skip to main |
skip to sidebar
అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. ద్రావిడభాషాలక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణశాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. వాడకపోతే పరవాలేదు గానీ వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా! మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న, ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతొంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:
అరు( గు = వీది అరుగు
అరుగు = వెళ్ళు, పోవు
అఱుగు = జీర్ణించు
ఏ( డు = సంవత్సరం
ఏడు = 7 సంఖ్య
కరి = ఏనుగు
కఱి = నల్లని
కా( Oపు = కులము
కాపు = కావలి
కా( చు = వెచ్చచేయు
కాచు = రక్షించు
కారు = ఋతువుకాలము
కాఱు = కారుట (స్రవించు)
చీ( కు = చప్పరించు
చీకు = నిస్సారము, గ్రుడ్డి
తఱు( గు = తగ్గుట, క్షయం
తఱుగు = తరగటం(ఖండించటం)
తరి = తరుచు
తఱి = తఱచు
తీరు = పద్ధతి
తీఱు = నశించు, పూర్తి(తీరింది)
దా( క = వరకు
దాక = కుండ, పాత్ర
నా( డు = కాలము
నాడు = దేశము, ప్రాంతము
నెరి = వక్రత
నెఱి = అందమైన
నీరు = పానీయం
నీఱు = బూడిద
పే( ట = నగరములో భాగము
పేట = హారంలో వరుస
పో( గు - దారము పో( గు
పోగు = కుప్ప
బోటి = స్త్రీ
బో( టి = వంటి [నీబో( టి]
వా( డి = వా( డిగాగల
వాడి = ఉపయోగించి
వేరు = చెట్టు వేరు
వేఋ = మరొకవిధము
మడు( గు,మడుగు మొదలైనవీ ఉన్నాయి.
[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి గారి "సాహిత్య కబుర్లు" , "తెలుగు వెలుగు" ల నుండి.]
'కలడు కలండనెడివాడు కలడో లేడో' అన్నది సాక్షాత్తూ దేవుడి గురించిన డౌటు. ఇది పోతన భాగవతం లోది. 'కలదు కలందనెడి సంస్థ కలదో లేదో' అన్నది వ్యాపార బాగోతం. దీనిని తిప్పి చూస్తే ఎందరో 'బోగస్'స్వాములు ఎందెందు వెదకి చూసిన అందందే కలరన్న పద్యపాదం కనపడుతుంది. వ్యాపారమంటే కోట్లు లక్షలు పెట్టుబడి పెట్టాలి; 24X7 శ్రమపడాలి అన్న భావనకు పోటీగా పెట్టుబడులెందుకు? పట్టుబడకుండా ఉంటే అదే పది లక్షలు అదే పది కోట్లు అన్న ధోరణి ప్రబలుతోంది. మాయ వ్యాపారులు మాయం కాగానే ఉన్నావా అసలున్నావా అన్న పాట పాడాల్సి వస్తోంది.'జమీందారు రోల్సు కారు మాయంటావూ! బాబూ ఏమంటావూ?' అన్న శ్రీశ్రీ మాటలు వింటే ఆహా ఓహో అనుకుంటాం. కారు మాయ కాకపోవచ్చు లేని కారును ఉన్నట్లు భ్రమ కలిగించి డబ్బు కొట్టేసే మాయ'దారుల్లో'ని మోస'కారు'లను తలుచుకుంటే మాత్రం 'కార్'ఫుల్‌గా ఉండాలనిపిస్తుంది. సృష్టికి ప్రతిసృష్టి ఉన్నట్టే, అసలు వ్యాపారులకు తోడు బోగస్ వ్యాపారాలూ పుట్టుకొస్తున్నాయా అనిపిస్తోంది. మాయల మరాఠీ ఒక్కడు కాదు ఎంతోమంది ఉన్నారనిపిస్తుంది. వాక్చాతుర్యం ఉంటే చాలు 'ఫేక్'చాతుర్యం చేయొచ్చని నిరూపిస్తున్నారు. నకిలీ స్టాంపులు, నకిలీ నోట్లు, నకిలీ సంస్థలు నకిలీ సర్టిఫి'కేట్లు' కాదేదీ నకిలీకనర్హం అనిపిస్తుంది. నకిలీ నోట్లది చిదంబర రహస్యం అనడానికీ వీల్లేదు. అది పి.చిదంబరానికి కూడా తెలియని రహస్యమేమో. దాదాపు 1,69,000 కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీ మన సమాజంలో చొరబడినందువల్ల బాధితులు 'చెల్లియో చెల్లకో...' పద్యం పాడుతున్నారని అంచనా. బోగస్ వ్యాపారమంటే సమాజం మీద జరిపే కుట్రతో సమానం. అన్నట్లు ఇంగ్లిషు వాడు స్థలాన్ని ప్లాట్ అన్నాడు. ప్లాట్ అంటే కుట్ర అని దాని అర్థం కూడా చెప్పాడు. దీంతో బోగస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి తెల్లవాడికి ముందే ఐడియా ఉందని తేలిపోయింది. ప్లాట్లు కాగితాల మీదనే కనపడుతున్నాయి తప్ప ఎన్ని పాట్లు పడ్డా భూమ్మీద ఆనవాలు చిక్కట్లేదు. బోగస్‌కు దిగాక ఒకటి కుదురుతుంది ఇంకోటి కుదరదనలేం. ముందు 'మోహన'ంగా సాగిన యూరో లాటరీ 'కోలా'టం ఎలా బంద్ అయిందో అందరికీ తెలుసు. అలాగే 'వీసా'సనీయ వర్గాల ప్రకారం ఆ మధ్య చెన్నైలో 9 మంది తెలుగు మహిళలు 'గాలి'వీసాలతో చెన్నై ఎయిర్‌పోర్టులో పట్టుబడి 'వీసా'విరహే తవదీనా... అని పాట ఎత్తుకున్నారు. ఒక పెద్ద మనిషి తానో పెద్ద ఎయిర్‌పోర్టు పెడుతున్నట్టు జనాన్ని నమ్మించి 15 కోట్లు గుటకాయ స్వాహా చేసిన 'ధన'కార్యం ముందు ఇదెంత అనిపిస్తుంది.
'ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన బోగసోడు' అని సర్కారు ఇటువంటి వాళ్ల వెంటపడి పట్టుకుని 'సమ్'కెళ్లు వేస్తుందని ఆశపడతాం.కానీ ఓ 'గద్ద'మనిషి ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్నే 'సృష్టించేసి' మంది డబ్బును ఎగరేసుకుపోయాడు. దాంతో ఎంతో మంది 'జేబులొ డబ్బులు పోయెనే' అనే 'బాట' పాడుకోవలసి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలు చూపిస్తామని గాలి కబుర్లు చెప్పి జేబులు కత్తిరించి, బిచాణా ఎత్తేయడం బోలెడు గిరాకీ ఉన్న వ్యాపారమైపోయింది. 'దొర'కేంత వరకు ఇటువంటి 'దొరలు' ఎందరో!
బోగస్ వ్యాపార సుందరి 'ఫోర్'జరీ అంచు చీర కట్టుకుని హొయలొలకబోస్తుంటుంది కూడా. బోగస్ వ్యాపారాలను 'మార్చి' మార్చి జనాన్ని ఏమార్చి ఒక నెలలోనే 15వేల కోట్ల రూపాయల మేరకు సాగించారని 'నోటు'మాటగా చెప్పవచ్చు. హ్యాపీ లైఫ్ కోసం ఆశపడి బీపీ లైఫ్ తెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. బోగస్ నవ్వులు నవ్వి 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా' అన్న సీను సృష్టించి నమ్మిన వాళ్లను రౌడీల చేత నట్టేట ముంచేట్టు చేయడమూ జరుగుతోంది!
చివరకు షాపింగ్‌లో బోగస్, సర్కారు ఇళ్ల కేటాయింపులోనూ బోగస్ వ్యవహారం 'చోటు' చూసుకుంటోంది! చిత్రమేమిటంటే బోగస్ వ్యవహారాల మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని మంత్రులు నమ్మకంగా చెప్తుంటారు. కొంత కాలానికి ఎంత గొప్ప 'యాక్షన్' అనిపిస్తుంది.మహామహా నటులు ఇంతగా నటించ లేరని వేరే చెప్పాలా?
-ఫన్‌కర్
[డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారి "ఇంటింటా తెలుగు దివ్వె" (వ్యాఖ్యానం- 'ఈనాడు'దినపత్రిక 25:04:2006) నుండి ఎత్తి రాసిన కొన్ని అంశాలు]
తెలుగువారిలో ప్రతి ఒక్కరూ తెలుగుకు నిలువెత్తు దర్పణంలా నిలవాలి.
మనం పలికే ప్రతి పలుకులో తెలుగుకే పట్టం కట్టాలి.
ప్రతి పలకరింతా తెలుగు పులకరింత కావాలి.
......................... తెలుగు భాషను బాగా వ్యాపింప చెయ్యాలంటే,...................... ఇప్పటికయినా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా మనలో తెలుగు బాగా వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. మనం చిత్తశుద్ధితో కొన్ని నిర్ణయాలు తీసుకొని, వాటిని తు.చ. తప్పకుండా ఆచరిస్తే ఫలితం కచ్చితంగా వచ్చి తీరుతుంది. మనల్ని చూసి ప్రభుత్వం కూడా మార్గం మార్చుకుంటుంది.
[1]ముందుగా- తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ వారి సంతకాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుగులోనే చేయాలి. బ్యాంకు లావాదేవీల దగ్గరనుంచి, ఉద్యోగం చేసే చోట చేస్తున్న పొట్టి సంతకాల దాకా!
[2]మనమందరం కలిసి ప్రతిరోజూ సాగించే ఉత్తర, ప్రత్యుత్తరాలు అసంఖ్యాకంగానే ఉంటాయి. ఆ ఉత్తరాలలో నిర్దేశించిన విషయం ఆంధ్ర దేశ పరిధిలో ఉంటే, ఆ విషయాన్ని; ఉత్తరాలపై రాసే చిరునామాల్ని కూడా తెలుగులోనే రాయండి. ఒకవేళ ఆయా అధికారులు ఆంధ్రేతరులైనట్లయితే, తెలుగులో ఉన్న ఆ లేఖల్ని చదివి తర్జుమా చేయించుకునే తలనొప్పి వారిదే అవుతుంది.
[3]బజారుకు వెళ్ళి మనమేదైనా కొనేటప్పుడు వాటి పేర్లను సహజంగా తెలుగులోనే చెప్పి కొనుక్కురండి. నిత్యావసర వస్తువుల్ని, పచారీ సామాన్లను, కూరగాయలను, పండ్లను ఇలా పలకడానికి ఇబ్బందిలేని, తెలుగు భాషలో చక్కని పదాలు ఉన్న వాటిని ఆ పేర్లతోనే పలకండి. తెలుగు భాషలో లేని పదాలు గల ఇతర భాషలలోని వస్తువుల పేర్లను (టీవీ, సైకిలు, రేడియోవంటివి) అలాగే పలకండి.
[4]బ్యాంకు ఫారాలను, మనియార్డరు ఫారాలను, చలానాలను నింపేటప్పుడు ఒకవైపు ఆంగ్లంలోనూ, మరొకవైపు తెలుగులోనూ నమూనా ఉంటే తెలుగులోనే కచ్చితంగా నింపండి.ఏవైనా దరఖాస్తులు రాయవలసి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ తప్పుల తడకలతో ఆంగ్లంలో రాయడం మానేసి చక్కగా తెలుగులో స్వేచ్ఛగా రాసి (మాట్లాడే భాషనే) ఆత్మవిశ్వాసంతో నిలబడండి.
[5]టీవీ చూస్తున్నప్పుడు తెలుగు ఛానళ్ళనే చూడండి.
[6] (అ)తెలుగు భాషతోపాటుగా మనోవికాసాన్ని కలిగించే భాగవతం, దేవీ భాగవతం, పంచతంత్రం వంటి (టీవీ) కార్యక్రమాలను తప్పనిసరిగా పిల్లలకు చూపించండి.
(ఆ)మీ పిల్లల్ని రోజుకో గంట సేపు మీ ఇంట్లో ఉన్న వృద్ధుల దగ్గర కూర్చోపెట్టండి. వారి చేత తెలుగు సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, కథలు, పాటల రూపంలో చెప్పించండి. కొత్తగా పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తప్పనిసరిగా తెలుగు భాషను ఎంపిక చేయండి.
(ఇ)ఇంటి దగ్గర పిల్లలకు రోజూ కొన్ని కొత్త తెలుగు పదాల్ని నేర్పిస్తూ తెలుగులోనే మాట్లాడండి.
(ఈ)కనీసం వారానికో పద్యం వాళ్లు నేర్చుకొని చక్కగా చదివేటట్టు చూడండి.
(7)విజటింగ్ కార్డులను, వివిధ శుభకార్యాలకోసం మనం ముద్రించే శుభలేఖలను తెలుగులోనే ముద్రించి అందరికీ పంచండి.
(8)పాఠశాలల్లో తెలుగులో మాట్లాడవద్దని నియంత్రించే యాజమాన్యాన్ని తల్లిదండ్రులందరూ కలిసి నిలదీయండి.
(9)ఇంట్లో చక్కగా తెలుగు మాట్లాడేవారికి చిన్న చిన్న బహుమతుల్ని ఇవ్వండి. ఎవరైనా తెలుగు వచ్చి కూడా ఇంగ్లీషులో మాట్లాడితే వారితో తెలుగులోనే మాట్లాడండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. అపరిచితులకు తెలుగు రాదేమోనని ముందుగా మీరే ఊహించేసుకొని ఆంగ్ల సంభాషణ ప్రారంభించకండి. చక్కగా తెలుగులోనే మాట్లాడండి. వారికి చక్కగా అర్థమవుతుంది. వారానికొక రోజు (సెలవు రోజైన ఆదివారమైతే మరీ మంచిది) పూర్తిగా చక్కని తెలుగు భాషలో మాట్లాడాలనే నిర్ణయాన్ని ఇంటిల్లిపాదీ తీసుకొనేట్లు చూడండి.
(10)శుభాకాంక్షల్ని నోరారా తెలుగులోనే తెలియజేయండి. (ఎదుటి వారు ఇంగ్లీషులో చెప్పినాసరే!)
ఇలా ప్రతిఒక్కరూ నిత్యం తెలుగును గుర్తుంచుకొని వ్యవహరించాలి. ఇప్పటికే తెలుగు వచ్చినవారంతా ఈ సూచనలు పాటిస్తే తెలుగుకు ప్రాచుర్యం తక్కువ కాలంలోనే ఎక్కువగా లభిస్తుంది..............
తెలుగును వ్యాప్తి చేయడంలో ప్రజల బాధ్యత ప్రజలది, ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానిది. సాధ్యమయినంత వరకు మన నిత్య జీవనాన్ని పూర్తిగా తెలుగుమయం చెయ్యడానికి ఎవరికీ ఏ ఇబ్బందికానీ ఖర్చుకానీ ఉండదు. ఉద్యమాలు చేసి ఆయాసపడనక్కర్లేదు. ఉద్యమస్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అది నూటికి నూరుపాళ్ళూ ఆచరించేదిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తక్కినవారిని ప్రభావితం చేసి కార్యోన్ముఖులయ్యేలా చూడాలి. ఇది మనందరి గురుతర బాధ్యత. తెలుగు వెలుగును దశదిశలా వ్యాపింపజేయడమో, లేక క్రమక్రమంగా కొండెక్కిపోతున్న వెలుగును పోగొట్టుకొని, మన భాషా సంస్కృతుల్ని అజ్ఞానంలోనికి నెట్టుకొని ఉనికిని కోల్పోవడమో... అంతా మన చేతుల్లోనే ఉంది. మన చేతల్లోనే ఉంది. ఆలోచించండి. ఆచరించండి. ఉద్యమించండి.

చెప్పాలనుకున్నదాన్ని ఎటువంటి తడబాటు లేకుండా, సూటిగా వ్యక్తం చేయడం నిజంగా కళే. కొంతమంది మగువలు తమవారి ముందు గుక్కతిప్పుకోకుండా మాట్లాడేస్తుంటారు. కానీ ఇతరుల ముందు నోరు పెగలదు. చిన్నపాటి సదస్సుల్లో, కార్యాలయంలో సహోద్యోగుల మధ్య విషయాలను వివరించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిపడతారు. వాక్చాతుర్యాన్ని పెంపొందించుకోవాలనుకున్న వనితలూ... ఓసారి ఇవి చదవండి.
* అభిరుచి :
ఎవరికి ఏ అంశంలో ఆసక్తి ఉంటుందో ఆ విషయాలను స్పష్టంగా మాట్లాడగలరు.కొంతమంది రాజకీయాల గురించి బాగా మాట్లాడితే, మరికొందరు పిల్లల పెంపకం, అందం, క్రీడలు.. తమకు నచ్చిన రంగం గురించి బాగా సంభాషించగలుగుతారు. తమ అభిరుచికి అద్దంపట్టే విషయాలను గుర్తించి, ఎప్పటికప్పుడు విషయసేకరణ చేసుకోవడం ఉత్తమం.
* అవగాహన :
పలు విషయాలపై పట్టున్నట్టే అనిపిస్తుంది. కానీ తీరా నలుగురిలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు లోతుగా ప్రస్తావించలేరు. అందరికీ తెలిసిన పైపై మాటలు చెప్పి ఆగిపోతుంటారు. అందుకే ఆ రంగంలో మరింత అవగాహనను పెంచుకోవాలి.క్షుణ్ణంగా తెలిసుంటే ఆత్మస్త్థెర్యంతో ప్రసంగించగలరు. కొత్త విషయాలను చెప్పగలిగినప్పుడు ఎదుటి వారూ చెవిచ్చి ఆలకిస్తారు.
* శ్రోతల్ని గమనించాలి :
ఎవరి ముందు మాట్లాడుతున్నారో గుర్తెరగాలి. వాళ్ల ఇష్టాయిష్టాలు... ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు? సాంకేతికంగా వారి పరిజ్ఞానం ఎంత? మాట్లాడుతున్న అంశాన్ని ఎంత వరకు అవగాహన చేసుకోగలరు? వంటి పలు అంశాలను గ్రహించగలిగితే దానికి తగ్గట్టు సన్నద్ధమవడం తేలిక.
* రాసుకుంటే.. :సదస్సుల్లో పత్ర సమర్పణ లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు వీలైతే మొత్తం వ్యాసాన్ని రాసుకుని చదువుకోవచ్చు. ముఖ్యాంశాలను రాసుకోవడం వల్లా ఉపయోగం ఉంటుంది. ఇలా చేస్తే చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోయే ప్రమాదం ఉండదు. మన ముందున్న వ్యక్తుల్ని చూసి తడబడి అసలు విషయాన్ని మర్చిపోతామన్న చింత దూరం.
* తర్ఫీదు :
మనసులో ఎన్ని విధాల అనుకున్నా ఆ భావాలను స్పష్టంగా పలకగలగాలి.ప్రసంగించాల్సిన విసయాన్ని ముందు రోజు ఒకటికి నాలుగు సార్లు అద్దం ముందు చెప్పుకొంటే మంచిది. సన్నిహితుల ముందు చెప్పినా ఫలితం ఉంటుంది. వారి సలహాలను కూడా స్వీకరించవచ్చు.
* సంసిద్ధత :
ఇన్నిరకాలుగా సంసిద్ధులైన తర్వాత ఇంకా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. వక్తృత్వ అంశమూ తెలుసు. శ్రోతల మనసూ తెలుసుకున్నప్పుడు భయమెందుకు? ధైర్యంగా మాట్లాడగలమన్న భావనను మనసులో ఒకటికి నాలుగు మార్లు మననం చేసుకుంటే చాలు.
* హావభావాలు :
నిటారుగా నిలబడి పాఠం అప్పగించేసినట్టు మాట్లాడటం ఎప్పుడూ అందగించదు. హావభావాలు ముఖ్యం. మనం ఏం చెబుతున్నామన్నది కొన్ని సార్లు చేతుల కదలిక, ముఖ కవళికలు ద్వారా కూడా వ్యక్తం చేయగలుగుతారు. అలాగని చేతుల్లో కాగితాలుంచుకుని వాటిని అటు ఇటూ కదిలిస్తూ మాట్లాడితే మైక్ ముందు చప్పుడై ఇబ్బందిగా ఉంటుంది. ఎదురుగా పోడియం ఉంటే దాని మీద చేతులు ఆన్చి మాట్లాడితే ఉత్తమం.
* చిరునవ్వు :
చిరునవ్వును మించిన ఆభరణం ఉండదంటారు. తీసుకున్న అంశాన్ని గురించి లోతుగా, ప్రభావితంగా మాట్లాడుతున్నా ముఖం మీద ప్రశాంతత, చిరునవ్వులను చెక్కుచెదరనీయకూడదు. సంతాప సభల్లో చిరునవ్వులు పనికిరావు. సమయానుకూల ప్రవర్తన మెప్పిస్తుంది.
* అతి వద్దు :
కొంతమంది ఎదురుగా ఉన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ఏవో చిన్నపాటి జోకులు చెబుతుంటారు. కానీ కొన్ని మరీ పేలవంగా ఉండి ఎదుటివారికి నవ్వు తెప్పించవు. సరికదా 'కుళ్లు జోకు' అని విమర్శలకు తావిస్తాయి. అందుకే వీలైనంత వరకు సున్నితమైన హాస్యాన్ని పండించే చమక్కులను ఎంచుకోవాలి.
* అర్థవంతంగా :'నా ధోరణి ఇంతే' అన్నతత్వం ఏ సమయంలోనూ సరికాదు. విషయాన్ని ఎంత సూక్ష్మంగా గ్రహించినా, చక్కటి తర్ఫీదు ఎలాగూ ఉందని మురిసిపోయినా, ఎదుటివారి నాడిని పట్టుకోగలమన్న ధీమా ఉన్నప్పటికీ... మనం చెప్పదలచుకున్న విషయాన్ని అర్థవంతంగా చెప్పకపోతే... వక్తృత్వం ఎదుటివారి మస్తిష్కంలో ఆలోచనను రేకెత్తించకపోతే మీరు చేసిన మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరేనన్నది అక్షర సత్యం. అందుకే అర్థవంతంగా ప్రసంగించగలిగితే చాలు.
[Thyaga R S Annambhotla గారి "నా తెలుగు రాతలు!" (http://diversityintelugu.blogspot.com/) లో 'ఏకాక్షరంతో మనవాళ్ళు చేసిన పద ప్రయోగాలు కొన్ని' చూసిన తరువాత ఇది ఇక్కడ చేర్చడం జరిగింది.]
క.నేనెన్నెన్నో నిన్న
న్నానని, నీనాననానినానని, నన్నో
నానీ! నిన్నూనిననను
నౌ, నౌ, నననీన నిన్ను నన్నౌనెన్నన్.
(కవిరాజు సంబర సూర్యనారాయణ శాస్త్రి-"తిమ్మరుసు మంత్రి")
ఓ నానీ! నేను; నిన్ను= నిను గురించి,
ఎన్నెన్నో=ఎన్నియో మాటలు,
అన్నానని= అంటిననియు,
నీనాన= నీ సిగ్గును,
నానినానని= పోగొట్టితిననియు,నిన్ను;
ఊనిన= నమ్మియున్న,
నను= నన్ను,
నన= పువ్వు, ఈన= వికసించినట్లు,
నౌనౌ= నవ్వు నవ్వు,
నిన్ను, నన్ను= మనలనిద్దఱను (అపుడు),ఎన్నన్ ఔను= పొగడదగును.
_____________________________________________
- డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
ప్రతికూల పరిస్థితులనేవేవీ మనిషి చుట్టూ వచ్చి చేరవు. మనిషే వాటిని సృష్టించుకుంటాడు. క్రియాశూన్యతతో వాటిని అధిగమించలేక ఎవరినో నిందిస్తాడు. మనం ఎప్పుడూ చేసే పనినే మాటిమాటికి చేస్తూ పోతుంటే ప్రతిసారి వచ్చే ఫలితమే ఎప్పుడూ ఎదురవుతుంది. భిన్నమైన ఫలితాన్ని పొందాలంటే చేసే పనినీ భిన్నంగా చేయాలి. ఇప్పటిదాకా పొందనిదేదో పొందాలంటే ఇప్పటిదాకా చెయ్యనిదేదో చేయాలి.
విజయం అనేది అనుకోని సంఘటన కాదు. ఓ అద్భుతం అసలే కాదు. ఏ పనికైనా ఈ ప్రపంచంలో ఓ ప్రయత్నం, ఓ ఫలితం అనే రెండే అంశాలుంటాయి. ఎక్కువ ప్రయత్నం చేసేవాడు ఎక్కువ ఫలితం పొందుతాడు. తక్కువ ప్రయత్నం చేసేవాడు తక్కువ ఫలితం పొందుతాడు. గాలిలో దీపంపెట్టి 'దేవుడా, నీవే దిక్కు' అనుకునేవాడు కర్మ, పాప ఫలం అనుకుంటూ కాలయాపన చేస్తూ జీవిత ప్రయాణాన్ని ముందుకు నెట్టే యత్నంలో ఉంటాడు.
ఆమధ్య బీజింగ్ ఒలింపిక్స్‌లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ చైనా నూరు పతకాలు కైవసం చేసుకుంది. భారతదేశం కేవలం మూడు పతకాలు సాధించింది. మరో దేశానికి చెందిన మైఖేల్ ఫెల్ప్స్ అనే ఈతగాడు ఒక్కడే ఎనిమిది బంగారు పతకాలు సాధించి అజేయుడై నిలిచాడు. ఈ ఫలితాలను యాదృచ్ఛికాలుగా భావించలేం. ఒకరిది అదృష్టం, మరొకరిది దురదృష్టం అనీ సరిపెట్టుకోలేం.
అనుకోకుండానో, అదృష్టవశాత్తో అద్భుతాలు జరుగవు. శ్రమిస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది. విజయం సాధించడానికి- చెయ్యగలిగిందల్లా చేస్తే లాభంలేదు. చెయ్యవలసిందల్లా చేయాలి.
ఓ మతపెద్ద ఓ పట్టణ శివార్ల గుండా కారులో ప్రయాణిస్తూ వెళుతున్నాడు. రోడ్డు పక్కన గుబురుగా, దట్టంగా పెరిగిన అటవీ ప్రాంతం పక్కన నందనవనం లాంటి శోభాయమానమైన తోటనొకటి చూశాడు. వెంటనే కారు ఆపి ఆ తోట అందాలను ఆస్వాదిస్తూ కొంత సమయం గడిపాడు. ఆ తోటలో కేవలం గోచీ గుడ్డ కట్టుకుని చెమటలు కక్కుతున్న శరీరంతో ఎండలో చెట్లకు పాదులు సరిజేస్తూ కలుపు మొక్కలు తీస్తున్న రైతును గమనించాడు ఆ మతపెద్ద.
ఆ రైతును పిలిచి 'నీవు ఎంత అదృష్టవంతుడివయ్యా! భగవంతుడు నీకు ఎంత మేలు చేశాడో చూడు. ఈ నిస్సారమైన గుట్టల మధ్య, ముళ్లపొదల మధ్య ఎంతో ఫలపద్రమైన తోటను నీకు బహూకరించాడు. దేవుడికి నీవు ఎంతో రుణపడి ఉండాలి. కృతజ్ఞుడివై ఉండాలి' అన్నాడు. అందుకు సమాధానంగా ఆ రైతు 'ఓ మహానుభావా! మీరు చెప్పినట్లు నేను దేవుడికి కృతజ్ఞుడినై ఉండాల్సిందే! నిజంగా నేను అదృష్టవంతుడినే. ఇరవై సంవత్సరాల క్రితం ఇదంతా అటవీమయంగా రాళ్లతో, ముళ్లపొదలతో నిండి, దుర్భేద్యంగా ఉండి, ఏ కూలినీ ఎంత ప్రాధేయపడ్డా నాకు సహాయపడేందుకు రానప్పుడు, నేనెంత పని చేశానో మీరు చూసి ఉంటే- దేవుడు నాకు ఎంత మేలు చేశాడో మీరు గ్రహించి ఉండేవారు. అయినా మీ మాటలు నేను కాదనడం లేదు. దేవుడు నాకెంతో మేలు చేశాడు. నేను ఆయనకు రుణపడి ఉన్నాను' అన్నాడు. రైతు సమాధానంలో 'శ్రమయేవ జయతే' అన్న అంతస్సూత్రం దాగి ఉంది. మనిషి కర్తవ్యం కేవలం కార్యాచరణ మాత్రమే. ఫలితం పనిని బట్టి ఉంటుంది.
సముద్రం పైపైన ఈదుతూ వెతికితే నాచు తగులుతుంది. అదే శ్రమకు వెరవకుండా లోతుల్లోకి వెళ్లి సాగరాన్ని మధిస్తేనే ముత్యాలు దొరుకుతాయి. ఇదే ప్రకృతిలో దాగి ఉన్న కార్యాచరణ రహస్యం. దైవాన్ని నమ్మినా, దైవంపై ఆధారపడకుండా పనిని నమ్మే కార్యసాధకుడే ఎప్పుడూ గెలుస్తాడు!

నోరు మంచిదయితే వూరు మంచిదవుతుంది. ఓ చిరునవ్వు... ఆత్మీయులను సంపాదించి పెడుతుంది. కరుణ చూపిస్తే పాషాణ హృదయమూ కరుగుతుంది. ప్రతి ఒక్కరూ కరుణను అలవర్చుకుంటే ప్రపంచమంతా సంతోషమయమవుతుంది. కరుణ చూపించడానికి కోట్లు కుమ్మరించాల్సిన పనిలేదు. పెద్దపెద్ద త్యాగాలూ అవసరం లేదు. కాస్తంత ఉదారం చూపితే చాలు. కోపం అణుచుకుంటే చాలు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు కాస్తంత సంయమనం పాటిస్తే దూదిపింజలా తేలిపోతాయి. రోడ్డుమీద వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఓ వృద్ధురాలు రోడ్డు దాటడానికి ప్రయాస పడుతుంది. ఓ శునకం బెంబేలెత్తుతుంది. పోలీసులెవరూ చెప్పకుండానే... మీ వాహనాన్ని ఆపి ఆ వృద్ధురాలికో, ఆ శునకానికో వెసులుబాటు ఇవ్వండి. అదే కరుణంటే. అర్థరాత్రి మంచి నిద్రలో ఉంటారు. పక్క ఫ్లాట్లోంచి విపరీత శబ్దాలు వచ్చి మీ నిద్రకు భంగం వాటిల్లుతుంది. వారిపై కోపగించుకుంటే ఏమవుతుంది. మీ నిద్ర ఎలాగూ పోయింది సరికదా! వారితో శత్రుత్వం ఏర్పడి ప్రశాంతత కరవవుతుంది. సంయమనంతో ఉండండి. ప్రశాంతత మీ సొంతమవుతుంది. మొక్కలు పెంచడం, పక్షులకు ధాన్యం గింజలు వేయడం, సహోద్యోగి పని ఒత్తిడిలో ఉన్నప్పుడు సాయమందించడం, పొరుగువారి కష్టాల్లో పాలుపంచుకోవడం ఇవన్నీ కారుణ్య చర్యలే. ఇల్లాలికి ఇంటిపనిలో సాయం చేయడమూ అదే కోవలోకి వస్తుంది. విశ్వ కారుణ్య ఉద్యమం తొలిసదస్సును జపాన్‌లోని టోక్యోలో 1998 నవంబరు 13న నిర్వహించారు. జపాన్ చిరు కారుణ్య ఉద్యమం 35వ వార్షికోత్సవం కూడా ఆ రోజునే పాటించారు. అప్పటినుంచి, కారుణ్య స్వభావాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నవంబరు 13ను విశ్వ కారుణ్య దినోత్సవంగా గుర్తిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ప్రాణి పట్లా కరుణ చూపడం, పర్యావరణం పట్ల మమకారం పెంచుకోవడం ఈ దినోత్సవం ఆశయం. ఈ ఆశయానికి అందరూ కంకణబద్ధులైతే ప్రపంచమంతా సంతోషం వెల్లివిరిస్తుంది. అశాంతి పరిసమాప్తమవుతుంది.
( - జి.వి.డి.కృష్ణమోహన్ )
''బ్లడీ ఇండియన్స్!''
-ఈ మాటలు వందేళ్ళ క్రితం గాంధీజీ సత్యాగ్రహం ప్రారంభించిన దక్షిణాఫ్రికాలో అప్పటి జాత్యహంకారులన్నవి కావు...
ఇది అరవయ్యేళ్ళ క్రితంవరకు మనల్ని పాలించిన బ్రిటిషర్ల దుర్భాషకాదు...
బతుకు తెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన మన జనాన్ని అక్కడి 'ప్రథమశ్రేణి పౌరులు' పిలిచే పిలుపూ కాదిది...
ఘనత వహించిన 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా'కు చెందిన ఓ కుర్ర నటిచుట్టూ దడికట్టి ఆమె మడిబట్టకు తగిలినవారిని తన్ని తగలేసేందుకు అరుదైన ఆ స్త్రీతోపాటు ఇండియా వేంచేసిన అంగరక్షక పంచకంలో మన ఘన చరిత్రా చేతగాని చవటాయిత్వాలను ఔపోసన పట్టిన అమెరికా జాతి దేహరక్షకుడి నోట జాలువారిన ముత్యాల సరాలు- ''బ్లడీ ఇండియన్స్!''
మనదేశంలో, మనజనం మధ్య మనవాళ్ళని అంత చీదరించుకునే, దూషించే, చివరికి చేయిచేసుకునే ధైర్యం ఓ విదేశీ నటి దేహరక్షకులకు ఎక్కడినుంచి వచ్చింది? నోరుపారేసుకున్న దేహవీరులు స్థాయిలేని అమెరికన్లనో, మన పోలీసులు కేసులు పెట్టారుకాబట్టి కథను కంచికి నడిపించేద్దామనో మనకుమనమే సర్దిచెప్పుకోవటానికి ఏమాత్రం వీలులేని ప్రశ్న ఇది.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది... సుదీర్ఘ నాగరికత ఉన్న దేశం మనది... జనాభాలో చైనాను మించుతున్న రాజ్యం మనది... ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఆయుధాలు కొంటున్నదీ మనమే... ఐ.టి.లో మనమే మేటి... ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడగల స్థాయికి ఎదిగిపోయిన దేశం కూడా మనదే... మనల్ని మనం(మాత్రమే) పొగడుకోవడానికి కావాల్సిన ఈ తరహా పనికిమాలిన సరంజామాను పోగేస్తే హిమాలయాల ఎత్తుకు మించిపోతుంది. విదేశాల్లో ఇండియన్లకు దక్కుతున్న 'మర్యాదల' గత, సమకాలీన చరిత్రల్ని తిరగేస్తే... ఓ జాతిగా మనకి లభిస్తున్న గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది.
మొదటి తరగతి రైలుపెట్టెలో ఎక్కిన నల్లబాబును బోగీనుంచి లాగి బయటపడేస్తే... మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అనే (అప్పటికి) అర్భకుడు దాన్ని మన హోం కమ్ ఉపప్రధాని పదవి వెలగబెట్టిన అద్వానీ మాదిరి సర్దుకుపోయి ఉంటే, ఆగ్రహమూ లేదు... సత్యాగ్రహమనే భావనే పుట్టేది కాదు. ఉపప్రధానిగా ఉన్నరోజుల్లో అధికారిక హోదాలో అగ్రరాజ్యంలో పర్యటించడానికి వెళ్ళిన అద్వానీ మహాశయుడిని అమెరికా ఉద్యోగులు బూట్లూ సాక్సు విప్పించి చూడటం మన జాతికి అవమానమని ఇక్కడి ప్రసార సాధనాల్లో అభిప్రాయాలు, వ్యాసాలు, వాదనలూ హోరెత్తుతున్న సమయంలో సదరు విప్పిన నేత సమాధానమేమిటంటే... ''దీన్ని గుడ్డలిప్పడంగా ఎందుకు భావిస్తున్నారో నాకు అర్థం కాలేద''ని. అర్థమైతే మహాత్ముడు- అర్థం కాకపోతే అద్వాని!
మనం అవతలిదేశంతో ఎలా వ్యవహరిస్తున్నాం, అవతలి దేశం మనతో ఎలా ఉంటోందన్నది దౌత్యంలో ప్రాథమికం, ప్రధానం. ఏకపక్ష గౌరవాలు, మర్యాదలు ఇచ్చేది సామంత రాజ్యమవుతుందే తప్ప సార్వభౌమ రాజ్యం కాలేదు. రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో రెండుమార్లు తన గుడ్డలూడదీసిన వైనాన్ని ఫెర్నాండెజ్ ఏనాడో పూసగుచ్చారు. విప్రో నిర్మాత అజీమ్ ప్రేమ్‌జీ, నటుడు కమల్‌హాసన్ సైతం ఇలా ఏదోరకంగా అవమానాలకు గురైనవారే. కాబట్టి ముంబాయిలో సినిమా షూటింగ్‌కోసం వచ్చిన ఏంజెలినా జోలి దేహరక్షకులే మనల్ని, మన జాతీయతను అవమానించారని బాధపడటం వ్యర్థం! ఉప ప్రధాని, రక్షణమంత్రి పదవుల్లోని వ్యక్తులనే పట్టించుకోని దేశంలోని వ్యక్తులు... ఆఫ్టరాల్, ముంబాయిలో ఓ స్కూలు పిల్లల్ని, వాళ్ళ అమ్మాబాబుల్ని సహేతుకంగా, సవినయంగా గౌరవిస్తారన్నదే వేరూ మొదలూ లేని ఆలోచన. అగ్రరాజ్యం నాయకత్వం తన పౌరులకు శాంతిసౌభ్రాత్రాలు, మానవతా విలువలు, సమానత్వ సూత్రాల స్ఫూర్తిని ఉగ్గుపాలలోనో సీసాపాలలోనో కలిపి పట్టిందనే వెర్రి నమ్మకాలెవరికీ లేవు. మిగతా ప్రపంచంలో అర్భకులు, అంగుష్ఠమాత్రులు మాత్రమే ఉంటారన్న భావన అక్కడి మనుషుల్ని కనిపించనివ్వనంత ఎత్తున అమెరికా నాయకత్వంలో మేటవేసి ఉన్నప్పుడు... ఆ దేశంలోని పౌరులందరిలో ప్రజాస్వామిక, మానవతా విలువలు హిమనదాల్లా ప్రవహించాలన్నదే దుస్వప్నం. ఇరాక్‌లో ఇరాకీలు, ఆఫ్ఘనిస్థాన్‌లో ఆఫ్ఘనీలు మాదిరే ఇండియాలో ఇండియన్లూ తమకన్నా తక్కువ జాతివారనే భావం కలగబట్టే మనదేశంలోనే మనం 'బ్లడీ ఇండియన్స్!'
'మీ దేశంలో భద్రత, రక్షణ వ్యవస్థలమీద మాకు నమ్మకం లేదు ఫొ'మ్మంటే క్లింటన్, బుష్‌ల పర్యటన సమయాల్లో మన సర్కార్లు తలూపాయి. వారి అధ్యక్షుడు పర్యటించే మన కార్యాలయాలు, ప్రదేశాలు అమెరికన్ల అధీనంలోకి వెళ్ళిపోయాయి. మన ప్రధాని, రాష్ట్రపతి ఎవరైనా, ఎప్పుడన్నా న్యూయార్కో వాషింగ్టనో సందర్శిస్తున్నప్పుడు... అదేతరహాలో వారి కార్యాలయాల్ని 'భద్రతా కారణాల దృష్ట్యా' మన దేశం అధీనంలో ఉంచాలని అడిగే సాహసమైనా మన నాయకత్వానికి ఉందా? ఇక్కడైనా అక్కడైనా మన భద్రతకన్నా వారి భద్రతే మెరుగని ఒప్పేసుకోగల చవటాయిత్వం మాత్రమే ఉంది. 'క్లింటన్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన చేతిని' నెలరోజులపాటు కడుక్కోనని చెప్పగల బులపాటమే మన ఎంపీల్లో సైతం బయటపడింది. పౌరుడి ప్రాణానికి విలువలేని ఇండియాలో పుట్టినా మనం ఎలా బతగ్గలుగుతున్నామన్నదే వారికి అర్థంకాని ప్రశ్న. అమెరికా అధ్యక్షుడికి రక్షణ కల్పించారంటే సరే... ఓ నటికి కూడా అక్కడి దేహరక్షకులతోనే భద్రత కల్పించేందుకు మన ప్రభుత్వాలు ఎలా అనుమతించాయన్నది మనకు అర్థంకాని ప్రశ్న. ఈ దేశంలో కూడా సర్కారున్నది అమెరికన్ల రక్షణపట్ల శ్రద్ధ చూపడానికి మాత్రమేనా అన్నది సమాధానం లభిస్తున్న సందేహం.
ఏంజెలినా జోలి దేహరక్షకుల్లో ముగ్గురిమీద మన పోలీసులు కేసులు పెట్టేసినమీదట... ఇండియాలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని విదేశాల్లో ఎవరైనా భ్రమపడితే వాళ్ళ ఖర్మ. ఏకంగా ఓ విమానం వేసుకొచ్చి మన దేశంలో ఆయుధాల బోషాణాలు జారవిడిచి అదృష్టం బాగోక దొరికిపోయిన విదేశీయుల్ని మన ఘన జన సర్కారు ఏం చేసింది? మొహమాటపడి వదిలేసింది. ఏదో రష్యా, లాత్వియా, బ్రిటన్ లాంటి దేశాల నాయకులు మాటవరసకు అడగ్గానే శత్రువుల్ని, కుట్రదారుల్ని కూడా వదిలేసిన మన ప్రభుత్వాలు... అందచందాల అమెరికన్ తార దేహరక్షకుల్ని చట్టానికి పట్టించి జైల్లో పెట్టిస్తారా? ఉపప్రధాని, రక్షణమంత్రి వస్త్రాపహరణకు గురైతేనే పొడుచుకురాని రోషం... మన బడిపిల్లల్ని, వాళ్ళమ్మానాన్నల్ని అన్నంతనే ఎగదన్నుకు వస్తుందా? ఆ ముగ్గుర్నీ వదిలేయండని అగ్రరాజ్యం అధ్యక్షులవారు అడక్కపోయినా బేఫరవా! అమెరికానుంచి ఎవరు ఫోన్ చేసినా క్షణమాలస్యం చేయకుండా ఆపని కానివ్వాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకోలేదని ఎవరు చెప్పగలరు? గాంధీపుట్టిన దేశంలో మహోన్నత జాతిని నిర్మించలేని మన నాయకుల్ని ఈ దేశంలో ప్రజలు అనగలిగిందేమిటి..?
వివేకం ఒకరి సొత్తు కాదు. కాస్తో కూస్తో తెలివి తేటలు అందరికీ ఉంటాయి. మోతాదుల్లోనే తేడాలు. కొందరికి తెలివి తేటలు అధికంగా ఉంటాయి. మరికొందరు అంత తెలివిగా ఉండరు. అతితెలివి కలవారితోను ఇబ్బందే, తెలివితక్కువ వారితోనూ కష్టమే. అమాయకత్వాన్ని మంచితనంగా భావిస్తే అసలు ఇబ్బందే ఉండదు. పరమానందయ్య శిష్యులను ఈ కోవలోకి చేర్చవచ్చు. తెలివి ఒకరి సొమ్మా తోట సుబ్బమ్మా- అంటూ నిలవేశాడట ఓ సుబ్బారాయుడు. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాకపోయినా తామే చాలా తెలివికలవాళ్లమనే అహం కొందరిలో ఉంటుంది. ''చెయిముట్టు సరసం అంటే నాకు కరచరణాలు ఆడవు కాని వ్యవహారాలంటే చెప్పు యెత్తుకి ఎత్తు ఇంద్రజాలంలా ఎత్తుతాను...'' అంటాడు రామప్ప పంతులు. అంతటి తెలివితేటలు కలవాణ్నీ- ''యీ రామప్పపంతులు చిక్కులకు జాకాల్ తెలివికి బిగ్ యాస్...'' అంటూ వర్ణిస్తాడు గిరీశం. ఆ వర్ణనకు మధురవాణి విరగబడి నవ్వుతుంది. తెలివితేటలు అధికమైనప్పుడూ అభాసుపాలయ్యే అవకాశం ఉంది. అతడు పైలాపచ్చీసు పురుషుడు. సినిమాలనీ షికార్లనీ తెగ తిరుగుతుంటాడు. భార్యను మాత్రం గడప దాటనివ్వడు. ఆవిడ సూక్ష్మగ్రాహి. భర్త అనుమానం పిశాచి అని తెలుసు. అతని అనుమానానికి అడ్డకట్టవేసి ఇంటిపట్టునే కట్టి పడెయ్యటానికి మంచి ఉపాయం కనిపెట్టింది. ''ఇంట్లో ఏం తోచటంలేదండీ. ఏ సినిమాకైనా వెళ్దాం. మీకు వీలుకాకపోతే పక్కింటి పిన్నిగారితో వెళతాలెండి...'' అంటుంది. అంతే- ఆ తరవాత రెండు రోజులు మానవుడు గడప దాటడు!
స్త్రీ పురుషుల మధ్య ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న వివాదం ఆదినుంచీ రగులుతూనే ఉంది. తెలివితేటల విషయంలో మగవారూ ఆడవారూ ఒకరితో మరొకరు పోటీ పడుతూనే ఉన్నారు. ''అతడు ఆమెల ఫైటు, అతివ ఛాన్సులు బ్రైటు, ఆడదెపుడూ రైటు...'' అన్నారు ఆరుద్ర. సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే అయినప్పటికీ ప్రతి విషయంలోనూ మగవారు ఆడవారు పోటీపడుతుండటం మొదటినుంచీ జరుగుతూనే ఉంది. ''మావారు నే గీచిన గీటు దాటరు'' అని గర్వపడుతుందా ఇల్లాలు. అంతకంటె రెండాకులు ఎక్కువ చదివిన శ్రీమన్నారాయణుడు ఫ్రెండ్సుతో పేకాడి బార్‌కు కూడా వెళ్ళి అర్ధరాత్రి తూలుకుంటూ ఇంటికొచ్చి ''ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. ఊపిరాడటం లేదు. తల బద్దలు కొట్టేస్తుంది...'' అంటూ నటసమ్రాట్‌లా నటించేస్తుంటే- నమ్మేస్తుంది అమాయకురాలు. అయ్యగారి బూట్లు విప్పటంతో పదసేవ ప్రారంభించి వేడివేడిగా కాఫీ కలిపి ఇచ్చి, బతిమాలి అన్నం తినిపించి జోలపాట మినహాగా పవళింపు సేవ పూర్తిచేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆలుమగలులో ఎవరు ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించారన్నది విజ్ఞులు తేల్చాల్సిన విషయం. అసలు రసజ్ఞులెవరూ ఇటువంటి ముచ్చట్ల జోలికి పోయి తీర్పులివ్వటానికి సిద్ధపడరు. తెలివితేటల సంగతి పక్కన పెడితే మాటల్లో మాత్రం అతివే మేటి. ''ఆటల పాటల పేటికలారా, కమ్మని మాటల కొమ్మల్లారా...'' అని గురజాడ అననే అన్నారు. మధురవాణి వంటి పేర్లు ఆడవారికే ఉన్నాయి కాని అటువంటి భావం స్ఫురించే పేర్లు మగవారికున్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు.
''ఆడది మెచ్చిందే అందం మొగాడి కన్ను మసక'' అంటుంది మధురవాణి 'కన్యాశుల్కం' నాటకంలో. కళ్ళ విషయంలో ఏమో కాని మెదడు విషయంలో మాత్రం మగవారిదే పైచేయి. అలాగని శాస్త్రజ్ఞుల అధ్యయనంలో తేలింది. ఇప్పటివరకు మేధ విషయంలో స్త్రీ పురుషులిద్దరూ సమానులే అన్న అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయం సరికాదని బుద్ధిబలంలో మగవారే ఆడవారికంటె ముందుంటారని బయటపడింది. వెస్టర్న్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞుల బృందం మనస్తత్వ శాస్త్రజ్ఞుడు జె.ఫిలిప్ రష్టన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ బృందం 17 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న లక్షమంది యువతీ యువకులను పరీక్షించి ఈ నిర్ణయానికి వచ్చింది. ఆ యువతీ యువకులందరికీ రకరకాల ఐ.క్యు. పరీక్షలు నిర్వహించారు. యువతుల కంటె యువకులే నాలుగైదు పాయింట్లు ముందున్నట్లు రుజువైంది. సామాజిక, ఆర్థిక సంబంధాల్లో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని పెట్టిన పరీక్షలన్నింటా మగవారే ఎక్కువ తెలివితేటలు ప్రదర్శిస్తున్నట్లు బయటపడింది. లోగడ ఓ పరిశోధనలోనూ ఇటువంటి ఫలితాలే వచ్చాయి. శైశవ బాల్యదశల్లో తెలివితేటలరీత్యా ఆడపిల్లలకు మగపిల్లలకు ఆట్టే తేడా కనిపించకపోయినా యౌవన ప్రాదుర్భావ సమయం నుంచీ మార్పులు కనిపిస్తున్నాయని తేటపడుతోంది. ఇందుకు కారణం ఆడవారికి మగవారికి మెదడు పరిమాణంలో ఉండే తేడా కూడా కావచ్చంటున్నారు. దేహబలం, బుద్ధిబలాల్లో మగవారే ఆధిక్యాన్ని కలిగి ఉన్నా, వాక్చాతుర్యంలో అమ్మాయిలదే మొదటి స్థానమని శాస్త్రజ్ఞులూ అంగీకరిస్తున్నారు. మాటల్లో మగవారు మగువలతో పోటీపడలేరని అంతా ఒప్పుకొంటున్నారు. ఆ విషయం తెలుసుకోవటానికి పెద్దగా పరిశోధనలు అక్కర్లేదనే విషయం అందరికీ తెలిసిందే