Showing posts with label /TELUGU. Show all posts
Showing posts with label /TELUGU. Show all posts

Wednesday, May 2, 2012

ద్రౌపదీ కీచకుల కథ



Keechaka Droupadi Story

స్త్రీలను ఎవరైనా కించపరుస్తుంటే, అవమానిస్తుంటే అపర కీచకుడు అనడం చాలాసార్లు వినేఉంటారు. ఇంతకూ అసలు కీచకుడు ఎవరు, ఏం చేశాడో తెలుసుకుందాం.
అనివార్య కారణాల వల్ల పంచ పాండవులను వివాహం చేసుకున్న ద్రౌపది మహా సౌందర్యవతి. అజ్ఞాతవాసంలో ఉండగా ద్రౌపది, మాలిని అనే పేరుతో సైరంధ్రిగా అంతఃపురంలో అట్టిపెట్టుకోమని అడిగినప్పుడు సుధేష్ణ భయపడింది. విరాటరాజు, ద్రౌపదిని చూసి ఎక్కడ మోహంలో పడతాడోననేది ఆమె భయం. ''పురుషుడి మనసు మహా చంచలమైంది. అందునా నువ్వు వర్ణించనలవి కానంత అందంగా ఉన్నావు..'' అంటూ కపటం లేకుండా మనసులోని మాట చెప్పింది.
ద్రౌపది శాంత చిత్తంతో ''మీరన్న మాట నిజమే. అయితే, ఒకసారి పంచ పాండవులను గుర్తు చేసుకోండి.. వాళ్ళు శౌర్యానికి మారుపేరు. తమ భార్యపై మరో పురుషుడి కన్ను పడితే చూస్తూ సహించరు. పైగా నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. జరగరానిది ఏదీ జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను.. నన్ను మీ అంతఃపురంలో ఉండనీయండి..'' అంది.
ద్రౌపది ముగ్ధమోహన లావణ్యాన్ని చూస్తోంటే ఎంత సందేహంగా ఉన్నప్పటికీ, ఆమె మాటలమీది నమ్మకంతో సుధేష్ణ సరేననక తప్పలేదు. అలా ద్రౌపది సుధేష్ణ అంతఃపురంలో చోటు సంపాదించింది.
సుధేష్ణ భయపడినట్లు ద్రౌపది విషయంలో విరాటరాజు అనుచితంగా ప్రవర్తించలేదు. అయితే, సుధేష్ణ సోదరుడు కీచకుడు ద్రౌపదిని చూసి మోహావేశంలో పడ్డాడు.
''మాలినీ! అందానికి నిర్వచనంలా ఉన్న నువ్వు సైరంధ్రిగా ఉండటం ఏమిటి? నాకు ఈ విషయం మింగుడు పడటంలేదు. సరే, నీ పూర్వాపరాల సంగతి నాకెందుకు? నిన్ను చూడగానే వలచాను. నువ్వు లేకపోతే బతకలేను అనిపిస్తోంది. ఇక నువ్వు సైరంధ్రిగా ఉండాల్సిన అగత్యం లేదు. నా పట్టపురాణిని చేసుకుంటాను. నువ్వు ఒప్పుకుంటే చాలు నీకు సర్వ భోగాలూ కల్పిస్తాను. నువ్వు పరిచారికలా ఉండాల్సిన పని లేదు. నీకింద ఎందరో పరిచారికలు ఉంటారు..'' అంటూ చెప్పాడు.
కీచకుడు ఆమెని ఊరించాడు, బ్రితిమాలాడు, ప్రాధేయపడ్డాడు. ఆమె దేనికీ లొంగకపోయేసరికి చివరికి బెదిరించాడు. అది మొదలు కీచకుడు, ద్రౌపదిని అనేకసార్లు వెంటపడుతూ, వేధిస్తూ, సతాయిస్తున్నాడు. ద్రౌపదిని వేధిస్తున్న సంగతి తెలిసిన భీముడు అసహనంతో రగిలిపోయాడు. వికటించిన ప్రేమకు వికృతంగానే జవాబు చెప్పాలనుకున్నాడు. ఈసారి కీచకుడు వెంబడించినప్పుడు నర్తనశాలకు రమ్మని ఆహ్వానించమన్నాడు.
కీచకుడు మహదానందపడి, ద్రౌపది చెప్పిన సమయానికి నర్తనశాలకు వెళ్ళాడు. లోనికి వెళ్తూనే తలుపు మూశాడు. గదిలో భీమసేనుడు మంచంమీద కూర్చున్నాడు. చూడగానే స్త్రీమూర్తిలా భ్రమింప చేసేందుకు తలపై చెంగు చుట్టుకున్నాడు.
కీచకుడు, ఆ కూర్చున్నది ద్రౌపదేననుకుని సంబరంగా వెళ్ళి చేయి పట్టుకున్నాడు. అంతే.. భీముడు నిమిషంలో కీచకుని నేలకూల్చాడు.

Sunday, February 5, 2012

పుస్తకమే రెక్కల గుర్రం




తెలుగు లోగిళ్లలో తొట్టతొలిగా చిట్టి బాలలచేత పుస్తకం పట్టించినప్పుడు ఒప్పజెప్పించే పద్యం, 'తల్లీ! నిన్ను దలంచి'. బుద్ధి, మనసు కలిసి ఉండే హృదయపీఠంమీద కొలువై ఉన్న చదువులమ్మను- దోషరహితమైన సుస్పష్ట శబ్ద సౌందర్యాన్ని, సుదూర కాలతీరాల వరకు జగన్మోహనంగా వ్యాప్తిచేసే శక్తియుక్తులు ప్రసాదించమని చేసే ప్రార్థన అది. వాగీశ్వరి హస్తభూషణం పుస్తకం. 'తలవాకిటను మెలగు ఆ చెలువ'ను విద్యాధిదేవతగా ఆరాధించే సంస్కృతి భారతీయులది. పుస్తకం, విత్తం, కన్య- వరసగా ధర్మార్థ కామ ప్రతీకలు మనకు. కన్యావిత్తాలు కొందరికే సొంతం. పుస్తక విజ్ఞానం అందరికీ చెందే ఆస్తి. చర్మ చక్షువులతో చూడ సాధ్యంకాని మహితాత్ముల మనోభావాలను, జీవితానుభవాలను ముందుతరాలకు అందజేసే ఉత్తమ సాధనం పుస్తకమే. వ్యాసపీఠంమీద రామాయణం ఉన్నదంటే వాల్మీకి ఆత్మ మనముందు కూర్చుని ధర్మప్రబోధం చేస్తున్నట్లే లెక్క. గీతాపఠనం కొనసాగిస్తున్నప్పుడు సాక్షాత్ ఆ జగద్గురువు ప్రత్యక్షమై జీవితం మీది మన విశ్వాసాలను పెంచుతున్నట్లే. కరుణశ్రీ భావించినట్లు 'కలువలు పూచినట్లు/ చిరుగాలులు వీచినట్లు/ తీవలు తలలూచినట్లు/ పసిపాపలు చేతులూచినట్లు/ ఆత్మలు పెనవేసినట్లు' కవితలు సృజిస్తుంటారు కదా కాళిదాసునుంచి కృష్ణశాస్త్రులదాకా! 'గ్రంథాలు ఆత్మబంధువులు' అంటారు గుంటూరు శేషేంద్రశర్మ. పుస్తకంలో మునిగిన మనిషి పుట్టలో మునిగిన ముని అని ఆరుద్ర చమత్కారం. మనసును సానబెట్టుకొనే చందనపు చెక్క- గ్రంథం. 'గ్రంథ నిలయంబు శారద కనకపీఠి/ గ్రంథ నిలయంబు కవుల శృంగారవీటి/ గ్రంథ నిలయంబు మోక్ష సద్గతికి చీటి' అన్న నాళం కృష్ణారావు గ్రంథాలయ సూక్తి నూటికి నూరుపాళ్లు నిజం.

విశాల విశ్వాన్ని ఓ పుస్తకాల గదిగా కుదించాలన్నా, పుస్తకాల గదిలోనే ఓ విశాల విశ్వాన్ని సృజించాలన్నా అక్షరానికే సాధ్యం. అది త్రేతాయుగంనాటి రాముణ్ని కలియుగ దేవుడిగా మారుస్తుంది. తెలుగు త్యాగయ్యను తమిళుల ఆరాధ్యుడిగా తీరుస్తుంది. కంచెర్ల గోపన్న చెరసాల చీకటి శోకాన్ని రామదాసు కీర్తనలుగా వెలిగించినా, హాలుని గాథాసప్తశతి ఘనతను కథలుగా మనకు ఇప్పుడు వినిపించినా ఆ గొప్పతనమంతా అచ్చక్షరానిదే. గ్రంథస్థ వ్యవస్థే లేకపోతే వేమన వేదాంతం బ్రౌన్ దొరదాకా పాకేదా! అన్నమయ్య పద సంపద ఈ మాత్రమైనా జాతికి దక్కేదా! పరదార కామన, అధికార లాలస, సాధుజన పీడన సర్వనాశనానికి కారణభూతాలన్న ధర్మసూక్ష్మం- రామాయణ, భారత, భాగవతాదులుగా రాయబట్టేగదా నీతులుగా నిలబడింది! హరిశ్చంద్రుని చరిత్రే గాంధీజీని సత్యాగ్రహిగా మార్చింది. గాంధీజీ సత్యప్రయోగాలే మార్టిన్ లూథర్ కింగ్ పోరుకు ప్రేరణ. చదువు ప్రాముఖ్యమేమిటో హిరణ్యకశిపుని నోటే చెప్పించాడు మహాకవి పోతన. విద్యాగంధం లేక జనుషాంధుల్లాగా ఉన్న కొడుకులను విష్ణుశర్మ అనే పండితుడికి అప్పగిస్తాడు 'నీతిచంద్రిక'లోని సుదర్శన మహారాజు. పరవస్తు చిన్నయసూరి భావించినట్లు మంచిపుస్తకం- 'పలు సందియముల దొలచును/ వెలయించు నగోచరార్థ విజ్ఞానము, లో/కులకు అక్షి'. సందేహం లేదు. ఒకప్పుడు విద్యావంతుల ఇంట ఓ పుస్తకాల గదీ తప్పనిసరి. వివాహాది శుభకార్యాల్లో పుస్తకాలు చదివించడం సదాచారంగా ఉండేది. ఇలా- గతంలో గ్రంథపఠనమంటే ఒక సంస్కార చిహ్నం.

కొన్నేళ్లక్రితందాకా పాఠశాలల్లో పిల్లలకు పుస్తకాలే బహుమానాలుగా దక్కేవి. వాటి స్థానాన్ని ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా 'ఎలక్ట్రానిక్ నోట్‌బుక్' ల్లాంటి ఆధునిక పరికరాలు ఆక్రమిస్తున్నాయి. సాంకేతికత ఎంత పురోభివృద్ధి చెందుతున్నా, పుస్తకం స్థానం ఏ ఈ-పరికరం పూడ్చలేనిది. టీవీ, చలనచిత్ర మాధ్యమాలు ఎంత శక్తిమంతమైనా- పుస్తకంలా 'వ్యక్తిగతం' కాలేవు. అమ్మలా బిడ్డకు మంచిమాటలు నేర్పించగలిగేది, బొమ్మల పుస్తకమే! తండ్రినుంచి దండన భయం ఉండొచ్చు. ఏ దండనా లేకుండా మంచిదారి చూపించగలిగేదీ పుస్తకమే! రోమన్ సేనాపతి మార్కస్ అరీలియస్ యుద్ధ ఆందోళనల మధ్య సాంత్వన కోసం శిబిరంలో పుస్తకం పట్టుకుని కూర్చునేవాడు. ఎన్ని రాచకార్యాలున్నా రాయలవారు విధిగా విద్వద్గోష్ఠులు నిర్వహించేవారు. తాళపత్ర గ్రంథాలను తులసిదళాలంత పవిత్రంగా భావించిన తరాలు మన తాతలవి. ఇప్పుడా 'పుస్తకాల పిచ్చి' పిచ్చిపుస్తకాల స్థాయికి దిగజారుతుండటమే దిగులు చెందాల్సిన అంశం. అమెరికన్ రచయిత ఎమిలీ డికెన్సన్ శ్లాఘించినట్లు, పుస్తకం- 'మానవాత్మను మనోవేగంతో స్వప్నలోకాలన్నీ తిప్పి తీసుకురాగల రెక్కల గుర్రం'. ఆ అపూర్వ అనుభవాన్ని పసిపిల్లలనుంచి దూరం చేస్తున్న కంప్యూటర్ సంస్కృతి మీద గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయంవారు పరిశోధనలు సాగిస్తున్నారు. ఆధునిక పరికరాల వినియోగం అతిగా ఉన్న అమెరికా, స్వీడన్ దేశాల బాలలు మేధోపరిజ్ఞాన రంగంలో బాగా వెనకబడిపోతున్నారన్నది వారి తాజా పరిశోధనల ఫలితం. పుస్తక పఠనంమీద అధికంగా ఆధారపడిన ఇటలీ, హంగరీ దేశాల పిల్లల ప్రజ్ఞ- అభివృద్ధి చెందిన దేశాల బాలబాలికల ప్రతిభాపాటవాలకన్నా చాలా ముందంజలో ఉందని పరిశోధకబృంద నాయకురాలు ప్రొఫెసర్ మోనికా రోజెన్ నిర్ధారించారు. మితిమీరిన సాంకేతిక వినియోగ వ్యసన సంస్కృతినుంచి అచ్చక్షరాల సంస్కృతిని తిరిగి అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కన్యాశుల్కం గిరీశంలాగా 'బయింగ్ బుక్స్... బార్బేరియస్!' అని ఈసడించుకుంటే- మనిషి కథ అడ్డం తిరగడం ఖాయం

Thursday, October 14, 2010

చక్కని తెలుగుకు చాంగుభళా!


- రావూరి ప్రసాద్‌
మేడలా, మిద్దెలా, కరెన్సీ నోట్లా, కనకాభరణాలా... 
ఏది నిజమైన ఆస్తి?
ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే-'ఎవరికైనా ఆస్తిఏముంటుంది? సంగీతంలో సప్తస్వరాలు సాహిత్యంలో యాభైరెండు అక్షరాలు!'

నిజం. అసంఖ్యాకమైన రాగాలకు ఊపిరిలూదిన ఏడంటే ఏడు స్వరాలకంటే, అసమానమైన రసరమ్య కావ్యాలెన్నింటికో రెక్కలు తొడిగిన యాభైరెండు అక్షరాలకంటే వేరే కలిమి ఎవరికైనా ఏముంటుంది?

అవును. అజరామరమైన ఆ సప్తస్వరాలే తెలుగువాడిగా నా ఆస్తి! 
అక్షయమైన ఆ యాభైరెండు అక్షరాలే తెలుగువాడిగా నా ఆస్తి!

పట్టుతేనెలోని మధురిమను చిలకరించే నా తెలుగు అక్షరాలకు సాటిరాగల మేడలేవి?

వెన్నెల జలపాతాన్ని కురిపించే నా తెలుగు పదం వన్నెచిన్నెలకు ఏ కనకాభరణాల మిలమిలలు సరితూగగలవు?

నింగీ, నేలా నడుమ నిలువెత్తు సంతకమై నిలిచిన నా తెలుగు వాక్యం ఠీవికి ఏ ఆకాశహర్మ్యం సొగసులు దీటు కాగలవు?

ఆమని సౌందర్యాన్ని తన అక్షరాల్లో సాక్షాత్కరింపజేసే నా తెలుగు 'సరస్వతమ్మ' పలుకుల కలరవాలకు ఎన్ని కరెన్సీ నోట్ల రెపరెపలు సరిపోలగలవు?

రామకథా 'రాగసుధాపానముచేసి' తెలుగు మనసు రంజిల్లడానికి
 త్యాగయ్య నాదమయం చేసిన సంగీతార్ణవంలోని సప్తస్వరాల క్షీరధారలు నా తెలుగు అక్షరాలు-

తెలుగునేల చీకట్లను పారదోలడానికి వేల సంకీర్తనల్లో 
అన్నమయ్య వెలిగించిన 'వెన్నెలవంటి శ్రీవేంకటేశు మంత్రము'లోని మణిదీప్తులు నా తెలుగు అక్షరాలు-

మాధవస్వామికి 
క్షేత్రయ్య అలదిన మధుర పద భక్తిచందనంలోని పరిమళాలు నా తెలుగు అక్షరాలు-

ప్రభువులు సాక్షాత్తు దైవాంశ సంభూతులేనని భావించే కాలంలోనే 'ఇమ్మనుజేశ్వరాధములు' అంటూ 'పాలక దేవుళ్ల' నిజరూపాన్ని బయటపెట్టిన
పోతన ధిక్కార గళంలోని రణన్నినాదాలు నా తెలుగు అక్షరాలు-

'రాజుల్‌ మత్తులు' అంటూ ఆ రోజుల్లోనే ఎలుగెత్తిన 
ధూర్జటి ఘంటారావంలోని గర్జనలు నా తెలుగు అక్షరాలు-

'మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం' అని చాటి దోపిడీలకు, అసమానతలకు, దౌర్జన్యాలకు తావులేని 'మరో ప్రపంచం' వైపు పదండి ముందుకు అంటూ
 శ్రీశ్రీ క్రాంతి గానం మీటిన కత్తి అంచులమీది తళతళలు నా తెలుగు అక్షరాలు-

'ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది' అంటూ
 వైతాళికుడు గురజాడవందేళ్ల క్రితమే నినదించిన భవిష్య వాక్కులు నా తెలుగు అక్షరాలు- నన్నెచోడుని నుంచి నవయుగ కవిచక్రవర్తి జాషువా దాకా, కవిత్రయం నుంచి కృష్ణశాస్త్రి దాకా, వేమన నుంచి విశ్వనాథ దాకా ఎందరెందరో సాహితీ సారస్వతమూర్తులు తమ అమృత కరస్పర్శతో సుసంపన్నం చేసిన తెలుగు అక్షర భాండాగారం మన ఆస్తి!
ద్వారం వెంకటస్వామి నుంచి జనార్దన్‌ వరకు, ఈమని శంకరశాస్త్రి నుంచి షేక్‌ చినమౌలానా వరకు; బాలమురళీకృష్ణ నుంచి నూకల చినసత్యనారాయణ వరకు ఎందరో నాద, గాన యోగులు తమ వేళ్ల కొసలతో, గాత్రమాధుర్యంతో సంపద్వంతం చేసిన సంగీత రసధుని మన ఆస్తి!

ఈ ఆస్తిని కాపాడుకోవాలంటే నిరంతరం తెలుగు అక్షరాలు వెలుగుతుండాలి. తెలుగు పదాలు పల్లవిస్తుండాలి. తెలుగు శబ్దాలు వేదాలై, నాదాలై ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తుండాలి.
 'జాను తెనుగే మేము- జాతి ఘనతే మేము' అంటూ మల్లాది రామకృష్ణశాస్త్రి మోగించిన తెలుగు జయభేరిని సగౌరవంగా అందుకుంటూ తెలుగువారిలో ప్రతి ఒక్కరూ సగర్వంగా ముందుకు సాగాలి!

Monday, August 2, 2010

త్యాగయాగం

- చిమ్మపూడి శ్రీరామమూర్తి
ఈ లోకంలో త్యాగభావంకన్నా మహత్తరమైన గుణం మరొకటి లేదు. ఈమానవజాతి జన్మసార్థకతకు మూలం 'త్యాగం'. త్యాగం ప్రేమవల్ల పుడుతుంది. ప్రేమ స్నేహంవల్ల పుడుతుంది. స్నేహం విశ్వాసంనుంచి ఆవిర్భవిస్తుంది. విశ్వాసం అవగాహన నుంచి జనిస్తుంది. అవగాహనకు మూలం ఆధ్యాత్మిక పరిజ్ఞానం. కనుక ఆధ్యాత్మికతకు త్యాగానికీ అవినాభావ సంబంధం ఉంది.

మానవుడు సహజంగా సుఖం కోరుకుంటాడు. ఎంతో శ్రమిస్తాడు. సంపద పోగుచేస్తాడు. ఆ సంపదలో కొంతభాగాన్నైనా దానరూపంలో త్యాగం చేయాలి. ఈదానం త్యాగంలోని ఒక భాగం. ఏ సంపదనైనా త్యాగభావంతో అనుభవించాలని వేదం చెబుతోంది. మన సంపద ఏ రూపంలో ఉన్నా అందులోని కొంతభాగాన్ని తప్పకుండా ఇతరుల శ్రేయంకోసం వినియోగించాలి. ధనం, ధాన్యం, భూమి, జలం యిలాంటివేవైనా మనం శ్రమించి కూడబెట్టుకుంటే అర్హులయినవారికి వీటిలోని ఎంతో కొంత భాగాన్ని వితరణ చేసి ఉదారవంతులం కావాలి.

జీవించినంతకాలం లోకహితకర్మలే ఆచరించాలి. ఈ లోక హితకర్మలన్నింటిలో త్యాగలక్షణం ప్రథమశ్రేణికి చెందినది. స్వార్థమున్నచోట త్యాగానికి తావే ఉండదు. మానవుడు తనలోని స్వార్థబుద్ధిని క్రమక్రమంగా దూరం చేసేకొద్దీ త్యాగబుద్ధికి హృదయంలో చోటు దక్కుతుంది. 'కర్మలను త్యజించడం సన్యాసం కాదు, కర్మఫలాలను త్యజించడం సన్యాసమనిపించుకుంటుంది' అని గీతావాక్యం. ఒంటరిగా తినటంకన్నా నలుగురితో కలిసి భోజనం చేస్తే కలిగే సంతృప్తి అనిర్వచనీయమైనది. మనకేది లభించినా అది భగవత్ప్రసాదం. దాన్ని వితరణ చేయాలి.

ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పరోపకారం త్యాగమే అవుతుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువూ సజీవమైనా, నిర్జీవమైనా- మననుంచి ఏమీ ఆశించకుండానే... ఎంతటి మహోత్కృష్ట ఫలితాలు, సౌఖ్యాలు ప్రసాదిస్తున్నాయో చూడండి. మేఘం, చెట్టు, గాలి, నీరు, గగనం, నేల... ఏదైనా ప్రాణికోటిని సేవిస్తోందేతప్ప బదులుగా ఏదీ తీసుకోవడంలేదు. ఇంతకన్న మించిన త్యాగం ఏముంటుంది? అదే నేర్చుకోవాలి మనం. అందుకే 'ప్రకృతి మానవుడి మొదటిబడి' అంటారు విజ్ఞులు.

మనదేశం అనాదిగా త్యాగానికి సాకారంగా పరిఢవిల్లుతోంది. మన ఆర్షవాఞ్మయమే అందుకు సాక్షి. తన శరణుకోరిన పావురాన్ని కాపాడటంకోసంశిబిచక్రవర్తి డేగకు తన తొడకోసి మాంసాన్నిచ్చి దాని ఆకలి తీర్చాడు. బ్రాహ్మణవేషంలో వచ్చిన ఇంద్రుడు కోరగానే పుట్టుకతోనే దేహంతో వచ్చిన సహజ కవచకుండలాలను త్యాగం చేశాడు కర్ణుడు. రాక్షస సంహారం కోసం ఇంద్రుడు కోరగానే తన వెన్నెముకను ఆయుధంగా ఇచ్చేశాడు దధీచి మహర్షి.రంతిదేవుడు అడవుల్లో తన ఆలుబిడ్డలతో తిరుగుతుంటే- చాలా రోజులకు దొరికిన అన్నం ఒక భిక్షుడికిచ్చివేసి ముంతలోని నీటితో దాహం తీర్చుకొనేందుకు సిద్ధమవుతాడు. అంతలో మరో యాచకుడు దాహార్తితో యాచించగానే ఆ నీరు అతనికి ఇచ్చేస్తాడు. సత్యంకోసంహరిశ్చంద్రుడు రాజ్యాన్నే త్యాగం చేస్తాడు.శ్రీరాముడు తండ్రి మాటను నిలబెట్టేందుకు అరణ్యవాసం చేసి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, నలుడు, బలిచక్రవర్తి ఇలా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు. అహింసామూర్తి బాపూజీ భారత స్వాతంత్య్రం కోసం తన జీవితమంతా త్యాగం చేశాడు. అల్లూరి, ఆంధ్రకేసరి, తిలక్‌, గోఖలే, భగత్‌సింగ్‌ల త్యాగనిరతిని జాతి మరువగలదా?

నూరు మందిలో ఒకడు శూరుడై ఉంటాడు. వెయ్యిమందిలో ఒకడు పండితుడై ఉంటాడు. పదివేల మందిలో ఒకడు వక్తయి ఉంటాడు. లక్షల్లోనైనా ఒకడు దాత అయి ఉండటం అరుదు. దాత అంటే త్యాగశీలి అయినవాడు. త్యాగానికి రెండు పంక్తుల్లో ఎంతటి మహత్తరమైన అర్థం చెప్పాడు గురజాడ! 'సొంతలాభం కొంత మానుక పొరుగువారికి తోడు పడవోయ్‌!' అన్నారాయన. త్యాగంవల్ల మానవుడిలో తృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పరమపురుషార్థం వైపు తీసుకువెళ్లేదే త్యాగం. యజ్ఞప్రక్రియను త్యాగానికి ప్రతీకగా అభివర్ణించారు సనాతనులు. అందుకే త్యాగమొక యాగం. 'కొట్టితినకు, పెట్టితిను' అనే వేదమే సామాన్యుడికి అవగతమయ్యేలా చెప్పింది. సత్పాత్ర దానంవల్లనే సంపాదన సార్థకమవుతుంది.అధములు 'నాదీ నాదే, నీదీ నాదే' అంటారు. మధ్యములు 'నీది నీదే నాది నాదే' అంటారు. ఉత్తములు 'నీది నీదే, నాదీ నీదే' అంటారు. ఈ ఉత్తమగుణం అలవరచుకుంటే లోకకల్యాణమే! ప్రతిఫలాపేక్షతో చేసే త్యాగం త్యాగమే కాదు. దేశం కోసం, లోకం కోసం చేసే త్యాగానికెవరూ విలువకట్టలేరు. త్యాగంవల్ల కలిగే ఆనందానికీ తృప్తికీ అవధులే లేవు, హద్దులే లేవు.మేరుపర్వతమంత ధనం సంపాదించాలనీ, త్యాగం చేసేటప్పుడు దాన్ని గడ్డిపరకలా భావించాలనీ శాస్త్రోక్తి. ఇదే మన జీవన పరమార్థం.

Tuesday, July 27, 2010

ఇవ్వడంలో ఆనందం


1985లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ 'అమెరికా ప్రెసిడెన్షియల్‌ ఫ్రీడం మెడల్‌'ను మదర్‌థెరీసాకు బహూకరిస్తూ, 'ఈమె దీన్ని భారత్‌కు తీసుకెళ్లి, కరిగించి ఆ డబ్బుల్ని పేదలకోసం ఖర్చు చేస్తుందేవో' అని చమత్కారంగా వ్యాఖ్యానించారు. అవును మరి, ఇచ్చే మనసున్నవారికి ఇవ్వడంలో లభించే తృప్తి మరెందులోనూ దొరకదు.
దానం ఇవ్వడాన్ని వ్యక్తిగత బాధ్యతగా బోధిస్తుంది రుగ్వేదం. తమ ఆస్తిలో పదోవంతు ఆదాయాన్ని దానంగా ఇవ్వాలని బైబిలూ 2.5 శాతం 'జకాత్‌'గా ఇచ్చేయాలని ఖురానూ చెబుతున్నాయి. అంటే అన్ని మతాలూ ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించమనే చెబుతున్నాయి. బహుశా దీన్నే కార్పొరేట్‌ కంపెనీలు తమ అభిమతం చేసుకున్నట్లున్నాయి.
వెున్నటికి వెున్న తన సంపదలో 85శాతం వాటాను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించి దాతల్లోకెల్లా మహాదాత అనిపించుకున్నారు 'బెర్క్‌షైర్‌ హాతవే' ఛైర్మన్‌
వారెన్‌ బఫెట్‌. ఈ వితరణ విలువ సుమారు లక్షా డెబ్భైవేల కోట్ల రూపాయలు. సంతానం కోసం కొద్దిగా అట్టిపెట్టారాయన. దీనికి బఫెట్‌ ఇచ్చిన సమాధానం చాలా చిన్నది, కానీ ఎంతో లోతైంది. 'నువ్వు ఎవరికి పుట్టావన్నదే సమాజంలో నీ స్థానాన్ని నిర్ణయించకూడదు'...అన్నదే ఆ సమాధానం. తన కుమారులనుద్దేశించి ఆయన అలా వ్యాఖ్యానించినా దీన్ని మనం పేదలకూ అన్వయించుకోవచ్చు.
చేసిన మేలును చెప్పుకోకూడదంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అలా చెప్పడమే మంచిదేవో. అప్పుడే ఇంకొకరికి మంచి చేయాలన్న స్ఫూర్తి కలుగుతుంది. మంచి చేయడంలో మించిపోవాలన్న పట్టుదల పెరుగుతుంది. అది పనిలోనైనా ఆపన్నులపట్ల ప్రేమలోనైనా.
పోటీతత్వం... ఇదేగా కార్పొరేట్‌ మంత్రం!
మహా దాతలు!
మనిషి జీవితం డబ్బు, పేరు, తృప్తి చుట్టూ తిరుగుతుంటుంది. వయసు పెరిగినకొద్దీ ప్రాధాన్యాలు మారుతుంటాయి. శాశ్వత తృప్తిని మిగిల్చేది సామాజిక సేవేనని అత్యధికుల విశ్వాసం. అందుకే చేతనైన సాయం చేస్తారు. పారిశ్రామికవేత్తలూ అదేకోవలోకి వస్తారు. అయితే అంతర్జాతీయ వ్యాపారవేత్తలతో పోల్చితే మన ప్రముఖులు ఇచ్చే విరాళాలు తక్కువే. మనకంటే సంపద సృష్టిలో వాళ్లు ముందుండడం అందుకు ఓ కారణం కావచ్చు. కొందరు చేసిన దానధర్మాల సొమ్ము చూస్తే కళ్లు చెదురుతాయి.

* ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అనిపించుకున్నారు అమెరికా పారిశ్రామికవేత్త 
జాన్‌ డేవిసన్‌ రాక్‌ఫెల్లర్‌. గుత్తాధిపత్యానికి పెట్టింది పేరు. అలాంటివ్యక్తిలో సేవాభావం ఉప్పొంగాక విద్య, ప్రజారోగ్యం కోసం తన సగం సంపద ఖర్చుచేశారు. 1913లో ఏర్పడిన రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌కు 25కోట్ల డాలర్లు వితరణ చేశారు. 1937లో ఆయన చనిపోయినప్పుడు, 'నానారకాలుగా డబ్బు సంపాదించిన రాక్‌ఫెల్లర్‌ తన సేవాభావంతో పునీతుడయ్యారు' అంటూ విమర్శకులు ప్రశంసించారు.

* స్కాట్‌లాండ్‌కు చెందిన 
ఆండ్రూ కార్నిగీ అసలు సిసలు వ్యాపారి అనిపించుకున్నారు. తర్వాత మనసు మారి బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ లాంటి దేశాల్లో సేవాకార్యక్రమాలు చేపట్టారు. దాదాపు మూడువేల గ్రంథాలయాలకు నిధులిచ్చారు. తన జీవితకాలంలో 35కోట్ల డాలర్లు ధర్మాలకే వెచ్చించారు. 1919లో మరణించిన కార్నిగీకి ఆస్తిని కొడుకులకు పంచడంలో తర్కం కనిపించలేదు. 'నేను కష్టపడ్డాను. వాళ్లు కాదు'... అదీ ఆయన చెప్పిన సమాధానం.

* తొలినుంచీ మనసున్నవాడిగానే జీవించిన ఫోర్డ్‌ వోటార్‌ కంపెనీ వ్యవస్థాపకుడు
హెన్రీ ఫోర్డ్‌ తన పేరుమీదే ఫౌండేషన్‌ నెలకొల్పారు. కంపెనీలోని కొన్ని షేర్లను మళ్లించి దాన్ని స్వతంత్రంగా సేవలందించేలా నిలబెట్టారు. యాభైదేశాల్లో దీని కార్యకలాపాలు సాగుతున్నాయి. ఒక్క 2006 సంవత్సరంలోనే ఈ సంస్థ అందజేసిన వితరణ రూ.2300 కోట్లు.

*
 'ఇంటెల్‌' సహ వ్యవస్థాపకుడు గార్డన్‌ మూర్‌ ప్రపంచంలో అత్యంత ఉదారస్వభావమున్న దాతల్లో ఒకరు. పర్యావరణ ప్రేమికుడు, రచయిత కూడా అయిన మూర్‌ తన ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటిదాకా అందించిన ఆర్థికసాయం విలువ సుమారు రూ.30,000 కోట్లు.

* 
ప్రపంచంలో తొమ్మిదో అత్యంత ధనవంతుడైన చైనా సంతతి లికా షింగ్‌వ్యాపార సామ్రాజ్యం 50కి పైగా దేశాల్లో విస్తరించింది. హచిసన్‌ వాంపో లిమిటెడ్‌, చ్యుంగ్‌ కాంగ్‌ (హోల్డింగ్స్‌) లిమిటెడ్‌ సంస్థల యజమాని అయిన లికా తన పేరుమీదుగానే ఫౌండేషన్‌ నెలకొల్పారు. దానికి తన బీమా కంపెనీలోని 30 శాతం వాటాను (సుమారు రూ.1200 కోట్లు) విరాళంగా ప్రకటించారు. విద్య, ఆరోగ్యం ప్రధానాంశాలుగా ఆయన వాగ్దానం చేసిన విరాళాల వెుత్తం సుమారు రూ.25,000 కోట్లు.

* ఐక్యరాజ్యసమితికి రూ.4500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు 
టెడ్‌ టర్నర్‌. 'చెక్‌ రాస్తున్నప్పుడు నా చేతులు వణికాయి. నా చేతులారా ప్రపంచంలోకెల్లా ధనవంతుడిని అయ్యే అవకాశం వదులుకుంటున్నాను కదా అనిపించింది' అని చమత్కరించారాయన. పర్యావరణ ప్రేమికుడు అయిన ఈ సీఎన్‌ఎన్‌ వ్యవస్థాపకుడు 'టర్నర్‌ ఫౌండేషన్‌' నెలకొల్పారు.

* హంగెరీలో జన్మించి అమెరికాలో ఆర్థికవేత్తగా ఎదిగిన 
జార్జిసొరోస్‌ స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులతో కోట్లు గడించారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు గురైన నల్లజాతీయులకు ఎన్నో సేవలందించారు. స్వేచ్ఛాయుత సమాజస్థాపనే ధ్యేయంగా 'ఓపెన్‌ సొసైటీ ఇన్‌స్టిట్యూషన్‌' నెలకొల్పారు. యాభై దేశాల్లో విస్తరించిన ఈ సంస్థ ప్రతి ఏటా అందించే ఆర్థిక సాయం సుమారు రూ.1600 కోట్లు.

* 'బ్లూంబర్గ్‌ ఎల్‌పీ కంపెనీ' అధిపతి, న్యూయార్క్‌ మేయర్‌ 
మైకేల్‌ బ్లూంబర్గ్‌2005లో రూ.654 కోట్లు విరాళమిచ్చారు. 987 స్వచ్ఛంద సంస్థలకు ఆ సొమ్మును పంచారు. దానం 
అన్నదానం, రక్తదానం, విద్యాదానం... దానం ఎన్నో రకాలు. ఈ భౌతిక ప్రపంచంలో మనుషులు దానం చేయడం మరచిపోయుంటారని పొరబడే అవకాశముంది. కానీ అది నిజంకాదు. పి.ఆర్‌.ఐ.ఎ.(పార్టిసిపేటరీ రీసెర్చ్‌ ఇన్‌ ఆసియా) సర్వే ప్రకారం
 ఏటా సుమారు ఏడున్నర కోట్ల భారతీయ కుటుంబాలు సేవా కార్యక్రమాలకోసం విరాళాలు ఇస్తున్నాయట. సంస్థాగత దానాల విషయానికొస్తే 2005లో అంతర్జాతీయంగా పేరువోసిన 211 కంపెనీలు ఉమ్మడిగా సుమారు రూ.44,000 కోట్లు దానమిచ్చాయి.

ఎవరైనా దానం ఎందుకు చేస్తారు? దీనిమీదే 
'ఆసియా పసిఫిక్‌ ఫిలాంత్రపీ కన్సార్టియమ్‌' అధ్యయనం చేసింది. దాని ప్రకారం పేదల కష్టాలను చూడలేని జాలిగుణం 68 శాతం మందిని స్పందింపజేస్తోంది. సాయం చేస్తే మనసుకు సంతోషం కలుగుతుందని 48 శాతం మంది జవాబిచ్చారు. మతవిశ్వాసాలవల్ల 46 శాతం మంది దానం చేస్తారు. నిజమైన హీరో
సెలబ్రిటీల్లోకెల్లా దయాగుణం ఉన్నవాడిగా 
జాకీచాన్‌ను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ కొనియాడింది. 1988లో 'జాకీచాన్‌ ఫౌండేషన్‌' నెలకొల్పాడు జాకీ. పేదరికం, ప్రకృతి బీభత్సం ఆయన్ని కదిలించే అంశాలు. సునామీ బాధితులకోసం యునిసెఫ్‌కు రూ.30 లక్షల ఆర్థికసాయం ప్రకటించాడు. ఇల్లులేనివారికోసం పనిచేస్తున్న అమెరికాలోని క్రిసాలిస్‌ అనే స్వచ్ఛందసంస్థకు రూ.45 లక్షలు అందించాడు. రెడ్‌క్రాస్‌, వరల్డ్‌ ఎయిడ్‌ లాంటి డజను స్వచ్ఛంద సంస్థలకు తరచూ విరాళాలు ఇస్తుంటాడు. వెుత్తంగా సుమారు 300 కోట్ల రూపాయలు దానధర్మాలు చేశాడీ యాక్షన్‌హీరో. తన సగం సంపద దానమిస్తానని ఇదివరకే ప్రకటించాడు. ఆ సొమ్ము ముఖ్యంగా యువతకు ఉపయోగపడాలనేది ఆయన కోరిక. జాకీ వ్యక్తిగత ఆస్తి విలువ సుమారు రూ.500 కోట్లు. ఆపదొస్తే ఆదుకుంటాం
ప్రైవేటు కంపెనీలు ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా పాటుపడుతున్నాయి.
ఆరోగ్యసేవలే తీసుకుంటే, బజాజ్‌ సంస్థ ఔరంగాబాద్‌లో 'కమల్‌నయన్‌ బజాజ్‌ హాస్పిటల్‌' నిర్వహిస్తోంది. ముంబయిలోని హరికిషన్‌దాస్‌ ఆసుపత్రికి'ధీరూభాయి అంబానీ ఫౌండేషన్‌' ధర్మకర్త. 'ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌' కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఆసుపత్రులు నిర్మించింది. 'సీఎస్‌ఆర్‌' అంతగా ప్రాచుర్యంలోకి రాకముందునుంచీ సామాజిక బాధ్యతను తనదిగా చేసుకున్న టాటా ముంబయిలో క్యాన్సర్‌ రోగుల కోసం 'టాటా మెవోరియల్‌ హాస్పిటల్‌' నిర్మించింది. ఆదిత్యబిర్లా గ్రూపు పుణెలో 500 పడకలతో 'ఆదిత్యబిర్లా స్మారక ఆసుపత్రి' నిర్మించింది. ఇందులో 60-70 పడకలు పేదవారికోసం కేటాయించారు. హోప్‌ ఫౌండేషన్‌కు అత్యధికంగా నిధులు సమకూరుస్తున్నది ఫినోలెక్స్‌ గ్రూపు. ఇక చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి వెన్నుదన్నుగా ఉన్నవి ఒరాకిల్‌, హెచ్‌పీ, యాహూ లాంటివే. మనరాష్ట్రంలో సత్యం '108' సేవలు తెలిసినవే. 'ముందు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సంపద సృష్టి జరగాలి. తర్వాత దాన్ని పంపిణీ చేయాలి'అంటారు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి. ఆ పంపిణీ సమాజసేవ రూపంలో జరుగుతోంది. ఎన్జీఓలకు అండదండ
గిరిజనుల పునరావాసం నుంచి పురజనుల సంక్షేమందాకా, బాలకార్మికుల విముక్తి నుంచి పల్లెప్రజల అభ్యున్నతి దాకా... పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఎన్నో, 
indianngos.com ప్రకారం దేశవ్యాప్తంగా వీటి సంఖ్య పదిహేను లక్షలు. వీటిల్లో కోటీ 94 లక్షల మంది పనిచేస్తున్నారని 'పీఆర్‌ఐఏ' అంచనా. ఇందులో 85శాతం మంది వలంటీర్లు. మిగిలినవారికి జీతాలు చెల్లించాలి. ఇన్ని లక్షల స్వచ్ఛందసంస్థల్లో సొంతంగా ఆర్థికవనరులు కలిగి ఉన్నవి చాలా తక్కువ. మరి ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? ఎలా సేవలందిస్తున్నాయి? ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, కార్పొరేట్‌ సంస్థల నిధులే ప్రాణాధారం. కాల్గేట్‌, భారతి, సిటీగ్రూప్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌ఎస్‌బీసీ, ఏసీసీ, ఆసియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ...వంటి ప్రతీ సంస్థ కొన్ని ఎన్జీఓలకు అండదండగా ఉంటోంది. 'ఏ సమాజపు సహజ వనరులు వాడుకుని మేము సంపద సృష్టిస్తున్నావో ఆ సంఘానికి మా వంతు సేవ చేసి తీరాలి' అంటారు హీరోహోండా సీఎండీ బ్రిజ్‌వోహన్‌ లాల్‌ ముంజాల్‌.
(Eenadu,16:0

Tuesday, July 13, 2010

ఎవరైనా కావచ్చు... కరోడ్‌పతి!


 అందరూ కలలుగంటారు. అందరూ కష్టపడతారు. అందరూసంపాదిస్తారు.కానీ కొందరే, సంపన్నులవుతారు . ఎందుకు? ఆర్థిక విజేతల్లో కనిపించే అరుదైన లక్షణాలే అందుకు కారణమంటున్నారు నిపుణులు. వాటిని ఒంటబట్టించుకుంటే ఎవరైనా కావచ్చు... కరోడ్‌పతి!

'ఆయన కోటీశ్వరుడు'
...గౌరవంగా చూస్తాం.
'ఆ కారు ఖరీదు యాభైలక్షలు'
...రెప్పవాల్చడం కూడా మరచిపోతాం.
'ఆమెకు ఆన్‌లైన్‌ లాటరీలో కోటిరూపాయలొచ్చాయి'
...కళ్లల్లో నిప్పులు పోసుకుంటాం.
'అదిగో, వెయ్యి రూపాయల నోటు!'
ఆశగా తలతిప్పుతాం.
అది డబ్బు పవర్‌. కరెన్సీ ప్రభావం. శ్రీమహాలక్ష్మి మహత్యం.
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు, డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాకపోవచ్చు. కానీ, ఏదో ఒక సందర్భంలో ఆర్థిక సంబంధాలు మానవసంబంధాల్ని ప్రభావితం చేస్తాయి. ఎవరైనా 'నాకు డబ్బు మీద ఆసక్తిలేదు' అన్నారంటే...సంపాదించడం చేతకాదని ఒప్పేసుకున్నారని అర్థం.
మీరు డబ్బును ప్రేమించే వ్యక్తుల జాబితాలో ఉండవచ్చు. ద్వేషించే వ్యక్తుల జాబితాలోనైనా ఉండవచ్చు. ఏ జాబితాలో ఉన్నా, 
బతికున్నంతకాలం డబ్బు అవసరాన్ని కాదనలేరు. ఇది నిజం. బతకడానికి సరిపడా ఆక్సిజన్‌లా, అవసరాలకు తగినంత కరెన్సీ ఉండితీరాలి. అలా అని, డబ్బున్నంత మాత్రాన సుఖంగా ఉంటామని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. కానీ డబ్బులేకపోతే కష్టాలపాలవుతామన్నది మాత్రం అక్షర సత్యం. అందుకే, డబ్బంటే అంత ఆరాటం. తరాలకు సరిపడా సంపాదించుకోవాలన్న తహతహ. ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా బొమ్మలు గీసినా పుస్తకాలు రాసినా...అంతా డబ్బు కోసమే. తృప్తి, ఆనందం, కళాభిమానం...ఎవరెన్ని కారణాలు చెప్పినా అన్నీ కరెన్సీ తర్వాతే.వందకోట్ల జనాభాలో ఓ పదిమంది ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదిస్తారు. ఓ వందమంది దేశంలోని శ్రీమంతుల లిస్టులో ఉంటారు. లక్షమందో, పదిలక్షలమందో కోటీశ్వరులని అనిపించుకుంటారు.మిగతావాళ్లంతా మామూలు మనుషులు. ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా అని మిగిలిన ఇరవైతొమ్మిది రోజులూ ఎదురుచూసే సగటు జీవులు.
ఎందుకిలా?
కొంతమందే సంపన్నులు కావడం ఏమిటి, మిగతావాళ్లంతా మధ్యతరగతి జీవులుగానో నిరుపేదలుగానో మిగిలిపోవడం ఏమిటి? అసలు, డబ్బు సంపాదించడానికి అర్హతలేమిటి?
తెలివితేటలా, శ్రమా, అదృష్టమా.
తెలివైనవాళ్లు మాత్రమే బాగా డబ్బు సంపాదిస్తారనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. సంపన్నులంతా మేధావులు కారు. మేధావులంతా సంపన్నులు కారు.కష్టపడేగుణముంటే, కోటీశ్వరులు కావచ్చనీ బల్లగుద్ది చెప్పలేం. చెమటే కొలమానమైతే, కరెన్సీ మున్ముందుగా శ్రమజీవుల్నే వరించాలి. అలాంటి దాఖలాలేం లేవు. అదృష్టానికీ డబ్బుకూ కూడా ముడిపెట్టలేం. బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌, నారాయణమూర్తి... వీళ్లెవర్నీ సిరిసంపదలు అయాచితంగా వరించలేదు. రాత్రికిరాత్రే ఎవరూ సంపన్నులైపోలేదు. అంటే...పూర్తిగా తెలివితేటలే కాదు. పూర్తిగా శ్రమే కాదు. పూర్తిగా అదృష్టమూ కాదు. ఇంకేవో లక్షణాలున్నాయి. అవే కుబేరుల్ని తయారుచేస్తాయి. అవి, కన్నవారో గురువులో ఒంటబట్టించినవి కావచ్చు, ఎవరికివారే తీర్చిదిద్దుకున్నవీ కావచ్చు. ఆర్థిక వికాస సాహిత్యాన్ని ఓ మలుపుతిప్పిన 
రాబర్ట్‌ కియోసాకీ కూడా ఈ మాట నిజమేనంటున్నారు.
బాల్యమే పునాది...
'నాన్నా! నాకు కంప్యూటర్‌ కావాలి'
'మనదగ్గర అంత డబ్బు లేదమ్మా. మనం మధ్యతరగతి మనుషులం. పెద్దపెద్ద కోరికలు ఉండకూడదు'...తెలిసోతెలియకో పిల్లల ఆశల్ని బలవంతంగా చిదిమేస్తాం. అలా కాకుండా ఆ కంప్యూటర్‌ ధర ఎంతో, తమ సంపాదన ఎంతో, దాన్ని కొనాలంటే అదనంగా ఇంకెంత సంపాదించాలో వివరంగా చెబితే...పిల్లలు తప్పకుండా అర్థంచేసుకుంటారు. ప్రతి సమస్యనీ ప్రతి అవసరాన్నీ ఆర్థిక కోణం నుంచి చూడటం నేర్చుకుంటారు.
ఆర్థిక అక్షరాస్యత అనేది బాల్యం నుంచే వెుదలుకావాలంటారు రాబర్ట్‌ కియోసాకీ తన 'రిచ్‌డాడ్‌-పూర్‌డాడ్‌' పుస్తకంలో. ఆ కథలో ఓ కుర్రాడికి బాగా డబ్బు సంపాదించాలని కోరికగా ఉంటుంది. తండ్రేవో ఎప్పుడూ, 'కష్టపడి చదువుకో. ర్యాంకు తెచ్చుకో. మంచి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకో. అస్సలు రిస్క్‌ తీసుకోవద్దు' అని పోరుతుంటాడు. తండ్రి చెప్పినట్టే నడుచుకుంటే తాను అప్పుల్లో మునిగితేలే మధ్యతరగతి మనిషిగానే మిగిలిపోతానని ఆ కుర్రాడికి అర్థమైపోతుంది. తనకెలాంటి నాన్న కావాలని కోరుకుంటున్నాడో సరిగ్గా అలాంటి లక్షణాలున్న నాన్న, స్నేహితుడి తండ్రిలో కనిపిస్తాడు. అందుకే అతన్ని తండ్రిలా గౌరవిస్తాడు. 'రిచ్‌డాడ్‌' అని వ్యవహరిస్తాడు. ఆయన దగ్గర శిష్యరికం చేస్తాడు. డబ్బు సంపాదించే మెలకువలు నేర్చుకుంటాడు. జీవితంలో గొప్ప స్థానానికి చేరుకుంటాడు. ఈ పుస్తకం లక్షల కాపీలు అమ్ముడుపోయింది. దాదాపుగా ప్రపంచ భాషలన్నిట్లోకీ అనువాదమైంది.
మనలో చాలామంది పెద్దపెద్ద చదువులు చదువుకుని ఉండొచ్చు. కానీ, ఆర్థిక విషయాలకు వచ్చేసరికి తొంభైశాతం మంది నిరక్షరాస్యులే. డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు, సంపాదించిన డబ్బును ఎలా రెట్టింపుచేసుకోవాలో తెలియదు. ఎ
ల్‌కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడా 'డబ్బు సంపాదించడం ఎలా' అన్న పాఠం ఉండదు. కన్నవారూ ఆ ప్రయత్నం చేయరు. పిల్లలే చొరవ తీసుకుని ప్రస్తావించినా 'పసివాడివి, నీకెందుకురా డబ్బు ఆలోచనలు? బాగా చదువుకో' అని మందలిస్తారు. డబ్బు గురించి తెలుసుకోవడం కూడా ఓ చదువే అని గుర్తించరు. ఎవర్నని ఏం లాభం? మన చదువులే అలా ఉన్నాయి. తండ్రులైనా, తండ్రుల తండ్రులైనా అక్షరాలు దిద్దుకుంది ఆ బళ్లోనేగా.
చాలా సందర్భాల్లో పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాలు పేకమేడల్లా కూలిపోడానికి కూడా పిల్లల పెంపకంలోని లోపాలే ప్రధాన కారణం. అంతంతమాత్రం చదువులతో అంతంతమాత్రం ఆర్థిక స్థోమతతో డొక్కు సైకిలు మీద జీవితాన్ని ప్రారంభించే తండ్రి..స్కూటరు స్థాయికి, ఆతర్వాత కారు స్థాయికి, ఇంకాపైకెళ్లి చార్టర్డ్‌ ఫ్త్లెట్‌ స్థాయికి చేరుకుంటాడు. పిల్లల్ని ఖరీదైన బోర్డింగ్‌ స్కూళ్లలో, పెద్దపెద్ద కాలేజీల్లో చదివిస్తాడు. అక్కడ ఎవరూ డబ్బు గురించి వాస్తవాలు బోధించరు. ఎలా సంపాదించాలో, ఎలా కాపాడుకోవాలిో, ఎలా వృద్ధిచేసుకోవాలో చెప్పరు. కన్నతండ్రి కూడా ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయడు. బహుశా, క్యాంపస్‌లోనే తన కొడుకు చాలా విషయాలు నేర్చుకున్నాడన్న భ్రమ కావచ్చు. ఆ పట్టాల్ని నమ్మి వ్యాపారం అప్పగిస్తే, కుప్పకూలిపోవడం ఖాయం. కొన్ని కూలిపోయాయి కూడా. ఆ ప్రమాదం రాకూడదనే, విజ్ఞత ఉన్న వ్యాపారవేత్తలు పిల్లలకు ఒక్కసారిగా వెుత్తం బాధ్యతలు అప్పగించరు. ప్రాథమిక స్థాయి నుంచి ఒక్కోమెట్టూ ఎక్కి పైకొచ్చేలా జాగ్రత్త పడతారు. ఉక్కు దిగ్గజం లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ తన కొడుకు ఆదిత్యను పెంచిన తీరే అందుకు ఉదాహరణ. ఆదిత్య హైస్కూలు చదువుల దశలోనే శని, ఆదివారాలు తండ్రి స్టీల్‌ప్లాంట్‌లోని 'మెల్ట్‌ షాప్‌'లో పనిచేసేవాడు. అక్కడ విపరీతమైన వేడి. చెవులు చిట్లిపోయేంత రణగొణ ధ్వనులుంటాయి. సాధారణ కార్మికులు కూడా ఆ విభాగంలిో డ్యూటీ చేయడానికి భయపడతారు. ఆదిత్యకు ఇప్పటికీ ఎయిర్‌ కండిషన్డ్‌ క్యాబిన్‌లో కూర్చోవడం కన్నా, మెల్ట్‌షాప్‌లో గడపడమంటేనే ఇష్టమట. అంటే, మిట్టల్‌ కంపెనీ షేర్‌హోల్డర్లు ఇంకోతరం దాకా ధైర్యంగా ఉండొచ్చన్నమాట.
ఒకప్పటి ప్రపంచ కుబేరుడు, హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ వారసుడు ప్రిన్స్‌ ముకరంజా ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుని, ఆస్ట్రేలియాలో సాధారణ జీవితం గడుపుతున్నాడు. లెక్కలేనంత సంపదను వారసత్వంగా ఇచ్చిన ఉస్మాన్‌ అలీఖాన్‌, దాన్నెలా కాపాడుకోవాలో అతనికెప్పుడూ చెప్పుండకపోవచ్చు. తండ్రో తాతో ఆర్థిక గురువైతే, ఏ బిడ్డకీ ఇలాంటి పరిస్థితి రాదు.
అనుభవాలే పాఠాలు
కుబేరులెప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటారనీ నిద్రలోనూ శ్రీమహాలక్ష్మిని కలవరిస్తారనీ చాలామంది భావిస్తారు. అది తప్పు. 
ధీరూభాయ్‌ అంబానీ పెద్దపెద్ద కలలు కన్నాడు. వాటిలో ఎక్కడా డబ్బు ప్రస్తావన లేదు. రతన్‌టాటా వాటాదారుల సమావేశంలో లాభనష్టాల వివరాల్ని ఒకటిరెండు మాటల్లో క్లుప్తంగా చెప్పేసి, మిగిలిన సమయమంతా విలువల గురించి వ్యాపారంలో నైతికత గురించే మాట్లాడతారు.ఈ ఇద్దరే కాదు, కోట్లరూపాయల సంపాదనతో కుబేరులైపోయిన వారెవరూ 'బాగా డబ్బు సంపాదించాలి' అన్న కోరికతో జీవితాల్ని ప్రారంభించలేదు. వాళ్లంతా లక్ష్యాల గురించి ఆలోచించారు. విజయాల గురించి ఆలోచించారు. సవాళ్ల గురించి ఆలోచించారు. ఆ సవాళ్లు నేర్పించే పాఠాల గురించి ఆలోచించారు.'సిరితావచ్చిన వచ్చును...' అన్నట్టు సంపదలు, పేరుప్రతిష్ఠలు, పురస్కారాలు వాటంతట అవే పరిగెత్తుకొచ్చాయి. కియోసాకీ పుస్తకంలో 'రిచ్‌డాడ్‌' ఓ గొప్ప మాట చెబుతాడు, 'జీవితాన్ని మించిన గురువు లేడు. ఆ గురువు ఎప్పుడూ మనతో మాట్లాడడు. నీతులు బోధించడు. కానీ అనుభవాల బెత్తం దెబ్బలు వేస్తుంటాడు. ఆ గాయాల నుంచి మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి'. ఆర్థిక విజేతలంతా అలాంటి దెబ్బలుతిని రాటుదేలినవారే.
'సింటెక్స్‌' అనగానే నల్లగా నిగనిగలాడే నీటినిల్వ ట్యాంకులే గుర్తుకొస్తాయి. ఏ బ్రాండు ట్యాంకునైనా 'సింటెక్స్‌ ట్యాంక్‌' అని పిలుచుకునేంతగా అవి ప్రజాదరణ పొందాయి. నిజానికి, ఆ సంస్థ యాజమాన్యం ఇలాంటి ట్యాంకుల్ని ఉత్పత్తి చేయాల్సివస్తుందని ఎప్పుడూ వూహించలేదు. వెుదట్లో, పారిశ్రామిక అవసరాల కోసం ప్లాస్టిక్‌ కంటెయినర్లు తయారుచేసే వ్యాపారం వాళ్లది. అందులో తీవ్ర నష్టాలొచ్చాయి. మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లక్షలుపెట్టి కొన్న యంత్రాల్ని ఏం చేసుకోవాలి? అప్పుడే, ఐఐఎమ్‌ నుంచి పట్టాపుచ్చుకుని ఉద్యోగంలో చేరిన డంగాయచ్‌ అనే కుర్రాడు యాజమాన్యానికి నీటి ట్యాంకుల ఆలోచన చెప్పాడు. ఆరోజుల్లో అంతా సిమెంటుతో ట్యాంకులు కట్టించుకునేవారు. ఇంజినీర్లు కూడా వాటినే సిఫార్సుచేసేవారు. ప్రారంభంలో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. చిల్లులుపడతాయనో, నీళ్లు ఖరాబైపోతాయనో ...ఏవో అపోహలు.పాతికేళ్లలో ఆ పరిస్థితుల్ని అధిగమించి సింటెక్స్‌ నంబర్‌వన్‌ స్థాయికి ఎదిగింది. డంగాయచ్‌ ఇప్పుడు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి. దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సీయీవోల్లో ఆయనా ఒకరు.
తామరాకు మీద...
వారెన్‌ బఫెట్‌-
సాధారణ కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కోట్లకు పడగలెత్తాడు. ఆస్తిలో చాలా భాగాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చాడు. దీనివల్ల ప్రపంచ కుబేరులి జాబితాలో ఆయన స్థానం కాస్త మారింది. అయినా, మునుపటికంటే సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నాడు.
రామలింగరాజు-
సాధారణ కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. సాఫ్ట్‌వేర్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వేల ఎకరాల భూములు సంపాదించాడు. అయినా తృప్తిచెందలేదు. 
ఇంకా సంపాదించే ప్రయత్నంలో దారితప్పాడు. ప్రస్తుతం చెంచలగూడ జైలులో ఉన్నాడు.
డబ్బు అమ్మాయి లాంటిది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాళ్లనే ఇష్టపడుతుంది. దొడ్డిదార్లో దగ్గరవ్వాలని ప్రయత్నించేవాళ్లను అసహ్యించుకుంటుంది.
కసితోనో మేడలుకట్టాలన్న కోరికతోనో అడ్డదార్లు తొక్కేవారి బీరువాలోంచి ఎప్పుడు బయటపడతానా అని డబ్బు ఎదురుచూస్తూ ఉంటుంది. అవకాశం దొరగ్గానే, బయటికొచ్చేస్తుంది. సంపదను ఒక బాధ్యతగా, నలుగురి కోసం ఉపయోగపడే సాధనంగా భావించే వ్యక్తుల నట్టింట్లో సిరిదేవి బాసింపట్టు వేసుకుని కూర్చుంటుంది.
డబ్బాట!
పర్వతారోహకుడు ఎవరెస్ట్‌ శిఖరానికి ప్రయాణం కట్టినట్టు, గజ ఈతగాడు సముద్రాన్ని ఈదినట్టు...సంపాదననీ ఓ ఆటలా భావించేవారే ఆర్థికంగా గొప్ప విజయాలు సాధిస్తారని చెబుతుంది 'బీ రిచ్‌ అండ్‌ హ్యాపీ' పుస్తకం.ఆటన్నాక గెలుపూ ఓటమీ ఉంటాయి. గెలిచినప్పుడు ఎవరైనా మురిసిపోతారు. ఓడిపోతే? మరో ప్రయత్నంలో అయినా గెలిచితీరాలని పట్టుదలగా ప్రయత్నిస్తారు. టెన్నిస్‌లోనో ఇంకో ఆటలోనో పరాజితుడు విజేతతో కరచాలనం చేసి మైదానం నుంచి బయటికి వస్తాడు చూడండి...అంత హుందాగా వైఫల్యాల్ని ఒప్పుకోవాలి. ఓటమికి దూరంగా ఉన్నామంటే, గెలుపుకూ దూరంగా ఉన్నట్టే!

పదిహేనేళ్ల కాలంలో 
అమితాబ్‌ బచ్చన్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది! ఏబీసీ (అమితాబ్‌ బచ్చన్‌ కార్పొరేషన్‌) నష్టాలపాలైంది. అప్పులు పెరిగాయి. అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు దివాలా పరిస్థితి. డబ్బు జబ్బే ఉంటే, ఎవరైనా ఆ స్థితిలో కుప్పకూలిపోతారు. ఏ పక్షవాతవో గుండెపోటో మింగేస్తుంది. కానీ అమితాబ్‌ భయపడలేదు. సంపాదనని ఓ ఆటగా తీసుకున్నాడు. మళ్లీ సున్నా స్కోరు నుంచి వెుదలుపెట్టాడు. 'కౌన్‌బనేగా కరోడ్‌పతి' గేమ్‌షోకు యాంకర్‌గా చేయడానికి అంగీకరించాడు. అద్భుతమైన స్పందన వచ్చింది. మళ్లీ విజయాలు వెతుక్కుంటూ వచ్చాయి. కొడుకూ అందొచ్చాడు. కోడలేవో ప్రపంచ సుందరి. ఇప్పుడు, బచ్చన్‌ కుటుంబం బ్రాండ్‌విలువ అక్షరాలా వేయికోట్లని అంచనా.
ఆలోచనలే ప్రాణం
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వందేళ్ల క్రితమే ఓ గొప్ప వ్యక్తిత్వవికాస రచన చేశారు. ఆ నవల పేరు 'మార్గదర్శి'. ఇద్దరు స్నేహితులు జాతరకెళ్తారు. ఒకడి జేబులో ఎంతోకొంత చిల్లర ఉంటుంది. దారిపొడుగునా ఆ కుర్రాడు ఆ డబ్బుఎలా ఖర్చు చేయాలా అనే ఆలోచిస్తుంటాడు. మరో కుర్రాడి దగ్గర చిల్లిగవ్వకూడా ఉండదు. కానీ ఆలోచనంతా డబ్బు సంపాదన మీదే.తిరిగొచ్చేసమయానికి వెుదటి కుర్రాడి జేబులు ఖాళీ అయిపోతాయి. రెండోవాడి జేబులు నాణాలతో నిండిపోతాయి.
తేడా ఎక్కడుంది? ఆలోచనలో.

ఏం ఆలోచించాలన్నదీ మనమే నిర్ణయించుకుంటే, చెత్తాచదారమంతా బుర్రలో తిష్టవేసే ప్రమాదమే ఉండదు.చాలా సందర్భాల్లో తాత్కాలిక లక్ష్యాలు, తాత్కాలిక అవసరాలు .. దారితప్పించే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ వలలోంచి బయటపడితేనే, దీర్ఘకాలిక లక్ష్యాల్ని నిర్ణయించుకోగలం. సాధించాలనుకున్నది సాధించగలం. 
రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ అధినేత అంజిరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో...రోజూ ప్రఖ్యాత మందుల కంపెనీ 'ఫైజర్‌' కార్యాలయం ముందు నుంచి వెళ్లేవారు. ఆ బోర్డువైపు ఆరాధనగా చూస్తూ 'ఏదో ఒకరోజు నేనూ ఇలాంటి సంస్థను స్థాపిస్తాను' అనుకునేవారు. ఆ ఆలోచనే అయనను దేశంలోనే రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీకి అధినేతను చేసింది. 'ఏదో ఒకరోజు ఈ సంస్థలో ఉద్యోగం చేయాలి' అనుకుని ఉంటే, ఫలితం మరోలా ఉండేది.అంజిరెడ్డి మహాఅయితే ఎగువ మధ్యతరగతి మనిషిగా మిగిలిపోయేవారు.
మార్కెటింగ్‌ మంత్రం
మనదేశంలో కూడా పుస్తకాలు అమ్ముకుని కోట్లు సంపాదించుకోవచ్చని ఐఐటీ పూర్వవిద్యార్థి చేతన్‌భగత్‌ నిరూపించాడు. ఆ విజయం వెనుక అద్భుతమైన మార్కెటింగ్‌ నైపుణ్యం ఉంది. చాలామందికి పుస్తకాలు చదవాలనే ఉంటుంది. కానీ పుస్తకాల దుకాణం దాకా వెళ్లి కొనాలంటే బద్ధకం. అందుకే ఆ ఆలోచనే మానుకుంటారు. టీవీ చూస్తూనో, పేపర్‌ తిరగేస్తూనో కాలక్షేపం చేస్తారు. పుస్తకాల ధర మరో సమస్య. వందలకొద్దీ ఖర్చుచేయడానికి మధ్యతరగతి బడ్జెట్‌ అస్సలు ఒప్పుకోదు. చేతన్‌భగత్‌ ఈ రెండు పరిమితుల్నీ దృష్టిలో పెట్టుకుని మార్కెటింగ్‌ వ్యూహం తయారుచేశాడు. పుస్తకాల్ని పుస్తకాల షాపుల్లోనే ఎందుకమ్మాలి? సూపర్‌మార్కెట్లో ఏ కాల్గెట్‌ టూత్‌పేస్టు పక్కనో ఎందుకు పెట్టకూడదు? ఆ పుస్తకం ధర వంద రూపాయలలోపే ఉంటే, బడ్జెట్‌ పద్మనాభం సినిమా టికెట్‌తో పోల్చుకుని...సంతోషంగా కొంటాడుగా! ఆలోచన అదిరింది!! చేతన్‌భగత్‌ పుస్తకాలు సగటున నిమిషానికొకటి అమ్ముడుపోతున్నాయని అంచనా! ఇలా అతను రెండు కలల్ని నిజం చేసుకున్నాడు. ఒకటి, తనకిష్టమైన రచనా వ్యాసంగాన్ని వృత్తిగా స్వీకరించడం. రెండు, సొంతగడ్డమీదే ఉంటూ హాంకాంగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించడం. తమ ఐడియాల్ని మార్కెట్‌ చేసుకున్నవారే విజేతలుగా నిలుస్తారనడానికి చేతన్‌భగత్‌ అతిపెద్ద ఉదాహరణ. ఫలానా రంగంలో ఉద్యోగం చేస్తేనే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చనో, ఫలానా వ్యాపారమైతే బంగారు బాతుగుడ్డనో భ్రమిస్తే పొరపాటే. ఏది అద్భుతంగా అమ్ముడుపోతుంది అన్నది ముఖ్యం కాదు. నువ్వేం అద్భుతంగా తయారు చేయగలవు? అదీ ముఖ్యం. మన ఆర్థిక విజయాన్ని నిర్ణయించేదీ ఆ నైపుణ్యమే.
* * * * * * * * * * * * * * * * *

డబ్బు...మన సౌలభ్యం కోసం మనం సృష్టించుకున్న ఓ మారకం, ఓ అవసరం. ఆ సత్యాన్ని గుర్తించాలి. బాల్యం నుంచే పిల్లలకు ఆర్థిక పాఠాలు చెప్పాలి. పెద్దలు కూడా తమ పరిజ్ఞానాన్ని విస్తృతపరుచుకోవాలి. అలా అని డబ్బే లోకమనుకుంటే పొరపాటు. కోట్లకుకోట్లు కూడబెట్టాలనుకోవడం దురాశ. అడ్డదార్లు తొక్కడం అన్నిటికంటే పెద్దతప్పు. 'అవసరాలకు మించి మన దగ్గరున్న డబ్బు మనది కాదు. ప్రజలది' అంటూ ఎంత సంపాదించుకోవాలనే విషయంలో మహాత్ముడో లక్ష్మణరేఖ గీశాడు. అపార సంపదల్ని సేవాకార్యక్రమాలకు దానమిచ్చిన ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ ఈ సూత్రాన్నే పాటించాడు. కోటీశ్వరులనీ, నవకోటి నారాయణులనీ దైవత్వాన్ని జోడించి మరీ మన పెద్దలు గౌరవించింది ఇలాంటి మనసున్న కుబేరులనే!
కరెన్సీనోటు సాక్షిగా!
మన జేబులో వేయిరూపాయల నోటుంటే...మల్టీప్లెక్స్‌లో మంచి ఇంగ్లిష్‌ సినిమా చూడొచ్చు. సినిమా అయ్యాక రెస్టారెంట్‌కు వెళ్లొచ్చు. ఇంకో వందో రెండువందలో మిగిలుంటే టాక్సీలో ఇంటికి రావచ్చు. అదే, వేయిరూపాయల నోటుకు బదులుగా చిత్తుకాయితం ఉంటే?
ఎందుకూ పనికిరాదు. ఏమీ కొనుక్కోలేం.
వేయిరూపాయల నోటు అని మనం చెప్పుకునే గులాబీరంగు కాయితానికి మారకపు విలువ ఉంది. ఆ విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించింది. 'మారకం' అంటే మారడం. అవసరమైతే మన దగ్గరున్న డబ్బు, దాని విలువ మేరకు బియ్యంగా మారుతుంది, బిస్కెట్‌ పొట్లంగా మారుతుంది, సినిమా టికెట్టుగా మారుతుంది, బంగారు నెక్లెస్‌గా మారుతుంది. 'ఏమిటి గ్యారెంటీ' అంటారా? కావాలంటే చూసుకోండి, ఆ నోటు మీద 'ఐ ప్రామిస్‌ టు పే ద బేరర్‌ సమ్‌ ఆఫ్‌ థౌజండ్‌ రుపీస్‌' అని మాటిస్తూ రిజర్వు బ్యాంకు గవర్నరు సంతకం చేశారు. మంత్రిగారు హైదరాబాద్‌లో ఉంటే, ఆయన బామ్మర్ది నియోజకవర్గంలో హల్‌చల్‌ చేసినట్టు...పైపైన కనిపించే హంగామా కాగితం నోటుదే కానీ, అసలు సిసలు అధికారమంతా బంగారానిదే. ప్రభుత్వం ఓ వందకోట్ల విలువైన నోట్లు విడుదల చేయాలనుకుంటే, ఆ మేరకు బంగారం నిల్వల్ని పక్కనపెట్టాలి. అంటే, ఈ పచ్చకాయితాలు ఆ బంగారానికి ప్రతినిధులు. అందుకే వాటికంత పవరు! వెుత్తంగా, మార్కెట్లో చలామణిలో ఉన్న నోట్ల విలువ...రిజర్వు బ్యాంకు దగ్గరున్న బంగారం నిలువకు సమానం!
-------------------------------------------------------------------
డబ్బు జాగ్రత్త!
డబ్బేం చెట్లకు కాస్తుందా? అంటుంటారు చాలామంది. హాస్యానికన్నా, వ్యంగ్యానికన్నా ఆ మాట నిజం. నిజంగానే డబ్బు చెట్లకు కాస్తుంది. అసలు డబ్బే ఒక చెట్టు. చెట్టు పెంచాలంటే ఎంత కష్టపడతాం! వెుక్క నాటుతాం. నీళ్లుపోస్తాం. కంచెపెడతాం. ఎరువులేస్తాం. పెరిగి పెద్దయ్యేదాకా కంటిపాపలా కాపాడుకుంటాం. డబ్బు చెట్టు విషయంలోనూ అంత జాగ్రత్త అవసరం.
* రాయీరప్పా పెరగదు. ఇల్లు పెరగదు. కుర్చీ పెరగదు. సృష్టిలోని నిర్జీవుల్లో డబ్బుకు మాత్రమే పెరిగే గుణం ఉంది. ఎంత పెరగాలో కూడా మనమే నిర్ణయించుకోవచ్చు!
* మీ జేబులోని పర్సు ఎంత శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంటే...మీరంత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్టు. కుటుంబానికి చక్కని ఇల్లు ఎంత అవసరవో, ఇంటి పెద్దకు నాణ్యమైన పర్సూ అంతే అవసరం. నోట్లు పద్ధతిగా ఉన్నప్పుడు, ఏ నోటు బయటికి తీస్తున్నావో మనకు స్పష్టత ఉంటుంది. పొరపాట్లు జరిగే అవకాశం తక్కువ.
* ఇంట్లోంచి బయటికి కాలుపెడుతున్నప్పుడు జేబులో ఎంత డబ్బుందో ఓసారి చూసుకోవడం ఉత్తమం. బ్యాంకు ఖాతాల్లోని నిల్వల గురించి కూడా ఉజ్జాయింపుగా అయినా తెలిసుండాలి.
* ఆత్మీయులతో వడ్డీ ఆశించే ఆర్థిక లావాదేవీలు వద్దు. అత్యవసర పరిస్థితుల్లో చేబదులు ఇచ్చినా ... తిరిగి రాకపోయినా ఇబ్బందిపడమనుకుని ఇవ్వడమే ఉత్తమం. తిరిగొస్తే సంతోషమే. డబ్బు కారణంగా ఆత్మీయతలూ అభిమానాలూ దెబ్బతినకూడదు.
* ఎవరిచేతికైనా డబ్బు ఇస్తున్నప్పుడు గాజువస్తువంత జాగ్రత్తగా, పసిపాపంత ప్రేమగా అందివ్వాలి. అది ఎదుటి మనిషికిస్తున్న గౌరవం కాదు, డబ్బుకిస్తున్న గౌరవం. ఎప్పుడైనా పొరపాటున అగౌరవ పరిస్తే శ్రీమహాలక్ష్మికి 'సారీ' చెప్పడానికి సంకోచించకండి.
* కాస్త చాదస్తంగా అనిపించవచ్చుకానీ, రోజువారీ ఖర్చుల వివరాలు ఓచోట రాసుకోవడం మంచి అలవాటు. దీనివల్ల అనవసరమైన వ్యయాలు దొరికిపోతాయి. మరుసటిరోజు జాగ్రత్తపడొచ్చు.
* ఏ కుటుంబానికైనా 
ఈ ఆరూ ముఖ్యం...అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ఆదుకోడానికి రిజర్వు మనీ, చిన్నదో పెద్దదో మనకంటూ ఒక ఇల్లు, పిల్లల పెద్దచదువులకు ఎంతోకొంత పొదుపు, ఇంటిల్లిపాదికీ ఆరోగ్య బీమా, మనంలేనప్పుడు కూడా మనలోటు తెలియకుండా గణనీయమైన వెుత్తంలో టర్మ్‌పాలసీ, వృద్ధాప్యం సాఫీగా సాగిపోడానికి పింఛను నిధి.
* పొదుపు రెండు రకాలు. ఒకటేవో, ఖర్చుపెట్టగా మిగిలింది పొదుపు చేయడం. రెండు, 
పొదుపు చేయగా మిగిలింది ఖర్చుపెట్టడం. రెండోదే ఉత్తమ మార్గం.
------------------------------------------------
- కె.జనార్దనరావు