"నేర్చుకోవడంతో కాదు;
స్వాభావికంగానే వివేచన
నిర్ణయం అంతఃప్రేరణదే
అబద్ధమాడడం తప్పు...
దొంగతనం చేయడం తప్పు...
ఎవర్నైనా చంపడం తప్పు..."
...అనడంలో మనకెవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. అవునా? అందుకే మనం ఇలాంటి మంచి మాటల్ని పిల్లలకు చెబుతుంటాం. నీతి కథలు బోధిస్తుంటాం. ఏది మంచో, ఏది చెడో... నేర్పిస్తేనే తెలుస్తుందని మనం అనుకుంటాం. ఇది నిజమేనా? నేర్పిస్తేనే 'నీతి' అబ్బుతుందా? అసలు ఇది తప్పు, ఇది ఒప్పు అని మనం ఎలా నిర్ణయానికి రాగలుగుతాం? విభిన్న భాషల్లో, సమాజాల్లో, వాతావరణాల్లో పెరిగిన వారికి మంచి, చెడుల విషయంలో విభిన్న అభిప్రాయాలుంటాయా? ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మార్క్ హౌజర్ అనే ప్రొఫెసర్ దీనిపై పరిశోధన చేసి ఆసక్తికరమైన విశేషాలు వెల్లడించారు. ఏది తప్పో, ఏది ఒప్పో మనం నేర్చుకుంటాం అనడం కన్నా, ఆ ఇంగిత జ్ఞానం (కామన్ సెన్స్) పుట్టుకతోనే మనలో ఉంటుందని ఆయన తేల్చారు. దీన్నే తార్కికంగా వివరిస్తూ 'నైతిక హృదయాలు (మోరల్ మైండ్స్)' అనే పుస్తకం రాశారు. పుట్టాక ఊపిరి పీల్చడాన్ని మనకెవరూ నేర్పరు. పీల్చాలని చెప్పరు కూడా. అయినా మనం ఊపిరి పీల్చడం ప్రారంభిస్తాం. అంతఃప్రేరణే దీనికి కారణం. మంచి చెడుల్ని తేల్చే ఇంగితజ్ఞానం కూడా ఇలాగే బాల్యంలోనే మనుషుల్లో బలంగా నాటుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం బాటలోనే లక్షలాది ఏళ్లుగా ఈ అంతఃప్రేరణ మన మనసుల్లో జీర్ణించుకు పోయిందని, క్రమంగా ఎదుగుతూ వస్తోందని వివరించారు. నైతికతకు సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న వేసినపుడు, క్లిష్టమైనదైనా, అది మంచో, చెడో వెంటనే చెప్పేస్తాం. అందులోనూ ఎక్కువమంది చెప్పే అభిప్రాయాలు ఏకీభవిస్తాయి. దీనికి కారణం.. మనుషుల్లో సహజంగా ఉండే వివేచనే అని ఆయన విశ్లేషించారు. ''పిల్లలు పూర్తిగా ఖాళీ మెదడుతో పుట్టరు. భాషకు సంబంధించిన మౌలిక వ్యాకరణం వారిలో పుట్టేనాటికే ఉంటుంది. దాని ఆధారంగానే వారు భాషను నేర్చుకోగలుగుతారు. విభిన్న భాషలకు విభిన్న వ్యాకరణాలు ఉంటాయని కదా అని ప్రశ్నించవచ్చు. భాషేదైనా, దాన్ని నేర్చుకునేందుకు మౌలిక వ్యాకరణం ఒకటే. దాని ఆధారంగానే పిల్లల మెదడులో వాక్య సమీకరణాలు వృద్ధి చెందుతాయి'' అని ప్రసిద్ధ విద్యావేత్త నోమ్ చామ్‌స్కీ గతంలో ప్రతిపాదించారు. నీతికి సంబంధించి కూడా మన మనసుల్లో పుట్టుక నాటికే, అసంకల్పిత వ్యాకరణం ఏర్పడి ఉందనీ, దాని ఆధారంగానే మనం మంచి చెడులపై ఏకాభిప్రాయంతో ప్రతిస్పందిస్తున్నామనీ హౌజర్ తెలిపారు. పరిశోధనలో భాగంగా ఆయన రెండు సన్నివేశాలను ఉపయోగించారు. అవి...
రైలు మార్గంపైకి వెళ్తే...
పక్కపక్కనే రెండు రైలు మార్గాలున్నాయి. ఒకదానిపై ఐదుగురు వ్యక్తులు నడుస్తున్నారు. వారి వెనకే వేగంగా ట్రాలీ వస్తోంది. బ్రేకుతో ఆపలేని పరిస్థితి. అది అలాగే ముందుకు వెళ్తే ఆ అయిదుగురూ ప్రాణాలు కోల్పోతారు. వారిని కాపాడాలంటే రెండేరెండు మార్గాలున్నాయి.
ఒకటి... ట్రాలీని పక్కనున్న పట్టాలపైకి మళ్లించే వీలుంది. కానీ దానిపై ఒక పాదచారి ఉన్నాడు. ట్రాలీ కిందపడి అతడు చనిపోతాడు. కానీ ఆ ఐదుగురూ బతుకుతారు.
రెండు... ఏదైనా పెద్ద వస్తువును అడ్డంవేస్తే ట్రాలీని ఆపొచ్చు. పట్టాల పక్కనే ఒక స్థూలకాయుడు నిలబడి ఉన్నాడు. అతడు పట్టాలపై అడ్డంగా పడితే ట్రాలీ అగుతుంది. కానీ అతడు చనిపోతాడు. ఐదుగురు బతుకుతారు.
ఏది అనుసరణీయం? ఏ మార్గం మంచిది? ఏది చెడ్డది? మీరైతే ఏం చెబుతారు? ఆలోచించండి.
ఎక్కువ మంది మొదటిదానికే ఓటేశారు. ట్రాలీని పక్కనున్న పట్టాలపైకి మళ్లించడమే సరైందని, అదే నీతిమంతమనీ అభిప్రాయపడ్డారు. స్థూలకాయుడిని పట్టాలపైకి నెట్టడం సరికాదని స్పష్టంచేశారు. నిజానికి రెండు సన్నివేశాల్లోనూ, లెక్క సమానం. ఒక వ్యక్తి చనిపోతే ఐదుగురు బతుకుతారు. అనివార్యమైన ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడమే రెండింటిలోనూ అంతరార్థం. అయినా మొదటిదే సరైనదని, రెండోది తప్పని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఏకీభావం? ''వారి ప్రతిస్పందన స్వాభావికమైనది. గణాంకాల తర్కాన్ని, పట్టించుకోకుండా వారిలోని అసంకల్పిత సహజ అంతఃప్రేరణ ఈ నిర్ణయం తీసుకుంది. భాషా, సామాజిక, ప్రాంతీయ, వయో భేదాలకు అతీతంగా ఇది వ్యక్తమైంది. అంటే వారు జన్మతః తమలో ఉన్న సార్వజనీన నైతిక వ్యాకరణాన్ని అనుసరించారన్న మాట'' అని విశ్లేషించారు హౌజర్.
ఆసుపత్రిలోకి ప్రవేశిస్తే..
అదో ఆసుపత్రి. నర్సు వేగంగా డాక్టర్ వద్దకు పరుగెత్తుకుని వచ్చింది. ''సర్. ప్రమాదంలో గాయపడిన ఐదుగురు వ్యక్తుల్ని ఆసుపత్రికి తెచ్చారు. ఒకరికి గుండె, ఇద్దరికి కిడ్నీలు, ఇంకొకరికి ఊపిరితిత్తి, వేరొకరికి కాలేయం దెబ్బతిన్నాయి. తక్షణం మారిస్తేనే బతుకుతారు. కానీ వారికిచ్చేందుకు అవయవాలు మన ఆసుపత్రిలో లేవు'' అని చెప్పింది. డాక్టర్ అయోమయంగా చూశాడు. ''సర్, రక్తమిచ్చేందుకు ఒక నిరుపేద యువకుడు మన ఆసుపత్రికి వచ్చి కూర్చున్నాడు. అతడి బ్లడ్‌గ్రూపు, బాధితులదీ ఒకటే. అతడి అవయవాలను తీసి వీరికి అమరిస్తే ఈ ఐదుగురూ బతుకుతారు. కానీ ఆ యువకుడు చనిపోతాడు..'' అని చెప్పింది నర్స్.
మీరే డాక్టరైతే ఏమంటారు? సరే అంటారా? ఎక్కువమంది అది తప్పన్నారు. ఐదుగురూ బతకకపోయినా పర్లేదుగానీ, ఆ యువకుడి అవయవాల్ని వారికి అమర్చడం సరికాదన్నారు.
రైలు మార్గం సన్నివేశంలో, ఐదుగురిని రక్షించడం కోసం పాదచారిని బలిపెట్టడం మంచిదేనన్న వారు, ఇప్పుడు మాత్రం ఐదుగురిని బతికించడం కోసం నిరుపేద యువకుడిని చంపడం తప్పన్నారు. అక్కడా ఇక్కడా లెక్క సమానం. ఐదు ప్రాణాలకు ఒక ప్రాణం. అక్కడా ఇక్కడా సమాధానం చెప్పింది వాళ్లే. కానీ జవాబు విభిన్నం. అక్కడ ఒప్పైంది ఇక్కడ తప్పైంది. ఎందుకీ తేడా? ''ఎలాగైనా నష్టం జరుగుతుంది అన్నపుడు, అది తక్కువగా ఉండేట్టు చూసి, ఎక్కువ మంచికి దారితీసేలా చేయడంలో తప్పులేదు. కానీ ఎక్కువ మంచి కోసమని, కావాలని తక్కువ నష్టానికి పాల్పడడం మాత్రం సరికాదు'' అన్నదే మానవ నైతిక హృదయం ఇచ్చే తీర్పు అని హౌజర్ విశ్లేషించారు. అత్యధికులు ఏకాభిప్రాయంతో ఇవే సమాధానాలివ్వడం ఆశ్చర్యకరమేగాక, మనిషిలో స్వాభావిక నీతికి నిదర్శనమని కూడా ఆయన చెప్పారు. అయితే దీన్ని ఇప్పుడే నిర్ధారించలేమనీ, ఇదొక ప్రతిపాదిత చర్చమాత్రమేననీ తెలిపారు.