![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjP1U_iO3IGDV1hUf3-RMr3SlQ_aLgrq-QeC44Z-QS8BzVXzQ_r7QcTtuEjlRK3dCYhjAvh5efR6YyJwA-ix4Ove49WGq1euHKVWJq4VvmxiF2D4bdz_j1LCBq71s4DjozS0BzQFsPiLh3k/s400/sleep.jpg)
పిల్లవాడు ఎంతకీ నిద్రపోకుండా సతాయిస్తున్నాడు. మారాం చేస్తుంటే అమ్మ బుజ్జగించింది. గుర్తుతెచ్చుకుని మరీ కథలు చెప్పింది. ఊరు మాటు మణిగినా ఇంట్లో అల్లరిపిడుగు దారికి రాకపోగా, విసుగెత్తిపోయిందా ఇల్లాలు. భార్యనుంచి భర్త బాధ్యత అందిపుచ్చుకున్నాడు. లోకజ్ఞానాన్ని పిట్టకథలుగా అల్లి చెబుతున్నాడు. పనులు చక్కబెట్టుకుని వంటిల్లు సర్ది గదిలోకి వచ్చిన భార్యకు కనిపించిందేమిటంటే- శ్రీవారు గుర్రుకొడుతున్నారు; అబ్బాయిగారు కళ్లు మిటకరిస్తూ- ఇంకేం విద్యలున్నాయి మీ దగ్గరన్నట్లు ఆరాగా చూస్తున్నాడు. ఎంతగా నిద్రపుచ్చినా బజ్జోని చిన్నారులు పెద్దవాళ్లకు ఎప్పుడూ కొరకరాని కొయ్యలే! మగవాడికి ఆరుగంటల నిద్రచాలు, స్త్రీలకు ఏడు గంటలు అవసరం, మూర్ఖుడు మాత్రం ఎనిమిది గంటలు నిద్రిస్తాడని చెప్పే ఆంగ్ల సామెత ఒకటి ఉంది. సామెతలనేవి జీవితానుభవాల్లోంచే పుట్టుకొస్తాయి. వాయిదా వేయలేని తొందర పనులవల్లో ఇతరత్రా కారణాల చేతనో నిద్ర తగ్గే వ్యక్తి దీర్ఘకాలంలో రోజుల తరబడి విశ్రాంతికి దూరమైనట్లేనని, అది అతగాడి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పలువురు వైద్యపుంగవులు గతంలోనే హెచ్చరించారు. జీవితంలో విపరీత వేగం చొరబడి, బతుకులు యాంత్రికమై, ఒత్తిళ్లు మిక్కుటమై చక్కటి నిద్రకు నోచుకోలేకపోతున్నామని వాపోయేవారు మనచుట్టూ తారసపడుతూనే ఉంటారు. అతి నిద్ర దరిద్ర లక్షణమన్న ఈసడింపులకేంగాని- నిద్రపట్టించే ప్రత్యేక పరికరాల తయారీలో అద్భుత వాణిజ్య అవకాశాల్ని పసిగట్టిన పాశ్చాత్య దేశాలు వీలైనంతలో పంట పండించుకుంటున్నాయి. ఆ కోవలోకి ఈమధ్యనే- జోలపాట పాడే పరుపు వచ్చి చేరింది.
యుద్ధం ముగిసింది. రావణ సంహారానంతరం ఘట్టం లంకనుంచి అయోధ్యకు మారింది. రామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కంటికి రెప్పలా అన్నాళ్లూ అగ్రజుణ్ని వెన్నంటి ఉన్న లక్ష్మణుడికి ఆ సభాప్రాంగణంలో వచ్చింది కునికిపాటు. ఇంతకాలమూ రాని నిద్ర ఇప్పుడే రావాలా అనుకొంటున్న లక్ష్మణస్వామి మోమున దరహాస చంద్రికలు విరబూశాయి. ఆ నవ్వుకు రాముడు, సీత, వానరులు రకరకాల భాష్యాలు అన్వయించుకుని ఎవరికి వారే చిన్నబుచ్చుకున్న విడ్డూరవైనం నవ్వుతో ముడివడిందే. అసలు నిద్ర ఎందుకు, ఎప్పుడొస్తుందో ఆధునిక శాస్త్రజ్ఞులు ఏనాడో విశదీకరించారు. నిద్ర ఆగమనాన్ని మెదడే ముందుగా సంకేతిస్తుంది. ఆవులింతల ద్వారా సందేశాలు పంపుతుంది. తల బరువెక్కినట్లు అనిపింపజేస్తుంది. కనురెప్పలు మూతపడేలా చేస్తుంది. మెదడు చేసే ఇంత కృషి, తమను నిద్రపుచ్చడానికి అమ్మానాన్నా సాగించే కసరత్తు చిచ్చరపిడుగుల ఎదుట బలాదూర్ అయితే- పరిష్కారమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికి పట్టుకున్నానంటోంది లండన్‌కు చెందిన లిండా హార్డింగ్ అనే మాతృమూర్తి. ఆవిడకు ఆరుగురు సంతానం. బిడ్డలకు నిద్ర ఇవ్వడంలో ఇక్కట్లు స్వయంగా అనుభవించిన ఆమె గాలిదిండులు ఉపయోగించి పరుపునొకదాన్ని రూపొందించింది. శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించే జోలపరుపు తల్లి గర్భాన్ని మైమరపిస్తుందని పరిశోధకులు కితాబిస్తున్నారు. తల్లి గుండెచప్పుడుకు పిల్లలు స్పందిస్తారని, వారికదే తొలి జోలపాట అంటున్న జీన్ టారంట్ అనే పరిశోధకుడి మాటల్ని ఎవరు కాదనగలరు? 'అమల తృణభూమి నాకు శయ్యాతలంబు గగన భాగంబు నా ఇంటికప్పు' అన్న కవి భావనను చిరు మస్తిష్కాల్లో పొదువుకుంటూ కలల ఒడిలో పిల్లలు సేదతీరడం- ఎంత అందమైన దృశ్యం! అక్టోబర్లో విపణివీధికి రాగలదంటున్న కొత్తరకం పరుపు మాతృమూర్తులకు వరమైతే, చిన్నారి పొన్నారి ముద్దుకన్నల పాలిట అపర సమ్మోహనాస్త్రం!
No comments:
Post a Comment