నులమరని/ విశ్వసామ్య వాదులందు/ విభేదాలు కలగవని' మనిషి కనే కల వయసు మనిషి పుట్టుకంత పురాతనమైనది. ఎదురుదెబ్బలెన్ని పడినా బెదరక కాలానికి ఎదురేగి మరీ వూరేగే సుగుణమే మనిషిని మిగతా జీవరాశికి అధిపతిగా నిలబెట్టింది. శిశిరం వచ్చి పోయిందనీ తెలుసు. తిరిగి వచ్చి విసిగిస్తుందనీ తెలుసు. అయినా మధుమాసం రాగానే మావికొమ్మమీద చేరి కోయిల కూయడం మానదు. చినుకు పడుతుందా, వరద కడుతుందా... అని చూడదు. వానకారు కంటపడితే చాలు- మయూరం పురివిప్పి నాట్యమాడకుండా ఉండదు. అత్తారింట్లో అడుగుపెట్టే కొత్తకోడలి అదృష్టం లాంటిది భావి. గతానుభవాలతో నిమిత్తం లేదు- రాబోయే కాలమంతా సర్వజనావళికి శుభాలే కలగాలని మనసారా ఆపేక్షించే అలాంటి స్వభావమే మనిషిదీ. 'సకల యత్నముల నుత్సాహంబె మనుజు/ లకు సకలార్థ మూలము' అని రంగనాథ రామాయణ ప్రవచనం. 'నానాటికి బ్రదుకు నాటకము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్ట నడిమిపని నాటకము' అని అన్నమయ్య వంటివారు ఎన్నయినా వేదాంతాలు వల్లించవచ్చు. రక్తి కలగాలంటే నాటకానికైనా ఆసక్తి రగిలించే అంశం అవసరమేగా! పర్వదినాలు ఆ శక్తిని అందించే దినుసులు. కొత్త ఆంగ్ల సంవత్సరంలో ఉత్సాహంగా మునుముందు జరుపుకోబోయే పండుగలన్నింటికీ జనవరి ఒకటి నాంది. గురజాడవారు భావించినట్లు 'నవ వసంతము నవ్య వనరమ/ మావి కొమ్మల కమ్మ చివురుల/ పాట పాడెడి పరభృతంబు(కోయిల)ను' పాడకుండా ఆపటం ఎవరితరం! కొత్త సంవత్సరం మొదటిరోజున మనిషి చేసుకునే సంబరాలను ఆపబోవడమూ ఎవరి తరమూ కాదు. ఎవరికీ భావ్యమూ కాదు.

'వైషమ్యాలు శమింపలేదు; పదవీ వ్యామోహముల్ చావలే/ దీషణ్మాత్రము గూడ; మూతవడలేదే కైతవ ద్వారముల్/ మరి యెన్నాళ్లకిటు వర్ధిల్లున్ బ్రజాభాగ్యముల్?' అంటూ రణక్షేత్రం మధ్య అర్జునుడిలా మనసు జీవితక్షేత్రంలో విషాదయోగంలో పడే సందర్భాలు బోలెడన్ని ఉంటాయి. భుజంతట్టి, లేపి, నిలబెట్టి చైతన్యమార్గం చూపించే నాటి ఆచార్యుని 'గీత' లక్ష్యమే నూతన సంవత్సర శుభాకాంక్షల అంతరార్థం. 'ఘన ఘనా ఘనము చీకటి మేడ వెలిగించు దివ్వెల నూనె తరుగలేదు/ పవలు రేలును తీరుబడి లేక ఘోషించు/ తోయధీశుని గొంతు రాయలేదు'- మరి ఎందుకు మధ్యలో ఈ విషాదయోగం? నియతి తప్పక నడిచే కాలమూ మనిషికిచ్చే సందేశం- శిశిరంలో సైతం వసంతాన్నే కలగనమని. అంది వచ్చిన కాలాన్ని ఆనందంగా అనుభవించాలని. కొనలేనిది, పట్టుకొనలేనిది, సృష్టించలేనిది, వృథా అయినా తిరిగి సాధించలేనిది, మొక్కినా వెనక్కి తెచ్చుకోలేనిది... మనిషి కొలమానానికి అందనంత అనంతమైన వింత- కాలం. జీవితంలో ప్రేమించడమొక్కటే కాలాన్ని వశపరచుకోగల ఏకైక మంత్రం. కాలగమనాన్ని సూచించే పర్వదినం జనవరి ఒకటి ప్రత్యేకతే వేరు. కుల మతాలు, చిన్నా పెద్దా, ఆడా మగ, తెలుపూ నలుపు ఏ తేడా లేకుండా 'సర్వేజనా స్సుఖినో భవంతు' అనే ఒకే ఉద్వేగభావంతో ప్రపంచమంతా సంబరాలు చేసుకొనే అపూర్వ పర్వదినం నూతన సంవత్సరం మొదటిరోజు మొదటి క్షణం. అంత ఉత్తేజకరమైనది, ఉత్సాహభరితమైన పండుగ మళ్ళీ వచ్చేది వచ్చే ఏటి మొదటిరోజు ఇదే సమయానికే. అందుకే ఈ రెండు పండుగల నడుమ కాలమంతా సర్వప్రపంచంలో సుఖ ఐశ్వర్య శాంతులతో ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుందాం

Sunday, December 4, 2011

తొలి కలల ప్రేమలేఖ


ప్రణయభావం హృదయ సంబంధి. నిండు నూరేళ్ల జీవితానికి రసాలందించే ఆ ప్రేమఫలం చవిని పసగల రెండు మూడు పదాల్లో పొదగాలంటే ఎంత అనుభవం కావాలి?'ప్రేమంటే ఒక తికమకలే. అది వేధించే తీపి కలే' అన్నాడో ఓ సినిమా కవి. ఎద సడిని సరిగమపదనిసలుగా మలచి పాడే ఆ గడసరి- పిడికిలంత గుండెలో కడలిని మించిన హోరును పుట్టించగల జగడాలమారి. 'మ్రొక్కి మొక్కించుకొనునట్టి చక్కదనము/పొగిడి పొగిడించుకొనునట్టి ప్రోడతనము/దక్కి దక్కించుకొనునట్టి దంటతనము/ దానికేకాక కలదే యే చానకైనా?' అని ముద్దుపళనివారి మాధవుడు తలపోసింది రాధిక గురించే. నిజానికి ఆ శాపనార్థాలన్నీ అన్యాపదేశంగా అశరీరుడి ఆగడాలమీద గురిపెట్టిన శరాలే! సదా గోపాలపాద చింతనామగ్న అయిన గోపకాంత ఒకతె చెంతవాలిన చంచరీకాన్నే ప్రియుడు పంపిన ప్రేమదూతగా భావించుకొని ఆలపించిన భ్రమరగీతాలూ ఈ ధోరణిలోనే సాగే తంతు. తనను మన్మథ వేదనపాలు చేసిన విధాత నిర్దయను వ్రేపల్లె గొల్లభామ పడ తిట్టిపోస్తుంది- పోతన భాగవతంలో. 'కత్తిలేని ఒరకు కాంతి లేనట్టుగా ప్రేమలేక యున్న బ్రతుకు సున్న' అని దాశరథివంటి కవులు భావిస్తూనే ఉన్నారంటే ఆ కొంటెతనమంతా ఈ మిటారితనంలోనే ఉందనేగా! 'ప్రణయ వధువు నొక రాతిరి త్రాగినాను/ప్రళయ దినము దాక నిషా వదలదు నన్ను' అంటూ పారశీక గజల్ కవి మీర్ పదాలు పాడింది ఈ పాడు తీపి ప్రణయ మధువు గమ్మత్తు మత్తు గురించే!

ప్రేమంటే మోకాలి లోతు దుఃఖం. పీకల దాకా సుఖం. ముల్లు ముల్లుకీ మధ్యనే పువ్వు విచ్చుకున్నట్లు, పువ్వు పువ్వుకీ మధ్య ముల్లూ పొడుచుకొని ఉంటుంది. ప్రేమలో కన్నీళ్లు వద్దనుకుంటే ఎలా? మెరుపు లేకుండా, చినుకు రాకుండా చిగురు పుడుతుందా? రాధికా సాంత్వనంలోని కథానాయిక బాధే ఏ మదన పీడితులకైనా. 'కంటికి నిద్రరాదు, వినుకాంతుని బాసిన నాటి నుండియున్/వంటకమింపు గాదు, పెఱవార్తలు వీనుల సోకలేదు నే/డొంటిగ బ్రొద్దుపోదు, మరులూరక యుండనీదు, తొల్లినే/జంట బెనంగు వారిగన జాలక చాల కరంగ గంటినో' అంటూ పెంపుడు చిలుక ముందు కంటనీరు పెట్టుకొంటుంది రాధిక ఒంటరి తుంటరి ఒంటిబాధ భరించలేక. సుభద్రను తొలిరేయి సమాగమానికి స్వయంగా అలంకరించి భర్త వద్దకు పంపిన తాళ్ళపాక తిమ్మక్కవారి 'ద్రౌపది'దీ అదే హృదయ వేదన.'విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా!' అంటూ పింగళి వంటివారు ఎంత వూరించినా నండూరివారి నాయుడు బావకిలా గుండె గొంతుకలో కొట్లాడుతుండే కూకుండనిస్తుందా కూసింతసేపు?! 'ఒక ముద్దుకోసం యుగాలైనా ఆగుతాను/ తన పొందుకోసం యోజనాలు సాగుతాను' అని బీరాలు పలికే ప్రేమదాసులు మూడుముళ్లు పడితేచాలు... తొలి రేయిదాకానైనా తాళలేరు. 'ఆలుమగల మధ్యగల ఆ అనుబంధం కాలం గడిచేకొద్దీ బలమైన స్నేహబంధంగా మారితేనే ఆ సంసారం సరస సుధాసారం... ఆ జంట లోకం కనులపంట' అంటాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి. ఈ తరం యువతరం తొందరపాటు, కలిసి నడవడంలోని తడబాటు, నూతన దంపతుల్లోని ఎడబాటును మరింత వేగంగా పెంచుతోందని మానసిక శాస్త్రవేత్తలిప్పుడు ఆందోళన చెందుతున్నారు.

'ఆమె కడలి తీరపు దీపం. కాకపోతే... అతను సంసార సాగరంలో జాడ తెలియని ఓడ. అతను సాగర హృదయ వైశాల్యం కాకపోతే ఆమె సంగమ సాఫల్యం అందని నదీసుందరి' అంటాడొక ఆధునిక కవి. ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో కుమారీ శతకం ఏనాడో తెలియజెప్పింది. భర్తకు భోజనం వడ్డించేటప్పుడు తల్లిలా, పవళింపు సేవలో రంభలా, ఆలోచనల వేళ మంత్రిగా, సేవించేటప్పుడు దాసిగా మెలగాలంటుంది. మరి, భర్త ఎలా ఉండాలి? ఆలుమగలు ఆకాశం, భూమిలాగా- హృదయవైశాల్యం, సహన సౌశీల్యం అలవరచుకుంటేనే ఆ దాంపత్యం వాగర్ధ ప్రణయైకమత్యమంత ఆదర్శప్రాయమవుతుంది. 'ఆత్మ సమానత్వం పొందిన జీవిత భాగస్వామి ముందు మోకరిల్లటం ఆత్మనమస్కారమంత ఉత్తమ సంస్కారం' అని కదా మల్లినాథహరి కిరాతార్జునీయంలోని ఒక ఉపకథాసారం! 'పొందనేర్తునె నిన్ను పూర్వజన్మ / కృతసుకృత వైభవమున దక్కితివి నాకు' అని ఆమె అనుకోవాలి. 'ఎంత మాధుర్యమున్నదో యెంచగలనె! / సలలిత కపోల నీ మృదుసూక్తిలోన' అని అతను మనస్ఫూర్తిగా భావించి పైకి అనాలి. పెళ్ళినాటి సప్తపదిలో ముందు నాలుగడుగులు వధువు వరుణ్ని నడిపిస్తే, మిగిలిన మూడడుగులు వరుడు వధువు చేయిపట్టుకొని నడిపించేవి.పెళ్ళిపీటల మీద అగ్నిసాక్షిగా పరస్పరం చేసుకొన్న ప్రమాణాలు కాళ్ల పారాణి పచ్చదనం తడి ఆరకముందే నేటితరానికి మరపునకు రావడం విచారకరం. పెరుగుతున్న విడాకులకు విరుగుడుగా పొరుగున చైనాలోని బీజింగ్ తపాలాశాఖ ప్రేమలేఖల చిట్కా ప్రవేశపెట్టింది. మూడుముళ్లు పడిన మరుక్షణంలోనే వధూవరులు తమ జీవిత భాగస్వాముల మీదున్న ప్రేమనంతా ఒలకబోసి రాసిన ప్రేమలేఖలను ఆ శాఖవారు భద్రపరచి ఏడేళ్ల తరవాత తిరిగి ఇస్తారట! పెళ్ళినాటి ప్రమాణాలు మళ్ళీ గుర్తుకొచ్చి ఎడబాటు ఆలోచనలు తగ్గుముఖం పడతాయన్నది వారి సదాలోచన. కలకాలం కలిసే ఉండాలన్న కోరికలు మరింత బలపడితే శ్రీ గౌరీశ్వర సాన్నిహిత్యంలా వారి దాంపత్యం కళకళలాడుతుందన్న ఆలోచనే హర్షణీయం. అందమైన సంసారాలను ఆశించే వారందరికీ అది ఆచరణీయం

Thursday, November 3, 2011

శాంతిపోరాటం




రైలుబండినుంచి బైటకు గెంటివేసినప్పుడు గాంధీజీ ముందున్న ప్రత్యామ్నాయాలు రెండే రెండు. మౌనంగా తొలగిపోవడం,నిలబడి పోరాడటం. రెండో మార్గాన్నే ఎంచుకొన్నాడు- తరవాతి కాలంలో శాంతిదూతగా మారిన మోహన్‌దాస్. ఛీత్కారం అనర్హుడికి అతలం. అదే అర్హుడికి అందలం. నిశ్చింతే జీవిత అంతిమ లక్ష్యమని తెలియకనా... నోబెల్ శాంతి పురస్కార గ్రహీత దలైలామా టిబెట్ బహిష్కరణను వరంగా స్వీకరించింది!నెల్సన్ మండేలానుంచి ఆంగ్‌సాన్ సూకీదాకా... దుర్మార్గానికి దాసోహమని సుఖపడటంకన్నా, సంఘర్షణే సన్మార్గమని నమ్మిన వైతాళికుల జాబితా చాలా పెద్దదే!రామాయణ, భాగవత, భారతాలేమీ శాంతిగ్రంథాలు కావు. యుద్ధం అయిదూళ్లకే అయితే, అంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామం జరిగేదే కాదు. ధర్మసంస్థాపనార్థం సంభవించిన వ్యతిరేకశక్తుల సంఘర్షణ అది. నూతన వైజ్ఞానికావిష్కరణ కోసం కొపర్నికస్వంటి శాస్త్రవేత్తలు, రాజా రామ్మోహన్‌రాయ్ వంటి సంఘసంస్కర్తలు సంఘర్షణాత్మక వైఖరి కనబరచకపోయి ఉంటే- మనిషి ఇంకా నిప్పు రాజేసే రాతి దశనైనా దాటి ఉండేవాడు కాదు. నిప్పులమీద వితంతువులను వేయించడం తప్పే కాదన్న మూఢత్వంనుంచి బైటపడి ఉండేవాడూ కాదు. జీవితం విలువలను పునర్నిర్వచించే సంధిదశలో తప్పనప్పుడు సంఘర్షణా తప్పు కాదు అంటాడు గౌతమబుద్ధుడు. 'విష పాత్రనెత్తి త్రావెడి మహాయోగి కన్/ గొనలలో తాండవించిన యహింస/ సిలువపై నిండుగుండెలు గ్రుమ్మరించు' దయామూర్తి నుదుట పారాడు శాంతి/హృదయేశ్వరిని వీడి కదలు ప్రేమతపస్వి బరువు చూపుల పొంగిపొరలు కరుణ/ శిరసు వంచక స్వేచ్ఛ కొరకు పోరాడు వీరాగ్రణి హృదయాన నలరు దీక్ష'- ఒక్కొక్కరిది ఒక్కో సంఘర్షణ మార్గం. చివరికి అన్నీ మనిషిని చేర్చింది మాత్రం- ఒకే స్వేచ్ఛా సుఖసుందర స్వర్గధామానికే. దాశరథి కృష్ణమాచార్యుల వారన్నట్లు- ముసలి దశరథుడు వయసు భార్య కోరికను కాదనే సాహసం చేయనందుకే సీతాపహరణం వంటి దారుణం జరిగింది. చెరసాల దుఃఖాన్ని అనుభవిస్తూ కూడావసుదేవుడు చేసిన సాహసంవల్లే కంసవధ వంటి సత్కార్యం సాధ్యమైంది. 'ఈదవలెను- ఈది నెగ్గవలెను' అని పురందరదాసు పాడిందీ జీవవైతరణిని ఈదే సాహసం గురించే!

శిష్యుడిగా స్వీకరించని గురువూ తలవంచింది రాజీలేని ధైర్య లక్షణానికే. సూత పుత్రుడని పరిహసించిన రాధేయుడికి పట్టం కట్టించిందీ ఈ పట్టువదలని సాహసతత్వమే. 'కలశ రత్నాకరమ్ము/ అమృత భాండమ్ము పడసినా రమరవరులు'- కాని ఎంత మథనము?- అంటారు నాయనివారు. కరుణశ్రీ విజయశ్రీలో అన్నట్లు 'తాతలు వంటి వారయిన తప్పదు లోబడి పోదురోయి/ ధర్మేతర శక్తులెట్లు తలయెత్తును ధర్మంబు సన్నిధిన్?'- నిజం. కానీ, కావాల్సింది ధర్మపక్షానే చివరివరకు నిలబడి తలబడగల తెగువ. శిల శిల్పంగా మారాలంటే ఉలిపోటుకు తట్టుకోక తప్పదు. పొదలోని వెదురులన్నీ వేణువులవుతాయా? నిలువెల్ల గాయాలైనా పులకించే రాగాలతో లోకాలను అలరించాలని పలవరించే వెదురుకే పిల్లంగ్రోవి భాగ్యం. స్పందించడమంటే హృదయాల్ని పోగులుగా మార్చి సమాజంకోసం వస్త్రాన్ని నేయడం- అంటాడు ఖలీల్ జిబ్రాన్. అంత శ్రమకోర్చి 'పావన మభ్ర గంగ'ను భగీరథుడు భువికి దింపింది తన దప్పిక తీర్చుకోవడానికా? ఎవరైనా ఎవరెస్టు శిఖరాన్నెక్కేది కలకాలం అక్కడే కాపురం చేయడానికా? 'మనిషి మొక్కవోని పోరాటపటిమముందు ఎంత కాంచన శిఖరమైన లొంగి మొక్కవలసిందే'నన్నది టెన్జింగ్ సాహస పర్వతారోహణ సందేశం. 'స్వాతంత్య్రం లేని బ్రతుకు చావుకన్న హీనమని/ భీతిలేదు... లే లెమ్మని జాతినంత మేలు కొలిపే' పిలుపే నాటిభగత్ సింగ్ ఎత్తిన తిరుగుబాటు బావుటా. 'ఎట్లాగూ సమరం తప్పదు/ మాట్లాడితే శంఖం ఊదినట్లుండాలి' అన్న నేటి మహిళ సమరోత్సాహానికి నాటి సాహసమూర్తుల తీరే స్ఫూర్తి. ముందుతరం దివిటీలకు తరవాతి తరం వెలుగుదారి. 'స్పందించే మనిషి ప్రకృతి కనే మంచికల. భీరువు దాని పీడకల'- అంటాడు తిలక్.

లోకమే కాదు... జీవితమూ రణక్షేత్రమే. శాంతికీ అశాంతికీ ధర్మానికీ అధర్మానికీ న్యాయానికీ అన్యాయానికీ నిత్యం సమరమే. 'సిరులు దొరగి ఘోర వనసీమల చెట్టుకు పుట్టకొకరై/ యరగినవారు' ఒకరు. 'దొరలై తెక తేరకు తీయగా తినన్/ మరగినవారు' మరొకరు. 'అలతి మాటలతో 'ధర' యిత్తురయ్య/ సంగరమున గదలు, గాండివముల్, చెరలాడ కుండగన్/' అని, పరమాత్ముడంతటివాడే ధర్మ సంస్థాపనార్థం సంఘర్షణ తప్పదని తేల్చేశాడు. 'దేహమా కంపించుచున్నది. ద్రోహమా అనిపించుచున్నది. మోహమేదో కుంచుచున్నది' అంటూ వృథా సందేహాలతో కింకర్తవ్య విమూఢచిత్త చాంచల్యానికి లోనైతే- లోకంలో ఇంక వికాసానికి చోటేదీ? 'కొంపలుగాల్చు దుండగీతనముపై చూపించు అనుకంపమూ ధార్మికహింసే' అని యజుర్వేదవాదం. గజ్జెల మల్లారెడ్డి హెచ్చరించినట్లు'బతుకు పూతోటలో ముళ్లపొదలు బలిసినపుడు' పలుగుకో పారకో పనిచెప్పటం తప్పు కాదుగా! ధర్మానికి కొమ్ముకాయడమంటే కొమ్మువిసరే దుర్మార్గంతో కుమ్ములాటకు దిగటమే. బైబిలైనా, భగవద్గీతైనా, ఖురానైనా, గ్రంథసాహిబ్ అయినా జీవితానికి చెప్పే భాష్యం- స్థితప్రజ్ఞతకు అవసరమైన సాహసంతో భవితను బంగారుమయం చేసుకొమ్మనే! మనిషి రెండుకాళ్లమీద నిటారుగా నిలబడి నేటికి రెండులక్షల సంవత్సరాలు. పడినప్పుడల్లా మళ్ళీ లేచి నిలబడి, పరుగులుపెట్టి, వేగం పెంచి పడే ఆ ఆరాటానికి అడ్డొచ్చే అవరోధాలకు ఎదురొడ్డటమే జీవన పోరాటం. జీవితం అంతిమ లక్ష్యం ప్రశాంతతే కావచ్చు. కానీ అది బండరాయిలో ఉండే స్తబ్ధత కాదు. 'రెండురెళ్లు నాలుగు' అన్నందుకు గుండ్రాళ్లు విసిరే గూండాతనం గుండెల్లో నిద్రపోవడమే నిజమైన చైతన్యం. నాడు జాతి స్వాతంత్య్రంకోసం బాపూజీవంటి సమరవీరులు చేసింది అహింసా పోరాటం. నేడు జాతికి పట్టిన అవినీతి చీడను పారదోలడానికి అన్నా హజారే వంటి సాహసవంతులు చేస్తున్నదీ అదే శాంతిపోరాటం. సంఘర్షణ అంటే, జాతి కొత్త జవసత్వాల ఆవిష్కరణ అన్నది చరిత్ర చెప్పే సత్యం!

Sunday, September 11, 2011

సరస్వతీ నమస్తుభ్యమ్‌..



పలు సందియములు దొలచును/ వెలయించు నగోచరార్థ విజ్ఞానము- అన్నది చదువుమీద చిన్నయసూరి సదభిప్రాయం. అక్షరం లోకం చక్షువు. నిరక్షర కుక్షిని గుడ్డి కుక్కతో పోల్చారు పురందరదాసు. 'సంతకుపోయి తిరిగిన దుడ్డుపెట్టె కాక దొరకేనా?' అని ఆ యోగి ఎకసెక్కాలాడినట్లే గాలికి తిరిగి తన పుత్రులెక్కడ జనుషాంధులవుతారోనని పంచతంత్రంలో పాటలీపుత్రం రాజు తెగ మథనపడిపోతాడు. అహరహము హరి నామస్మరణ మరిగిన ముద్దుల పట్టిని తిరిగి దారికి తెచ్చుకుందామంటే హిరణ్యకశిపుడికీ ముందుగా తోచింది సద్గురువుల వద్ద లభించే సద సద్వివేక చతురత కలిగించు విద్యాబుద్ధులే! చదవనివాడజ్ఞుండగునని రాక్షసుడైనా అక్షర మహిమను చక్కగా గ్రహించాడు. ఇప్పుడంటే విద్య పరమార్థం అర్థ సంపాదన గానీ... ఏకలవ్యుడు ఆ కాలంలో ఏ కాసులు ఆశించి గురుబ్రహ్మను బొమ్మగా తీర్చిమరీ విద్యలకోసం వెంపర్లాడాడు! కర్ణుడు పరశురాముని వద్ద పడీపడీ శుశ్రూషలు చేసింది కాలక్షేపం కోసమైతే కాదు గదా! మృతసంజీవనీ విద్యకోసం కచుడు చేసిన సాహసం సామాన్యమైనదా! ఆత్మ పరమాత్మల పరమ రహస్యాలను గురుముఖతః గ్రహించాలన్న కామనతోనే గదా జాబాలి గౌతముని మున్యాశ్రమంలో అన్నేళ్లు ఎడతెగక గొడ్లూ-గోదలను కాసింది! విద్యార్జనకెంత విలువలేకపోతే ఆ బాలగోపాలుడు సాందీప మహాముని ఆశ్రమంలో గుంట ఓనమాలు దిద్దుకుంటాడు! అవతార పురుషుడు ఆ తారకరాముడు సైతం తాటకి వధకు ముందు వశిష్టులవారి వద్ద వేద పారాయణాల్లో తర్ఫీదు పొందినవాడే! విద్యా సముపార్జనను ఓ విధిగా నిర్దేశించిన బ్రహ్మచర్యం చతురాశ్రమాల్లో ప్రథమమైనదే కాదు... ప్రధానమైనది కూడా. భారతీయులకు చదువు చెప్పే గురువు సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపం.పురందరదాసు ప్రబోధించిన విధంగా గురువుకు 'గులాము అయ్యేదాకా ముక్తి దొరకదన్నా' అన్న సూక్తి మనిషికి చదువు మీదున్న భక్తిశ్రద్ధలకు పెద్ద నిదర్శనం.

భర్తృహరి బోధించినట్లు విద్య నిగూఢ గుప్తమగు విత్తము. పూరుషాళికి రూపము,యశస్సు, భోగకరి, విదేశంలో ఆదుకునే ఆపద్బంధువు. హర్తకు అగోచరమైన నిధి, సుఖపుష్టి, సత్కీర్తి ఘటించు ఈ దివ్యధనం విద్యార్థి కోటికి పూర్తిగా ధారపోసినా పెరిగేదే గాని తరిగే ద్రవ్యం కాదు. నిజానికి మనిషికి భుజకీర్తులు, సూర్య చంద్రహారాలు పెద్ద అలంకారాలు కావు. చందన స్నానాలూ, మందార మాలలు అందచందాలను ఏమంత పెంచనూ లేవు. వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణమ్‌- అన్న భర్తృహరి వాదనను కొట్టిపారేయలేము. ఆ రాచకవి అన్నట్లు నిజంగా విద్య నృపాల పూజితమే. కాకపోతే మనుచరిత్ర కర్త అల్లసాని పెద్దనామాత్యుని 'ఎదురైనచో మద కరీంద్రము నిల్పి కేయూత యొసగి' కృష్ణరాయలంతటివారు సరదాకి అయినా ఎక్కించుకుంటారా? వల్మీకజుడైన వాల్మీకి మహర్షికి కమలజన్మునితో సరిసమానమైన గౌరవ మర్యాదలందటానికి కీలకం రామాయణా రచనేనంటే ఏమనగలము? సుభాషిత రత్నావళి భాషించినట్లు చందమామకు తారాతోరణం, పతీపత్నులకు పరస్పర సాహచర్యం, పృథ్వీమతల్లికి సద్భూపాల సుపరిపాలన భూషణాలయితే... విద్య మాత్రం సర్వేసర్వత్ర సకల లోకాలకూ ఒకే మాదిరైన సద్భూషణం. 'డొక్క శుద్ధిలేని మనిషితేనె బొట్టులేని పట్టు' అంటారు ఖలీల్‌ జిబ్రాన్‌. మనిషిజన్మ ఎత్తినందుకైనా నాలుగు మంచిముక్కలు నాలుకమీద ఉంచుకోనివాడిని- వజ్రవైఢూర్య ఖచిత ఘటకంలో తెలకపిండి వంటకంకోసం మంచిగంధపు చెక్కల్ని మంటపెట్టినవానికన్నా వెయ్యిరెట్లు అధిక మూర్ఖునిగా చిత్రించింది విద్యానీతి. చదువుకన్నా చక్కదనం, చక్కనిధనం ముల్లోకాలుగాలించినా ఎక్కడా దొరకదనేదే సర్వశాస్త్రాల సారం.

'చదువు సంధ్యలు' ఎంత చక్కని జంట పదం! జీవిత సంధ్యను రాగరంజితంచేయగలిగే చేవ చదువుకు మాత్రమే ఉందని ఎంత వింతగా ధ్వనిస్తున్నదీ పదం!బతుకు ధర్మక్షేత్రంలో మంచిచెడ్డల మధ్య జరిగే నిత్య కురుక్షేత్రంనుంచీ మానవుడిని మాధవునిలాగ కాపాడగలిగేది ఓనమాలే! సర్వరోగాలకు మూల కారణమైన తాపత్రయంవల్ల అంతిమంగా జరిగే నష్టం ఆయుక్షీణం- అన్నది రుగ్వేదవాదం. ఆ యావనుంచి మనసును మళ్లించి మంచి దోవకు తిప్పగల తారకమంత్రం మనచేతిలోనే ఉందని మానసిక వైద్యులూ చెబుతున్నారు. ఆరోగ్యసిద్ధికి... అమరత్వలబ్దికి పుస్తక పఠనమే ఉత్తమ సోపానం అని ఇప్పుడు లండన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులూ పేర్కొంటున్నారు. ఒక దశ దాటిన పిదప వయసుతోపాటు మనసు వడలిపోవడం సహజ పరిణామమే. నిష్కాముకత్వం దానికి నిఖార్సైన ఔషధం కావచ్చుకానీ... ఆ యోగం అందరికీ అంత సులభంగా అందివచ్చే అందలమా? బద్దెన నీతిశాస్త్రంలో కుండ బద్దలుకొట్టినట్లు ధనం, ఉషోదయం, యవ్వనం, వండిన అన్నం, మూర్ఖుడి స్నేహం లాగా మానవ జీవితకాలమూ బుద్బుధప్రాయమే. 'ఆయువు నూరు సంవత్సరములందు సగంబు నశించె నిద్రచే/ నా యరలో సగంబు గతమయ్యెను బాల్య జరాప్రసక్తి చే/ బాయక తక్కిన యట్టి సగబాలు గతించు బ్రాయస వృత్తిచే!' ఆ మిగిలిన సగభాగంలోనైనా పడుచుదనంతో పరవళ్లు తొక్కాలని ఎవరికి ఉవ్విళ్ళూరదు!పుస్తక పఠనం ఓ వ్యసనంగా మలుచుకున్నవారి ఆయుర్దాయంపెరగడమేకాదు... ఉన్నంత కాలం చలాకీగా చిందులెయ్య గలుగుతారని లండన్‌విశ్వవిద్యాలయ పరిశోధక బృందం జరుపుతున్న పరీక్షల ఫలితం నిగ్గు తేల్చింది.మానవ కణాలల్లోని క్రోమోజోముల చివర జీవితకాలాన్ని నిర్దేశించే 'టెలొమెర్‌'లు ఉంటాయనీ... అవెంత దీర్ఘంగా ఉంటే జీవితకాలమంత సుదీర్ఘంగా సాగుతుందని ఆ బృందం నాయకుడు ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ హోల్గేట్‌ వాదం. పుస్తకాల పురుగులలో ఈ టెలొమెర్‌ కణం పొడుగు పెరుగుతుంటుందనేది పరిశోధనల సారాంశం. ఇంకేం... ఏడు పదులు దాటినా చేతికి కర్ర రాకుండా చలాకీగా ఉండాలంటే వెంటనే ఓ మంచి పుస్తకంతో 'పఠనాయోగం' ప్రారంభించటం మంచిది కదూ!
(సంపాదకీయం, ఈనాడు, ౨౯:౦౫:౨౦౧౧) 

Saturday, February 26, 2011

మొదలు ఎక్కడో , చివర అక్కడే.






ఏ దారమో పపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం.. అన్నారు సిరివెన్నెల ఒక పాటలో..
ఎంత గూడార్ధం దాగుందో అనుకున్నాను ఆ పాట విన్నప్పుడు.
అప్పుడే పుట్టిన పసికందు ని చూశాను మొన్న. ముడతలు పడిన చర్మం, బలం లేని వేళ్ళు, నిలపలేని మెడ..సృష్టి విచిత్రానికి ప్రత్యక్ష సాక్ష్యం గా ఉంది ఆ చిట్టి రూపం.
అప్పుడే పుట్టిన పాపాయి చేతికి స్పర్శ తెలియదు. తన వేళ్ళూ ఉన్నాయన్న విషయమే తనకి తెలియదు. కాలక్రమేణా ఆ చిట్టి చేతుల ఉపయోగం, వాటి ఉనికి తెలిసి వస్తుంది. బలం కలిగే కొలది, వాటి పట్టు పెరుగుతుంది.
అలాగే వాళ్ళు పుట్టిన వెంటనే ఎవరిని కళ్ళతో గుర్తించలేరు. స్పందించలేరు. కాని వినగలరు, చూడగలరు.
ఐనా అంతా మనకి ముద్దుగా, ఎంతో కనువిందుగా ఉంటుంది. ఎంత చిన్న చిన్న చేతులో, ఎంత చిన్న కాళ్ళో అంటూ తెగ ముద్దు చేస్తాం. ముచ్చట పడతాం.
మొత్తం కాకపోయిన, ఇంచు మించు ఇదే శరీర స్థిథి మనిషి జీవిత కాలం లో ఇంకోక సారి వస్తుంది. వార్ధక్యం లో.
కాని అప్పుడు ఏదీ ముద్దుగా , ముచ్చటగా అనిపించదు. వాంగి పోయిన అవయవాలు, పట్టు లేని చేతులు, వాలిపోతున్న తల..మొదలు ఎలాగో, చివర అలాగే..

ఎమి రాని, చేతకాని పసి బిడ్డకు సర్వం తానే అయ్యి చూశే తల్లి, తిరిగి తన వృధ్యాపం లో ఆ బిడ్డకు భారమయి పోతోంది.. ఇది మనిషి సృష్టించిన చిత్రం. సృష్టి విచిత్రం ముందు మనిషి సృష్టించిన చిత్రం బలం గా లేదు?

నీ చేతులకు సత్తువ లేనప్పుడు నా చేతులే నీ చేతులుగా చేసి నీకు అన్ని చేశాను, నీ కు నడక రానప్పుడు నా చేతులు అందించి నీన్ను నడిపించాను, నువ్వు కింద పడిపోతే నేను కంట నీరు పెట్టాను, మరి నా చేతుల లో సత్తువ లేనప్పుడు, నువ్వు నాకు నీ చేయి అందించాలి కదా?

చిట్టి రూపాన్ని చూసినప్పుడు ముచట వేయటానికి కారణం ఏమిటి? ముసలి రూపాని చూసినపుడు కలగపోవటానికి కారణం ఏమిటి?

రెండు శరీరాలే కదా?

కొన్ని కారణలు ఉన్నాయి.

పసితనం నిషకల్మషమైనది. వారి ఆలోచనలు, ఆశలు, అభిరుచులు, కనీసం వారి ఊహ కూడా మనకి తెలియదు. అది దైవత్వం. ఎమి రాయని కాయితం.

కాని వృధ్యాప్యం అలా కాదు. కనీసం మనం అలా అనుకోము. అవయవాలలో బలం లేకపోయినా, ఏమీ ఆలోచించే స్థితిలో వారు లేకపోయినా, వారి జేవితం కాలం అనుభవాలు, లోటు పాట్లు, ఇష్టాయిష్తాలు, రాగ ద్వేషాలు మనకు తెలియటమే..

నిజంగా అవసరమొచ్చినా, వారికి సహాయ పడటానికి ఆలోచిస్తాం, పూర్వపు అనుభవాలను మర్చిపోము. ఆ సందర్భం లో అలా అన్నారని, లేక మన మాటతో ఏకీభవించలేదని..గుర్తు తెచ్చుకొని మరీ కారణాల పరదాలను అడ్డు కట్టేస్తాం.

కాని సృష్టి తీరు ని గౌరవించాలి. పుట్టినపుడు ఎలా ఉందొ, పోయేటప్పుదు శరీర స్థితి అలాగే ఉంటుంది కాబట్టి, ఏ అరమరికలు లేకుండా, వీళ్ళని వాళ్ళలాగే స్వీకరించగలిగితే ఆ రెండు దశలలో లేని మనం దైవత్వాన్ని పొందినట్టే!

Friday, January 21, 2011

చిన్ని చిన్ని ఆశ



ప్రాచీన ప్రాకృతగాథల్లో ఒక పచ్చిబాలింత ఉదంతం ఉంది. ఆమెది పూరిగుడిసె. బయట హోరున వర్షం. పాక పైకప్పు కొబ్బరాకు పందిరిలా ఎక్కడికక్కడ కారిపోతోంది. దుర్భరమైన తనస్థితిని తలచుకుని ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. ఒళ్ళో పసిబిడ్డ తడిసిపోతాడన్న బెంగతో తన చీరకొంగును గొడుగులా ఎత్తి పట్టుకుంది. అయినా, ఆ శిశువు తడిసిపోతూనే ఉన్నాడు- వర్షపునీటి వల్లకాదు, ఆమె కార్చే కన్నీటివల్ల- అంటాడు కవి!అనునిత్యం దుఃఖంతో నానుతూ కష్టాలతో కుదేలవుతూ, నిస్సహాయంగా కుమిలిపోయే వ్యధార్తజీవుల యథార్థజీవిత సగటు ముఖచిత్రం సరిగ్గా అలాంటిదే. బాధలతో సతమతం కావడం ఒకవైపు, వాటినుంచి పారిపోయేందుకు అనువైన దారులను వెతుక్కోవడం మరోవైపు- మానవజీవితాన్ని సంక్షోభానికి గురిచేస్తున్నాయి. 'ఔను నిజం! ఔను నిజం! జీవఫలం చేదునిజం' అన్న మహాకవి పలుకులు ఆ దుస్థితికి ప్రత్యక్ష వ్యాఖ్యానాలు. మనిషిని నిరాశ ఆవరిస్తోంది. భయం పీడిస్తోంది. బతుకు బరువై తోస్తోంది. ఇలాంటి సమయంలో మనిషి తప్పక గుర్తుచేసుకోవలసిన ఒక అద్భుతమైన మాట పేరు- 'ఆశ'. మనిషి బతుక్కి గొప్ప చేయూత- ఆశ! కొండెక్కిపోబోతున్న దీపానికి చమురు చుక్కలాంటిది ఆశ. విడిచిపోతున్న ప్రాణాలను పట్టి నిలబెట్టేది ఆశ. 'చిగురంత ఆశ- జగమంత వెలుగు' అన్నది పరమసత్యం. సీతాన్వేషణ క్రమంలో హనుమంతుడు తిరిగితిరిగి విసిగి వేసారిపోయాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. చనిపోదామని సైతం అనుకున్నాడు. చితాం కృత్వా ప్రవేక్ష్యామి... సమిద్ధమ్‌ అరణీసుతమ్‌... అరణి సంభవుడైన అగ్నిని రగిల్చి ఆ చితిలో దేహత్యాగం చేద్దామని సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆ స్థితిలో ఎక్కడో... అంతరాంతరాల్లో చిన్న ఆశ మొలకెత్తింది. సీతమ్మ కంటపడుతుందన్న విశ్వాసం చివురించింది. బతికి యున్నచో సుఖములు బడయవచ్చు... జీవన్‌ భద్రాణి పశ్యతి... అనుకున్నాడు. తిరిగి ప్రయత్నం సాగించాడు. అద్భుత విజయం సాధించాడు. తాను బతికాడు, తోటి కపివీరుల్నీ బతికించాడు.

నేను బాగుండాలి, మీరూ బాగుండాలి అనేది చిన్నమాటేగాని- దాని ప్రభావం చాలా గొప్పది. వ్యక్తిత్వ వికాస గ్రంథాల్లో సంచలనం థామస్‌ హేరీ 'అయామ్‌ ఓకే... యు ఆర్‌ ఓకే'కి కేంద్రవృత్తం అదే. 'ఈ సిద్ధాంతాన్ని అక్షరాలా అమలుచేస్తే ప్రతి మనిషికీ అంతులేని ఆనందం లభిస్తుంది, ఆయుర్దాయం పెరుగుతుంది' అంటాడు హేరీ. 'సర్వేజనాః సుఖినోభవన్తు' అనే ఆర్యోక్తికి భావానువాదం అది. జీవితంలోంచి మనిషి పారిపోవడాన్ని భారతీయ సారస్వతం కూడా ఎన్నడూ సమర్థించదు. ఆశావహమైన దృక్పథంతో సానుకూల వైఖరితో ముందుకు సాగాలన్నదే మన పెద్దల తీర్పు. 'కర్మాణి కుర్వన్నేవ జిజీ విషేత్‌' కర్మాచరణంతో మనిషి జీవించడాన్ని కోరుకోవాలన్నది- భారతీయ సామాజిక జీవనానికి మూలసూత్రం! క్షణశః కణశశ్చైవ విద్యామ్‌ అర్థంచ సాధయేత్‌... క్షణక్షణమూ విద్యనూ కణకణంగా డబ్బునూ సంపాదిస్తూనే ఉండాలని నిర్దేశించిన ఈ దేశం- పనినే తప్ప పలాయన వాదాన్ని ఏనాడూ బోధించలేదు. 'ఇక ఏడురోజులే బతుకుతావు' అన్నప్పుడుపరీక్షిత్తు బెంగతో ఏడుస్తూ కూర్చోలేదు. భాగవత శ్రవణం ద్వారా- చనిపోతున్నానన్న స్థితినుంచి తాను శరీరాన్ని విడిచిపెడుతున్నానన్న స్థితికి చేరాడు. మృత్యువు పట్ల కూడా సానుకూల ధోరణిని ప్రదర్శించాలన్నది భాగవత సందేశం. విజేతలెవరూ పారిపోరు. పారిపోయేవారంతా విజయానికి దూరమవుతున్నట్లు లెక్క. మాట్లాడటం సరిగా రాదని బాల్యంలో హేళనకు గురైన విన్‌స్టన్‌ చర్చిల్‌ ప్రపంచం చెవులొగ్గిన వక్త అయ్యాడు. పొట్టివాడివి, సినిమాలకు పనికిరావు పొమ్మన్న చార్లీఛాప్లిన్‌ నటనకే పాఠ్యగ్రంథం అయ్యాడు.గెలవాలన్న కోరిక కడుపులో నిరంతరం కణకణలాడుతూ ఉండటమే- ఆశావాదం, సానుకూల దృక్పథం!

సానుకూల వైఖరి, ఆశావహ దృక్పథం మనిషికి విజయాన్ని అందిస్తాయని వ్యక్తిత్వ వికాసగ్రంథాలు వివరిస్తున్నాయి. ఆశావాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల హార్వర్డ్‌కు చెందిన హెల్త్‌వాచ్‌లో ప్రచురితమైన ఒక నివేదిక- ఆయుర్దాయం పెరగడానికి సైతం ఆశావాదమే కారణమని తెలియజెప్పింది. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో నిరాశావాదులకన్నా ఆశావాదులు త్వరితంగా కోలుకుంటున్నట్లు ఆ పరిశోధనలో బయటపడింది. త్వరగా నిరాశకు గురయ్యేవారిలో అధిక రక్తపోటు మూడురెట్లు ఎక్కువనీ, గుండెజబ్బుల ముప్పు రెండు రెట్లనీ తేలింది. ఫ్రెంచి విప్లవంపై తాను అద్భుతంగా రూపొందించిన రాతప్రతి ప్రమాదవశాత్తూ దగ్ధం కావడంతో- థామస్‌ కార్లయిల్‌ అంతటి గొప్ప రచయిత నిస్పృహకు లోనయ్యాడు. కుంగిపోయాడు. ఒకరోజు ఇటుక ఇటుకగా శ్రద్ధగా గోడ నిర్మిస్తున్న తాపీమేస్త్రీ పనితనం చూసి స్ఫూర్తిపొంది, రోజుకో పేజీ రాసినా చాలనుకుంటూ- ఆశావహ దృక్పథంతో తిరిగి రచన చేపట్టాడు. అది మొదటిదానికన్నా బ్రహ్మాండంగా రూపొందడం చూసి తానే ఆశ్చర్యపడి, రెట్టించిన ఉత్సాహంతో ఉద్గ్రంథాన్ని పూర్తిచేశాడు. జేజేలు అందుకున్నాడు. 'మనిషి చనిపోవచ్చుగాని- ఓడిపోకూడదు' అని పాశ్చాత్యగ్రంథాలు బోధిస్తాయి.'నువ్వు' చనిపోవడం అనేదే ఉండదు, ఎందుకంటే నువ్వు అమృతపుత్రుడివి- అని భారతీయ తత్వశాస్త్రం ధైర్యం చెబుతుంది.నిండునూరేళ్లు చూద్దాం. జీవం తొణికిసలాడుతూ నూరేళ్లూ ఉందాం. నూరేళ్లూ సంతోషంగా ఉందాం. నూరేళ్లూ విందాం. నూరేళ్లూ మాట్లాడుతూ ఉందామని ప్రోత్సహిస్తుంది. మనిషి సర్వస్వాన్నీ కోల్పోయినా, రేపనేది ఒకటి మిగిలే ఉంటుందని తప్పక గుర్తుంచుకోవాలి!

Monday, November 29, 2010

జీవిత పరమార్థం


'కోటి గ్రంథాల సారాంశాన్ని నేను అర్ధశ్లోకంలోనే చెప్పగలను. అదేమిటంటే- పరులకు ఉపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం' అన్నాడు కవి కులగురువు కాళిదాసు. 'పరోపకారార్థమిదమ్‌ శరీరమ్‌' అన్నది ఈ వేదభూమిలో నిత్యం ప్రతిధ్వనించే రుషివాక్కు. సమాజంలో సౌభ్రాతృత్వ భావన వెల్లివిరియడానికి, మనసున విశాల దృక్పథం పెంపొందడానికి, మనుషుల మధ్య పరస్పర ప్రేమానురాగాలు పరిఢవిల్లడానికి- యావత్‌జగత్తుకు ఈ నేల అందించిన దివ్యసందేశమది.శరీరమున్నది ఇతరులకు ఉపకారం చేయడానికేనన్న ఆ ఆర్యోక్తికి భారతీయ సంస్కృతి యుగయుగాలుగా పట్టం కడుతూనే ఉంది. మనిషి సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడటంకంటే పుణ్యప్రదమైన కార్యమేముంటుంది? స్వకార్యాల కోసమేకాక, ఇతరులకు ఉపకారం చేయడానికీ శరీరాన్ని సాధనంగా మలచుకోవలసింది మనిషే. 'అనిత్యాని శరీరాణి' అంటూ అందరికీ బోధించేవారిలో చాలామంది, స్వవిషయంలో మాత్రం 'అంతా మాకే రానీ' చందంగా వ్యవహరించడం కద్దు. తనువు అశాశ్వతం, సిరులు అస్థిరం, భోగభాగ్యాలు తాత్కాలికమన్న ఎరుకతో- తమ శక్త్యానుసారం సాటివారిని సమాదరించే వితరణశీలురూ ఎందరో ఉన్నారు ఈ లోకంలో. 'జీవితం కరిగిపోయే మంచు/ ఉన్నదాంట్లోనే నలుగురికీ పంచు' అన్న కవి వాక్కును సార్థకం చేస్తూ ఆపన్నహస్తం అందించేవారు ఆర్తుల పాలిట ఆప్తులూ ఆత్మబంధువులే. మనిషికి అమ్మ ఒడిలాంటి ప్రకృతి కూడా పరోపకారతత్వానికి ప్రతీకే. దాహార్తిని తీర్చే సెలయేరు, వూరటనిచ్చే చిరుగాలి, ఛత్రమై నిలిచే చెట్టునీడ- ప్రకృతి ప్రసాదితాలైన ఇవన్నీ తమ ఉనికి పరుల మేలుకేనని చాటుకుంటున్నవే.
స్వసుఖాలకంటే సామూహిక శ్రేయానికే పాటుపడటం సత్పురుషులకు సహజాలంకారం. 'తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాప్తకుల్‌ సజ్జనుల్‌...' అన్నాడు సుభాషితకర్త భర్తృహరి. అలా- పరోపకారమే పరమావధిగా తమ జీవిత ప్రస్థానం సాగించిన మహనీయులు ప్రజల గుండెల్లో భగవత్‌ స్వరూపులుగా కొలువై ఉంటారు. రామానుజాచార్యుల చరితమే అందుకు దృష్టాంతం.
ఎవ్వరికీ చెప్పకూడదంటూ గురువు తనకు ఉపదేశించిన తిరుమంత్రాన్ని రామానుజులవారు అందరికీ వెల్లడించారు. గురువుకు ఇచ్చిన మాట తప్పి- 'ఓమ్‌ నమోనారాయణాయ' అన్న ఆ మంత్రాన్ని బహిర్గతం చేయడంవల్ల తనకు నరకం ప్రాప్తించినా ఫరవాలేదన్నారు. ఓ గోపురశిఖరం పైకి ఎక్కి... జాతి, మతం, కులవిచక్షణ లేకుండా సమస్త ప్రజానీకం చెవిన పడేలా ఆ మంత్రాన్ని ఎలుగెత్తిచాటారు. తిరుమంత్రం మహిమ 'ఇంతమందికి మోక్షాన్ని, స్వర్గాన్ని ప్రసాదిస్తున్నప్పుడు- నేనొక్కణ్నీ నరకానికి పోవలసివస్తే మాత్రమేం, ఆనందంగా వెళ్తాను' అన్న నిండుమనసు ఆయనది.
 పరుల మేలుకోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించినందునే శిబి చక్రవర్తి, దధీచి మహర్షిమహాదాతలుగా చిరకీర్తిని సొంతం చేసుకున్నారు. దానశీలత, ధర్మనిరతి, దయాగుణం, సత్యవచనం, రుజువర్తనం- 'రాజుల పాలిటికివి రాజయోగంబులు' అన్నాడు వేమన. ఆ గుణగణాలన్నీ మూర్తీభవించిన శిబి- తనను శరణు వేడిన పావురాన్ని రక్షించడంకోసం ప్రాణాల్ని అర్పించడానికీ సిద్ధపడ్డాడు. దానవ సంహారార్థం ఆయుధాలను అర్థిస్తూ తన కడకు వచ్చిన దేవతల కోసం శరీరాన్నే త్యజించిన రుషి దధీచి.

జీవసమాధి పొందిన దధీచి వెన్నెముకే దేవేంద్రుడి వజ్రాయుధంగా రూపుదాల్చిందని ప్రతీతి.
 సశరీరంగానే కాదు, మరణానంతరమూ మానవదేహానికి పరమార్థం లోకోపకారమేనన్నది శిబి, దధీచి వృత్తాంతాలు బోధిస్తున్న నీతి.

'మ్రోడు మందారాలు పెడుతుంది/ అటు చాపి, ఇటు చాపి అభయహస్తాలల్లి/ జగమంత పందిరిని కడుతుంది' అంటూ చెట్ల జీవలక్షణాన్ని అక్షరీకరించారు కృష్ణశాస్త్రి ఓ కవితలో.శాశ్వతంగా జీవితం మోడువారే వేళ- పరోపకారానికి పందిరి పరవడం ద్వారా- తాము లేకున్నా తమ పేరు నిలిచిపోయేలా పుట్టుకను సార్థకం చేసుకుంటున్నవారెందరో. మరణానంతరమూ సమాజానికి ఉపయోగపడాలన్న సదాశయంతో- వైద్య పరిశోధనల నిమిత్తం తమ పార్థివ శరీరాన్ని ఆసుపత్రులకు అప్పగించాలని ఆకాంక్షిస్తున్నవారున్నారు. లోకమంతా చీకటైపోయినవారికి తమ కళ్లతో వెలుగులు పంచాలని కోరుకుంటున్నవారున్నారు. ఆ మేరకు వాగ్దాన పత్రాలపై వారు సంతకాలు చేస్తున్నారు కూడా. ప్రమాదవశాత్తో, ఇతరత్రానో మృత్యుముఖంలోకి వెళ్లిన తమ పిల్లల అవయవాలను- ఇతరులకు అమర్చడానికి పెద్దమనసుతో సమ్మతి తెలుపుతున్న తల్లిదండ్రులున్నారు. ఓ చిన్నారి... ముప్ఫై ఏళ్లలోపు వయసున్న ఓ జంట కలల పంట... పుట్టిన నాలుగోరోజునే కనుమూసింది... అమ్మకు, అయ్యకు గుండెకోత మిగిల్చి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఈ మధ్యనే... పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువున అదిమిపట్టి ఆ తల్లి తన పసికూన అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది. భర్త, బంధువులు ఆ మహత్కార్యాన్ని ప్రోత్సహించారు. ఆ కసిగందు హృదయనాళాలను ఇద్దరు పసివాళ్లకు, కళ్లను మరో ఇద్దరు బిడ్డలకు అమరుస్తామంటున్నారు వైద్యులు. అమ్మ పక్కలో పడిన తరవాత నాలుగు రోజులకే మృత్యుఒడిలోకి చేరిన పాప- భౌతికంగా లేకపోవచ్చు. కానీ, ఆ చిట్టితల్లి- తన హృదయనాళాలు అమర్చిన ఇద్దరు చిన్నారుల ప్రాణస్పందనలో ఉంటుంది. తాను దృష్టి ప్రసాదించిన మరో ఇద్దరు చిన్నారుల కళ్లల్లోనుంచి ఈ లోకంలోని అద్భుతాలను, సౌందర్యాన్ని వీక్షిస్తూనే ఉంటుంది. 'మృతినెరుంగని ఒంటిదేవతలకన్న/ నలుగురికి మేలు చేసెడి నరుడె మిన్న' అన్న గాలిబ్‌ సూక్తికి ప్రతిబింబమై వెలుగులీనుతూనే ఉంటుంది!

Saturday, October 9, 2010

మానవతా మహాపతాకం

మానవతా మహాపతాకం


'ప్రకృతిలో మానవుడే పరమాద్భుత పరాకాష్ఠ-' అంటూ మనిషి ఔన్నత్యానికి అక్షరాభిషేకం చేశాడు హరీన్‌ చట్టో. తన మనుగడను శాసించజూసే సవాళ్లను తిప్పికొడుతూ, ప్రతిబంధకాలను అధిగమిస్తూ- జీవన యవనికపై మనిషి నిత్యం ఆవిష్కరించవలసిన మనోజ్ఞదృశ్యం ఆ సార్వకాలీన సత్యమే.'కాలమా! నీకు బానిస కాను/నీవు ఎంత ఎదురొడ్డినను నేను ఎదుగగలను' అన్నంత ధీమా అడుగడుగునా సాక్షాత్కరించే మానవ జీవితం ఒక మహా సాహసికయాత్ర. కాలప్రవాహంలోని ఆటుపోట్లకు వెరవకుండా సంకల్పబలంతో కడవరకు సాగాల్సిన ప్రయాణమది. ఆ ప్రస్థానంలో- 'రానీ, రానీ, వస్తే రానీ! కష్టాల్‌, నష్టాల్‌... రాట్లూ, పాట్లూ రానీ రానీ' అన్న శ్రీశ్రీ మహితోక్తి మనిషి మీటే జీవన గానానికి పల్లవియైు రవళించాలి. కష్టాల్ని ధిక్కరిస్తూ, నష్టాల్ని వెక్కిరిస్తూ, విజయహాసం చిందిస్తూ- జీవనపథంలో గమ్యం వైపు నిర్నిరోధంగా పురోగమించేవారే కార్యసాధకులవుతారు. మొక్కవోని ధైర్యంతో, సడలిపోని స్త్థెర్యంతో ముందడుగు వేసే మనిషి- లక్ష్యం చేరుకోవడానికి ఏదీ అడ్డంకి కాదు, అంగవైకల్యంతో సహా! తునకలుగా ఉన్నా, మెలికలు తిరిగిన రూపంలో ఉన్నా బంగారం జిగి ఎప్పటికీ తగ్గనిదే. దాని విలువా ఎన్నటికీ తరగనిదే. అలాగే- శారీరకంగా అంగ వైకల్యమున్నా, జ్ఞానేంద్రియాల్లో లోపమున్నా మనిషి గుండె దిటవు, ఆత్మధృతి ఏనాటికీ చెక్కుచెదరనివే. సమున్నతమైన ఆ లక్షణాలే దిక్సూచిగా... 'బాధల్లో మునుగుతాను- సంతోషాల్లో ఉదయిస్తాను/నేను మానవ సూర్యుణ్ని'అన్న శేషేన్‌ వాక్కును సాకారం చేస్తున్నట్లు జీవన రస్తాపై పయనిస్తున్న ధీరత్వం అంగవికలురది!
మూగతనం, బధిరత్వం, అవిటితనం, అంధత్వం వంటి వైకల్యాలు మనిషి దేహానికే తప్ప, మనోధైర్యానికి ఉండవు. తెలుగు కవిత్వానికి గంధర్వగాన సొబగులద్దిన కృష్ణశాస్త్రి దాదాపు ఏడు పదుల వయసులో తన గొంతుక మూగవోయిన తరవాత కూడా 'ఐన నేమాయె- మూగవోయిన నా గళమ్మునను గూడ/ నిదురవోయిన సెలయేటి రొదలు గలవు'అనిపించేలా రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. శ్రవణేంద్రియాలు పనిచేయకపోతే మాత్రమేం, బధిరులు- ఎదుటివారి పెదవులపై కదలాడే మాటల్లోని మంత్రలిపిని చదివి, వారి మనసును అర్థం చేసుకోగలరు. పాశ్చాత్య సంగీతలోకంలో ధ్రువతార బీతోవెన్‌ బధిరుడు. తాను వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయినా- సంగీత సాధనను విడనాడకుండా, సమాజానికి సంగీత మధురిమలను పంచిపెట్టిన కళాకారుడతడు. తడబడుతూనే కాదు, ప్రయత్నబలంతో వడివడిగా అడుగులు వేయడానికీ అవిటితనం అడ్డుకాదు. పరుగు పందేలకు వికలాంగులూ 'సై' అనడం అందుకు ఓ నిదర్శనం. పోటీ మొదలైంది.... అవిటితనంతో లెక్కేమిటన్నట్లు పోలియోగ్రస్త పిల్లలు వూతకర్రల సాయంతో పరుగులాంటి నడకతో కదులుతుంటే మైదానంలో మిన్నుముట్టేలా హర్షధ్వానాల హోరు... పరుగు పందెంలో గెలుపురేఖకు ఒకేఒక్క అడుగు దూరంలో ఉన్న బాలుడు హఠాత్తుగా ఆగిపోయి వెనకడుగు వేశాడు. తనతో పాటు పోటీలో పాల్గొంటూ ఉన్నట్టుండి పడిపోయిన మరో బాలుడి వద్దకు చేరుకున్నాడు... అతణ్ని లేవనెత్తి మైదానం వెలుపలికి తీసుకెళ్లాడు... మిగిలిన పోటీదారులూ అతణ్ని అనుసరించారు... పందెంలో విజయం కాదు, కింద పడిపోయిన సాటి వికలాంగుడికి చేయూతనిచ్చి నిలబెట్టడమే ముఖ్యమని చాటిన పెద్దమనసు ఆ చిన్నపిల్లవాడిది. అందరిలోనూ మారాకు తొడగవలసింది- మానవత్వ పరిమళాల్ని వెదజల్లిన ఆ స్ఫూర్తే! ఫిడేలు నాయుడుగారుగా సుప్రసిద్ధులైన ద్వారం వెంకటస్వామి పాక్షికంగా అంధులు. అయితేనేం, కవి నారాయణబాబు అన్నట్లు- వాయులీనంమీద తన వేళ్ల విన్యాసంతో ఆయన 'నిశ్శబ్దపు నీలి నీలి అంచులనే మ్రోగించి' సంగీత వర్ణమయ జగత్తును రసజ్ఞుల కళ్లకు సాక్షాత్కరింపజేశారు.
ఏడాదిన్నర పసిపాపగా ఉన్నప్పుడే సోకిన వ్యాధి వల్ల అమెరికన్‌ మహిళ హెలెన్‌ కెల్లెర్‌ కంటి వెలుగులు ఆరిపోయాయి. వినికిడి శక్తినీ పూర్తిగా కోల్పోయిందామె. లోకమంతా చీకటైపోయిన ఆమె- మూడేమూడు రోజులు భగవంతుడు తనకు మళ్లీ చూపును ప్రసాదిస్తే, ఆ వెలుగుల్ని ఎలా ప్రసరింపజేయాలన్న వూహలకు రెక్కలు తొడిగింది. ఆ డెబ్భైరెండు గంటల్లో తొలుత- అప్పటివరకు తాను స్పర్శ సాయంతోనే గుర్తించిన బంధువుల్ని, నేస్తాల్ని, తనకు అన్నిటా చేయూతనిచ్చి జీవిత పాఠాలను నేర్పిన టీచర్ని చూడాలన్నది ఆమె ఆకాంక్ష. పొలాల్లో నడుస్తూ ప్రకృతి శోభను తిలకించాలని, అడవులు, కొండలు, నదులు, ద్వీపాలను వీక్షించాలని ఆమె అభిలాష. జనసమ్మర్దంతో కలకలలాడుతున్న న్యూయార్క్‌ నగర వీధుల్ని, పార్కుల్లో ఆడుతూపాడుతూ కేరింతలు కొడుతున్న చిన్నారుల్ని, శ్రమజీవన సౌందర్యాన్ని కళ్లకు కడుతూ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికుల్ని చూడాలని ఆమె కోరిక. ఈ లోకంలోని అందాలను చూడటానికి కనీసం మూడురోజులైనా దృష్టిభాగ్యం లభిస్తే చాలనుకున్న కెల్లెర్‌ ఆర్తి- కనుచూపు కరవైనవారందరిలోనూ ఉంటుంది. అటువంటివారి కంటివెలుగుపై కమ్ముకున్న కారుమబ్బుల్ని తొలగించి, వారికి శాశ్వతంగా చూపు ప్రసాదించేందుకు- తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి పలువురు ముందుకు వస్తుండటం శుభపరిణామం. ఆ మహత్కార్యంలో రంగారెడ్డి జిల్లాలోని దేవుని ఎర్రవెల్లి గ్రామం అందరికీ మార్గదర్శకమై నిలిచింది. ఆ పల్లె ప్రజలందరూ తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి సంసిద్ధత వ్యక్తంచేశారు. ఆ మేరకు తొలి విడతగా వెయ్యిమంది- తమ కళ్లను దానం చేయడానికి అంగీకారం తెలుపుతూ ఇటీవల వాగ్దాన పత్రాలపై సంతకాలు చేసి మానవీయవిలువల మహాపతాకాన్ని ఆవిష్కరించారు. బెడ్డ దెబ్బకు గాయపడి నీటిబొట్టు కదలాడితే, చెరువులోని నీరంతా చలించిపోయినట్లు- విధి చిన్నచూపు చూసిన సాటివారిని ఆదుకోవడానికి ఒక్కుమ్మడిగా తరలివచ్చిన ఊరు దేవుని ఎర్రవెల్లి దైవత్వానికి జేజేలు!

అలౌకికం




అలౌకికం










వేయి రేకలుగా విప్పారిన మానవ మేధ- సృష్టికే మారాకు తొడగడంలో ముందంజ వేస్తూనే ఉంది. జనన మరణ రహస్యాలపై నిరంతరం కొత్తకొత్త ఆవిష్కరణలకు కర్తృత్వం వహిస్తూనే ఉంది. అది- పరీక్ష నాళికల్లో శిశూదయాలకు పురుడు పోసింది. మనిషిని పోలిన మనిషిని పునఃప్రతిష్ఠించేందుకు నాందిగా క్లోనింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. కృత్రిమశ్వాస అమరికతో ప్రాణచలనంలో చేతనత్వానికి ఊపిరులూదుతోంది. జీవాధారమైన రక్తజలధారను కృత్రిమంగా రూపొందించే మార్గాలను వెదుకుతోంది. వ్యాధులు, వార్ధక్యం, మృత్యువు- ఈ మూడూ మనిషిని నిత్యం భయపెడుతూనే ఉంటాయి. వాటి బారినుంచి తప్పించుకోలేరెవరూ. అలాగని- తెలిసితెలిసీ చేతులారా వాటిని కొని తెచ్చుకోవాలనీ ఎవరూ అనుకోరు. 'తగిలి జరయు రుజయు/ దైవవశంబున నయ్యెనేని అనుభవింత్రుగాక/ యెరిగి కడగి యా రెంటిని జేకొందురయ్య యెట్టి కుమతులైన?' అంటూ తండ్రి యయాతికి తమ యౌవనాన్ని ఇచ్చేందుకు ఆయన నలుగురు కుమారులు నిరాకరించడం- 'మహాభారతం'లోని కథ. మనిషిపై ముసిరే మొండివ్యాధుల్ని ఔషధాస్త్రంతో లొంగదీసుకుంటున్న మానవ మేధస్సు ఇప్పుడు- మనిషికి శతాధిక సంవత్సరాల ఆయుష్షునిచ్చే అమృతగుళిక తయారీలో నిమగ్నమైంది. భావి తరాలకు భవ్యమైన కానుకగా అది- ఏనాటికైనా మరణానికి మరణశాసనం రాసే రోజూ రావచ్చు. అంతవరకు మృత్యువు ముందు మానవాళి తలొంచక తప్పదు. కాలానికి బాకీలాంటి జీవిత రుణం చెల్లుబడకపోతే 'జాలిలేని మృత్యువెపుడొ జప్తు చేయు'నన్న ఆత్రేయ- 'చావంటే నాకు భయంలేదు. నేనుండగా అదిరాదు. అది వచ్చినప్పుడు నేనుండను' అని చమత్కరించడంలో అంతరార్థం అదే.

కొసరు పిసరంతైనా వేయని పిసినారి దేవుడు- అసలు తూకంలోనే మోసం చేసి ఆనందాన్ని, ఆయుఃప్రమాణాన్ని తగ్గిస్తాడట! ఆ మాటే చెబుతూ 'అందమైన ఉదయాలూ స్పందించే హృదయాలూ/చందనం, చంద్రకళా, సరదాలూ స్వప్నాలూ/ ఇన్నిటినీ సమకూర్చిన పసందైన గారడీ/ చటుక్కున మడతపెట్టి చేస్తాడు టెరిబుల్‌ ట్రాజెడీ-' అని తేల్చిచెప్పాడు కవి తిలక్‌.జీవిత నాటకానికి తెరదించే ఆ విషాదయానంలో- ప్రతిప్రాణీ చివరికి చేరుకోవలసిన తుది మజిలీ మృత్యువే. అది- మనిషిని అదృశ్యరూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఏ క్షణాన, ఏ విధంగా విరుచుకుపడేదీ ఏ మాత్రం తెలియనీయకుండా మనిషి చుట్టూ తారట్లాడుతూనే ఉంటుంది. అదను చూసి మెరుపుదాడికి దిగుతుంది. గుండె స్పందనపై అది విసిరిన నిశ్శబ్దపు పంజా ధాటికి తెగిన నాడుల తీగలు- చర్మం కింద ప్రవహిస్తున్న పాటకు ఉరి పేనుతాయి. హంసగీతాలాపన హఠాత్తుగా ఆగిపోతుంది! అజంతా అన్నట్లు 'భయ విభ్రమాల మధ్య విషాద వాక్యంవలె సాగే జీవితంలో మృత్యువు ఒక్కటే నిజం' అని అందరికీ ఎరుకే. అయినా, మానవుడికి జీవితేచ్ఛ వాడదు. మృత్యుభీతీ వీడదు. బతుకు భ్రమల్లో విహరిస్తున్నాడనో, ప్రాణభయంతో వణికిపోతున్నాడనో మనిషిపై మృత్యువు దయచూపదు. అతణ్ని తరలించుకుపోకుండాను ఆగదు. మనిషితో ఆడే దాగుడుమూతల్లో దానిదే పైచేయి. ఎక్కడినుంచో వచ్చే విద్యుత్తు తళుక్కున వెలిగించే గాజుబుడ్డీ లాంటిదే దేహదీపమని వర్ణిస్తూ- 'వృద్ధాప్యంలోనో, బాల్యంలోనో, యౌవనంలోంచో/ ఎప్పుడో మన దేహం ఫిలమెంట్‌ రాలిపోతుంది' అన్నాడు 'చితి-చింత' కావ్యకర్త మోహన్‌ప్రసాద్‌.

మృత్యువంటే భయంతో పాటు, మనుషుల్లో మరణేచ్ఛా అంతర్భూతంగా ఉంటుందని, మరణాన్ని ఔదలదాల్చితే అనంతానుభూతి కలుగుతుందని ఓ ప్రముఖ రచయిత ఉవాచ. జీవిత ప్రస్థానాన తాను అంతిమంగా తిరగక తప్పని ఆఖరి మలుపు... మృత్యువంటే మనిషిలో వెరపు సహజమే. అలా భయపడినంత మాత్రాన, వేళ ముగిసిన జీవనపత్రం నేలరాలకుండా ఉండదు. మృత్యుప్రహారాన్ని మౌనంగా అతడు అనుభూతించకా తప్పదు. శ్రీశ్రీ అన్నట్లు 'మృత్యు నిశ్శబ్దాన మృదు జీవరవళి' ఆ సమయంలో అతనికి వినవస్తుందో, లేదో తెలియదుకానీ... మరణం అంచులదాకా వెళ్లి బయటపడినవారిలో కొందరు- ఆ అపస్మారక స్థితిలో తమకు కొన్ని వింత అనుభూతులు కలిగినట్లు చెప్పడం కద్దు. ఆఖరి ఘడియలకు చేరుకున్న సంధి సమయంలో- ఇష్టదైవాలు కట్టెదుట నిలిచినట్లు; శరీరం తేలిపోయినట్లు; మంచంపైనే శరీరాన్ని వదిలేసి- ఏదో వెలుగు దారి చూపుతుంటే చుక్కలలోకంలోకి వెళ్లిపోయినట్లు- ఇటువంటి అనుభూతులేవో తమను ఆవరించినట్లు వారు చెబుతుంటారు. అవన్నీ వారి భావనలు మాత్రమేనని అంటున్నారు శాస్త్రజ్ఞులు. చనిపోయేముందు మనిషి శరీరం, మెదడు తీరు ఎలా ఉంటుందన్న అంశంపై- జార్జి వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన లఖ్మీర్‌ చావ్లా ఓ అధ్యయనం నిర్వహించారు.'మరణానికి ముందు మనిషి మెదడుకు రక్తం ప్రసరించడం క్రమేణా తగ్గిపోతుంది. ప్రాణవాయువు స్థాయి పడిపోతుంది. మెదడులోని విద్యుత్‌ తరంగాలు చివరిసారిగా కంపిస్తాయి. వాటి ప్రకంపనలు అలలు అలలుగా మనిషి ఆలోచనల్ని కదిలిస్తాయి. చనిపోయేముందు తాము ఆస్వాదిస్తున్నట్లుగా- మృత్యుశయ్యపై ఉన్నవారు పలవరించే అనుభూతులన్నీ ఆ ఆలోచనల ప్రభావమే' అని చావ్లా చెబుతున్నారు. మెదడులో ముప్ఫై సెకన్లనుంచి మూడు నిమిషాలవరకు కనిపించిన ఆ విద్యుత్‌ తరంగాల అలజడి పూర్తిగా సద్దుమణగడం మృత్యువుకు సంకేతం అని ఆయన అంటున్నారు. అవసాన సమయాన మగత నిద్రలో దృశ్యాదృశ్యంగా కదలాడే భావనాచిత్రాలను అనుభూతించడం ఒక్కటేనేమో- మరో లోకంలోకి మరలిపోయే మనిషి కడకు తన వెంట తీసుకువెళ్లగలిగేది!

Thursday, September 23, 2010

నవ్వు నలభైవిధాల మేలు




'ఎంతటి ఆయుధమైనా సరే, ప్రమాదకరమైనది కాదు- అది కోపాన్ని నిగ్రహించుకోలేనివారి చేతిలో పడేదాకా!' అన్నాడొక ఆంగ్లరచయిత. మనిషి స్వభావాల్లో ఎక్కువ ప్రమాదకరమైనది కోపం. దానికి విరుగుడు హాస్యం. హాస్యచతురత అలవడితే కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. అవతలివారి కోపాన్ని చల్లార్చేందుకూ హాస్యం ఉపకరిస్తుంది. పేద కుర్రవాడొకడు హోటల్లోకి చొరబడి, మస్తుగా ఫలహారాలు సేవించాడు. సొమ్ము చెల్లించమనేసరికి డబ్బులు లేవని బిక్కమొహం వేశాడు. ఆ యజమానికి కోపం ముంచుకొచ్చింది. చాచిపెట్టి గూబమీద కొట్టాడు. పిల్లవాడు ఆ దెబ్బకు గిర్రున తిరిగి కిందపడ్డాడు. కాసేపటికి తేరుకొని, మెల్లగా 'అయ్యా! ఈ లెక్కన నేను రోజూ రావచ్చా' అని అడిగాడు. యజమానికి ముందు నవ్వు వచ్చింది. ఆ తరవాత కన్నీళ్లు వచ్చాయి. కుర్రవాడి మీద అంతలావు కోపం ప్రదర్శించినందుకు సిగ్గుపడ్డాడు. హాస్యప్రవృత్తి మనిషిని ఆరోగ్యవంతుణ్ని చేస్తుంది. 'రోజుకు ఒకసారైనా మనసారా బిగ్గరగా నవ్వని రోజు జీవితంలో వృథా అయినట్లే' అన్నాడొక రచయిత. 'నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అని ప్రముఖ సినీదర్శకులు జంధ్యాల చెప్పిన మాట తెలుగునాట విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సృష్టిలో నవ్వగలిగే జీవి మనిషి ఒక్కడే! కనుక నవ్వు మనిషిసొత్తు. నవ్వు నాలుగిందాల చేటు- అనేది నమ్మదగిన మాటకాదు. నవ్వుకుని వదిలేయవలసిన మాట.

'నాలో హాస్యప్రవృత్తి లేకుంటే నేను ఏనాడో ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చేది' అన్నారు గాంధీజీ. కోపంలోంచి, నిరాశలోంచి తేలిగ్గా బయటపడటానికి మనిషి హాస్య చతురతను అలవరచుకోవాలి. కోపం ముంచుకొచ్చినప్పుడు- పాతకాలం తెలుగు మాస్టర్లు తిట్లకు హాస్యాన్ని ముసుగువేసేవారు. ఒక మంత్రిగారి సుపుత్రుడు కళాశాలలో బాగా అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను ఏడిపించేవాడు. వాణ్ని ఏమీ చెయ్యలేక ఒక తెలుగు మాస్టారు 'ఓరి ఇరవై అయిదూ, ఇరవై ఆరూ! నోర్మూసుకు కూర్చో' అనేవారు. అది తిట్టో ఏమిటో అర్థమయ్యేదికాదు. చివరికి కళాశాల నిమంత్రణ ఉత్సవం(ఫేర్‌వెల్‌)లో కొందరు విద్యార్థులు 'గురువుగారూ చివరిరోజు కదా, ఇవాళైనా ఆ ప్రహేళిక విప్పండి' అని అడిగారు. దానికి ఆయన 'తెలుగు సంవత్సరాల పేర్లు వెతుక్కోండి' అన్నారు. తీరాచూస్తే ఇరవై అయిదు- ఖర, ఇరవై ఆరు నందన! అంటే, రోజూ వాణ్ని 'గాడిదకొడకా' అని ఆయన కసితీరా తిట్టేవారన్నమాట. 'నోరా వీపుకి తేకే' అన్న సూత్రాన్ని ఆయన తన హాస్య చతురతకు ముడివేసి ఆపద రాకుండా చూసుకునేవారు. ఒకోసారి చట్టసభల్లో ఉద్రిక్తతలను సైతం హాస్యధోరణి చల్లబరుస్తుంది. కేంద్రమంత్రులు సంప్రదాయ అంబాసడర్‌ కార్లు వదిలేసి, విదేశీ వాహనాల కొనుగోలుపట్ల మొగ్గు చూపడంపై చట్టసభలో పెద్ద దుమారం రేగింది. 'పెద్దపెద్ద విదేశీ కార్లలో మహారాజుల్లా తిరగడం- ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ఘోరం' అంటూ ప్రతిపక్షసభ్యులు విరుచుకు పడ్డారు. సభలో ఉద్రిక్తతలు చెలరేగాయి. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి లేచి 'అవును నాకు ఇష్టం లేదు... అంతపెద్ద కారులో నావంటి పొట్టివాడు కూర్చుంటే బయటికి అసలు కనపడడు' అన్నారు. సభ గొల్లుమంది. గాంభీర్యం తొలగిపోయింది. హాస్యస్ఫురణ కారణంగా ఒకోసారి అనుకోని ప్రయోజనాలు జతపడతాయి. చైనా దురాక్రమణ సందర్భంగా మనదేశం కోల్పోయిన భూభాగం విషయమై- డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా ఆవేదనగా ప్రసంగిస్తున్నారు. 'గడ్డికూడా మొలవని వృథా భూభాగం కోసం ఇంత రభస చెయ్యాలా' అని నెహ్రూజీ ఆ వాదనను తోసిపుచ్చారు. వెంటనే డాక్టర్‌ లోహియా 'మీ బట్టతలపై కూడా ఏమీ మొలిచే అవకాశం లేదుకదా, అదీ వృథా అని ఒప్పుకొంటారా' అని అడిగారు. అంతవరకూ ఆయన చేసిన ప్రసంగం సాధించలేనిదాన్ని- ఈ ఒక్క చమత్కారపు ప్రశ్న సాధించింది. లోహియా హాస్య చతురతకు నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది.

హాస్యచిత్రాలు చూసినా, చమత్కారాలు విన్నా- మనిషి దేహంలో 'ఇంటర్‌ ఫెరాన్‌ గామా' రెట్టింపవుతుంది. అనారోగ్య లక్షణాలను పారదోలే విలువైన రసాయనమది. పెదాలకు ఫెవికాల్‌ అంటించుకున్నట్లు ఎప్పుడూ గంభీరంగా ఉండే మాజీ ప్రధాని ఒకరు తెలుగులో రాజేంద్రప్రసాద్‌ హాస్య చిత్రాలను ఇష్టపడేవారు. ఆయన ఆరోగ్య రహస్యం హాస్యం అన్నమాట! మనిషి విరగబడి నవ్వినప్పుడు మెదడు నుంచి విడుదలయ్యే రసాయనాలు రక్తపోటును తగ్గించి, గుండెను తేలికచేస్తాయని సైన్సు నిరూపించింది. అందుకే వైద్యులు బాగా నవ్వమని సలహా ఇస్తున్నారు. నవ్వును ఒక చికిత్స (లాఫింగ్‌ థెరఫీ)గా ప్రయోగిస్తున్నారు. 'కూర ఇలా తగలబడింది ఏమిటి?' అని గర్జించే భర్తకు- హాస్య చతురత అలవడినా, నవ్వు విలువ బోధపడినా- 'ఈ కూర నువ్వు చేసినట్లు లేదే!' అని అడగడం చేతనవుతుంది. ఈ రెండో రకమే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని, ఎక్కువ ప్రయోజనకరమైనదని తెలుస్తుంది. తద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. ఇది కేవలం వ్యక్తిగతమే కాదు, సంస్థాగతం కూడా. ఇంట గెలిచినవాడు రచ్చగెలవడం నేరుస్తాడు. ఇప్డుడు పెద్దపెద్ద సంస్థల్లోనివారు ఈ నైపుణ్యాన్ని సాధన చేస్తున్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు రిచర్డ్‌ బ్యాండ్లర్‌ 'లాంగ్వేజి పేటర్న్‌'లో చెప్పిన సూచనలు ఈ తరహావే. 'ఖరీదైన సౌందర్య లేపనాలకన్నా మనిషి మొహాన్ని ఆకర్షణీయంగా చూపించేది- పెదాలపై చక్కని నవ్వే' అని చాలామంది అభిప్రాయం!