Sunday, February 10, 2013

జీవన సంజీవని



నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనడంలో 'శతమానం భవతి' ధ్వనిస్తే, వెయ్యేళ్లు హాయిగా వర్ధిల్లాలని కోరుకోవడంలో శుభ దీవెనే కాక ప్రగాఢ కామనా ప్రతిఫలిస్తుంది. అజేయంగా తిరిగే, అమేయంగా వెలిగే కాలచక్రంలో 'క్షణాలు దినాలు మాసాలు సంవత్సరాలు/ యుగాలు కల్పాలు కల్పాంతాలు' గిరగిరా చరచరా సాగిపోవడాన్ని మునుపే చూసింది కవినేత్రం! 'చిరంజీవ చిరంజీవ- సుఖీభవ సుఖీభవ' అని ఒకటికి రెండుసార్లు పలకడమన్నది కేవల ఆశీర్వచనమో వేదనాదమో కాదు. 'శతాయుష్మాన్ భవ' అన్న ఏడక్షరాలూ సప్తమహర్షుల హస్తాల నుంచి ఒక్కొక్కటిగా జాలువారిన పవిత్ర అక్షతలూ ఆశీస్సుమాల మాలలే! శత వసంతాల జీవన కాలాన్ని లోకులంతా కోరుకున్నా ఆ పత్రం నేలరాలకుండా చేసే, ఆ దేహదీపం ఆరిపోకుండా చూసే బాంధవుడెవరు? ఆయురారోగ్య భోగభాగ్యాలతో తులతూగాలని ఆబాలగోపాలానికీ ఉంటుందికానీ, ప్రాణ పరిపూర్ణ సంరక్షణే అసలు ప్రశ్న. 'అంబుధులీద వచ్చు, ప్రళయాగ్నులు గుప్పిట బట్టవచ్చు, గ్రం/థంబులు వ్రాయవచ్చు, గగనానికి నిచ్చెన వేయవచ్చు, వి/శ్వంబు జయింపవచ్చు, హిమశైలమునెక్కగ వచ్చు గాక/ చోద్యంబగు చావుపుట్టుకల దైవరహస్యమెరుంగవచ్చునే' అన్నారందుకే కవిశ్రీ. బాల్య కౌమార యౌవన వార్ధక్యాలనే చతుర్విధ దశలుగా కొనసాగే జీవన యానంలో మానవులకు ఆశలు శతకోటి! అయినా, సురవరం వారన్నట్టు- 'పుట్టుట గిట్టుట పుడమి జనులకు కట్టడి/ చావు బ్రతుకు వర్తించు చక్రగతి'. చిగురుటాకు అంచున వూగిసలాడే నీటిబిందువు వంటిది ప్రాణమైతే, అది ఉన్నంత కాలమూ- ప్రభాకరుని ప్రకాశం, ధ్రువతార తేజం, మేఘంలా వర్షించడం, చందమామలా స్పర్శించడం కావాలంతే!

ఉపకార చింతన, ధర్మ పరిరక్షణ కలగలిసిన తరుణాన స్థితప్రజ్ఞత, సత్యసంధత, స్థిరత, దానశీలత, ప్రతిభా ప్రపూర్ణతలూ సుగుణసంపన్నాలే. పురాణగాథల్లోని ఆంజనేయ, విభీషణ, కృప, పరశురామ, అశ్వత్థామ, బలి, వ్యాస చరితలు మానవాళికి బోధించేవీ ఈ విలక్షణతలే.. వీరందరిదీ పూర్ణాయు ప్రతీక. హితసాధనలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఘనతర పతాక. 'కాలము పోవును, కడకు మాట నిలుచు' అని క్షేత్రయ్య పలికినా, 'కీర్తి నిలుపుటయు కాదె జనులకు జన్మఫలంబు' అంటూ నన్నయ ప్రవచించినా- ఆ అర్థం బహుజన హితం, ఆ భావం బహుజన సౌఖ్యం. 'మనసులో పుట్టిన మంచి తలంపు/ లాచరణమునందు అలవికాకున్న/ జన్మఫలంబేమి? చచ్చుటే మేలు!' అన్న శ్రీనాథ సుభాషితమూ సర్వదా మననీయం, బహుధా స్మరణీయం. ఒక ప్రాణి జననం ఎప్పుడూ ఎక్కడా అని అడిగితే బదులు పలకొచ్చు. అదే ప్రశ్న మరణం గురించి అడిగితే- సమాధానమేదీ ఉండదు. వేమన 'ఏమి గొంచు వచ్చె నేమి దా గొనిపోవు/ బుట్టువేళ నరుడు గిట్టువేళ' అన్నదీ బదులు తెలియనిదే. తెలిసిందల్లా ఒక్కటే- జీవనకాలం ఎంత అనేకన్నా, అది ఎంత ప్రయోజనకరమన్నదే ఏనాటికైనా మిన్న. కాలజ్ఞతే మనిషి విజ్ఞతకు నికార్సయిన సూచిక. నిరంతరం పరిభ్రమించే కాలం ఒక్క క్షణమైనా ఆగదు. ఆగేదీ సాగేదీ మనిషే కనుక, మంచిని పెంచాల్సిందీ పంచాల్సిందీ ఆ మనిషే. మనుగడ ఓ నవరస భావ పూర్ణ నాటక వేదిక. సర్వ సమర్థంగా పాత్రపోషణ చేయాల్సిన మానవుడికి అందుకే 'అందనిదానికోసమయి అఱ్ఱులు చాచకు, లేనిదానికై/ కొందల మందబోకు, చెడు కోర్కెల చెంతకు చేరనీకు, నీ/ కందినదానితోడ ముదమందుచు, మోమున మందహాసముల్/చిందుచు సాగిపొమ్ము నవజీవన చైత్ర వనాంతరమ్ములన్' అని దారిదీపం చూపింది కరుణ కవి హృదయం. ఏడుస్తూ పుట్టి, కొన్నిమార్లు ఏడుస్తూ పెరిగి, ఇంకొన్నిసార్లు ఇతరుల్ని ఏడిపించిపోయే ప్రాణితో ఈ నేలకు ఉపకారమేమిటనీ నిలదీసిందా స్వరం. 'కలలొచ్చే సమయాన మేలుకోకు, కాలం కలిసొస్తే నిదురపోకు' అన్న హితోక్తి జనచేతనకు దోహదపడే నవామృత మాత్ర!

మిసిమి ప్రాయమైనా ముదిమి వయస్సయినా జీవితేచ్ఛ ఒకటే. కలకాలం విలసిల్లాలన్న శుభాకాంక్షకు పసికందు మొదలు ముదివగ్గుదాకా స్పందించేది బోసినవ్వుతోనే. అన్నమయ్య నిర్ధరించినట్టు 'తగిలి సంపదలచే దనిసినవారు లేరు/ ఒగరు సంసారభార మోపనన్నవారు లేరు/ జడిసి ఆయుష్యము చాలునన్నవారు లేరు'. లోక గమనాన్ని గమనించిన ఆయన నయనాల ఎదుట వరసగా సాగిపోతున్న దృశ్యాలు, రంగులు మార్చుకున్న వైనాలు అనేకం. వాటిని విశ్లేషిస్తే 'పెంచగ బెంచగ బెరిగీ నాసలు/ తుంచగ దుంచగ దొలగునవి/ తడవగ దడవగ దగిలీ బంధము/ విడువక విడువక వీడునది' అన్నట్టుంది స్థితి. నిలిచినదొకటే నిజం, తెలిసిన తెలివే ఘనం అంటే, అదేనేమో మరి. తెలియాల్సింది ఇంకా ఉందనుకున్నప్పుడు 'పక్కనే ఉన్న లోయలోకి తొంగిచూసి/ శిఖరం తన లోతెంతో తెలుసుకోవాలనుకుంది/ వృక్షం కళ్లుమూసుకుని/ తన వేళ్లు నేల పొరల్లోనికి ఎంత దూరం సాగిపోయాయో వూహించుకుంది' అనే సినారె మాలిక గుర్తురాక మానదు. శిఖరస్థాయిగా వృక్షసమంగా మూలలకీ విస్తరించిన వైద్య సదుపాయాలు ప్రజానీకానికి దీర్ఘాయువు ప్రసాదిస్తున్నాయి. జీవన ప్రమాణాల పెంపుదల కారణంగానూ- ఈ ఏడాది పుట్టిన బాలల్లో మూడోవంతు మంది వందో పుట్టినరోజు చేసుకుంటారంటోంది లండన్‌లో జరిగిన తాజా అధ్యయనం. దాంపత్య బంధంతో పాటు ఉత్తమ స్నేహ సంబంధం మనిషి ఆయువును పెంచి తీరుతుందని కూడా అక్కడి పరిశోధకులు తేల్చిచెప్పారంటే, సంజీవని... ఎదుట నిలిచినట్టేగా!

No comments:

Post a Comment