Showing posts with label RELIGION/telugu. Show all posts
Showing posts with label RELIGION/telugu. Show all posts

Saturday, February 18, 2012

బిల్వ పత్రాలతో శివరాత్రి పూజ Auspicious Shivaratri Puja


బిల్వ పత్రాలతో శివరాత్రి పూజ
Auspicious Shivaratri Puja

మాఘ బహుళ చతుర్దశి మహా శివరాత్రి పర్వదినం. ఈ విశిష్ట దినాన పరమశివుని బిల్వపత్రాలతోపూజించాలి.

మహాశివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకం చేయాలి. ''నమశ్శివాయ'' అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. బిల్వపత్రాలతో శివలింగాన్ని పూజించాలి. మృత్యుంజయ మంత్రం జపించాలి. దీన్ని ''త్రయంబకం మంత్రం'', ''రుద్ర మంత్రం'', ''మృత సంజీవనీ మంత్రం'' అని కూడా అంటారు.

ఈ శివరాత్రి వ్రతాన్ని కనీసం ఒక్కసారి చేసినా ఇహలోకంలో సర్వ సుఖాలూ, పరలోకంలో మోక్ష ప్రాప్తి లభిస్తాయి. అందుకు నిదర్శనమైన కథ చూడండి. పూర్వం ఒక వేటగాడు ఉండేవాడు. అతను రోజూ అడవికి వెళ్ళి జంతువులను వేటాడి జీవించేవారు. ఒకరోజు వేటగాడికి ఏ మృగమూ దొరకలేదు. రాత్రయినా చిన్న జంతువు కూడా దొరకలేదు. నిరాశ కలిగినా ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళలేక ఒక సరసు వద్ద ఉన్న చెట్టు ఎక్కి ఏదో ఒక జంతువు నీళ్ళు తాగడానికి రాకపోతుందా అని మాటు వేశాడు.తాను కూర్చోడానికి వీలుగా ఆ చెట్టు ఆకులు, పూలు, కాయలు విరిచి కింద పడేశాడు. అనుకున్నట్లుగానే ఒక జాము వేళ ఓ లేడి వచ్చింది. వేటగాడు ఆనందించి జింకకు బాణం వేయబోగా జింక పైకి చూసి ''వేటగాడా! నన్ను చంపకు'' అంది. జింక మనిషిలా మాట్లాడుతోంది ఏమిటని ఆశ్చర్యపోయి చూశాడు. అందుకు సమాధానంగా ''నేను గతజన్మలో రంభని. అప్సరసనైన నేను రాక్షస రాజు అయిన హిరణ్యాక్షుని మోహంలో పడి మహాశివుని పూజించడం మరచాను. అందుకు కోపించిన పరమేశ్వరుడు ''కామంతో కళ్ళు మూసుకుపోయిన నువ్వు,నీ ప్రేమికుడు కూడా జింకలుగా పన్నెండేళ్ళు జీవించండి. చివరికి ఒక వేటగాడి కారణంగా శాపవిముక్తులౌతారు'' అంటూ శపించాడు.

''ఇప్పుడు నేను నిండు గర్భిణిని. ఈ స్థితిలో నన్ను చంపకూడదు. నేను ప్రసవం కాగానే, శిశువును ఎవరికైనా అప్పగించి వస్తాను. ఈలోపు ఒక పెంటిజింక వస్తుంది.. దాన్ని చంపు'' అని చెప్పింది.

వేటగాడు అమితాశ్చర్యంతో అదంతా విని అందుకు సరేనన్నాడు.
రెండోజామువేళ పెంటి జింక వచ్చింది. వేటగాడు దాన్ని చంపబోగా అది కూడా మనిషి స్వరంతో ''వేటగాడా! నేను విరహంతో వేగిపోయి ఉన్నాను. నా శరీరం కూడా కుంగి కృశించి పోయింది. నన్ను చంపినా, దోసెడు మాంసం కూడా రాదు. కనుక నువ్వు చేసేది దండగమారి పని. కాసేపట్లో బలమైన జింక వస్తుంది, దాన్ని చంపు.. లేదంటే కొద్దిసేపట్లో నేను తిరిగివస్తాను, అప్పుడు చంపుడువుగాని'' అంది.
వేటగాడు అలాగే విడిచిపెట్టాడు.
మరికాసేపటికి మగ జింక వచ్చింది. వేటగాడు బాణం తీయగా ఆ జింక ''ఇంతకుముందు నా ప్రేయసిని, మరో జింకను చంపింది నువ్వేనా?'' అనడిగింది.
వేటగాడు ఆశ్చర్యపోయి ''లేదు.. అవి తిరిగివస్తామని చెప్పి వెళ్ళాయి.. నిన్ను చంపి భుజించమని చెప్పాయి'' అన్నాడు. ఆ జింక ''అలాగా.. సరే.. ఇప్పుడు మాత్రం నన్ను వదిలిపెట్టు. నా భార్య నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తనతో గడిపి, బంధుమిత్రులతో చెప్పి తిరిగివస్తాను.. నన్ను నమ్ము'' అంది.
వేటగాడు దాన్ని కూడా వదిలాడు. అతనికి అంతా చాలా వింతగా ఉంది. వాటికోసం ఎదురుచూస్తూ ఆ చెట్టుమీదే ఉండిపోయాడు. అతని నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ జింకలు తిరిగి వచ్చాయి. ఇంకా చిత్రం ఏమిటంటే ఆ జింకలు దేనికదే తనని చంపమంటే తనని చంపమని వేటగాణ్ణి బ్రతిమాలాయి. వాటి నిజాయితీ చూసిన క్షణాన వేటగాడిలో ఊహించని మార్పు వచ్చింది. తాను చేస్తున్నది నీచమైన పని అనిపించింది. తనమీద తనకే జుగుప్స కలిగింది. ''నేను చంపను.. దయ, ధర్మం అంటే ఏమిటో నాకు తెలిసొచ్చింది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో మరెప్పుడూ నేను ఎవర్నీ చంపను.. మీరంతా సుఖంగా జీవించండి..'' అనడమే కాకుండా, తన కళ్ళు తెరిపించిన ఆ జింకలకు నమస్కరించాడు.
అప్పుడు దేవతలు పూలవర్షం కురిపించారు. ఆకాశంనుండి సుస్వరాలు వినిపించాయి. దేవదూతల విమానం వచ్చి ఆగింది. వారు ''ఓ వేటగాడా! ఈరోజు మహాశివరాత్రి. ఆహారం దొరక్క అయితేనేం ఈరోజు ఉపవాసం ఉన్నావు. రాత్రంతా జాగారం చేశావు. అనుకోకుండా నువ్వు ఎక్కిన చెట్టు మరేదో కాదు బిల్వవృక్షం. ముఖానికి అడ్డు వస్తున్నాయని ఆకులను తుంచి కింద వేసావు. చెట్టు మొదట్లో స్వయంభూలింగం ఉంది. నువ్వు వేసిన ఆకులు లింగంపై పడ్డాయి. శివునికి బిల్వపత్రాల పూజ కంటే ప్రియమైంది లేదు. అన్నిటినీ మించి నువ్వు చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందావు. అవకాశం వచ్చినా మృగాలను చంపలేదు. నిన్ను సశరీరంగా స్వర్గానికి తీసికెళ్ళేందుకే వచ్చాం..'' అన్నారు.

అలా వేటగాని జీవితం ధన్యమైంది. తెలియకపోయినా శివునికి ఇష్టమైన విధులతో స్వర్గప్రాప్తి పొందాడు. కనుక మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వపత్రాలతో శివలింగాన్ని పూజించడం శ్రేష్ఠం. ఈ పండుగనాడు రోజంతా ఉపవాసం ఉండి, శివుని ధ్యానిస్తూ, అర్చిస్తూ గడిపి, రాత్రి జాగరణ చేయాలి. అది సర్వ సుఖాలనూ ఇచ్చి, స్వర్గ లోకాలకు దారితీస్తుంది.

ఇహంలో సుఖాన్ని, పరంలో స్వర్గాన్ని ఇచ్చే మహాశివరాత్రి Hindu Festival Maha Shivaratri




మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి పర్వదినం. హిందూ పండుగల్లో ముఖ్యమైంది శివరాత్రి. ప్రతి నెలాకృష్ణ చతుర్దశి మాస శివరాత్రి కాగా మాఘమాసంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రి. మాస శివరాత్రి దినాల్లోనూ శివునికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత విశిష్టమైంది, ఆరాధనీయమైంది. మహాశివుడు సాకారమైన మూర్తిగానూ, నిరాకారమైన లింగంగానూ పూజలు అందుకుంటాడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏటా హిమాచల్ ప్రదేశ్, మండిలో వారం రోజులపాటు ''International Mandi Shivratri Fair'' నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుండి భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారు.

పర్వదినం, పుణ్యదినం అయిన శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే సమస్యలు నివారింపబడతాయి. కోరికలు సఫలమౌతాయి. పెళ్ళి కానివారికి పెళ్ళి అవుతుంది. తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. సద్గతులు లభిస్తాయి. మహాశివరాత్రి రోజున ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ముఖ్యంగా శివునికి ఇష్టమైన ''నమశ్శివాయ'' అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇతర రోజుల్లో గుడికి వెళ్ళలేకపోయినా ఈ విశేష దినాన తప్పనిసరిగా వెళ్తారు. భక్తుల రద్దీతో ఆలయాలు కిక్కిరిసి ఉంటాయి. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.

భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. పూజలు, ప్రార్థనలు, అర్చనలు, అభిషేకాలతో ఆరాధిస్తారు. శివ స్తోత్రాలు, భక్తి గీతాలతో మహేశ్వరుని ప్రార్ధిస్తారు. రోజంతా పరమేశ్వరుని చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.

మహాశివునికి, విభూతికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే శివభక్తులు పరమ పవిత్రమైన విభూతిని ధరిస్తారు. శివరాత్రి రోజున విభూతిని తయారుచేస్తారు.

భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే "భక్తవశంకర" అన్నారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం.

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచు కుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆవిధంగా ముక్తి పొందుతాడు. అదీ సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది.

మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

Sunday, January 15, 2012

సంక్రాంతి


కాంతులు చిందించే సంక్రాంతి
Colourful Festival Sankranti
సంక్రాంతి... పేరులోనే ఉంది కాంతి. నిజంగా ఇది కాంతులొలికే పండుగ. సంబరాల పండుగ. వాకిట్లో రంగురంగుల రంగవల్లికలు, ఆకాశంలో అంతకంటే అందమైన గాలిపటాలతో మహా శోభాయమానమైన పండుగిది. ఇది ఒకరోజు పండుగ కాదు. నెలరోజులపాటు సంబరాలు చేసుకునే వైభవం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకసారి Colourful Festival Sankranti విశేషాలు తెలుసుకుందాం.
 
జ్యోతిష్య శాస్త్రంలో మేషం, వృషభం - ఇలా పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు ఒక్కో నెలలొ ఒక్కో రాశిలొ ప్రవేశిస్తాడు. సూర్యుడు మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అది మేష సంక్రమణం. అలా ఏ రాశిలొ సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలొ ప్రవిసించింది మొదలు మకరరాశిలొ ప్రవేశించడంవరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటివరకూ దక్షిణాయనంలొ సంచరిస్తోన్న సూర్యుడు ఉత్తరాయణంలొ ప్రవేశించిన పుణ్యదినం కూడా ఇది.
మకర సంక్రాంతికి ముందురోజు ''భోగి''. భోగి అంటే గోదాదేవి, శ్రీరంగనాథుని సేవించి కల్యాణ భోగం అనుభవించిన రోజు. మకర సంక్రాంతిలాగే భోగి కూడా పెద్ద పండుగే. ఆవేళ ఉదయాన్నే లేచి ''భోగిమంటలు'' వేస్తారు. భోగిమంటల్లో సూక్ష్మక్రిములను నశింపచేసే పిడకలు, విరిగిపోయి ఇళ్ళలో అడ్డంగా అనిపించే చెక్క సామాను, ఔషధప్రాయమైన వేప తదితర కలపతో వేస్తారు. ఇవి కేవలం చలి కాచుకోదానికే గాక ఆరోగ్యరీత్యా మంచిది. క్రిమికీటకాలు నశిస్తాయి. వాతావరణ కాలుష్యం పోతుంది.

అభ్యంగన స్నానం, కొత్తబట్టలు, పూజలు, పిండి వంటలు, బంధుమిత్రుల సమాగమం లాంటి కార్యక్రమాలతో ఇల్లిల్లూ సందడిగా, సంతోషంగా కనిపిస్తుంది. చిన్నారులున్న ఇళ్ళలో రేగిపళ్ళలో పప్పుబెల్లాలు, పూవులు, డబ్బులు జోడించి ''భోగిపళ్లు'' పోస్తారు. రేగిపళ్ళు సూర్యునికి ప్రీతికరమైనవి. పిల్లల తలపై భోగిపళ్లు పోయడంవల్ల సూర్యుని ఆశీస్సు లభిస్తుంది.
భోగిపళ్లు అంటే రేగిపళ్ళే. బదరీఫలం అనే పదం నుండి భోగిపండు వచ్చింది. బదరికావనంలో నరనారాయణులు తపస్సు ఆచరించే సమయంలో బదరీ ఫలాలను తిన్నారట. అందుకే భోగిపళ్లు పోయడమంటే నరనారాయణుల ఆశీస్సులు పండడం. రేగిపళ్ళు ఆరోగ్యరీత్యా కూడా చాలా మేలు చేస్తాయి. వాటిని శరీరం మీద పోయడంవల్ల అనారోగ్యాలు నయమౌతాయి. ఇవి తింటే దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఉదర సంబంధ జబ్బులు కుదురుతాయి. ఆహారం చక్కగా జీర్ణమౌతుంది. భోగిపళ్ల వేడుక ముగిసిన తర్వాత ఈ పళ్ళను కూడా పంచిపెడతారు. అవి తిని ఆరోగ్యంగా ఉండాలనేది పరమార్థం.
ఇక మకర సంక్రాంతి మరుసటిరోజు కనుమ. ఇది రైతులకు ముఖ్యమైన పండుగ. వ్యవసాయ కుటుంబాల్లో తెల్లవారుజామున లేచి పనులు మొదలుపెడతారు. పాడి పశువులను కడిగి, కుంకుమ, పూసల గొలుసులు, మువ్వలు, పట్టెడలతో అలంకరిస్తారు. నెల పొడుగునా వాకిళ్ళలో పెట్టిన గొబ్బెమ్మలను పొయ్యికింద పెట్టి పాయసం చేసి మొదట సూర్యునికి, ఆపైన దేవుడి మందిరంలో, తర్వాత పశువుల కొట్టంలో నైవేద్యం పెడతారు. పొలంలో, పశువులశాలలో గుమ్మడికాయ పగలగొట్టి దిష్టి తీస్తారు. గంగానమ్మ, పోలేరమ్మ లాంటి గ్రామదేవతలకు గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.
 
సంక్రాంతి నెల మహా సందడిగా ఉంటుంది. ఒణికించే చలిలో కూడా అర్ధరాత్రివరకూ మెలకువగా ఉండి వాకిళ్ళలో కళ్ళాపి జల్లి, రంగవల్లులు తీర్చిదిద్దుతుంటారు. లేదా తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేస్తారు. అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తారు. పుణ్య నదుల్లో స్నానం చేస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి, జ్ఞాననేత్రం తెరచుకుంటుంది. నదిలో మునిగి, సూర్యునికి అర్ఘ్యం వదులుతారు. మకర రాశిలో ప్రవేశించిన సూర్యునికి నమస్కరిస్తారు. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు.
 
ఇళ్ళముందు సంక్రాంతి ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, పూలు, పసుపుకుంకుమలు జల్లి వాకిళ్ళను కళాత్మకంగా రూపొందిస్తారు. గుమ్మాలు మావిడాకులు, బంతిపూల తోరణాలతో అలరారుతూ అందాలు చిందిస్తాయి. గ్రామాల్లో అప్పుడే కోతలు ముగిసి ధాన్యం ఇంటికి రాగా, ఏడాది అంతా చేసిన శ్రమ మాయమై కొత్త ఉత్సాహం ముఖాల్లో వెల్లివిరుస్తుంది.
 
సంక్రాంతి సందర్భంగా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు. తిరుప్పావై పాశురాలను చదువుతారు లేదా వింటారు. వేద మంత్రాలను పఠిస్తారు. యాగాలు నిర్వహిస్తారు. ఇక హరిదాసులు, పులి వేషగాళ్ళు, గంగిరెద్దుల సందడి, గాలిపటాల ఆటల గురించి చెప్పనవసరమే లేదు. చూస్తుండగానే పండుగ వచ్చేస్తుంది. కొత్త బియ్యంతో అరిసెలు, పాలతాలలికలు చేసి దేవునికి నివేదిస్తారు. పేదసాదలకు దానధర్మాలు చేస్తారు. సాయంత్రంపూట బొమ్మలకొలువు ఏర్పాటు చేస్తారు.


ఇతర రాష్ట్రాల్లో సంక్రాంతి
Sankranti Festival Celebrations

సంక్రాంతి కేవలం మన రాష్ట్రంలోనే కాదు తెలుగువాళ్ళు ఎక్కడుంటే అక్కడ మకర సంక్రాంతి మహా ఘనంగా జరుగుతుంది. ప్రవాసాంధ్రులు తెలుగుతనాన్ని మర్చిపోకుండా వీలైనంతవరకూ పండుగ సంప్రదాయాలేవీలోపించకుండా కళకళలాడేలా వైభవోపేతంగా జరుపుకోవడం మనకు తెలిసిందే. మరో సంగతి ఏమంటే మకరసంక్రాంతి తెలుగువారి పండుగ మాత్రమే కాదు. కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా వివిధరాష్ట్రాలవాళ్ళు ఈ పండుగ జరుపుకుంటారు.

తమిళులు నాలుగు రోజులపాటు సంక్రాంతి పండుగ వేడుక చేసుకుంటారు. మొదటిరోజును ''తై'' నాడు సూర్యుని, వానదేవుని ప్రార్థిస్తారు. రెండోరోజు ''పొంగల్'', మూడోరోజు''మత్తు పొంగల్'', నాలుగోరోజు ''తిరువళ్ళువర్''. వీటిని మనం వరుసగా భోగి, పండుగ, కనుమ, ముక్కనుమ అంటాం.

బెంగాలీలకు సంక్రాంతి గొప్ప పండుగ. అత్యుత్సాహంతో వేడుక చేసుకుంటారు.

ఉత్తరప్రదేశ్ లో సంక్రాంతిని ''ఖిచ్రి'' అంటారు. గంగా, యమునా, సరస్వతి సంగమ తీరంలో నదీ స్నానం చేస్తారు. గంగా తీరంలో పెద్ద ఎత్తున భోగిమంటల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

పంజాబులో భోగి పండుగను ''లోహ్రి'' అని, సంక్రాంతిని ''మఘీ'' అని అంటారు. ఈ పండుగ మహోత్సవం సందర్భంగా భాంగ్రా నృత్యం చేస్తారు.

మధ్యప్రదేశ్ లో సంక్రాంతిని ''సుకరాత్'' పేరుతో ఆనందంగా జరుపుకుంటారు.

మహారాష్ట్రలో సంక్రాంతి సందర్భంగా నువ్వులతో పిండివంటలు తయారుచేస్తారు.

సంక్రాంతి ప్రత్యేక పిండివంటలు
Sankranti Festival Recipes

పాలతాలికలు
కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి - అరకిలో
బెల్లం - అరకిలో
పాలు - ఒక లీటరు
జీడిపప్పు , కిస్మిస్ - వంద గ్రాములు
యాలుకల పొడి - తగినంత
తయారుచేసే పద్ధతి
బియ్యాన్ని నానబెట్టి దంచిన పిండిని జల్లించి తగినన్ని నీళ్ళు పోసి బాగా కలపాలి. బెల్లాన్ని సన్నగా తరిగి ఉంచాలి. జీడిపప్పు, కిస్మిస్ లను నేతిలో వేయించి ఉంచుకోవాలి. పాలను కాచి అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత బియ్యప్పిండిని కారప్పూస గిద్దల్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా వత్తాలి. గడ్డ కట్టకుండా మెల్లగా తిప్పుతూ తరిగిన బెల్లం వేసి కలయతిప్పాలి. చివరికి మిగిలిన బియ్యప్పిండిని కూడా వేసి కలపాలి. పచ్చితనం పోయి చక్కగా ఉడికింది అనుకున్నాక ఇలాచీ, కిస్మిస్, జీడిపప్పు వేసి దించితే సరిపోతుంది.

అరిసెలు
కావలసిన పదార్థాలు
బియ్యం - కిలో
బెల్లం - ముప్పావు కిలో
నూనె - అరకిలో
నువ్వులు - వంద గ్రాములు
తయారుచేసే పద్ధతి
బియ్యం ఒకపూట ముందు నానబెట్టి ఎందపోయాలి. ఆ బియ్యాన్ని దంచి జల్లెడ పట్టాలి. బెల్లం తరిగి సుమారుగా కప్పుడు నీరు పోసి పాకం పట్టాలి. బెల్లంలో సన్నటి రజను లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది కనుక పాకం పల్చగా ఉండగా వడకట్టాలి. తర్వాత మరోసారి స్టవ్ మీద పెట్టి ముదురు పాకం రానివ్వాలి. అందులో బియ్యప్పిండివేసి ఉండ కట్టకుండా తిప్పాలి. తర్వాత దింపి, చల్లారిన పిండితో చిన్న ఉండలు చేసి బాదం ఆకు లేదా పాలిథిన్ కవరు మీద వేసి సన్నగా వత్తి నువ్వులను జల్లి, అరచేత్తో అద్ది బాణలిలో వేసి వేయించాలి. కాలిన అరిసెలను రెండు అపకల సాయంతో బాగా వత్తి, నూనె కారిపోయేటట్లు చేసి తీయాలి. తడి లేని డబ్బాలో భద్రపరచుకోవాలి.

కొబ్బరి వడలు
కావలసిన పదార్ధాలు
కొబ్బరికాయ – 1
బియ్యం – పావుకిలో
నూనె – పావుకిలో
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి - 6
కొత్తిమీర – 1 కట్ట
జీలకర్ర – 1 టీ స్పూను
వంట సోడా – చిటికెడు
కరివేపాకు – 2 రెబ్బలు
ఉప్పు - తగినంత
తయారు చేసే పద్ధతి
కొబ్బరిని తురమాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. బియ్యం కడిగి నానబెట్టాలి. నీళ్ళు ఓడ్చి, కొబ్బరి తురుము కలిపి రుబ్బుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి నూరి కలపాలి. వంటసోడా, ఉప్పు, తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. బాణలిలో నూనె కాగనిచ్చి కలిపి ఉంచుకున్న పిండిని వడల్లా వత్తి ఎర్రగా వేయించుకోవాలి. కొబ్బరి వడలు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి.

చెక్క గారెలు
కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి - 4 పావులు
శనగపప్పు - అర్ధపావు
నూనె - కిలో
వెన్న – కప్పుడు
పచ్చిమిర్చి - వంద గ్రాములు
కరివేపాకు - పది రెబ్బలు
అల్లంవెల్లుల్లి పేస్టు - కొద్దిగా
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి
శనగపప్పును కడిగి ఒక గంటసేపు నానబెట్టి పక్కన ఉంచాలి. బియ్యప్పిండిలో శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న, ఉప్పు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినన్ని నీళ్ళు వేసి బాగా కలపాలి. అరటి ఆకు లేదా పాలిథిన్ కవరు మీద కొద్దిగా నూనె రాసి, పిండిని సన్నటి గారెలుగా చేసి వేయించుకోవాలి. ఈ చెక్కగారెలు పదిరోజులు నిలవుంటాయి.

రవ్వ పులిహోర
కావలసిన పదార్ధాలు
రవ్వ – అరకిలో 
నూనె - ముప్పావు కిలో
చింతపండు - వంద గ్రాములు
శనగపప్పు - చారెడు
మినప్పప్పు - చారెడు
పల్లీలు - అర కప్పుడు
పచ్చిమిర్చి - పది
ఎండుమిర్చి - పది
కరివేపాకు - నాలుగు రెబ్బలు
పసుపు - కొద్దిగా
ఆవాలు - తగినన్ని
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి
చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకోవాలి. ఒక పాత్రలో సుమారుగా ఒక లీటరు నీళ్ళు పోసి మరిగిన తర్వాత అందులో రవ్వ వేసి పొడిపొడిగా ఉడికించి దించాలి. పైన రెండు గరిటెల నూనె పోసి మూత పెట్టాలి. కొంతసేపటి తర్వాత మూత తీసి బాల్చీలోకి తీయాలి. ఎంతమాత్రం ఉండలు కట్టకుండా చేత్తో చిదిమి పసుపు, ఉప్పు కలపాలి. మూకుట్లో నూనె పోసి తాలింపు దినుసులు వేసి వేగిన తర్వాత రవ్వ ముద్ద వేసి, చింతపండు గుజ్జు కూడా వేసి కలయతిప్పి కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి, దించితే సరిపోతుంది



సంస్కృతి, సరదాల మేళవింపు గొబ్బెమ్మలు



Hindu Tradition: Gobbemmalu
ధనుర్మాసం ప్రారంభమైన రోజునుండి వాకిళ్ళలో రంగవల్లికలు తీర్చిదిద్ది, వాటిమధ్య గొబ్బెమ్మలు ఉంచడం ఆచారం. గొబ్బెమ్మలకు పసుపుకుంకుమలు పెట్టి, మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొడుతూ ఆడిపాడతారు. కొందరు సాయంత్రం వేళ కూడా గొబ్బెమ్మలు పెడతారు. సాయంవేళ పెరట్లో దీపాలు వెలిగించి, గొబ్బెమ్మలు చేసి సందె ముగ్గుల మధ్య ఉంచుతారు. అందుకే వీటిని సందె గొబ్బెమ్మలు అంటారు.

వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, వాటికి రంగులు అద్దడం, మధ్యలో గొబ్బెమ్మలు, గొబ్బి ఆటపాటలు - ఇవన్నీ పిల్లలకు మరీ వినోదం. ముగ్గులు, గొబ్బెమ్మలు తొక్కవద్దంటూ చేసే హెచ్చరికలు, మరి ఎలా నడవాలి అంటూ ఇతర్ల ప్రశ్నలు కూడా తమాషాగా ఉంటాయి.

ధనుర్మాసం అంతా వాకిళ్ళలో ఉంచిన గొబ్బెమ్మలను ఎండబెట్టి కనుమ రోజున వాటిని పొయ్యికింద పెట్టి రాజేసి, ఆ మంటతో పాయసం వండి దేవునికి నివేదించడం ఆచారం. ఇదంతా సరదా పంచే సంబరం.
ఉత్తరాయణం మహా విశిష్టం
Auspicious Uttarayan 

ఉత్తరాయణం మహా పుణ్యమైంది. ఈ కాలంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, దేవతలకు మహా ప్రీతికరమైనదని చెప్తారు. మానవమాత్రులకు రాత్రి పగలు మాదిరిగా దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి అన్నమాట.

బ్రహ్మదేవుడు సృష్టిలో భాగంగా కాల విభజన చేశాడు. క్షణం, నిమిషం, ఘడియ, దినం, పక్షం, మాసం, ఆయనం (ఆరు నెలలు), సంవత్సరం అంటూ విభజించాడు. ఈ లెక్కల ననుసరించి మనకు సంవత్సరం అంటే దేవతలకు కేవలం ఒకరోజు. అంటే ఆరు నెలల కాలం దేవతలకు ఒక రాత్రి లేదా పగలుతో సమానం.

సూర్యుడు మేషం మొదలు మీనం వరకూ ఒక రాశి నుండి మరో రాశిలోకి మారతాడు. దీన్నే సంక్రమణం అంటారు. సూర్యుడు మకర రాశిలోకి మారడం లేదా ప్రవేశించడమే మకర సంక్రమణం. సూర్యుడు కర్కాటక రాశి నుండి ధనూరాశి వరకూ సంచరించే కాలం దక్షిణాయనం కాగా, మకర రాశి నుండి మిథునరాశి వరకూ సంచరించే కాలం ఉత్తరాయణం.

మరోరకంగా చెప్పుకుంటే సూర్యుడు భూమధ్య రేఖ నుండి ఆరు నెలలు ఉత్తర దిక్కుగా, ఆరు నెలలు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణించే కాలం ఉత్తరాయణం, దక్షిణ దిక్కుగా ప్రయాణించే కాలం దక్షిణాయనం.

ముఖ్యంగా దేవతలకు పగటిపూట అయిన ఉత్తరాయణం పుణ్యప్రదమైంది. స్వర్గ ద్వారాలు తెరిచి ఉండే ఈ కాలంలో పూజలు చేయడం, యజ్ఞయాగాదులు నిర్వహించడం వల్ల దేవతలు మరింత ప్రసన్నం అవుతారని, కోరుకున్నవన్నీ నెరవేరుతాయని ధార్మిక గ్రంధాలు తెలియజేస్తున్నాయి. ఉత్తరాయణంలో చనిపోయినవారు తిన్నగా స్వర్గం చేరతారని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఆషాఢమాస ఏకాదశినాడు.. దీన్నే ''శయనైకాదశి'' లేదా ''తొలి ఏకాదశి'' అంటారు.. ఆరోజు క్షీరసాగరంలో శేషతల్ప శాయి అయిన మార్గశిర మాస ఏకాదశినాడు నిద్ర నుండి మేల్కొంటాడు. కనుకనే ఈ ఏకాదశిని ''ఉత్థాన ఏకాదశి'' అంటారు. కనుక శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొని భక్తుల మొర ఆలకించి, సర్వ సంపదలూ సమకూర్చేది ఉత్తరాయణ కాలంలోనే. ''ఉత్థానం'' అంటే లేవడం. విష్ణుమూర్తి నిద్రనుండి లేస్తాడు కనుక ''ఉత్థాన ఏకాదశి''. వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కనుక ''వైకుంఠ ఏకాదశి'' అని, ముక్కోటి దేవతలు కూడా మేల్కొంటారు కనుక ''ముక్కోటి ఏకాదశి'' అని అంటారు.

మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రేఖను దాటుతాడు. ఈరోజుతో సంధ్య సమయంలోనే కమ్ముకొచ్చే చీకట్లు తగ్గుతూ పోతాయి. చలి తీవ్రత తగ్గుతుంది.

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన వెంటనే వచ్చే ఇరవై ఘడియలు మరీ పవిత్రమైనవి. ఇందుకో ఉదాహరణ కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు దక్షిణాయనంలో గాయపడ్డాడు. కానీ ఆయన ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోవాలనే ఉద్దేశంతో మరణాన్ని వాయిదా వేశాడు. ఉత్తరాయణ పుణ్య ఘడియలు వచ్చేవరకూ అంపశయ్యపై పడుకున్నాడు. ఆ తర్వాతే తనువు చాలించాడు. మకర సంక్రాంతి పరమ పవిత్రదినం కనుకనే బలిచక్రవర్తి సంక్రాంతినాడు భూమ్మీదకు వచ్చేందుకు విష్ణుమూర్తిని ప్రార్ధించి అనుమతి పొందాడు. వామనుడి రూపంలో వచ్చిన విష్ణుమూర్తికి మూడడుగుల స్థలం ఇస్తానని మాట ఇచ్చి, దాన్ని నిలబెట్టుకోవడంకోసం తనపై మూడో అడుగు వేయమని పాతాళానికి వెళ్ళాడు కదా బలిచక్రవర్తి. అలా పాతాళం చేరిన బలి,సంక్రాంతి రోజున భూమ్మీదికి వస్తాడు. అలా వచ్చే బలిచక్రవర్తిని ''సంక్రాంతి పురుషుడు'' లేదా ''సంకురమయ్య'' అంటారు.

ఉత్తరాయణంలో చేసే నదీస్నానం, పూజలు, తర్పణాలు, పురాణ శ్రవణం, దానధర్మాలు వెయ్యిరెట్ల ఫలితాన్ని ఇస్తాయి. పుణ్యలోకాలను ప్రసాదిస్తాయి. అందుకే కాయగూరలు, వస్త్రాలు, ధనధాన్యాలు మొదలు, గోవులు, వెండి, బంగారం వరకూ ఎవరి శక్తిని బట్టి వారు దానం చేస్తుంటారు. ఉత్తరాయణం తొలి ఘడియల్లో భూమ్మీద ఉన్న జలమంతా గంగాజలంతో సమానమౌతుంది.

Wednesday, January 4, 2012

మహావిష్ణువు భువికి ఏతెంచే పుణ్యతిథి ముక్కోటి Mahavishnu comes to earth on Mukkoti Ekadasi




భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రతిరోజూ ఒక పండగే! ప్రతి దినమూ ఒక ఉత్సవమే!సంవత్సరంలోని మూడొందల అరవై రోజులూ ఏదో ఒక విశేషమే కనిపిస్తుంది. ఆ వంకతోనైనా పూజలు చేసి, ఉపవాసాల్లాంటి నియమాలు పాటించి, పవిత్రమైన జీవనవిధానంలో కాలం గడుపుతూ, కొంతకాలానికైనా మానసిక ప్రవర్తనలో ఒక మార్పు కలిగి, ఆధ్యాత్మిక చింతన ఏర్పడి, మానవుడు దానవుడుగా కాక, భక్తి పారవశ్యంతో సంచరించి పరమ పురుషార్ధమైన మోక్షం వైపు పయనిస్తాడని పెద్దల విశ్వాసం. ఆవిధంగా ఏర్పడిందే ఏకాదశి వ్రతం.

మన సంవత్సర కాలాన్ని స్థూలంగా ఉత్తరాయణం, దక్షిణాయణం, అని రెండు భాగాలు చేశారు. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు అనువైనదని, ఆ కాలంలో మరణించినవారికి స్వర్గం ప్రాప్తిస్తుందని ఒక నమ్మకం. అంతేకాదు, ఉత్తరాయణం దేవతలకు పగటివేళ అని, దక్షిణాయణం రాత్రికాలమని కూడా అంటారు. అందుకే అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు దక్షిణాయణం లోకి వస్తాయి.

విష్ణుమూర్తి ఈ దక్షిణాయణంలో ఆషాఢ శుద్ద ఏకాదశి నుండి యోగనిద్రలో నాలుగు మాసాలు గడుపుతూ లోకం తీరుతెన్నులు పరిశీలిస్తూ ఉంటాడు. అందుకే ఆషాఢ శుద్ద ఏకాదశిని ''శయన ఏకాదశి'' లేదా ''తొలి ఏకాదశి'' అని పిలుస్తారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి ఏకాదశి ఒక పర్వదినమే. సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి. ఒక్కొక్క మాసానికి శుక్లపక్షంలో ఒకటి, కృష్ణ పక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు ఉంటాయి. అధికమాసం ఉన్న సంవత్సరం అయితే మరో రెండు అదనంగా ఉంటాయి. అప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశి ప్రాముఖ్యాన్ని గూర్చి శంకరుడు పార్వతికి వివరించినట్లు పద్మపురాణం పేర్కొంది. విష్ణువు వైకుంఠం నుండి ముప్పై మూడు కోట్ల దేవతలతో ఈ ఏకాదశి రోజు భూమికి దిగివస్తాడు. కాబట్టి దీనికి ''ముక్కోటి'' అని పేరు వచ్చింది అంటారు.

ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, పూజలు, దానధర్మాలు చేసి, భగవన్నామ స్మరణతో కాలం గడుపుతూ రాత్రంతా జాగరణ చేసి, మర్నాడు అంటే, ద్వాదశినాడు ఆ ఘడియలు వెళ్ళకముందే పారణ చేయాలి. ఇది ఒక వ్రాతనియమం. మానవులకు ముక్తి కలిగించాచానికి స్వయంగా విష్ణువే ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారిలో రుగ్మాంగదుడు, అంబరీషాదులు ముఖ్యులు. ఈ వ్రతానికి సంబంధించిన భవిష్యోత్తరపురాణాదులు ఎన్నో గాధలు, కధలు పేర్కొన్నాయి.

ఏకాదశినాడు ముఖ్యంగా ఉపవాసదీక్ష భక్తులు పాటించే ఒక నియమం అసలు ఉపవాసం అంటే ఏమితో చూడండి.. ఉప అంటే భగవంతుని సమీపంలో అని, వాసం అంటే ఉండటం అని అర్ధం. అంటే భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ కాలం గడపడం అన్నమాట. అయితే, ఆరోగ్యరీత్యానో, వయోభారం చేతనో కొంతమంది ఆహారం తీసుకొనక ఉపవాసం ఉండలేక పోవచ్చు. వారికి ప్రత్యామ్నాయంగా వాయుపురాణం -

'సక్తం హవిష్యాన్న మనోదనం వా 
ఫలంతిలాః క్షీరమధాంబుచాజ్యం 
యత్పంచగవ్యం యదివాపి వాయు 
ప్రశస్త మంత్రోత్తర ముత్తరం చ'
అని పేర్కొంది.

ఉపవాసం చేయలేనివారు నీరు, పాలు, నువ్వులు, పండ్లు తినవచ్చు. లేదా ఉడకని పదార్ధాలు లేదా హనిశ్యాన్నం భుజించవచ్చు. అది కూడా చేతకాని వారు సక్తభోజనం అంటే రాత్రిపూట భోజనం చేయవచ్చు. అయితే ఏకాదశి నాడు భుజిస్తే చాంద్రాయణ వ్రతం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకోవాలని శాస్త్రం చెప్తున్నది.

''మాసానాం మార్గశీర్షోహం'' అన్నాడు గీతాచార్యుడు. అందుకే ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశికి ఒక ప్రాముఖ్యం ఏర్పడింది. మార్గశిర సుద్ద ఏకాదశిని మొక్శైక ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. దీన్నే హరిదినమని, వైకుంఠ దినమని అంటారు. ఇది ఉత్తరాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడిణి చుట్టుముట్టిన చీకట్లు పటాపంచలై ఆయనకు మోక్షం అంటే విముక్తి కలగడంవల్ల దీన్ని మోక్ష ఏకాదశి అన్నారు.

వాస్తవానికి కాలగమనంలో తెలుగువారిది చాంద్రమానం. అయితే ముక్కోటి సౌరమానం ప్రకారం జరుపుకునే పండుగలు, ధనుస్సంక్రమణం తర్వాత వచ్చే ఏకాదశి ఇది. సాధారణంగా ఈ పండుగ మార్గశిరంలో కానీ పుష్యంలో కానీ వస్తుంది. దక్షిణాయణం వెళ్ళిపోతుంది కాబట్టి రాత్రిపోయి పగలు వస్తుంది. అందుకే విష్ణువు వైకుంఠం నుండి ముప్పై మూడు కోట్ల దేవతలతో ఈరోజు భూమికి దిగివస్తాడు. కాబట్టి దీనికి 'ముక్కోటి' అని పేరు వచ్చిందని అంటారు. 33 కోట్లను మూడు కోట్లు అనే పదం సూచిస్తుంది. దానికి సూచనగా విష్ణు ఆలయంలో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనికి వైకుంఠద్వారం అని పేరు.

సూర్యుడు ఉత్తరాయన ప్రవేశాన్ని వైకుంఠ ద్వారం తెరవడం ద్వారా సూచిస్తారు. తెల్లవారుజామున దీనిగుండా వెళ్లినవారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు స్వర్గంలో ప్రవేశిస్తారని ఒక విశ్వాసం. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమానం. ఈనాడు విష్ణుమూర్తి మురాసుర సంహారం చేసాడని, శ్రీరంగ క్షేత్రంలో విభీషణుడు వచ్చి ఆ స్వామిని పూజిస్తాడని చెప్తారు. హిందువులందరూ ముక్కోటి ఏకాదశిని భక్తిశ్రద్ధలతో పాటించడం గమనించదగ్గ ఒక విశేషం.

వైభవోపేతం వైకుంఠ ఏకాదశి



Auspicious Mukkoti Ekadasi 

పుష్య శుద్ధ  ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. సహజంగానే ఏకాదశి తిథి ఎంతో ఉత్తమమైంది. ఇక వైకుంఠ  ఏకాదశి పరమ పవిత్రమైంది. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి.

విష్ణుమూర్తి ముర అనే రాక్షసుని సంహరించి, ఇంద్రాది దేవతలను ఆనందింపచేసిన రోజిది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు దేవుని దర్శించుకుని, ఉపవాసం ఉన్నవారికి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.  

వైకుంఠ  ఏకాదశినాడు చేసే దైవారాధన మూడు కోట్ల దేవతలకూ చెందుతుంది. ఈ విశిష్ట దినాన చేసే పూజతో మూడు కోట్ల దేవతలూ ప్రసన్నం అవుతారు. కనుక ఈరోజు విధిగా ఆలయానికి వెళ్తారు. భక్తిగా దేవుని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఉపవాసం ఉండి, పాలు, ఫలాలు మాత్రమే సేవిస్తారు. ముక్కోటి ఏకాదశినాడు దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడతాయి. ఇక వైష్ణవ దేవాలయాల సంగతి చెప్పనవసరం లేదు. కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలలో ముక్కోటి ఏకాదశి మహా వైభవోపేతంగా జరుగుతుంది.  

ముక్కోటి ఏకాదశినాడు భక్తులు ముఖ్యంగా వైష్ణవులు ''విష్ణు సహస్రనామం''తో మొదలుపెట్టి స్వామివారికి అర్చనలు, పూజా కార్యక్రమాలు చేస్తారు. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పురాణ శ్రవణాలు, ధార్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తారు. ఈ పుణ్య తిథినాడు యజ్ఞయాగాదులు జరిపితే మంచిది కనుక కొందరు యజ్ఞాలకు పూనుకుంటారు.  

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునే భక్తులు ఇతర దినాల్లో కంటే, ముక్కోటి ఏకాదశి లాంటి విశేష పర్వదినాల్లో తిరుమల వెళ్ళడం మరింత శ్రేష్ఠమని నమ్మి, ఆ వేళ్టికి అక్కడ ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. నిజానికి రద్దీ విపరీతంగా ఉండటంవల్ల వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా లక్ష్యపెట్టకుండా వెళ్తారు.  

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి నాడు చనిపోయిన వారు తిన్నగా వైకుంఠానికి వెళ్తారని, మోక్షం పొందుతారని పూరాణాలు చెప్తున్నాయి.

Friday, December 30, 2011

గీతా మకరందం




గంగ, గాయత్రి, గీత- ప్రపంచానికి భారతీయత ప్రసాదించిన మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక కానుకలు. తొలిరెంటి మాట అలా ఉంచి గీతాసూత్రం మాత్రం 'శంకా సంకుచితాంతరంగులకు, వృథా సందేహమందేహులకు' కింకర్తవ్య విమూఢత్వం ఆవరించినప్పుడల్లా మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా స్వస్థతనందించే చక్కటి ఔషధం. దాదాపు అయిదువేల సంవత్సరాల కిందట- దుర్మదాంధులైన కురుసైన్యం ఎదుట కురుక్షేత్ర రణక్షేత్రం ముంగిట దైన్యయోగంలోపడ్డ నరుడికి నారాయణుడే జ్ఞానసారథ్యం వహించి చేసిన కర్తవ్యబోధ- గీత! 'గీ' అంటే త్యాగం, 'త' అంటే తత్వజ్ఞానం. యుద్ధ సందర్భాన్ని ఓ మిషగా తీసుకొని సర్వకాలాలకూ వర్తించే నిష్కామ కర్మయోగ ప్రాశస్త్యాన్ని భగవంతుని మాటగా 'గీత' ప్రకటించిందని బుద్ధిజీవులూ విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో సరిసమానంగా ప్రమాణత సంతరించుకొన్న ప్రవచనంగా శంకరాచార్యుల వంటి భగవత్పాదులే గీతను భావించి భాష్యాలు వెలువరించారు. సంక్షుభిత సమాజానికి సాంత్వన చేకూర్చే చిత్రమైన తత్వమేదో గీతలో దాగుందని డాక్టర్ అనిబిసెంట్ వంటి మేధావులూ వ్యాఖ్యానాలు చేశారు. దేవుడు పట్టించుకోనంత దూరంలో ఉన్నాడు కనుక, మనిషి నిర్భయంగా సుఖపడవచ్చని ఆదిమానవుడు నమ్మిన కాలంనుంచి, నేటికాలం దాకా- మానవజీవన ప్రస్థానంలో ఎన్నెన్నో మతాలు, మార్పులు, మలుపులు. త్రికరణశుద్ధిగా, ఫలాపేక్ష రహితంగా, భవబంధాలకు అతీతంగా, కర్మ చేయడమొక్కటే మనిషి కర్తవ్యమని నిక్కచ్చిగా చెప్పిన గీతాసూత్రం- ఈ అణుయుగంలో సైతం అణువంతైనా మారలేదు. గీత సజీవతకు, అంతస్సూత్రంగా దాగిన ఈ నిత్య జీవిత సత్యసంధతే ప్రధాన కారణం. మంచి మనుగడే మతం అభిమతమైతే గీత సర్వమత సమ్మతం ఎందుకు కాదు?

'దేహమా కంపించుచున్నది/ 'ద్రోహమా' యనిపించుచున్నది/ మోహమేదో కుంచుచున్నది' అంటూ విషాదయోగంలో పడ్డ నరుణ్ని- 'మోహమడంగె తొలంగె ధర్మ సందేహములన్నియున్' అనే మోక్ష సన్యాస యోగదశదాకా నడిపించుకొని రావడానికి 'గీత'లో నారాయణుడు ఎత్తిన అవతారాలు ఎన్నెన్నో. 'ముందు గూర్చుండి నే పగ్గములను బట్టి/ రథము నడిపింతు/ కార్యసిద్ధికి నీవింక గడగుమయ్య!' అంటూ నాయకుడిలా ముందు నిలబడి భరోసా ఇస్తాడు ఒకసారి. 'దారుణ మారణ క్రియ/ కెట్టు లోర్చు మదీయ హృదయము?/ కొట్టనీ... చేతులు కట్టుకొని యుందున్' అంటూ డీలాపడిపోయినప్పుడు 'త్యజింపుము బేలతనమ్ము/ ధైర్యమున్ జెదరనీకుము' అంటూ తల్లిలా లాలిస్తాడు ఇంకోసారి. 'కొంచెపు మాట లాడెదు, జుగుప్స, అశోచ్యుల కోసమేల శో/ కించు టనార్యజుష్ట మపకీర్తికర, మ్మపవిత్రమైనదీ/ చంచలబుద్ధి, కశ్మలత చాలు' అంటూ తండ్రిలా మందలిస్తాడు మరోసారి. మోహపాశంలో పడి కొట్టుమిట్టులాడే మిత్రుడి చేయిపట్టుకొని ఎలాగైనా పైకి లేపాలనే తాపత్రయం చూపిస్తాడు చాలాసార్లు. 'నరుడే కైక ధనుర్ధరుండయి యఖండ త్యాగదీక్షా దురం/ ధరుడై నిల్చిన ముజ్జగమ్ముల నసాధ్యమన్నదే లేదు' అంటూ గురువులా ధర్మమార్గం దర్శింపజేస్తాడు భగవానుడు గీతలో. 'కర్తన్ నేను సమస్త భూతములకున్/ సర్వమ్ములో వర్తింతున్, అవతార ధర్మమును నిర్వర్తింతు, భూభారమున్/ దీర్తున్, నీవు నిమిత్త మాత్రమగు మంతే, క్త్లెబ్యమింకేల? నీ/ కర్తవ్యము గుర్తెరింగి విజయా/ గైకొమ్ము గాండీవమున్' అంటూ నిలబెడతాడు. చింతాక్రాంతుడైన మానవుడికి సాంత్వన కలిగించడానికి అంతా తనమీద వేసుకొనే ఔదార్యం ఇంతగా మరే సంస్కృతిలోనూ ఎవరూ ప్రదర్శించినట్లు కనిపించదు.

చెప్పడంలోని గొప్పతనమో, వ్యాసుడు రాయడంలోని గడుసుదనమో గాని... పరమ గంభీరమైన వేదాంతసారం గీతాపాత్రలో పరమాన్నమంత మధురంగా ఉంటుంది. యోగులు, స్వాములు, జ్ఞానులు, అవధూతలే కాదు... బుద్ధివాదులు, చివరికి చలం వంటి స్వేచ్ఛాప్రణయ జీవులూ గీతామకరందాన్ని సీతాకోక చిలుకల్లాగా సేవించడానికి ఉవ్విళ్లూరడాన్నిబట్టి, సుఖజీవిత అంతస్సూత్రమేదో ఆ పుష్పంలో దాగుందనేగా అర్థం! 'చాలాకాలం కిందటే కనుమరుగైన నా తల్లి స్థానాన్ని భర్తీ చేసింది భగవద్గీతే. మనసు కలత చెందినప్పుడల్లా నేనా తల్లి ఒడిలోనే తలదాచుకొనేది' అనేవారు అహింసాయోగి మహాత్మాగాంధీ. 'చిత్తం పరిశుద్ధమయ్యేకొద్దీ కొత్తకొత్త అర్థాలు తోచే చిత్రమైన ఆధ్యాత్మిక పొత్తం గీత' అనేవారు ఆధునిక యోగి వివేకానంద. ధర్మాధర్మాల మధ్య ఘర్షణ హృదయాన్ని రణక్షేత్రంగా మార్చినప్పుడు విచక్షణ భగవత్ స్వరూపం పొంది సన్మార్గం చూపిస్తేనే గదా మనిషి పతనావస్థనుంచి బైటపడగలిగేది! వ్యాస ప్రోక్తమైన గీత అష్టాదశాధ్యాయాల్లోని శ్లోకాల్లో- ఏదో ఒకటి ఎల్లవేళలా ప్రపంచంలోని ఏదో మూల ఎవరో ఒకరి చిత్తచాంచల్యమనే చీకటిని చెండాడే దివిటీలా వెలుగుతూనే ఉంది. అందుకనే విశ్వవ్యాప్తంగా శ్రీమద్భవద్గీతకు ఇంతకాలంగా ఇంత మన్నన. గీత కేవలం వ్యాస మహాభారతంలోని భాగం మాత్రమే కాదు. మనిషి- నిశ్చింత జీవితానికి నిత్యం పాటించదగిన జీవన సూత్రాల్ని విరివిగా పొదిగిన మనోవికాస శాస్త్రం. నరుడికి నారాయణుడు గీతలో చేసిన 'తామరాకు మీది నీటిబొట్టు తత్వం'- మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా లోకం మొత్తం అనుక్షణం అనుసరించదగిన సూక్తం. అనేక భాషల్లో భాష్యాలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు వెలువడ్డ భగవద్గీతపై నేడు వివాదం రేగడమే దురదృష్టం. ఉత్తమ మానసిక వికాస సాహిత్యంగా, జ్ఞానామృత భాండాగారంగా ప్రశంసలు చూరగొంటున్న శ్రీమద్భగవద్గీత మీద తీవ్రవాద సాహిత్యమనే ముద్ర వేయడం, నిషేధానికి పూనుకోవడం సంకుచిత మనస్కుల తెలివిమాలినతనం. మనసును ఉద్దీప్తం చేసి, జాతి కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసుల ఆర్తి తీర్చడంలో ముందున్న గీతను ఎవరేమని ఆడిపోసుకున్నా- అది, మకరందం!

Saturday, December 17, 2011

ధనుర్మాసం ప్రారంభం స్వాగతించే వైకుంఠం Dhanur Sankraman-2012




సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించడాన్ని ధనుర్ సంక్రమణ అంటారు. ఈ డిసెంబర్ 16న ధనుర్మాసం మొదలై జనవరి 14, 2012న ముగుస్తుంది. ధనుర్ సంక్రమణను వాడుకలో ''నెల పట్టడం'' అంటారు. హిందువులకు.. అందునా వైష్ణవులకు ధనుర్మాసం పరమ పవిత్రమైంది.మన తెలుగువాళ్ళే కాకుండా కన్నడీగులు, తమిళులు కూడా ధనుర్మాసాన్ని గుర్తించి, ఆయా ఆచారాలను పాటిస్తారు.

వైష్ణవులకు ధనుర్మాసం నెల మహా పవిత్రమైంది. ప్రతిరోజూ ఒక పర్వదినమే. విష్ణుమూర్తిని, ఆండాళ్ మాతను ఆరాధిస్తారు. తిరుప్పావై పఠిస్తారు. ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని చెప్తున్నాయి పురాణాలు. అందుకే భూలోక వైకుంఠంగా భావించే తిరుమలను ఈ నెలలో దర్శించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ధనుర్మాసంలో చేసే పూజలతో వైకుంఠవాసుడు ఇట్టే ప్రసన్నుడౌతాడు. విష్ణుమూర్తిని, ఆయన ప్రతిరూపమైన శ్రీ వేంకటేశ్వరుని ధనుర్మాస విశేష దినాల్లో ప్రత్యేకంగా ఆరాధించాలి.

ధనుర్మాసం ఆరంభంతోనే సంక్రాంతి పండుగ సంబరం మొదలవుతుంది. వాకిట్లో రంగవల్లికలు తీర్చిదిద్దుతారు. గొబ్బెమ్మలను పెట్టి పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. హరిదాసులు, గంగిరెద్దుల హడావిడి సరేసరి.

ధనుర్మాసంలో ''వైకుంఠ ఏకాదశి'', ''భోగి'' విశేష పర్వదినాలు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం జరుపుతారు.
ధనుర్మాసం రోజుల్లో తిరుమలలో గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు.
శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవం మహా ఘనంగా జరుగుతుంది.
తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్ని ''పావై నొంబు'' అంటారు.

Monday, December 5, 2011

భగవద్గీత పుట్టినరోజు Gita Jayanti or Mokshada Ekadashi



గీతా జయంతి అంటే భగవద్గీత పుట్టినరోజు. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజు భగవద్గీత జయంతిఉత్సవం జరుపుతారు. మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన హితోపదేశమే భగవద్గీత. గీతా జయంతిని ''మోక్షదా ఏకాదశి'' అని కూడా పిలుస్తారు.

కురుక్షేత్రం జరిగి ఆరువేల సంవత్సరాలు గడిచాయి. అంతే భగవద్గీతకు ఆరువేల సంవత్సరాలన్నమాట. హిందువులకు భగవద్గీత వేదంతో సమానం. అందుకే ఎందరో భక్తులు గీతా పారాయణం చేస్తారు. గీతా సారాంశం కనుక బోధపడితే ఇక సంసార సాగరంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీటినీ అవలీలగా ఎదుర్కోగల్గుతారు.

''అర్జునా! చేసేది నువ్వే అయినా చేయించేది నేను..'' అంటూ మొదలుపెట్టి అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పిన హితోక్తులు, ఆనాటికీ, ఈనాటికీ కూడా జీవనసత్యాలే. నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో మనకు ఎదురయ్యే క్లిష్ట సమస్యలు అన్నిటికీ భగవద్గీతలో సమాధానాలు దొరుకుతాయి. మనసులో చెలరేగే కల్లోలాలు, అయోమయంగా, అగమ్యగోచరంగా తోచే సంక్లిష్ట పరిస్థితుల్ని కూడా గీతా సారంతో సమన్వయ పరచుకోగలం. అలజడులు, ఆందోళనలను శాంతింపచేసుకోగలం.

ఇంత అద్భుతమైనది, అపురూపమైనది కనుకనే భగవద్గీతను అందరూ దైవంతో సమానంగా కొలుస్తారు. గీతా శ్లోకాలను కంఠస్తం చేస్తారు. నేర్చుకోలేనివారు కనీసం విని ఆనందిస్తారు. ఆఖరికి న్యాయస్థానంలో కూడా భగవద్గీతమీదే ప్రమాణం చేయించుకుంటారు.

అసలు భగవద్గీత ఎలా పుట్టింది అంటే -
కురుక్షేత్రంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలు, గురువులు యుద్ధభూమిలో ఉండగా అర్జునునికి అయోమయంగా అనిపించింది. ఏరుల్లా పారుతున్న రక్తం, క్షతగాత్రులైన, వీర మరణం చెందిన సేనల్ని చూస్తోంటే మతి పోయింది. అంత దయనీయమైన పరిస్థితికి దారితీసే రణరంగం అంటే ఏహ్యత కలిగింది. తాను యుద్ధం చేయాలా, ఎందుకు చేయాలి - లాంటి ప్రశ్నలు దహించాయి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన హితబోధయే భగవద్గీత. ''చేసే పనిమీదే తప్ప, ఫలితం గురించి ఆలోచించవద్దు'', ''చావు అంటే ఆత్మ దుస్తుల్లాంటి ఒక శరీరాన్ని విడిచి మరో శరీరంలో చేరడమే'' లాంటి ఆ ఉపదేశం ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతుంది. జీవిత సత్యాలను, కఠోర వాస్తవాలను తేటతెల్లం చేసి చెప్పినట్లుగా ఉంటాయా శ్లోకాలు.

దైవానికి ప్రతిరూపంగా భావించే భగవద్గీత భారతీయులకు పరమ పవిత్ర గ్రంధం. అందుకే దేశం నలుమూలలా ''గీతా జయంతి''ని ఉత్సవం జరుపుతారు. భగవద్గీత పుట్టినరోజు అయిన మోక్షదా జయంతి నాడు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, కృష్ణ పూజ చేస్తారు. రమ్యమైన భగవద్గీత శ్లోకాలను విని తరిస్తారు. దేవాలయాల్లో దైవ సమానమైన భగవద్గీత శ్లోకాలను తాత్పర్య సహితంగా చెప్తారు. ముక్తకంఠంతో గీతా పారాయణం చేస్తారు. కొందరు కురుక్షేత్ర ఘట్టాలను, భగవద్గీత శ్లోకాలను నృత్య రూపకాలుగా, నాటికలుగా రూపొందించి ప్రదర్శిస్తారు. భక్తులు పాటలు, భజనలతో సత్ కాలక్షేపం చేస్తారు. భగవద్గీతలోని మహా సూక్తులను పదేపదే మననం చేస్తారు. మర్నాడు ద్వాదశి రోజున ప్రసాదం సేవించి ఉపవాసానికి స్వస్తి చెప్తారు.

భగవద్గీత సారాన్ని వంటబట్టించుకున్నవారు జీవితంలో ఎన్నడూ బాధపడరు. విషాదంలో మునిగితేలరు. అసలు వత్తిడికే గురవ్వరు. ఎంత క్లిష్ట పరిస్థితినైనా ఇట్టే ఎదుర్కోగల్గుతారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇంత స్థైర్యాన్ని అందించిన భగవద్గీత ప్రత్యక్ష దైవమే కదా!

Wednesday, November 30, 2011

సుబ్రహ్మణ్య షష్ఠి పూజతో సర్వ సుఖాలు Subramanya Shasti




మార్గశిర శుక్లపక్ష షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఆంధ్రులే కాకుండా తమిళులు,కన్నడీగులు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. అసలీ స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి గురించిన వివరాలేంటో తెలుసుకుందాం.

స్కందుడు అంటే మన్మథుని అవతారమే. సుబ్రహ్మణ్యేశ్వరుడు సాక్షాత్తూ మహాశివుని కుమారుడు. ఇంద్రుని కక్ష్యలో ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలు అందరిలోకీ మహా అందమైనవాడు, చురుకైనవాడు. సుబ్రహ్మణ్యుని మాదిరిగానే ఆయన వాహనం మయూరం (నెమలి) మహా అందమైనది. ఈయన దేవతలకు నాయకత్వం వహిస్తాడు. ముఖ్యంగా యుద్ధాలకు అధిపతి. ఈయనకు ఆరు ముఖాలు ఉంటాయి. ఆరువైపులా చూస్తూ పరిస్థితులను సమన్వయం చేసుకోగలడు.

సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన రోజును పురస్కరించుకుని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి జరుపుకుంటారు. ఈరోజున ఉదయానే స్నానం చేసి (వీలైతే నదీ స్నానం) సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని, దానధర్మాలు చేసినట్లయితే తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి.

సర్పదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రార్ధనలు చేసి పుట్టలో పాలు పోస్తారు. ఐదు ముఖాలున్న నాగదేవతను ఆరాధిస్తారు. నాగదేవతల్లో ఒకటైన శంకపాలను పూజిస్తారు. ఇలా చేయడంవల్ల సర్ప దోషాలు తొలగిపోతాయి. చర్మవ్యాధులు ఉంటే తగ్గుతాయి. పిల్లాపాపలతో సుఖసంతోషాలు అనుభవిస్తారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మచారి కనుక ఈ సుబ్రహ్మణ్యషష్ఠి రోజున ఈర్ష్యాసూయలు లేని స్వచ్చమైన మనసున్న బ్రహ్మచారులను భోజనానికి పిలుస్తారు. వారికి భోజనం పెట్టి దక్షిణ సమర్పించి, వస్త్రదానం చేస్తారు. ఇలా చేస్తే ఏ కష్టాలూ రావని, సుఖసౌఖ్యాలు అనుభూతికి వస్తాయని పూరాణాలు చెప్తున్నాయి.

శ్రీనివాసుడు తన కల్యాణం సందర్భంలో అతిథులను ఆహ్వానించేందుకు, సుబ్రహ్మణ్యేశ్వరుని నియమించాడు. సుబ్రహ్మణ్యునికి కుమారస్వామి, మురుగన్, షణ్ముఖుడు, కార్తికేయ, స్కంద – అంటూ అనేక పేర్లు ఉన్నాయి.

Monday, November 7, 2011

ఉత్థాన ద్వాదశినాడు తులసి కల్యాణం



Tulasi Kalyanam on Utthana Dwadashi 

కార్తీక శుక్ల ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అంటారు. ఈ ఉత్థాన ద్వాదశినాడు తులసి మొక్కకి కల్యాణం చేస్తారు. ఈ పుణ్యదినానికి సంబంధించిన అంశాలను ఒకసారు గుర్తుచేసుకుందాం.

ఉత్థాన ద్వాదశినాడు తులసి, విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు పూరాణాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణుస్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసితో కల్యాణం జరిపిస్తారు. కొందరు కార్తీక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద, ఉసిరి మొక్కలను నాటుతారు. పురాణ కథనాన్ని అనుసరించి, తులసి కల్యాణం కథ ఇలా సాగుతుంది.

దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మధించినప్పుడు లక్ష్మీదేవికి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్ళి చేసుకోవాలని కలలు కంది. అయితే, అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అయ్యుండటాన సహజంగానే ఆమెకి తులసిమీద మహా కోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకుపడి, తులసిని ''నువ్వు మొక్కగా మారిపో'' అని శపించింది.

అయితే, తనపట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి, ఒక మొక్కగా మారిపోవడం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసితో ''తులసీ! బాధపడకు..భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.. నేను సాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరౌతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్ళలో, దేవాలయాల్లో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు, భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్ళలో తులసిమొక్కను నాటుకుని పూజిస్తారు. నీకు నీళ్ళు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశినాడు నీతో నాకు కల్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు'' అంటూ ఓదార్చి, దీవించాడు.

ఆ విధంగా తులసిమొక్క కు ఎనలేని పవిత్రత చేకూరింది. తులసిమొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని మనకు తెలుసు. ఏ రకంగా చూసినా తులసిమొక్క మనకు ఆరాధ్యం.

యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా |
యథాగ్రే సర్వ వేదశ్చ తులసీ త్వం నామం మధ్యం ||

అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసికోటకు పసుపు కుంకుమలు పెట్టి, తులసివనాన్ని భక్తిగా పూజిస్తాం.

కార్తీక శుక్ల ద్వాదశి లేదా ఉత్థాన ద్వాదశి నాడు విష్ణుమూర్తితో తులసిమొక్కకు కల్యాణం జరిపించి తీర్ధ ప్రసాదాలు తీసుకోవడం ఆచారంగా కొనసాగుతోంది.


Tuesday, October 25, 2011

దీప్తులు చిందించే దీపావళి




శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని చంపిన తర్వాతి రోజు, ఆ రాక్షసుని పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చింది. శ్రీరాముడు, రావణాసురుని అంతం చేసి, సేతమ్మను తీసుకుని, అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకునే ఆచారం నెలకొందని చెప్పే కథనాలు కూడా ఉన్నాయి. మొత్తానికి చెడును రూపుమాపి, మంచిని మిగిల్చిన సందర్భంగా, సంతోష చిహ్నంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి, విజయసూచకంగా టపాసులు మోగించే ఆచారం ఏర్పడింది. 

Happy Diwali
Deepavali scraps & graphics


హిందువుల ప్రముఖ పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. అంతకుముందు రోజు నరక చతుర్దశి. వ్యాపారులు దీపావళి పర్వదినాన్ని నూతన సంవత్సరంగా భావిస్తారు. లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు.

మనం రోజూ పూజలో దీపం వెలిగిస్తాం. పండుగలు, విశేష దినాల్లో తప్పనిసరిగా దీపారాధన ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. అంత అపురూపమైన దీపాల పండుగ దీపావళి. దీపావళితో మొదలుపెట్టి, కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ నెల అంతా సంధ్యాసమయంలో దీపాలు వెలిగించి, ఇంటి ముంగిట పెడతారు. కనీసం ఒక్క దీపాన్ని అయినా తులసికోట ముందు ఉంచితే మంచిదంటారు.

అమావాస్య నాడు చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే సంప్రదాయం ఉంది. ఆ ప్రకారం పురుషులు జలతర్పణం విడుస్తారు. దీపావళి రోజున కుటుంబసభ్యులందరూ తలంటు స్నానం చేసి, కొత్తబట్టలు ధరిస్తారు. ఇళ్ళముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాస్తారు. మావిడాకులు, బంతిపూలతో తోరణాలు కడతారు. నైవేద్యానికి ప్రసాదాలను, పిండివంటలను సిద్ధం చేసుకుంటారు. ఆనక లక్ష్మీదేవి పూజకు సంసిద్ధమౌతారు.

దీపావళి రోజున మహాలక్ష్మి పూజ చేస్తారు. ఈ పూజ చేయడం వెనుక ఉన్న పురాణ కథనం ఏమిటో చూద్దాం. పూర్వం దూర్వాసముని దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమ గల హారాన్ని ప్రసాదించాడు. కానీ, దేవేంద్రునికి దాని గొప్పతనం తెలీక, తన ఐరావతం మెడలో వేశాడు. ఆ ఏనుగు కాస్తా హారాన్ని కాళ్ళతో తోక్కేసేంది. ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి దీనమైన స్థితిలో పడ్డాడు. శ్రీహరిని ప్రార్ధించగా ''ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపజ్యోతిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ, భక్తిగా పూజించమని'' పరిహారం చెప్పాడు. దేవేంద్రుడు అలాగే చేశాడు. దాంతో లక్ష్మీదేవి కరుణ చూపి, ఇంద్రునికి తిరిగి దేవలోక ఆధిపత్యాన్ని, సర్వ సంపదలను అనుగ్రహించింది.

తనను అనుగ్రహించిన లక్ష్మీదేవిని ఉద్దేశించి, దేవేంద్రుడు ''తల్లీ, సామాన్యులు నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా?” అనడిగాడు. 


Deepavali scraps & graphics


అప్పుడు లక్ష్మీదేవి ''నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ, ఏ లోటూ ఉండదు. దీపం వెలిగించి, ప్రార్ధించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను'' అని బదులిచ్చింది. అప్పటినుంచీ దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది.

దీపావళి రోజున సాయంసంధ్య వేళ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించుకుంటారు. ఆనక దీపాలను తులసికోట వద్ద, వాకిట్లో ఉంచుతారు. రెండు దీపాలకు తక్కువ లేకుండా కొందరు అనేక దీపాలతో స్వర్గాన్ని తలపించేలా అలంకరిస్తారు.

ఇక సాయంత్రం అయ్యేసరికి బాణాసంచా కాల్చడం మొదలౌతుంది. పిల్లలు, పెద్దలు అందరూ కాకరపూవొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్డులు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, తారాజువ్వలు, రకరకాల టపాకాయలు కాలుస్తూ సంబరం చేసుకుంటారు.


Diwali cards



దీపావళి పండుగ వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అప్పటివరకూ వర్షాలు పడి ఉంటాయి కనుక వాతావరణంలో రకరకాల క్రిములు వృద్ధి చెందివుంటాయి. వాటిని నాశనం చేసి, మనకు మేలు చేస్తుంది ఈ పండుగ. దీపాలు చీకటిని పారదోలుతాయి. టపాసులు క్రిమికీటకాలను సంహరిస్తాయి. మతాబుల్లోంచి వచ్చే పొగ దోమలు మొదలైనవాటిని మట్టుపెడుతుంది.