మార్గశిర శుక్లపక్ష షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఆంధ్రులే కాకుండా తమిళులు,కన్నడీగులు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. అసలీ స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి గురించిన వివరాలేంటో తెలుసుకుందాం.
స్కందుడు అంటే మన్మథుని అవతారమే. సుబ్రహ్మణ్యేశ్వరుడు సాక్షాత్తూ మహాశివుని కుమారుడు. ఇంద్రుని కక్ష్యలో ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలు అందరిలోకీ మహా అందమైనవాడు, చురుకైనవాడు. సుబ్రహ్మణ్యుని మాదిరిగానే ఆయన వాహనం మయూరం (నెమలి) మహా అందమైనది. ఈయన దేవతలకు నాయకత్వం వహిస్తాడు. ముఖ్యంగా యుద్ధాలకు అధిపతి. ఈయనకు ఆరు ముఖాలు ఉంటాయి. ఆరువైపులా చూస్తూ పరిస్థితులను సమన్వయం చేసుకోగలడు.
సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన రోజును పురస్కరించుకుని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి జరుపుకుంటారు. ఈరోజున ఉదయానే స్నానం చేసి (వీలైతే నదీ స్నానం) సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని, దానధర్మాలు చేసినట్లయితే తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి.
సర్పదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రార్ధనలు చేసి పుట్టలో పాలు పోస్తారు. ఐదు ముఖాలున్న నాగదేవతను ఆరాధిస్తారు. నాగదేవతల్లో ఒకటైన శంకపాలను పూజిస్తారు. ఇలా చేయడంవల్ల సర్ప దోషాలు తొలగిపోతాయి. చర్మవ్యాధులు ఉంటే తగ్గుతాయి. పిల్లాపాపలతో సుఖసంతోషాలు అనుభవిస్తారు.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మచారి కనుక ఈ సుబ్రహ్మణ్యషష్ఠి రోజున ఈర్ష్యాసూయలు లేని స్వచ్చమైన మనసున్న బ్రహ్మచారులను భోజనానికి పిలుస్తారు. వారికి భోజనం పెట్టి దక్షిణ సమర్పించి, వస్త్రదానం చేస్తారు. ఇలా చేస్తే ఏ కష్టాలూ రావని, సుఖసౌఖ్యాలు అనుభూతికి వస్తాయని పూరాణాలు చెప్తున్నాయి.
శ్రీనివాసుడు తన కల్యాణం సందర్భంలో అతిథులను ఆహ్వానించేందుకు, సుబ్రహ్మణ్యేశ్వరుని నియమించాడు. సుబ్రహ్మణ్యునికి కుమారస్వామి, మురుగన్, షణ్ముఖుడు, కార్తికేయ, స్కంద – అంటూ అనేక పేర్లు ఉన్నాయి.